Previous Page Next Page 
పార్ట్ టైమ్ హాజ్ బెండ్ పేజి 12

 

    "అదేంటండీ ? నేనేం తప్పు మాట్లాడానని? ఇంతవరకూ రెండు చోట్లకెళ్ళాను. రెండు చోట్ల కూడా ప్రొబేషన్ లో వుండగానే నా వర్క్ నచ్చలేదని గెంటేశారు "
    ఆమెకు అతని మాటల మీద నమ్మకం కలగటం లేదు.
    పెళ్ళికి ముందే అలాంటివి జరుగుతాయంటే --
    'ఛీ -- పాడు " అనుకుందామే శిరీష వాళ్ళక్క బయటికొచ్చింది మళ్ళీ.
    "మాకేం ఆస్తి పాస్తులు లేవు బాబూ! బాంక్ బ్యాలెన్స్ లూ లేవు! అందుకని డబ్బు విషయం గట్టిగా పట్టు పట్టకపోతే మిగతా కానుకలూ, సరదాలూ అన్నీ జాగ్రత్తగానే అందజేస్తాం."
    "ఓహో! అంటే జీతం కాష్ రూపంలో ఇవ్వటం కష్టమని చెపుతున్నారన్నమాట! కనుక తను ఇంకో లింక్ పెడితే సరిపోతుంది.
    జీతం బదులు వీళ్ళింట్లోనే పేయింగ్ గెస్టు ఏర్పాట్లు చేసుకుంటే తన సమస్య కూడా తీరిపోతుంది.
    'అమ్మాయి అందగత్తె! చూస్తూనే ఉన్నారు కదా!"
    "అవునండీ! డ్రీమ్ గాళ్ లాగుంది! అందులో డౌటేమీ లేదు" ఆ విషయం ఆమె ఎందుకు చెపుతుందో తెలీక మాట్లాడాడు.
    "మిగతా ఏ విషయం లోనూ మీకు లోటు రాకుండా చూసే బాధ్యత మాది."
    "నాకేం అభ్యంతరం లేదులెండి! కాపోతే నాకో వీక్ నెస్ వుంది. ప్రాక్టికల్ గా ముందు వర్క్ ఎంత వుంటుందో చూసుకుంటేనే గానీ దీనికి వప్పుకోలేను. కనీసం ఇవాళ ఒక్క రోజయినా మీరు దగ్గరుండే అన్నీ చూపిస్తే ......."
    శీరిష చివాలున మొఖం తిప్పుకొని లోపలి కెళ్ళిపోయింది.
    వాళ్ళక్కకు కోపం ముంచు కొచ్చేసింది.
    'చూడు నాయినా! ఇలాంటి పద్దతులు మా ఇంటా వంటా లేవు. మేము ఆస్థి పరులం కాకపోవచ్చు గానీ నీతి నియమాలు లేనివాళ్ళం కాదు.  మాకున్నది ఇల్లు ఒక్కటే. పై పోర్షనూ మా చెల్లిది. కింద పోర్షన్ నాది. ఇద్దరికీ చెరోకటీ ఇచ్చారు మా నాన్నగారు . అంతే! ఇంకేమయినా అడగాలనుకుంటే అడగండి!"
    సురేష్ కి అంతా అయోమయంగా వుంది.
    "భలే వారండీ మీరు! ట్రైనింగ్ కీ, నీతి నియమాలకూ సంబంధం ఏమిటి? సరేలెండి! మీకిష్టం లేదంటే నాకేం? కానీ ముందే చెప్తున్నాను . తర్వాత మాత్రం నీకు ఎక్స్ పీరియన్స్ లేదని ముందే ఎందుకు చెప్పలేదు? అంటూ గొడవ చేస్తే నేనూరుకోను! రూల్స్ ప్రకారం మూడో నెల వరకూ మీకిష్టం ఉన్నా లేకపోయినా నన్నుంచుకోవలసిందే."
    "అదేమిటండీ! జీవితమంతా నిలవాల్సిన బంధం ఇది! మూడో నెలకే ఎందుకు పోమ్మంటాం?"
    సురేష్ కొద్ది క్షణాలు ఆలోచించాడు.
    వాళ్ళెలాగు జీతం నమ్మకం లేదంటున్నారు కాబట్టి, ముందు ఇంట్లో షెల్టర్ అయినా సంపాదించాలి.
    "సరే నామీద మీకు అంత నమ్మకం వుంటే కనీసం ఇవాళ్టి నుంచీ ఆమె పై పోర్షన్ అయినా నేను వాడుకునెందుకు వప్పుకుంటే నేనూ మిగతా విషయాలేమీ పట్టించుకోకుండా వప్పుకుంటాను."
    'అదిగో ఆ తలతిక్క మాటలే వద్దంది. మా చెల్లెలికసలు అలాంటి జులాయి వేషాలు గిట్టావ్."
    'సరే అయితే మీరొచ్చినా నాకేం అభ్యంతరం లేదు. వర్క్ ఎలా వుంటుందో శాంపుల్ చూసుకోకుండా నన్ను ఎలా మాట ఇవ్వమంటారు?"
    ఆమె కోపంతో అదిరిపడింది.
    "ఏమిటి నేను రావాలా?" రోషంగా అడిగింది.
    "అవును! మీవారేలాగూ ఊళ్ళో లేరన్నారు కదా? మీ సిస్టరయితేనేం, మీరయితేనేం? మీరంతా నాకు యజమానులేగా?"
    "ఊరుకుంటే నెత్తి కెక్కుతున్నావ్! నీలాంటి వాడికెలా బుద్ది చెప్పాలో నాకు తెలుసు! నువ్ మమ్మల్ని అల్లరి పెట్టడానికొచ్చినట్లున్నావ్ గానీ పెళ్ళి చూపుల కొచ్చినట్లు లెవ్!" అంటూ గడప దగ్గరకు చకచక నడిచి "శారదా , కీర్తనా, త్వరగా రండి!" అంటూ అరచింది.
    మరుక్షణంలో బిలబిల మంటూ ముగ్గురు స్త్రీలు లోపలికి వచ్చారు.
    "ఏమిటోదినా? ఏం జరిగింది?' సురేష్ వంక అనుమానంగా చూస్తూ పిలిచారు.
    "వీడు పెళ్ళి చూపుల కొచ్చాడు కదాని గౌరవిస్తోంటే ఇప్పుడే శిరీషను తనతో పంపమంటున్నాడు. అదేమిటంటే పెళ్ళికి ముందే ట్రైనింగ్ కావాలంట" కోపంగా చెప్పింది.
    అందరి ముఖాల్లోనూ ఆశ్చర్యం, కోపం.
    సురేష్ కంగారుపడ్డాడు.
    "ఇదేం న్యాయమండీ! నేను పెళ్ళి చూపుల కొచ్చానని అబద్దం చెప్తారేం?"
    "అలాగా! పెళ్ళి చూపులకు గాకపోతే మరిదేని కొచ్చినట్లు ?"
    "ఉద్యోగం కోసమండీ!"
    "వీళ్ళింట్లో నీకు ఉద్యోగం కావాలా? ఏం ఉద్యోగం? ఆడపిల్ల'లను గదిలోకి పంపితే ట్రైనింగ్ తీసుకునే ఉద్యోగమా?" వెటకారంగా అడిగిందామె.
    "పైగా ఇంకేమన్నాడో తెలుసా శారదా! మీ సిస్టర్ ని పంపటం ఇష్టం లేకపోతే మీరే రండి.' అంటున్నాడు.
    అందరూ ఉలిక్కిపడ్డారు.
    'ఛాన్స్ దొరికితే వీడు గుడినీ, లింగాన్ని కూడా మింగెట్లు న్నాడు......"
    "బైగాడ్ చెప్తున్నాను మేడమ్. నాకు మీ అడ్రస్ ఇచ్చి ఇక్కడ పార్ట్ టైం ఉద్యోగం ఉందని చెప్పాడు. కావాలంటే మీరే రామలింగానికి ఫోన్ చేసి కనుక్కోండి. నేనిక్కడే వుంటాను ."
    "మేమేం ఇండస్ట్రీ పెట్టామనుకున్నావా ఉద్యోగాలివ్వటానికి? నువ్ పోకిరీ వేషాలేయడానికి కొచ్చావ్?"
    "ఇలాంటి వాడిని పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పాల్సిందే."
    సురేష్ గొంతు తడారిపోయింది.
    పోలీస్ స్టేషన్ లో పడేస్తే బయటపడటం ఎంత కష్టమో తెలుసు.
    "సరే ఉద్యోగం కోసం వచ్చావనుకో! మరి ఆ అమ్మాయిని ఎందుకు రమ్మంటున్నావ్?
    "భలే వారేనండీ! పనేమిటో తెలీకుండా ఉద్యోగంలో ఎలా చేరమంటారు? కిందటిసారి ఇలాగే పార్ట్ టైం జాబ్ వప్పుకుని రెండు రోజులు వెళ్ళేసరికి అప్పడాల పిండి కలపమన్నారు. నావల్ల కాదంటే ముందేందుకు వప్పుకున్నావని నానా గొడవ చేసిందావిడ."
    ఎవరో ఓ మూల నుంచి నవ్వారు.
    "పక్క వీధిలోనే ఫోన్ ఉందిగా చేసి వద్దాం పదండి" అంది ఒకామె.
    శిరిషా వాళ్ళక్క బయటకు నడిచింది.
    "ఆ మధ్య పేపర్లో కూడా చదివాను. ఒకడిలాగే పెళ్ళి చూపులకని వెళ్లి అచ్చం వీడిలాగే మాట్లాడి ఆ పిల్లతో ఏకాంతంగా మాట్లాడాలని చెప్పి బయటకు తీసుకెళ్ళి రేప్ చేశాడంట----" అంటుందోకావిడ.
    'పార్వతమ్మ చప్పున కనిపెట్టేసింది గానీ లేకపోతే శిరీషను కూడా చేసేవాడు ' ఇంకోకావిడ అంటోంది.
    బయటకు పారిపోవటం ఉత్తమని తెలుస్తూనే వుంది గానీ దానివల్ల మరింత శరీర హాని జరిగే అవకాశాలెక్కువగా ఉన్నాయన్న అనుమానం కలుగుతోంది.
    ఫోన్ చేసిన వాళ్ళిద్దరూ తిరిగి వచ్చారు.
    "తప్పు ఇతనిది కాదులెండి. రామలింగందెనట! పొరపాటున పెళ్ళి చూపులకు పంపాల్సిన కుర్రాడిని ఉద్యోగానికీ, ఉద్యోగానికి పంపాల్సిన ఇతనిని పెళ్ళి చూపులకూ పంపాడట --- ' నొచ్చుకుంటూ అంటోంది.

 Previous Page Next Page