"ఏం ఉద్యోగం?" అడిగాడు సురేష్.
"తెలీదు ! వెయ్యి రూపాయల జీతం...."
"థాంక్యూ....."
అడ్రస్ తీసుకుని గాలిలో తేలిపోతున్నట్లు నడవసాగాడు.
ఇంకా నమ్మశక్యం కావటం లేదు.
పార్ట్ టైం ఉద్యోగానికి వెయ్యి రూపాయలిస్తున్నారంటే !"
కుకట్ పల్లి కాలనీలో ఉందా ఇల్లు.
కాలింగ్ బెల్ మోగించాడు.
ఇంటావిడ తలుపు తెరిచి ప్రశ్నార్ధకంగా చూసింది.
"నన్ను రామలింగంగారు పంపించారండీ!"
మొఖంలో సడెన్ మార్పు -- విషయం ఉట్టి పడుతోంది . తన చెల్లెలు శిరీషకు మంచి సంబంధాలు చూడమని బ్రోకర్ కి చెప్పారు.
"నమస్తే ! రండి! కూర్చోండి" ఆహ్వానిస్తూ అంది.
లోపలకు నడిచి కుర్చీలో కూర్చున్నాడు ఆమె హడావుడిగా లోపల కెళ్ళి పోయింది. ఓ అందమయిన అమ్మాయి మొఖం వెనుక నుంచి తళుక్కున మెరిసి మాయమయింది.
మిడిల్ క్లాస్ ఇల్లులా ఉంది! ఇక్కడ పార్ట్ టైం జాబ్ ఏం ఉంటుంది?
ఆమె ట్రేలో మంచినీళ్ళ గ్లాస్ తెచ్చి టీపాయ్ మీద ఉంచింది.
"శిరీష వాళ్ళ బావగారు పొద్దున్నే ఆఫీస్ పని మీద ఊరెళ్ళారు రేపు ఉదయం గానీ రారు -- మీదేవూరు ?" అడిగిందామె.
"మచిలీపట్నం' శిరీష అంటే ఎవరయి ఉంటారో తెలీటం లేదు.
'చాలా దూరం నుంచి వచ్చారు. కూర్చోండి! ఇప్పుడే శీరీషను తీసుకొస్తాను" లోపలి కెళ్ళింది .
లోపల గుసగుసలు--
కర్టెన్ వెనుక మెరిసిన అందమయిన మొఖం మళ్ళీ కనబడితే బావుండుననుంది.
ఆమె ఈసారి ట్రేలో కాఫీ ఫలహారాలు తీసుకొచ్చింది.
"సమయానికి ఆయనలేరు. అన్నీ నేనే మాట్లాడాలి!' సిగ్గుపడుతూ అంది.
"ఎవరయితే ఎంలెండి! నేనుండేది ఇంక ఈ ఇంట్లోనే కదా!"
ఆమె కళ్ళల్లో ఆనందం తొంగి చూసింది.
"అవునవును! అన్నీ కుదిరితే ఇది మీ ఇల్లే!"
"కుదరకేం లెండి! నాకు డబ్బు ముఖ్యం కాదు! కొంచెం గౌరవం మర్యాద ఇచ్చేవాళ్ళు ౦ అంతే!
ఆమె నవ్వింది.
"మేమూ అంతేనండి! మంచి, మర్యాదలకే విలువ ఇస్తాం!"
"లోపల్నుంచి సెక్సీ గొంతు.
"ఇప్పుడే అమ్మాయిని తీసుకొస్తాను" లోపలి కెళ్ళింది.
సురేష్ కన్ ఫ్యూజ్ అయాడు.
భర్త ఊళ్ళో లేడు కాబట్టి ఆమె స్వయంగా డీల్ చేస్తుందేమో! ఇంతకూ ఇలాంటి ఇంట్లో పార్ట్ టైం జాబ్ ఏమయి ఉంటుంది?
"త్వరగా ముస్తాబవ్! నిన్ను చూడ్డానికి వచ్చాడతను' చెల్లెలితో చెపుతోందామె.
"ఎవరతను?"
"మనకు మాత్రమేం తెలుసే? కుర్రాడు బాగానే వున్నాడు. రామలింగం పంపించాడు కాబట్టి మంచి సంబంధమే అయుండాలి !" రహస్యంగా అంది.
శిరీష త్వరత్వరగా ముస్తాభాయి బయటికొచ్చింది అక్కతో పాటు. "మా చెల్లెలు శిరీష బాబూ!"
"నమస్తే" అంది సురేష్ వేపు సిగ్గుతో చూస్తూ.
"నమస్తే"
ఆమె కుర్చీలో కూర్చుంది. అక్క కుర్చీ వెనుక నిలబడింది పైట నిండుగా కప్పుకుంటూ.
ఒకవేళ వీళ్ళకేమయినా కాటేజ్ ఇండస్ట్రీ ఉందా? కొంతమంది ఇళ్ళల్లోనే అప్పడాలు, కాండిల్స్ , శికాకాయ్ లాంటివి తయారు చేసి వాటిని మార్కెటింగ్ చేయటం కోసం తనలాంటి నిరుద్యోగ పక్షులను పార్ట్ టైం జాబ్ కి తీసుకుంటారు.
"ఇద్దరూ మాట్లాడుకోండి బాబూ! తరువాత గొడవలు రాకుండా ఉండాలంటే ముందే ఒకరినొకరు అండర్ స్టాండ్ చేసుకోవటం మంచిది కదా!"
తనింక రెచ్చిపోవచ్చు. ఎందుకంటే ఆ పిల్ల తన డ్రీమ్ గాళ్ లాగుంది.
"శిరీషగారితో అలాంటి ప్రాబ్లం ఏమీ రాదండీ! ఆమెను చూడగానే ఎవరయినా ఒక అండర్ స్టాండింగ్ కొచ్చేస్తారు" అక్కగారు లోపలికెళ్ళిపోయింది.
శిరీష కాటుక కళ్ళు బరువుగా పైకెత్తి చూసింది చిరునవ్వుతో.
మరీ పెళ్ళి కూతురిలా ఎందుకు బిహేవ్ చేస్తోందో సురేష్ కి అర్ధం కావటం లేదు.
"జీతం వెయ్యి రూపాయలని బ్రోకర్ చెప్పాడు" అన్నాడతను .
ఇలాంటి ఉద్యోగాల విషయంలో జీతం విషయం ముందే తేల్చుకోవటం మంచిది.
"అవును! కానీ టెంపరరీ ఉద్యోగం" అందామె -- తన గురించి చెపుతూ !
తను చేస్తున్న ఉద్యోగం గురించి అడుగుతున్నాడనుకుంది.
అక్క పెళ్ళిళ్ళ బ్రోకర్ కి చెప్పింది. "పిల్లాడికి చిన్న ఉద్య్లోగం ఉన్నా ఫర్లేదు మంచి చదువుంటే చాలు! ప్రస్తుతం అమ్మాయి ఉద్యోగం చేస్తోంది కాబట్టి ఫర్లేదు " అని.
"పని రోజూ ఉంటుందా?" ఒకవేళ నాలుగురోజులు చేయించి నాలుగురోజులు మానిపిస్తారేమోనన్న సందేహంతో అడిగాడు.
"లేకపోతే అంత జీతం ఇవ్వరు కదండీ!' నవ్వుతూ అంది. నవ్వుతుంటే అందం ఇంకో రెండు మూడు లీటర్లు పెరిగిపోయినట్లనిపిస్తోంది.
"ఆఫ్ కోర్స్! ఆ మాట నిజమేలెండి!"
కొద్ది క్షణాలు నిశ్శబ్దం .
"మీరు సరేనంటే --- మిగతా విషయాలు మాట్లాడితే బావుంటుంది " అంది కొంచెం ధైర్యంగా.
"భలే వారే ! నేను 'రడీ' ఆయె వచ్చాను. 'సరే' అనాల్సింది మీరు."
ఆమెకు ఆశ్చర్యంగా ఉంది. సాధారణంగా మగపిల్లాడీకే ఆడపిల్ల నచ్చాల్సి వుంటుంది. ఇతను రివర్సులో మాట్లాడతాడేమిటి?"
"నాకిష్టమే" అంది సిగ్గుపడిపోతూ.
"మరి ముందు కొద్దిరోజులు నాకేమయినా ట్రైనింగు ఇస్తారా మీరు?" ఆమె కలవరపాటుతోనూ సిగ్గుతోనూ చూసింది.
"ఛీ పాడు! అవేం మాటలు?"
సురేష్ కి అర్ధం కావటం లేదామే మాటలు.
"అందులో తప్పేముందండీ! ఈ రోజుల్లో అందరూ 'ప్రోబేషన్ పిరీడ్' అనేదొకటి పెడుతున్నారు! నేను మీకు పూర్తిగా ఉపయోగపడతానో లేదో మీరు చోసుకొవాలి కదా?"
ఆమె మరింత సిగ్గుపడిపోయింది.
'అయ్యొయ్యో! అలా మాట్లాడకండి! నాకు సిగ్గేస్తోంది" చేతులతో మొఖం కప్పుకుంటూ అంది.
"చూడండి! మీ మంచికే చెప్తున్నాను. తర్వాత మీకు నేను సంతృప్తి కలిగించలేకపోయాననుకోండి! అప్పుడు సడెన్ గా నన్ను బయటకు గెంటి ఇంకోడిని వెతుక్కువాలంటే చాలా కష్టమవుతుంది! అందుకని ముందే టెస్ట్ చేసుకోవటం మంచిది ఏమంటారు?"
"అలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను" లేచి నిలబడుతూ అంది.
ఆమె ఎందుకంత అఫెండయిపోతోందో అర్ధం కావటం లేదు.