Previous Page Next Page 
Sri N T Rama Rao Prasangalu పేజి 11

                                 

 

కదలిక ప్రగతికి ఊపిరి


    ఉత్తుంగ తరంగమై పరవళ్ళు త్రొక్కుతూ ఇరు ఒడ్డులకు వోరిసి పారే జీవనది గోదావరి కూడా మొదట చిన్న సెలయేరులా ఉద్భావిన్చినదే. యాభై సంవత్సరాల క్రితం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థగా వాసికెక్కిన ఈ సంస్థ కూడా ఒక చిన్న రవాణా సంస్థగా నిజాం రాష్ట్రంలో మొదలైన విషయం మీ అందరికీ తెలుసు. అవగింజంతైన మర్రి విత్తనం నుండి మహావటవృక్షం పుట్టి పెరిగినట్లు అలనాటి ఆ చిన్న సంస్థయే ఈనాటి ఈ మహా సంస్థకు మాతృకని తెలుసుకోవడం చిత్రంగా అనిపించకమానదు. ఈ అభివృద్ధి వెనుక వేలాది కార్మిక సోదరుల కష్టం దాగి వున్నది. వారంతా నిరంతరం చెమటోడ్చి శ్రమించి మూడు పువ్వులు, ఆరు కాయలుగా పెంచి పెద్ద చేసిన సంగతి మనమంతా ఒకసారి నిండు హృదయంతో కృతజ్ఞతాంజలులతో గుర్తుకు తెచ్చుకోవలసిన అవసరం వుంది. ఆ ఉద్యోగులు, ఆ కార్ముకులే ఈ సంస్థకు వెన్నెముక, నవనాడులు, అండ దండ. ఈ శుభ సందర్భంలో గత 50 సంవత్సరాలుగా ఈ సంస్థ అభివృద్దికి దోహదం చేసిన, చేస్తున్న అశేష ఉద్యోగ బృందానికి , కార్మిక సోదరులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
    "గ్రామసీమల్లోనే వుంది ఈ జాతి జీవనం" అని చాటి చెప్పాడు పూజ్య బాపూజీ. కష్టిత ప్రజలు దుర్బర దారిద్యంలో , అజ్ఞానంలో, అనారోగ్యంలో కొట్టు మిట్టాడుతూ ఆమారుమూల గ్రామాల్లో నివసిస్తున్నారు. వారి బడుగు బ్రతుకులలో వెలుగులు నింపాలంటే , వారి కీవితాలలో నవోషస్సులు ఉదయించాలంటే , వారి భవితవ్యాన్ని బంగారు బాటలో తీర్చి దిద్దాలంటే ముఖ్యంగా కావలసింది రాకపోకల సౌకర్యాల పెంపు. రాకపోకల వల్లనే బయటి ప్రపంచంతో వారు సంబంధ బాంధవ్యాలు పెంచుకోగలుగుతారు. అభివృద్ధి పధకాల ఆవశ్యకతను, ప్రాముఖ్యతను అవగతం చేసుకోగలుగుతారు. తాను అనుభవిస్తున్న దుర్బర దారిద్ర్యాన్ని 


          

 

ఎలా పారద్రోలుకోవాలో ఎలా అంచెలంచెలుగా అభ్యుదయ పధకంలో ముందుకు సాగాలో వారు తెలుసుకోగలుగుతారు. ఎండనక, వాననక, పగలనక, రేయనక, పొలాలను హలాలతో దున్ని, మట్టి నుండి మానిక్యాన్ని పండించే రైతాన్న తన కష్టానికి తాను తగిన ప్రతిఫలం లభించక నిరాశ నిస్పృహలకు లోనవుతున్నాడు. ఈ పరిస్థితి నుండి అతన్ని తప్పించాలంటే అతని శ్రమకు తగిన ప్రతిఫలం లభించేటట్లు చూడాలంటే , తను పండించిన పంటను మార్కెట్లకు తీసుకొని వెళ్ళి , తను కావాలనుకున్నప్పుడు, దానికి లాభసాటి బేరం తగిలినప్పుడు తన పంటను తాను అమ్ముకోగలదన్న ధైర్యం అతనిలో కలిగించాలి మనం. సరైన రహదారి సౌకర్యాలు , రాకపోకల సౌకర్యాలు అతనికి లభించినప్పుడే ఇది సాధ్యం అవుతుంది. అందువల్ల రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అభివృద్ధి రాష్ట్రంలో రవాణా సౌకర్యాల అభివృద్ధితో ముడి పెట్టుకొని వుంది. ఈరోజు మనకు కనపడుతున్న ఈ రోడ్డు రవాణా సంస్థ బస్సు కేవలం ఒక్క రవాణా సాధనం మాత్రమే కాదు. అది ఒక చైతన్య రధం. ప్రపంచం నలుదిక్కులా జరుగుతున్న విషయాలను నాలుగు పేజీలలోకి కుదించి సవ్యాఖ్యానంగా ప్రజలకు అందించే వార్తా పత్రికలను కూడా ఈ బస్సే గ్రామాలకు  మోసుకుని వస్తుంది. రోగపీడితులై  బాధపడుతున్న ఆర్తులకు తగిన చికిత్స చేసి, స్వస్థత చేకూర్చి తిరిగి నిండు ఆరోగ్యంతో తమ పనులను తాము నిర్వహించేటట్లు చూసే వైద్యుని, ఔషధాలను ఈ బస్సు పల్లెలకు చేరవేస్తుంది. కదలిక ప్రగతికి ఊపిరి అయితే ఆ కదలికకు జీవనాడి ఈ బస్సు. 
    అయితే ఇంత ప్రాముఖ్యత గల ఈ రవాణా సంస్థ ఇంతవరకు పని చేసిన తీరు తెన్నులను మనం ఈరోజు సమీక్షించుకొని యింకా చక్కగా ప్రజలకు, మరింత ఉపయోగకరంగా, మరింత లాభసాటిగా ఈ నిర్వహణను కొనసాగించడం ఎలా అన్న విషయాన్ని పరిశీలించవలసిన అవసరం ఈనాడు ఎంతైనా వున్నది. ఒక్క బస్సు పెట్టుకొని ప్రయివేటు రంగంలో ఆపరేటర్లు లక్షాధికారులవుతున్న సమయంలో వేలాది బస్సులు నడిపే ఈ రోడ్డు రవాణా సంస్థ భారీ నష్టాలతో నడవడం ఎందువల్ల? ఈ ప్రశ్న మనకు మనమే వేసుకోవలసి వుంది. ఇందుకు ఎవరో భాద్యులని నేను వారిని నిందించడం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్ది ఈ సంస్థలో వస్తున్న నష్టాలకు అడ్డు కట్ట కట్టి లాభాలను పెంపొందించి ఈ సంస్థను సక్రమమార్గంలో నడిపించడానికి, ప్రజాసేవలో ఉత్తమ సాధనంగా దీనిని తీర్చి దిద్దడానికి ఈ సంస్థ ఉద్యోగబృందం , కార్మిక సోదరులు కలిసి చిత్తశుద్దితో , పట్టుదలతో గట్టిగా కృషి చేస్తున్న సంగతి నాకు తెలుసు. ఈ కృషి యిప్పటికే సత్ఫలితాలను యిచ్చిందన్న సంగతి కూడా నాకు తెలుసు. అంతేకాదు. ఈ కృషిని మరింత పట్టుదలతో, మరింత క్రమశిక్షణతో , మరింత ఉత్సాహంతో మనం కొనసాగించవలసి వుందన్న సంగతి మీకు గుర్తు చేయవలసిన అవసరం లేదని అనుకొంటాను. ఈ మహత్తర కృషిలో మీరందరూ త్వరలోనే విజయాన్ని సాధించగలరని, భారీ నష్టాలతో నడుస్తున్న ఈ సంస్థ తొందరలోనే ఒక లాభసాటి వ్యాపారంగా మరి రాష్ట్రానికి వన్నె తెచ్చే వ్యవస్థగా రూపొందగలదని నేను ఆకాంక్షిస్తున్నాను.
    ఈ స్వర్ణోత్సవాల సందర్బంగా బస్సు సర్వీసులను మెరుగుపరచి , మరింత సక్రమంగా, మరింత ప్రయోజనకరంగా వాటిని నిర్వహించే విషయంలో మీరందరూ సమాలోచన చేస్తారని, సత్వర చర్యలు తీసుకొంటారని నాకు పూర్తి విశ్వాసం వుంది. ముఖ్యంగా మనమందరం ప్రతి క్షణం గుర్తు చేసుకోవలసిన అంశం ఒకటి వుంది. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలే పాలకులు. రైతే రాజు. శ్రామికుడే చక్రం తిప్పాలి. అందువల్ల మన బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రతి వ్యక్తీ మనకు అత్యంత గౌరవనీయుడైన అతిధి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేసే ఉద్యోగులు -ముఖ్యంగా బస్ కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర సిబ్బంది - ఈ అంశాన్ని  ప్రతి క్షణం జ్ఞప్తికి వుంచుకోవాలని నేను కోరుతున్నాను. 'మడులు, మాన్యాల కన్నా మర్యాదగా మాట్లాడితే మిన్న' అన్న నానుడి మీకందరికీ తెలుసు. గౌరవం యిచ్చి పుచ్చుకోడం, మాట మన్ననతో ప్రయాణికులకు తలలో నాలుకల వలె మసలడం, మీకు , మీ సంస్థకు ఎంతో మంచి పేరు తెచ్చి పెడతాయి. సామాన్య మానవుడు చెమటోడ్చి సంపాదించిన ధనంలో టికెట్ రూపేణా యిచ్చే పైసలతోనే మనకు రవాణా సంస్థ వారు జీతాలు చెల్లిస్తున్నరన్న సంగతి , అది మన మనుగడకు మూలధనమన్న సంగతి విస్మరించకూడదు.
    కొన్ని కొన్ని సందర్భాలలో మన ఉద్యోగుల బృందం ప్రవర్తిస్తున్న తీరుపట్ల ప్రజల నుండి అనేక పిర్యాదులు అందడం నిజంగా దురదృష్టకరం. ఇట్టి పరిస్థితులు తలెత్తకుండా ఉద్యోగ బృందం పూర్తి శ్రద్ధ తీసుకొంటారని , మనలో మనకు ఎన్ని సమస్యలున్నా వాటిని సరైన విధంగా మనం పరిష్కరించుకోవడం, తోటి ప్రయాణికుల తోటి మర్యాదగా మసలడం, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం మన విధ్యుక్తధర్మంగా అందరూ భావిస్తారని నేను ఆశిస్తున్నాను.
        
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ స్వర్ణోత్సవాల సందర్భంగా 1983 జూన్ 2 వ తేదీన ......

 

 Previous Page Next Page