Previous Page Next Page 
రుద్రనేత్ర పేజి 11


    నేత్ర వాన్ వైపు చూశాడు.

 

    వాన్ లోవున్న శరీరాలవైపు పిస్టల్ గురిపెట్టి వున్నాడు క్యూతో పాటు వచ్చిన హెలికాప్టర్ పైలెట్. క్యూ అన్నాడు ఈలోపులో.......

 

    "నువ్వు నన్ను చంపగలవు. భూషణరావుని చంపగలవు. కాని ఇప్పుడు అమాయక ప్రజానీకం చావుకి దగ్గర్లో వున్నారు. చెప్పు..... మన చదరంగం ఆటలో ఆ అమాయక పావుల్ని బలిపెడతావా? పిస్టల్ వదిలేస్తావా?"

 

    నేత్ర నిర్విణ్ణుడయ్యాడు. అతడీ పరిణామం ఆలోచించలేదు.

 

    "చెప్పు నేత్రా ........ పిస్టల్ వదిలేస్తావా.....? ఆ పేషెంట్స్ ని చంపెయ్య మంటావా......?"

 

    నేత్ర పిస్టల్ వదిలేశాడు. క్యూ దగ్గరగా వచ్చి, దాన్ని చేతిలోని తీసుకుని బిగ్గరగా నవ్వాడు "సాటి మనిషి కష్టంలో వుంటే నువ్వు మిగతా విషయాలు మరిచిపోతావని నాకు  తెలుసు నేత్రా. అందుకే అబద్ధమాడాను. ఆ వాన లో వున్నవి శవాలు. సర్పభూషణరావు ప్రయోగశాలలో సమిధలుగా మారినవాళ్ళు."

 

    దూరంనుంచి వస్తున్నా వాహనాల చప్పుడు ఎక్కువైంది.

 

    "గుడ్ బై నేత్రా ....... వచ్చే జన్మలో కలుసుకుందాం" అంటూ మరి నేత్ర మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా పిస్టల్ పేల్చాడు.

 

    నేత్ర గాలిలోకి డైవ్ చేశాడు.

 

    కానీ ఏజెంట్ క్యూ ప్రపంచంలోకెల్లా గొప్ప షూటర్. మొదటి గుండు మిస్సయినా, రెండోది సూటిగా వెళ్ళి తగిలింది.

 

    నేత్ర నీళ్ళల్లోకి గెంతాడు. ఈ లోపులో మరో బుల్లెట్ అతడి శరీరం గుండా దూసుకుపోయింది. అలాగే మరొకటి...... మరొకటి.

 

    నీళ్ళు ఎర్రగా మారాయి. క్యూ పెదవుల మీద నవ్వు కదలాడింది.

 

    నేత్ర శరీరం శవమై పైకి తేలింది. దానికోసమే చూస్తున్న క్యూ తన వాహనం వైపు వెళ్తూ "క్విక్ ...... నువ్వెళ్ళిపో ఇక్కడినుంచి" అన్నాడు. మరో నిమిషంలో  సర్పభూషనరావు వన్ అక్కడినుంచి  అదృశ్యమైంది. క్యూ హెలికాప్టర్ గాలిలోకి లేచింది. నిమిషం క్రితం జరిగిన ఘోరమైన సంఘటన తాలూకు ఛాయలేమీ లేవు.

 

    అసలక్కడ ఏమీ లేదు.

 

    సెంట్రల్ ఇంటలిజన్స్ చీఫ్ తన బలగంతో అక్కడికి వచ్చేసరికి అక్కడెవరూ లేరు. నీళ్ళు మాత్రం ఎర్రగా వున్నాయి. అతడి మనసు కీడు శంకించింది.

 

    "సెర్చ్" అని అరిచాడు.

 

    చప్పున నలుగురు నీళ్ళలోకి దూకారు.

 

    నిమిషం తరువాత నేత్ర అచేతనమైన శరీరాన్ని పైకి తెచ్చారు.

 

    "నేత్ర......." గాద్గదికమైన కంఠంతో అతడి శరీరాన్ని  పైకి తెచ్చారు.

 

    నేత్ర ఏదో మాట్లాడటానికి ప్రయత్నించాడు. "ఏజెంట్ క్యూ.......... క్యూ.........." అన్నాడు. అంతలో అతడి తల వాలిపోయింది.

 

    అధికారులందరూ దూరంగా నిలబడి వున్నారు.

 

    బుల్లెట్స్ దూసుకుపోయిన నేత్ర శరీరాన్ని నిశ్చేష్టుడై చూస్తూ ఉండి పోయాడు చీఫ్.

 

    
                                    *    *    *

 

    రాత్రి పదకొండున్నర అయింది.

 

    ఆ గదిలో దీపం లేదు. దీపం అవసరం కూడా లేదు. కారణం 'స్కూల్  ఫర్ బ్లయిండ్' హాస్టల్ అది. ఆ గది మధ్యలో కూర్చుని ఒకమ్మాయి తన అన్నయ్యకి ఉత్తరం వ్రాస్తూంది. 'వ్రాస్తూంది' అనడం కన్నా  'చెక్కుతూంది' అనడం సబబేమో. బ్రెయిలీ లిపిలో కాగితం మీద సూదితో గుచ్చుతూ ఉత్తరం పూర్తిచేసినంది.

 

    ఒరేయ్ భాస్కర్ అన్నయ్యా.......

 

    నువ్వు పెద్ద ఇడియట్ వని నాకు ఈవేళే అర్థమైంది. నా కోసం నువ్వు అసలు బ్రెయిలీ నేర్చుకోలేదని, నువ్వు వ్రాసే ఉత్తరాలన్నీ నేత్ర అన్నయ్యతో వ్రాయిస్తున్నావని, అలాగే నేను వ్రాసే ఉత్తరాలు కూడా తనతోనే చదివించుకుంటున్నావని తాతయ్య చెప్పాడు. ఎందుకురా ఈ గుడ్డి చెల్లెల్ని యిలా మోసం చేయడం? నేత్ర అన్నయ్యకున్న ప్రేమలో నూరోవంతు నీకుండివుంటే నేనెంతో సంతోషించి  వుండేదాన్ని. 'ప్రేముంది, కాని కష్టపడడమే చేతకాదు' అంటావు. పైకి ఎంతో కష్టంగా అనిపిస్తుంది కాని, ఈ బ్రెయిలీ నేర్చుకోవడం చాలా సులభం . కావాలంటే నేత్ర అన్నయ్యని అడుగు. తనని చూసి బుద్ధి తెచ్చుకో. నాకోసం తను అది నేర్చుకున్నాడు. నువ్వు నన్ను చేసిన  మోసానికి శిక్షగా ఈ సంవత్సరం నీకు రాఖీ కట్టడం లేదు.

 

    ఆఫీసులో కరెంట్ పోయిందనుకుంటాను..... మా సూపర్నెంట్ విసుక్కుంటున్నాడు. ఇటువంటి సమయాల్లోనే కళ్ళు లేకపోవడం వల్ల వున్న  లాభాలు తెలుస్తూ వుంటాయి.

                                                                                కళ్యాణి

 

    మరుసటిరోజు ఉత్తరం బాక్సులో పడేసి, స్కూలుకెళ్ళింది.

 

    ఆ రోజు సేఠ్ కన్వర్ లాల్ బర్త్ డే. పుట్టిన రోజునాడు ప్రతి ఏడాది అంధ పాఠశాల పిల్లలకి స్వీట్లు, బట్టలు ఇవ్వడం కన్వర్ లాల్ అలవాటు.

 

    అందరికీ అలా పంచుతూ వచ్చాడు.

 

    "ఎందుకు మాకు ఈ బహుమతులు?" అడిగింది కళ్యాణి.

 

    "నా పుట్టినరోజు. అందుకని."

 

    "మీ పుట్టినరోజున మీ వర్కర్స్ కి ఇవ్వచ్చుగా. మాకెందుకు?"

 

    కన్వర్ లాల్ కొంచెం ఇబ్బందిగా "దేవుడు అన్యాయం చేశాడు కాబట్టి" అన్నాడు.

 

    "మా అవకరాన్ని మీ సానుభూతితో మరోసారి గుర్తుకు తెస్తున్నారు సార్. దీనికన్నా మా స్కూల్ ఫండ్ కి డొనేట్ చెయ్యండి. మమ్మల్ని మరింత సమర్థవంతమైన మనుష్యులుగా తయారు చెయ్యడానికి సాయపడండి, మాకు జాలి వద్దు. చేయూత నివ్వండి. పుణ్యం కోసం స్వీట్లు, దానధర్మాలు వద్దు. సమానత్వం కోసం మానవత్వం చూపించండి."

 

    కన్వర్ లాల్ కదిలిపోయాడు. "ఎవరు బోధించారమ్మా నీకిదంతా?"

 

    "మా నేత్ర అన్నయ్య."

 

    "నువ్వు చెప్పింది బావుంది. కాని నీ మాటల్తో నా కళ్ళు తెరుచుకున్నాయి అనలేను. ఎందుకంటే నేనూ నీ లాగే పుట్టు గుడ్డిని కనుక."

 

    కళ్యాణి చప్పున "అయామ్ సారీ" అంది.

 

    "ఫర్వాలేదమ్మా. ఒక గొప్ప సత్యం తెలుసుకున్నాను" అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు.

 

    ఆ రోజు స్కూల్లో టీచర్ వాళ్ళందరికీ బ్రెయిలీ పేపర్లిచ్చింది. "రేపటినుంచి పదిహేను రోజులపాటు సెలవులు. హోమ్ వర్క్ గా ఈ రోజు పేపర్ని బ్రెయిలీలో మార్చి మీ అందరికీ యిస్తున్నాను. అనువాదం చేసి తీసుకురండి" అంది టీచర్. ఒకరోజు న్యూస్ పేపర్ని మొత్తంబ్రెయిలీలోకి అనువదించడానికి పదిహేను రోజులు పడుతుంది.

 

    రూముకొచ్చాక కళ్యాణి పేపర్ చదవడం మొదలుపెట్టింది. ఒక చోట చిన్న వార్త.

 

    ఇంటర్ పోల్ ఏజెంట్ నేత్ర హత్య.

 Previous Page Next Page