Previous Page Next Page 
భార్యతో రెండో పెళ్ళి పేజి 11


    "జానీ........"
    "నన్ను పెళ్ళి చేసుకుంటానన్నాడు. వాళ్ళకి డబ్బు ఉందట!. అతనికి చదువొస్తుందిట! బోలెడు అమ్మాయిలతో తిరిగినా నన్ను మాత్రమే పెళ్ళి చేసుకోవాలని అనిపించిందట."
    పాలిపోయింది వివేక్ మొహం. "మంచిదే" అన్నాడు.
    "ఏమిటి మంచిది?"
    "అతడ్ని.. జానీని పెళ్ళి చేసుకోవడం.."
    "ఛ! ఆ రోగ్ నా?"
    "అతడు రోగ్ కాదు. అతడు ఏ అమ్మాయినీ బలవంతం పెట్టలేదు. ప్రలోభ పెట్టలేదు. నాకు బాగా తెలుసు! మీ ఆడపిల్లలే ఎలాగైనా ఆ బంగారు పిచ్చుకని వల్లో వేసుకోవాలని అతడి వెంటపడి వేధిస్తున్నారు."

    "అతడి తప్పు లేదంటారు."
    "లేదు."
    "అయితే నేనూ అలాగే తిరిగితే తప్పు లేదంటారా?"
    "అనను... నువ్వు తిరిగితే తప్పే."
    "ఆడదానికొకరూలు. మగవాడికొక రూలునా?"
    "తప్పదు.. సృష్టి క్రమం అలా ఉంది."
    "అంటే ఆడదానికి ప్రకృతి మాతృత్వం విధించింది కనుక....."
    "కరెక్ట్! "మాతృత్వం" అంటే ఏమిటి? సృష్టి శక్తిని గ్రహించటం. అలా గ్రహించేశక్తి ఆడదానికి మాత్రమే ఉంది. మొగవాడు సృష్టిశక్తిని విడుదల చేస్తాడు. అంచేత బాధ్యత తక్కువ."
    "ఇంతేనా! శారీరకమైన సంబంధాలేనా? మనసు మాట."  
    "మనసు ప్రసక్తి ఉంది గనకనే. ఇలాంటి విశృంఖలసంబంధాలలో స్త్రీదే తప్పు అంటున్నాను. సాధారణంగా మొగవాడికి సెక్స్ అవసరం. స్త్రీకి సెక్స్ ప్రేమలో ఒక భాగం మాత్రమే. ప్రేమ ఆమె జీవితానికి ఆలంబనం. ఇవి సహజమైన స్త్రీ పురుషుల మనఃప్రవర్తులు. డబ్బుకోసమో పెండ్లికోసమో సహజ ప్రవృత్తికి భిన్నంగా ప్రవర్తించే స్త్రీ తప్పు అనటం చాలా చిన్నమాట? అలాంటి స్త్రీ........" ఆవేశంతో మాట పూర్తి చేయలేకపోయాడు.
    ఆశ్చర్యంతో వింది యశోద... వివేక్ నోట ఇలాంటి మాటలు ఇంతటి ఆలోచనతో వస్తాయని అనుకోలేదు. ఎంతగా స్త్రీ జన పక్షపాతంగా ఉన్నా వివేక్ మాటలలోని నిజాన్ని కాదని అనలేకపోయింది.  

    "కూల్ డౌన్!" అంది చిరునవ్వుతో.
    "జానీ మాటల్లో నిజం ఉంది. నన్ను పెళ్ళిచేసుకోవటం కంటే అతడ్ని చేసుకుంటే నువ్వు సుఖపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నీకెంత జెలసీ ఉన్నా. నీ ఫ్రెండ్ గా నీకీ సలహా ఇస్తున్నాను."

    "థేంక్స్! కానీ అలాంటి జులాయి మనిషిని నేను పెళ్ళిచేసుకోలేను."
    చురుగ్గా చూశాడు వివేక్.
    "అతడికి ఆడస్నేహితులు ఉన్నారని పెళ్ళి చేసుకోనంటున్నావా?"
    "ఆ స్వరమూ.. ఆ మాటల ధోరణి..." యశోదకే దోస్ఫురించి చటుక్కున అంది." నాకతడి మీద ప్రేమ లేదు. ప్రేమ ఉంటే ఎన్ని బలహీనతలనైనా క్షమించేదాన్నేమో? అంచేత అతనితో నాకు పెళ్ళి ఆలోచన రాదు."

    "వివేక్ కళ్ళు మెరిశాయి "హమ్మయ్య!" అనుకుంది యశోద.
    అప్పుడు అడిగింది రెండోసారి....
    "ఉదయం నాతో అన్నారు. ఏదో చెప్తానని........?"
    "మిమ్మల్ని మోటార్ సైకిల్ మీద రావొద్దన్నాను. అందుకు కారణం....." ఆగాడు. గొంతు సవరించుకుని నెర్వస్ గా నవ్వాడు.
    "నాకు ఆడ పిల్లలతో మాట్లాడటం అలవాటు లేదు. చనువుగా ఉండటం అస్సలు తెలీదు! అంతేకాదు ఆడపిల్లలు మరీ దగ్గరగా వస్తే చేతులు వణుకుతాయి. నేను ఇంతకు ముందు ఏ ఆడపిల్లనీ మోటార్ సైకల్ పై కూర్చోపెట్టుకోలేదు. మొదటిసారిగా నిన్ను ఎక్కించుకుంటే.... నా చేతులు వనికితే... నువ్వు కిందపడి నీకు దెబ్బలు తగిలితే.....?"
    యశోద తెల్లబోయింది. అతడ్ని చూసి విరగబడి నవ్వింది.
    ఏదో పెద్ద రిలీఫ్ పొందినవాడిలా అతడూ నవ్వాడు.
                                    4
    వివేక్ తల్లి ఎదుట కృష్ణాజినం మీద కూర్చున్నాడు.
    ఆవిడ పూజ పూర్తిచేసి నమస్కారం చేసి లేస్తోంటే తనూ దేవుడికి దణ్ణం పెట్టాడు.
    నవ్వింది ప్రసూన... ఆవిడ పూర్తి పేరు 'జ్ఞాన ప్రసూనాంబ' అందరూ ప్రసూనా! అని పిలుస్తారు.

    తల్లితో ప్రత్యేకించి ఏదైనా పని ఉన్నప్పుడే వివేక్ పూజ గదిలోకొచ్చిముందు దేవుడికి దణ్ణం పెట్టుకుంటాడు. ఆ ఇంట్లో ఏ రహస్యాలు మాట్లాడుకోవడానికి పూజ గదికి మించిన స్థలం లేదు.
    "ఏం కావాలి?" అడిగింది ప్రసూన.
    "ఆ రోజు మనింటికి వచ్చింది చూడూ ఆ అమ్మాయి గుర్తుందా?"
    "యశోద! ఎందుకు గుర్తుండదూ? నువ్వు పెళ్ళి చేసుకోవాలనుకున్నావు."
    "అవును!"
    "నాన్నగారితో మాట్లాడమంటావా?"
    "ఒద్దు!"
    ఆవిడ కళ్ళు పెద్దవి చేసి చూసింది.
    "అదేం?"
    "నాన్నగారికి నువ్వు చెప్పటం. ఆయనని వొప్పించటం... ఈ తతంగాలూ వద్దు. ఆయనకి ఏమి చెప్పకుండానే రిజిస్టర్ మేరేజ్ చేసుకుంటాను. నువ్వు ఆశీర్వదించు! చాలు."

    "వివేక్! ఇలా అయితే. నాన్నగారికి చాలా కోపం వస్తుంది."
    "అవును! వస్తుంది. కానీ పెళ్ళి అయిపోయాక ఏమి చెయ్యలేరు."
    "అంటే!"
    "నాన్నగారి సంగతి నాకంటె నీకే బాగా తెలుసు. ఆయనకి ఇష్టంలేని పని ఈ ఇంట్లో జరగటానికి వీల్లేదు. ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకోవటం నాన్నగారికి ఇష్టం ఉండదని నీకూ నాకూ కూడా తెలుసు! నువ్వు చెప్పి ఒప్పిస్తానంటావు. ఒప్పుకున్నట్లు కనిపిస్తారు. కానీ తప్పకుండా ఏదో ఒకటి చేస్తారు. ఏం చేస్తారో మనకు తెలియదు. కానీ పెళ్ళి కాకుండా చేస్తారు."              

 Previous Page Next Page