"ఆ భయం అక్కర్లేదు లెండి!"
"అంటే? నిందలకు భయపడరనా? పెళ్లి చేసుకోరనా?"
"ఇప్పట్లో పెళ్ళయ్యే అవకాశం లేదని-"
"అదేం? మీరు కలలుకనే దివ్యపురుషుడు ఇప్పట్లో తారసపడటం అసంభవం అనా...."
"నేనే దివ్యపురుషుణ్ణి గురించీ కలలు కనటం లేదు - ఒక చిన్న ఇల్లూ - నా పిల్లలు - నా సంసారం.... సహృదయుడైన భర్త.... ఇంతే కోరుకునేది నేను - కానీ, ఇంత అతిమామూలు కోరిక కూడా నాలాంటి దానికి గగన కుసుమమై కూచుంది-"
"అదేమిటి! మీలాంటి యువతిని ఎవరు కళ్ళకద్దుకుని స్వీకరించరూ?"
జ్యోత్స్న భాస్కర్ వైపు చూసి చిరునవ్వు నవ్వింది -
అంత ఉద్రేకంగా అన్నందుకు సిగ్గుపడ్డాడు భాస్కర్ -
"మీకు అభ్యంతరం లేకపోతే నేను చూస్తాను, మీకు సంబంధాలు-"
"వద్దులెండి!"
"మీకు కావలసింది నిండైన సామాన్య సంసారమే అయినపుడు అభ్యంతరం దేనికి?"
మనదేశంలో కేవలం వ్యక్తినీ , వ్యక్తిత్వాన్నీ చూసి పెళ్ళి చేసుకునే వారెవరు ? పెళ్ళి అనగానే పుట్టు పూర్వోత్తరాలన్నీ తవ్వుతారు -"
"అది సహజమేగా! అయితే ఏం?"
జ్యోత్స్న మాట్లాడలేదు- అప్పుడప్పుడే చీకటి పేరుకుంటోన్న వేళలో ఆమె నీళ్ళలోకి చూస్తూ కూచుంది.
జ్యోత్స్న ముఖంలోకి వింతగా చూసిన భాస్కర్ మళ్ళీ ఆమెను అడగలేదు.
"బాగా చీకటి పడింది." అంది జ్యోత్స్న లేచి....
భాస్కర్ కూడా లేచి "అప్పుడప్పుడు ఇలా మిమ్మల్ని కలుసుకుంటే మీకేమీ అభ్యంతరం ఉండదుగా!" అన్నాడు.
"ఉండదు - ఈనాటివరకూ మీలాంటి మంచి స్నేహితుడు నాకు తటస్థపడలేదు-"
"ఈనాటివరకూ నాకసలు ఆడవాళ్ళలో స్నేహితులే లేరు మా సుశీల దూరంగా ఉన్నా, ఎప్పుడూ నా పక్కనే ఉండి గుడ్లు ఉరిమి చూస్తున్నట్లే అనిపిస్తుంది నాకు! అంత ప్రేమ!"
నవ్వాడు భాస్కర్.... జీవితంలో విషాదాన్ని హాస్యంగా మార్చుకోగలుగుతూన్న ఆ యువకుణ్ణి చూసి తనూ నవ్వింది జ్యోత్స్న-
అప్పటి నుండి జ్యోత్స్న భాస్కర్ లు తరచుగానే కలుసుకునేవారు. అనేక విషయాలు మాట్లాడుకునేవారు - తనే పరిస్థితుల్లో సుశీలను పెళ్ళి చేసుకోవలసి వచ్చిందో చెప్పాడు భాస్కర్. పెద్ద వాళ్ళలో కొందరిలో ఈనాటికీ వదలని మూర్ఖత్వాన్ని తలుచుకుని బాధపడ్డారు ఇద్దరూ-
జ్యోత్స్న ఉద్యోగం గురించి అడిగాడు భాస్కర్ -
"ఒక స్థిరమైన ఉద్యోగం లేదు. కొన్నాళ్ళు ట్యూషన్లు చెప్పాను - కొన్నాళ్ళు హౌస్ కీపర్ గా కూడా ఉన్నాను - ప్రస్తుతం ఒక షాప్ లో సేల్స్ గరల్ గా పనిచేస్తున్నాను - కానీ, నా అందమే నాకు శాపపై కూచుంది. ప్రతిచోటా ఏదో ఒక సందర్భంలో నా పరిసరాల్లో పురుషులు నన్ను కోరక మానరు. అక్కడితో సమస్యలు. ఉద్యోగం వదిలి నిరాశ్రయురాలిని కావటం - ఈ ఉద్యోగమయినా ఎక్కువకాలం నిలుస్తుందని అనుకోను. మా షాపు యజమాని కొడుకు అప్పుడే ఎదో వంకతో నాతో పరిహాసాలు ప్రారంభించాడు.'తన దగ్గర పని చేస్తున్నారు' అనగానే మరింత లోకువ కొంతమంది మొగవాళ్ళకి - ఈ సేల్స్ గరల్ పని కూడా ఎప్పుడు వదులుకోవలసి వస్తుందో! పొద్దున్నే టైప్ నేర్చుకుంటున్నాను. నైట్ కాలేజీలో బి.ఏ చదువుతున్నాను. కనీసం నా కర్మాన నన్ను సుఖంగా ఉద్యోగమైనా చేసుకోనివ్వదు, ఈ పాడు లోకం...."
"బి.ఏ పాసయి ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగంలో సెటిలయితే ఇన్ని యిబ్బందులు ఉండకపోవచ్చును."
"నా ఆశా అదే! అందుకే భగీరథ ప్రయత్నం చేస్తున్నాను."
నిరాశ పడనక్కర్లేదని ధైర్యం చెప్పేవాడు భాస్కర్. అతని ప్రోత్సాహంతో మరింత శ్రద్ధగా చదవసాగింది జ్యోత్స్న....
ఒకరోజు జ్యోత్స్న చీకటి పడకముందే లేచి "నా పెన్ పాడయిపోయింది. కొత్తది కొనుక్కోవాలి" అంది.
"నా పెన్ తీసుకోండి" అని తన పెన్ ఇవ్వబోయాడు భాస్కర్.
జ్యోత్స్న తటపటాయించింది.
"తీసుకోండి. ఈ పెన్ నాకు మా మాఁవగారు ప్రజంట్ చేశారు. ఆయన బొంబాయి నుంచి తీసుకొచ్చారు. చాలా బాగా రాస్తుంది. దీంతో పరీక్షలు రాస్తే మీరు తప్పకుండా పాసవుతారు."
"ఇలా శుభాకాంక్షలతో ఇస్తున్నారు కనుక తీసుకుంటాను. కానీ, మళ్ళా నేను మీకేమీ బహుమతి ఇవ్వలేను."
"రోజుకొక్కసారి మిమ్మల్ని చూడగలిగితే చాలు. అంతకుమించిన బహుమతి నాకేమీ అక్కర్లేదు."
అప్రయత్నంగా ఆర్ద్రంగా అనేశాడు భాస్కర్. అంతలోనే తొట్రుపడుతూ "వెళ్దాం రండి!" అని లేచాడు.
"జ్యోత్స్న లేవలేదు."
"అదేమిటి? రారా?" అన్నాడు భాస్కర్.
"రాను."
"చీకటి పడుతోంది."