Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 11


    పెద్దవాళ్ళ మాట చెల్లించింది తను.


    ఇక కృష్ణమౌళి ఇంద్రసేనల పెళ్ళి ఉంది.


    అది చాలా కష్టంతో కూడిన పని. చాలా తెలివిగా ఆ పెళ్ళి జరిపించాలి.


    కృష్ణమౌళి గణేశ్ రావు గారితో చిన్నప్పుడు అన్నాడు. నీ కూతుర్ని నువ్వు ఇచ్చి పెళ్ళిచేసేది ఏమిటి శ్రీకృష్ణుడులా ఎత్తుకెళ్ళిపోయి పెళ్ళి చేసుకుంటాను అని.


    ఆ మాట నిజం చెయ్యటం ఎలా!


    దానికి పెద్ద ప్లానే ఆలోచించాలి.


    అంబిక మనసులో చిన్నగా నవ్వుకుంది.


    అంతలో తలుపు దగ్గర చప్పుడు అయితే తలనొప్పి చూసింది.


    సుభద్రమ్మ నవ్వుతూ ఆ గదిలోకి వచ్చింది.


    ఆవిడ్ని చూస్తూనే అంబిక లేచి నిలబడింది. ఆ యింటిలో ఆవిడ అంటే ఆమెకు చాలా గౌరవం.


    సుభద్రమ్మ కళ్ళల్లో కనిపించే అభిమానం ప్రేమ ఆమెకు ఎంతో ఇష్టం.


    ఆవిడ చేతిలో వస్తువులు పెట్టే, చీర జాకెట్ ఉన్నాయి. కోడలికి అందిస్తూ-


    "నీవు చదువుకున్న అమ్మాయివి. నిరాడంబరంగా ఉండటం నీకు ఇష్టం అని నాకు తెలుసు. అయినా ఈ రోజు సాంప్రదాయ ప్రకారం నీవు అన్ని వస్తువులు పెట్టుకుని ముస్తాబు అవక తప్పదు" అంది.


    అంబిక కనురెప్పలు క్రిందకు వాలిపోయాయి. కనురెప్పలు ఎత్తి ఆవిడవైపు చూడలేకపోయింది.


    "త్వరగా బట్టలు మార్చుకుని ఈ వస్తువులు పెట్టుకోమ్మా" అంటూ చెప్పగానే అంబిర మరో గదిలోకి వెళ్ళి పది నిముషాల్లో చీర మార్చుకుని వస్తువులు పెట్టుకుని వచ్చింది.


    సుభద్రమ్మ కోడలికి పూలతో జడ అల్లింది.


    కోడలి ముస్తాబు పూర్తి అయ్యాక ఆమె చుబుకం పట్టి పైకి ఎత్తి క్షణంసేపు అలాగే చూసి ఆవిడ అంది.


    "నిన్ను చూస్తుంటే నీలో ఎవరి పోలికలో కనిపిస్తున్నాయి. ఎవరి జ్ఞాపకాలో గుర్తుకు వస్తున్నాయి."


    అంబిక ఒక్కక్షణం ఆవిడవైపు చూసి వెంటనే తల వంచేసుకుంది.


    ఆవిడకు గ్రహింపు అయిపోయిందా!


    తను ఎవరో తెలిసిపోయిందా!


    "చూడమ్మా నీకు నేను అత్తగారిగా చెప్పవలసిన ఒకే ఒకమాట" అంది ఆవిడ బరువుగా నిట్టూరుస్తూ కుతూహలంగా చూసింది ఆవిడవైపు.


    "జయరామ్ పైకి చాలా కటువుగా కనిపించినా మనసు చాలా మంచిది. అయితే పిల్లలు ఇద్దరిని అతి గారాబంతో పెంచటంవలన వారు అలా తయారయ్యారు. తండ్రి పెంపకం అటువంటిది. ఈ యింటికి తెలివయిన కోడలు రావాలని ఈ యింటిని ఈ మనుష్యులని తీర్చిదిద్దాలని నేను ఎంతగానో అనుకునేదాన్ని. భగవంతుడు నా కోరిక తీర్చాడు. నువ్వు కోడలుగా ఈ యింటిలో అడుగుపెట్టావు. నీ బుద్ధిబలంతో నీ తెలివి తేటలతో అందరిలో ఎలా మార్పు తెస్తావో నీ ఇష్టం" అంది ఆవిడ.


    అంబిక ధైర్యంగా తల ఎత్తి "మీరు ఏం ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. ఈ బాధ్యత అంతా నాది. అందరిలో మార్పు తీసుకురావడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి" అంది చిన్నగా నవ్వుతూ.


    కోడలి మాటలతో ఆవిడ మనసు తేలిక అయినట్టు అయింది. "వెళ్ళు అమ్మా జయరామ్ గదిలో కెళ్ళి పడుకో" అంది ఆవిడ కోడల్ని ఉద్దేశించి.


    అంబిక మెల్లగా అక్కడ నుండి వెళ్ళింది.


    జయరామ్ గదిలో మంచంమీద పడుకుని ఆలోచనలో పడ్డాడు. ఈ రాత్రి తనకో చిత్రమైన రాత్రి.


    కేవలం పూర్తిగా అన్ని విషయాలు మర్చి స్త్రీకి దాసుడైపోయిన రోజు ఎంత చిత్రం.


    ఆవేశాలు, పగలు కక్షలతో గడిచి పోయాయే గాని రోజులు స్త్రీ పొందుకోసం మనసు ఎప్పుడు ఆరాట పడటం లేదు.


    తన మనస్తత్వమే వేరు కాని ఇప్పుడు!


    మనసులో ఏదో కోరిక ఎన్నడూ ఊహించని అద్భుతమైన భావాలు తియ్యని రాగాలు గుండెల్లోకి పాకుతున్నట్లు అవసాగింది.

    చదువుకున్నది, అందమైన తెలివయినది అంబిక తనకు భార్య అయింది.


    ఆ అందాలరాశి ఈ రోజు రాత్రి తన సొత్తు అయిపోతుంది.


    అతని పెదవులమీద చిరునవ్వు మెదిలి కళ్ళల్లోకి పొంగి ఆ కళ్ళు కాంతివంతంగా అయ్యాయి.


    గుమ్మం దగ్గర చప్పుడు అవటంతో తలతిప్పి ఆతృతగా చూశాడు.


    అంబిక రోజూ తను చూసినట్టు సింపుల్ గా హుందాగా లేదు.


    దేవలోకం నుండి దిగివచ్చిన అప్సరసలా వస్తువులతో ఖరీదయిన తెల్ల జరీచీరతో నిండుగా ముస్తాబు అయి వచ్చింది.

    అప్పుడు ఆమెలో హుందాతనానికి బదులు ముఖంలో నునుసిగ్గులు దోబూచులాడాయి.


    జయరాం ముగ్ధుడై ఆమెవైపు రెప్పవాల్చకుండా అలాగే చూడసాగాడు.


    అంబికకి అతని చూపులు ఆ రోజు కొత్తగా అనిపించి ఆమెకు అడుగు ముందుకు పడలేదు.


    తలుపు దగ్గరే నిలబడి పోయింది.


    తను డాక్టరు మెడిసన్ లో చేరినప్పుడే సిగ్గు అనే మాట మర్చిపోయింది. అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి చదవటంలో డాక్టరుగా తన వృత్తి సాగించటంలో తను ఒక స్త్రీ అనే మాట మర్చిపోయింది. స్త్రీలతోనేకాక మగవాళ్ళతో కూడా అనేక విషయాలు తప్పనిసరిగా మాట్లాడవలసి వచ్చేది.


    డాక్టర్ వృత్తి అటువుంటిది.


    కాని ఈ రోజు, తన గదిలోకి అడుగుపెట్టగానే తను ఒక స్త్రీనని గుర్తుకువస్తుంది తనకి.


    ఏవో భావాలు మదిలో మెదిలి సిగ్గులు మొగ్గలు వేస్తున్నాయి.


    జయరాం మెల్లగా దగ్గరకు వచ్చి ఆమె భుజాలమీద చేతులువేసి అనురాగంగా, మృదువుగా పిలిచాడు "అంబికా!" అంటూ.


    ఆమె చిన్నగా నవ్వి ఊరుకుంది.


    "జీవితం చాలా చిత్రంగా అయింది కదూ. నీవు నా భార్యవు అవుతావు అని కలలో కూడ ఊహించలేదు."


    అంబిక మాట్లాడలేదు. మవునంగా వినసాగింది. "ఈ రోజు ఏమిటో నాకు చెప్పలేని ఆనందంగా అనిపిస్తుంది. మరి నీకు!" అతను ప్రశ్నిస్తూ ఆమెను మెల్లగా దగ్గరకు లాక్కున్నాడు.

 Previous Page Next Page