చీఫ్ మినిస్టర్ కనపడట్లేదనే వార్త మెల్లగా ప్రచారం లోకి రావటం మొదలయింది. ఆఫీస్ కి, ఇంటికి ఫోన్ల మీద ఫోన్లు మొదలయ్యాయి.
విష్ణు, బృంద సర్ది చెప్పలేక సతమతం అవసాగారు.
విష్ణు కి ఫోన్ చేసింది బృంద.
"ఏం చేద్దాం?" అడిగింది.
"రేపు ప్రెస్ మీట్ పెట్టి సార్ ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీ లో ఉన్నారనీ, కొంత కాలం అందుబాటు లో ఉండరని చెప్తే?" అడిగాడు విష్ణు.
"ఆరోగ్యం గురించి అట్లా చెప్తే రోగిష్టి అని ముద్ర వేసి, పదే పదే ప్రచారం చేసే ప్రమాదం ఉంది. ఒత్తిడి వల్ల రెస్ట్ తీసుకుంటున్నారని నిజం చెప్పటం ఒక్కటే మార్గం అనిపిస్తోంది" అంది బృంద.
"మేడం, ఒత్తిడి, విశ్రాంతి లాంటి పదాలకి రాజకీయాల్లో స్థానం లేదు. ఇన్నాళ్లూ పులి, సింహం అన్న వాళ్లే పిచ్చి అని ముద్ర వేస్తారు. అదింకా ప్రమాదం" అన్నాడు విష్ణు
ఆలోచనలో పడింది బృంద.
సుధీర్ కేబినెట్ లో ఒక మంత్రి నుంచి అంతకు ముందే ఆమెకు ఫోన్ వచ్చింది.. రాజకీయాల్లోకి రాక ముందు ఆ మంత్రి పెద్ద రౌడీ గా పేరొందాడు. సెటిల్మెంట్ లు చేయటానికి, మాట వినని వాళ్ళని బెదిరించడానికి సుధీర్ కి అతని అవసరం ఉంటుంది. చేసిన తప్పులు వెంటాడుతుంటే బయటపడటానికి, వాటి నుంచి తప్పించుకోవటానికి అతనికి సుధీర్ అవసరం. పరస్పర అవసరాల మధ్య ఏర్పడ్డ ఆ బంధం చూడటానికి ఎంత గట్టిగా అనిపిస్తుందో, అంత బలహీనంగానూ ఉంటుంది.
అతని మాట చాలా రఫ్ గా ఉంది.
"అన్న ఎక్కడికి పోయాడు? ఎందుకు ఎక్కడా కనపడటం లేదు?" అడిగాడు.
"ఆరోగ్యం బాగాలేదు. కొన్నాళ్ళు విశ్రాంతి అవసరం" చెప్పింది బృంద.
"ఫోన్ ఇవ్వమ్మా" అన్నాడు.
"ఇంట్లో లేరు" చెప్పింది బృంద.
"సరే. తర్వాత చేయించమ్మా తప్పకుండా...మర్చిపోవద్దు చాలా అర్జంట్ పని ఉంది" అన్నాడు.
ఫోన్ పెట్టేశాను అనుకుని అతను ఆ తర్వాత మాట్లాడిన మాటలు ఫోన్ లోంచి వినపడ్డాయి బృంద కి.
"మళ్లీ ఏదో ఎదవ పని చేసుంటాడు. కనపడకుండా తిరుగుతున్నాడు. మనకి అవసరం అయినప్పుడు లేకుండా పోతే చూస్తూ కూర్చోవడానికి నేనేమన్నా పిచ్చోడినా?"
"దీనికీ వాడికీ అసలు పడనే పడదు. ఇట్లాంటప్పుడు వాడికి దీని బోడి సపోర్ట్" అంటున్నాడు.
అతను మాట్లాడింది తన గురించే.
తర్వాత ఫోన్ కట్ అయిపోయింది.
వింటున్న బృంద కి అవమానం తో రక్తం అంతా మొహం లోకి తన్నుకొచ్చింది.
కనపడినప్పుడు ఎంతో వినయం ప్రదర్శిస్తాడు. భుజాలు వంగి పోయి నిలబడతాడు. ఇటువంటి వాళ్ళను చూసుకుని సుధీర్ తనకి తిరుగు లేదనుకుంటాడు.
ఒకరితో ఒకరికి ఉన్న అవసరం వల్ల ఒక కూటమి గా ఏర్పడే ఇలాంటి వాళ్ల మధ్య సంబంధాలు ఇంత కంటే గొప్పగా ఎట్లా ఉంటాయి? సాధారణం గా ఇటువంటి సంబంధాల్లో ఉన్న రెండు పార్టీలను ఏకం చేసే శక్తి ఇద్దరికీ మధ్య ఉన్న శత్రువు వల్ల మాత్రమే సాధ్యం. శత్రువు బలహీన పడగానే వీళ్ల మధ్య సంబంధం కూడా పుటుక్కుమంటుంది.
***
సుధీర్ ఇంటి పైనున్న ఆఫీస్ లోనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు విష్ణు.
టీవీ ఛానెల్స్ , యూట్యూబ్ లైవ్ టెలీ కాస్ట్ అని ఊదరగొడుతున్నాయి.
"ముఖ్యమంత్రి కనపడకపోవటం ఏమిటి?" అందరికీ ఆసక్తిగా ఉంది.
ప్రతిపక్ష నాయకుడు పార్థు పొద్దుటి నుంచి టీవీ కి అతుక్కు పోవటం చూసి అతని భార్య తల కొట్టుకుంది. ఇదే సందని తన వాగ్ధాటిని ప్రదర్శించసాగింది.
"చిన్నప్పుడు సినిమా కి వెళ్తే ముందు వరస లో కూర్చున్న వాళ్ళకి బొమ్మ ముందు కనపడుతుంది అనుకునే వాళ్ళం. అట్లా ఉంది మీ హడావుడి."
"మీకున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి సీఎం మిస్సింగ్ అన్న మాట నిజం. ఇంక ఎదురు చూడాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వాన్ని కూల్చేసి, మీరే సీఎం అవ్వొచ్చుగా ఇక."
అంతలోనే మళ్లీ అంది మెల్లగా.
"ఇదిగోండి. మీరు సీఎం అయ్యాక మా చెల్లి ని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిని చెయ్యాలి. ముందే చెప్తున్నా"
ప్రతిపక్ష నాయకుడిగా అతడు పులే కానీ భార్య ముందు మాత్రం పిల్లే.
"ఇళ్లలో వాళ్ల వల్లే మేము రాజకీయాల్లో మట్టి కొట్టుకుపోతున్నాం. మీతో గెలవలేక, ఇంట్లో ప్రశాంతత ఉండదని మీరు చెప్పే ప్రతిదీ చేసి తరవాత మేము జవాబు ఇచ్చుకోలేక చస్తున్నాం" అనుకున్నాడు.
"మీ చెల్లెలని నీకు ప్రేమ తప్ప ఆమెకి ఏం చాతనవుతుంది? పోనీ, ఆడవాళ్లకు, పిల్లలకు ఏమన్నా చేసిందా అంటే అదీ లేదు. తన ఇంట్లో పని చేసే వాళ్ళను నానా తిట్లూ తిట్టటం, పిల్లల్ని వదిలేసి బలాదూర్ క్లబ్ లకి తిరగటం, అంతేగా. ఏ శాఖ ఇవ్వాలో కూడా మీ అక్కాచెల్లెళ్ళు నిర్ణయిస్తారా?" అన్నాడు పార్థు. బీపీ పెరిగింది అతనికి.
మూతి తిప్పింది అతని భార్య. ఇక తన వైపు ఏడు తరాల చరిత్ర బయటకి తీస్తుంది కాబోలు. గభాల్న వేరే వైపు కి తిప్పాడు సంభాషణ.