"ఆహా.. మిమ్మల్ని ఎలా అభినందించాలో తెలీడం లేదు. పుస్తకం కొనడం అలవాటులేని తెలుగు పాఠకుల చేత.... నెల తిరక్కుండానే అన్ని కాపీలనూ కొనిపించింది మీ గ్రంథరాజం! ఒకే మూసలో పోసిన కథలు తీసే మన నిర్మాతల చేత ఒక పురుషుడు రాసిన నవలని చిత్రీకరించాలనే నిర్ణయం చేయించింది మీ పుస్తకం! తెలుగుదేశం మీకు కలకాలం ఋణపడి వుంటుంది....." అన్నాను వ్యంగ్యంగా.
నా వ్యంగ్యాన్ని ఆయన నిజంగా తీసుకున్నాడు. ఉబ్బితబ్బిబ్బు అయిపోయాడు.
"ఏదోనండీ.... అంతా మీబోటివారి చలవ!" అంటూ బోలెడు సిగ్గుపడ్డాడు. మళ్ళీ అంతటి సిగ్గునుంచి తేరుకుని, తల బల్లమీద ఆనించి పకపకా నవ్వడం మొదలుపెట్టాడు.
నాకు భయంవేసింది - వున్నట్లుండి ఈ మహానుభావుడికి పిచ్చెక్కలేదుకదా.. .అని.
ఆ నవ్వు తెరల్లోంచి తేరుకుని తలెత్తాడు ఆ మహా రచయిత. నవ్వి నవ్వి అతడి కళ్ళమ్మట నీళ్లు వచ్చాయి. "శివయ్య కూడా ఇలాంటి అవస్థలోనే పడ్డాడండీ. అది జ్ఞాపకం వచ్చి నవ్వు వచ్చింది" అన్నాడు. మళ్లీ వస్తున్న నవ్వును ఆపుకుంటూ -
"ఈ శివయ్యే తెలీదూ?" అని ఒక్కసారి సీరియస్ గా అడిగి, "ఓ ..ఐయాం సారీ - మీరు తాటిచెట్టుని చదవలేదన్నారుగా! శివయ్యది అందులో ఒక చక్కని పాత్ర లెండి. ఆ పాత్రని ప్రత్యేకమైన కృషితో చిత్రించాను. అది కలకాలం జీవించా పాత్ర!" అంటూ అర్జునునికి గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిలాగా సంశయం నివృత్తి చేశాడు.
"మళ్ళీ తాటిచెట్టు వచ్చిందిరా దేవుడా...!' అనుకున్నాను. అప్పటికే నాకు తలనెప్పి మొదలైంది. అది అంతకంతకూ ఎక్కువవుతోంది. వెంటనే ఏ ఆస్ప్రోనో, అనాల్జినో వేసుకుంటేగాని అది తగ్గేట్టులేదు. మళ్లీ లేచి -
"అయ్యా... కాఫీ వచ్చేసరికి ఆలస్యం అవచ్చు. నేను త్వరగా వెళ్లాల్సివుంది. ఇంకోసారి వసతా... వెళ్ళివస్తా!" అన్నాను - ప్రాధేయపూర్వకంగా.
"ఎంతసేపండీ...." అంటూ కూర్చున్నవాడు లేచివచ్చి, "ఈపాటికి బాయ్ వస్తూనే వుంటాడు. ఫైవ్ మినిట్స్ కూర్చోండి!" అంటూ ఎంతో చనువుగా నా భుజాలు పట్టుకుని కుర్చీలో కూలవేశాడు.
ముళ్లమీద కూర్చున్నట్లు, భీష్ములవారు అంపశయ్యమీద పడుకున్నట్లు కూర్చున్నాను. బలిపీఠం మీద పశువులాగా ఇరకాట పడసాగాను... , పంజరంలో పక్షిలాగా మనస్సులోనే కొట్టుకోసాగాను.
ఆ రచయిత చేతులు వెనక్కి కట్టుకుని, నా కుర్చీకీ, తన కుర్చీకీ మధ్య తిరగడం మొదలుపెట్టాడు - కాపలా కుక్కలాగా సీరియస్ గా ముఖం పెట్టి!
"పాపం -శివయ్య ఎంతో అమాయకుడు. ఒకసారి అతను రాసిన నవల గురించి కాలేజీ విద్యార్దులు నవ్వుతాలికి పొగిడితే, అది నిజమే ననుకుంటాడు. అప్పుడొక హాస్య సంఘటన జరుగుతుంది. అది జ్ఞాపకం వచ్చి నవ్వువచ్చింది." అని తిరిగి తన కుర్చీ దగ్గరికి పోయి కూర్చున్నాడు. నేనేమీ మాట్లాడలేదు.
'నిన్ను చూస్తూంటే ఆ శివయ్య సాక్షాత్తూ కన్పిస్తున్నాడు నాయనా....' అని మనస్సులో అనుకున్నాను. తిరిగి ఆయనే అందుకున్నాడు -
"ఆ శివయ్యది ఎటువంటి పాత్ర అనుకున్నారు! కరుడు కట్టిన మంచితనం మూర్తీభవించిన అమాయకత్వం. మనం సినిమాల్లో చూస్తూంటాం చూడండీ - సత్తెకాలపు సత్తయ్య లాంటి పాత్రలు! అచ్చం అటువంటి రకపు పాత్ర. అసలు నా పాత్రనే సినిమా వాళ్లు కాపీ కొట్టేవారని నా అనుమానం. ఒక శివయ్య ఏమిటి లెండి... నేను సృష్టించిన పాత్రలన్నీ అటువంటివే!"నిరాఘాటంగా సాగిపోతోంది ఆయన వాగ్ధాటి.
ఇంతలో..... నా పాలిటి భగవంతుడిలాగా వచ్చాడు - బాయ్ కాఫీ తీసుకుని!
దానితో ఆ రచయిత వాక్ర్పవాహానికి అడ్డుకట్ట పడింది.
బాయ్ కాఫీని ఇద్దరిముందు వుంచాడు.
"తీసుకోండి. ..." అంటూ తానొక కప్పు తీసుకుని సిప్ చేస్తూ - "మీరు నా రచనలు ఏమేం చదివారు?"అన్నాడు.
అసలే వేడి కాఫీ.. కంగారులో త్రాగడంతో నాలిక చుర్రుమంది. రచయిత ప్రశ్నతో పచ్చివెలక్కాయ గొంతులో పడ్డట్టయింది. నిజానికి - నేను ఆ రచయిత రచనలేవీ చదవలేదు. 'ఇంక తప్పదురా బాబూ....' అనుకుని -
"చాలా చదివానండి...! ఎక్కువ కథలు చదవడంతో పేర్లు జ్ఞాపకం లేవు" అన్నాను.
రచయిత ఉత్సాహంగా "ఆ..... ఆ... చదివేవుంటారు! చదవకుండా ఎలా వుంటారు లెండి!?" 'కాకిగోల' చదివారనుకుంటాను... 'కర్మఫలం' కూడా తప్పక చదివేవుంటారు" అంటూ లిస్టు చెప్పుకుపోసాగాడు.
'కర్మఫలం చదవలేదు నాయనా.... అనుభవిస్తున్నాను' అనుకుంటూ - 'అబ్బా ...... చాలా చదివానండీ! ఒక్కమాటలో చెప్పాలంటే - మీ రచనలన్నీ ఔట్ స్టాండింగ్ ...!' అన్నాను.
రచయిత ఉత్సాహం కట్టలు తెంచుకుంది. అర్దనిమీలిత నేత్రాలతో చూస్తూ.....
"నాకు తెలుసు - మీరట్లా అంటారని...! ఆ.... ఇంతకీ 'మనసు మోకులు' చదువుతున్నారా?" అని అడిగాడు.
నేను తాగుతున్నది కాఫీ అయినా నీళ్లు నమలసాగాను.
"అదేనండీ - ప్రస్తుతం ఆ పత్రికలో సీరియల్..." అంటూ అదేదో పత్రక పేరు చెప్పాడు.
"వారం వారం చదవనండీ. అంతా అయ్యాక ఒక్కసారి చదువుతాను. లేకుంటే గ్రిప్ పోతుంది. ... చూడండి!' అన్నాను.
"అది మంచి పద్దతే అనుకోండి. కాని ఇది మాత్రం ప్రతివారం చదవండి. అంతా అయ్యాక మళ్ళీ చదవవచ్చు. ఇటువంటి సీరియల్ ఇంతవరకూ రాలేదని రోజూ మాకు వేలాది ఉత్తరాలు వస్తున్నాయి...." అన్నాడు ఆయన సీరియస్ గా.
నా కాఫీ తాగడం పూర్తి అయింది.
ఆయనదీ అయింది.
బ్రతుకుజీవుడా ...అనుకొంటూ, "వెళ్లివస్తాను" అంటూ లేచాను.
ఆయన "సరే.....!" అన్నాడు.
సంతోషంతో నాలుగడుగులు వేశానో, లేదో - "మాస్టారూ..." అని మళ్లీ పిలిచాడు.
ఇంకా ఏమి రాసిపెట్టి వుందిరా దేముడా... అనుకుంటూ వెనక్కి తిరిగాను.
"చూడండీ... మనసు మోకులు మాత్రం చదవడం మరిచిపోకండి. లేకుంటే జీవితంలో ఒక మంచి నవల చదవలేదని తర్వాత చాలా పశ్ఛాత్తాపపడతారు!" అన్నాడు సీరియస్ గా.
"అయ్యో ... తప్పక చదువుతానండి!" అంటూ ఇక వెనక్కి తిరిగి చూడకుండా గబగబా బయటకి వెళ్ళిపోయాను. రెండు అనాసిన్ మాత్రలు వేసుకుంటేనే కాని తలనొప్పి తగ్గలేదు.
అప్పటినుంచీ ఆ ఆఫీసు వైపు వెళ్లాలంటనేనే భయంగా వుండేది.
-హాస్యప్రభ.... డిసెంబర్' 95
అనుభవం నేర్పిన పాఠం
ఒక దిన పత్రికలో 'తోటమాలి కావలెను. అభ్యర్దులు తాము ఇంతకుముందు పనిచేసినప్పటి ట్రౌజర్ లను కూడా వెంట తీసుకురావలెను' అని పడింది.
ఈ వింత ప్రకటనకి విస్తుపోయిన రంగయ్య తన పాత ట్రౌజర్ ని తీసుకుని వెళ్ళాడు.
ప్రకటన చేసిన ముదుసలి ఇంటి యజమానురాలు అతని ట్రౌజర్ లను చూసి -
"ఈ ఉద్యోగం నీకిస్తున్నాను" అంది.
రంగయ్య ఉండబట్టలేక - "అమ్మా ..... ఈ ట్రౌజర్లకీ, నా ఉద్యోగానికీ ఏమిటి సంబంధం?" అని అడిగాడు.
"ఉంది. నీ ట్రౌజర్లు మోకాళ్ల మీద చిరిగాయి. ఇంతకుముందు వచ్చిన ఇద్దరి ట్రౌజర్లూ పిర్రల మీద చిరిగాయి. నాకు నేల మీద వంగి పనిచేసేవారు కావాలి కాని, కూర్చునేవాళ్లు కాదు" అంది ఆ అనుభవజ్ఞురాలు.