Previous Page Next Page 
విష్ణు విలాసిని పేజి 11

 
    గురువుగారు అవాక్కయ్యారు. తనకీ తెలియదు. ఏం చెప్పగలరు? తెలివిగా వెంకమాంబ వైపు తిరిగి,   
    "ఈ కథ చెప్పింది నువ్వేగా! ఈ సందేహానికి సమాధానం కూడా నువ్వే చెప్పు" అన్నాడు.    
    ఇంకా ఆరేళ్ళునిండని పసిబిడ్డని తనకే తెలియని విషయం చెప్పమన్నాడు గురువు. తనకూ తెలుసుకోవాలనే కోరిక ఉంది అందులో.    
    "అలాగే అయ్యగారూ!" అని వెంకమాంబ చెప్పటం మొదలుపెట్టింది. ఇప్పుడు వెంకమాంబ ముఖంలో ఇంతకుముందులేని కాంతి.   
    "తండ్రి మంచిమాటలు చెప్పి పుత్రులని దారిలో పెట్టాలి. అప్పుడు పిల్లలు తండ్రిమాట జవదాటకూడదు. తండ్రి తప్పుదారిలో నడుస్తుంటే తనకి ఇంకా తెలియని స్థితిలో తండ్రి మాట వింటే తప్పుతండ్రిదేకాని, పిల్లవాడిదికాదు. తెలిసిన తర్వాత తను సరైన దారిలో నడవటమే కాదు, తండ్రిని కూడా సరైన దారిలో నడిపించాలి సరైన కొడుకు అయితే అసలు తండ్రి ఎవరు? అజ్ఞానంలో ఉన్నవాళ్ళ దృష్టిలో జన్మనిచ్చినవాడు తండ్రి. తెలిసినవారికి లోకాలన్నింటికి జన్మనిచ్చిన విష్ణువే తండ్రి. జన్మనిచ్చినతండ్రి, ఆ తండ్రి గురించి చెప్పాలి. ప్రహ్లాదు డామాటే చెప్పాడు. తండ్రి అనే మాటకి అర్ధం చెప్పాడు వినండి ఈ పద్యం.   
    కమలాక్షు నర్పించు కరములు కరములు
        శ్రీనాథునర్పించు జిహ్వజిహ్వ
    సురరక్షకునినిఁజూచు చూడ్కులు చూడ్కులు
        శేష శాయికి మ్రొక్కు శిరము శిరము
    విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
        మధువైరి దవిలిన మనము మనము
    భగవంతు వలగొను పదములు పదములు
        పురుషోత్తముని మీది బుద్దిబుద్ది
    దేవదేవునిఁ జింతించు దినము దినము
    చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు
    కుంభినీధవుఁజెప్పెడి గురుడు గురుడు
    తండ్రి!హరిఁజేరుమనియెడి తండ్రితండ్రి"    
    సుస్వరంతో వెంకమాంబ పద్యం పాడుతూంతే అందరికీ ప్రహ్లాదుడే దిగివచ్చాడా అని పించింది. అపర ప్రహ్లాదుడికి మనసులోనే నమస్కరించారు గురువుగారు. పైకి చేస్తే ఆయుక్షీణం కదా అని.   
    ప్రహ్లాదుడి కథ, ధృవుడికథ, అంబరీషుడి కథ వెంకమాంబే చెప్పాలి. కృష్ణలీలలు చెబుతుంటే అపరశుకమహర్షి అనిపిస్తుంది.   
                                                            * * *    
    నరసింహస్వామి దేవాలయం సందడి సందడిగా ఉంటోందీమధ్య. ఊళ్ళో ఉన్న పిల్లలంతా దేవాలయ ప్రాంగణంలో చేరి ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. అందరికీ నాయకత్వం వహించేది ఐదేళ్ళ వెంకమాంబ. తనకన్న పెద్దవాళ్ళు కూడ వెంకమాంబతో జట్టుకట్టటానికి ఇష్టపడతారు. దేవాలయ మంటపంలోనో, తోటలోనో చేరిన పిల్లలందరికీ వెంకమాంబ ఎన్నో కథలు చెపుతుంది. అన్నీ తాను తన తాతగారు, నాయనమ్మ, అమ్మలనుండి విన్నవి. అక్షరం పొల్లుపోకుండా, కళ్ళకు కట్టేట్టు చెప్పగల నేర్పుఉంది. అవసరమైన చోట్ల తనకు తోచిన వర్ణనలు జోడిస్తుంది. అర్ధంకావటం లేదనిపిస్తే తన వయసుకు తగినట్టు వ్యాఖ్యానం కూడా చేస్తుంది.    
    గొంతెత్తి మధురంగా పాడుతుంది. స్పష్టమైన ఉచ్చారణ మధురమైనగొంతులకి తోడు ఆర్ద్రత, అనుభూతి ఒక్కసారి ఆ గొంతువింటే మరవలేరు. తనుపాడటమే కాదు తనతో ఆడుకోటానికి వచ్చిన వారందరికీ ఆ పాటలు నేర్పుతుంది.    
    మొదట్లో తమ పిల్లలకి పాటలు, పురాణకథలు బాగా వస్తున్నాయని పిల్లలు బుద్దిమంతులౌతున్నారని సంతోషించారు ఊళ్ళోవాళ్ళు. కాని, రానురాను ఎక్కువ సమయం గుడిలోనే గడపటం నచ్చటంలేదు. పెళ్ళికావలసిన పిల్లలు ఇంటిపనులు నేర్చుకోకుండా గుళ్ళూగోపురాలూ అంటూ, పాటలూ, పురాణాలూ అంటూ తిరుగుతుంటే ఎట్లా? దానికితోడు పారిజాత పట్టుకొచ్చి చెప్పేకథలు కాస్త భయంకూడా కలిగిస్తున్నాయి. పారిజాత ఇంట్లో అంట్లు తోమే మనిషి. కృష్ణయార్యుని ఇంట్లో కూడా అంట్లు తోముతుంది. పారిజాతకి ఊళ్ళోవాళ్ళందరి సంసారాల సంగతులూ కావాలి. అందుకని పనిమనిషి వరాలు, చాకలి బూసి అందరూ ఆమెకి ఆప్తులే    
    "వెంకమాంబ ఇంటి దగ్గర తాతగారి దగ్గర చదువు నేర్చుకుంటుందిట!"    
    "తల్లి దగ్గర, నాయనమ్మ దగ్గర పాటలు నేర్చుకుంటుందిట!"    
    "ఏపనీ రాదుట!"    
    "అల్లరికూడా చెయ్యదుట!"    
    "ఎప్పుడు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుందిట!"   
    "దెయ్యమో, పిశాచమో, బ్రహ్మరాక్షసో!"    
    ఉన్నవి ఉన్నట్లుగా చెపితే తృప్తి ఉండదు కదా! వీటికి చిలవలు పలవలూ చేరుతున్నాయి.    
    "దెయ్యాలతో మాట్లాడటం మేం చూశాం"    
    "రోజూ చీకటి పడగానే ఇంటిచుట్టూ దెయ్యాలు తిరగటం మేం చూశాం"   
    "వెంకమాంబ ఒంటరిగా రాత్రిపూట స్మశానంలో తిరగటం మేం చూశాం"    
    "దెయ్యం పట్టటంకాదు, ఆ పిల్లే దెయ్యం"    
    "నెత్తురు తాగటం మేం చూశాం"
    పిల్లమొహం చూశాక నమ్మాలనిపించక పోయినా, ఎవరి భయం వాళ్ళది. తమ పిల్లలని గుడికి వెళ్ళకుండా కట్టడి చేయటం మొదలు పెట్టారు. ఆలయ పూజారికి మాత్రం వెంకమాంబ గుడికి రావటం ఏమాత్రం ఇష్టంలేదు. అందుకని వదంతులకి తనవంతు సహకరించాడు. పైగా వెంకమాంబ కీర్తనలు పాడుతూ నృత్యం కూడా చేయటం, తోటిపిల్లలంతా అందులో పాలుపంచుకోవటం కంటకింపుగా ఉంది. అది 'రాసలీల' అని అందరూ గుండ్రంగా నిలబడి కోలాటం, గొబ్బిపాటలు ఆడటం అసలు నచ్చటం లేదు. ధనుర్మాసంలో సాయంత్రం సందెగొబ్బెమ్మలు పెట్టి వాటిచుట్టూ గొబ్బితడుతూ.    
    "ఏలవచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే....    
    మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే..."    
    అని పాడుతూ అందరూ చక్కగా నృత్యం చేస్తుంటే సంతోషంతోపాటు అదేదో కూడని పని అనేభావం, 'అయినింటి పిల్లలు నృత్యాలు చెయ్యవచ్చా? అది సానులుచేసే పని' అనే అసంతృప్తి చాలామందిలో చోటు చేసుకుంది పూజారి సహకారంతో.    
    ఈ మాటలన్నీ మంచినీళ్ళ కోసం వెళ్ళినప్పుడు వినపడుతూనే ఉన్నాయి మంగమాంబకి అత్తగారికి వాళ్ళు రావటం చూసి, చూడనట్టుగా నటించి, వాళ్ళకి వినపడేట్టుగా మాట్లాడి ఎరగనట్టు వెళ్ళిపోవటం అమ్మలక్కలపని.    
    మంగమాంబకి ఎంతో కష్టంగా ఉంది తన కూతురు గురించి అట్లా మాట్లాడుకుంటున్నారంటే. మందలించటానికి మనసురాదు. చేసిన పనుల్లో తప్పు ఎక్కడా కనపడదు. ప్రవర్తనలోనూ ఎటువంటి దోషం లేదు. నోటివెంట ఒక్క అపభ్రంశపు మాటరాదు. వినయవిధేయతలకు పెట్టింది పేరు. గుడికి వెళ్ళవద్దనటం అంతే హత్యచేసినట్టే. కనీసం తగ్గిస్తే కొంతనయం. దానితో ఇంటిపట్టున ఉండే సమయం పెరిగి గుడికెళ్ళటం తగ్గుతుంది. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.

 Previous Page Next Page