ఇది జరిగిన పదినిముషాలకు ప్రార్థనకి మెలకువ వచ్చింది. లేచి డైనింగ్ రూమ్ కి వస్తూంటే తండ్రి కంఠం వినిపించింది. ఆమె అక్కడే ఆగి చూసింది.
డైనింగ్ టేబిల్ దగ్గర భోజనం చేస్తూన్న వాళ్ళిద్దరి మీదకు బయట్నుంచి వెన్నెల జల్లులా పడుతూంది. ప్రార్థనకి ఆ దృశ్యమెంతో అపురూపంగా తోచింది. ఆ దృశ్యంలో గొప్పతనమేమీ లేదుగాని, లేని వాళ్ళకే తెలుస్తుంది ఆ గొప్పతనం! తన చిన్న ప్రపంచంలో తనకి అందరికన్నా ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు తన పరోక్షంలో అలా స్నేహితుల్లా దగ్గిర దగ్గిరగా కూర్చుని మాట్లాడుకోవటం ఆ పాపకి చాలా బావుంది. చప్పుడు చెయ్యకుండా వెనక్కి వెళ్ళి తన ప్రక్క చేరుకుంది. ఆ తరువాత టీచరు వెళ్ళటానికి ఉద్యుక్తురాలై తన గదిలోకి వచ్చినప్పుడు కూడా నిద్రనే నటించింది.
.....
"మీరు నన్ను క్షమించాలి".
"మీరింకోసారి అలా అంటే నేను నిజంగా క్షమించను" కాస్త చొరవ తీసుకుని అన్నది వసుమతి. ఆమె స్వతహాగా ఎక్కువ మాట్లాడదు. కానీ అతడూ తన 'టైపే' అవటంతో ఆమె బిడియం తగ్గింది.
కారులో ఆమెని డ్రాప్ చేస్తున్నాడు అతడు.
"మీరెప్పుడూ ఇలాగే ఆలస్యంగా వస్తారా?" అని అడిగింది.
"ఉహూ. పని లేకపోతే తొందరగా యింటికి వచ్చేస్తాను. కానీ సాధారణంగా 'లాబ్'లో ఆలస్యం అవుతూ వుంటుంది" అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఆమె అలా అకస్మాత్తుగా మౌనం వహించేసరికి అతడు విస్మయం చెంది, "ఏమిటాలోచిస్తున్నారు?" అడిగాడు.
"ఆ పిల్లల గురించి..."
అతడు మరింత ఆశ్చర్యంతో, "వాళ్ళ గురించి ఏముంది?" అని అడిగాడు.
"ఏమీలేదా?" ఆమె విషాదంగా నవ్వింది. "-ఇరవై సంవత్సరాల క్రితం నేనూ యిలాగే వున్నాను- ఇంట్లో బిక్కు బిక్కు మంటూ, ఆలస్యంగా వచ్చే తండ్రి కోసం ఎదురుచూస్తూ. మీకు చిన్నపిల్లల మనస్తత్వం గురించి చెప్పేంత పెద్దదాన్ని కాదు. మీ ప్రపంచంలో అంతా సైంటిస్టులూ, మేధావులూ, గొప్పవాళ్ళూ వుండవచ్చు. కానీ మీ చిన్న పిల్లల ప్రపంచంలో అంతా తమ తల్లిదంద్రులే! నా తండ్రి తన జీవితమంతా ప్రపంచం కోసమే అన్నట్టూ తిరిగాడు. అదో గొప్ప త్యాగమనుకున్న భ్రమలో కుటుంబానికి ఎప్పుడూ ఏమీ చెయ్యలేదు. నా అనుభవంతో చెపుతున్నాను భార్గవగారూ! ఎంత తపించిపోయే వాళ్ళమో మేము- ఆ తరువాత అదే కోపంగానూ, అయిష్టంగానూ మారింది ఆయనపట్ల!! ప్రపంచాన్ని సంస్కరిస్తున్నానన్న భ్రమలో కవిత్వం రాస్తూ కుటుంబాన్నే మర్చిపోయిన ఆయన- చివరి క్షణాల్లో కుటుంబ సభ్యుల సానుభూతి పొందలేకపోయాడు..."
ఎందుకో తెలీదు కానీ ఆమెకు దుఃఖం వచ్చింది. బహుశా గతం తాలూకు జ్ఞాపకాలు కల్గించిన దుఃఖం కావొచ్చు. అతికష్టంమీద తమాయించుకుని "-అంత దయనీయమైన పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఇదంతా మీకు చాలా చిన్న విషయంగా కనబడవచ్చు. కానీ ఆ కోణంలోంచి ఆలోచిస్తే-" అనబోతూంటే భార్గవ కల్పించుకుని, "అర్థమైంది" అన్నాడు. ఆమె తలెత్తి చూసింది.
"రేపట్నుంచి ఆరింటికే వస్తాను ఇంటికి".
ఆమెకి నవ్వొచ్చింది. "ఇదే మా ఇల్లు, ఆపండి" అన్నది. కారు అగేక, ఆమె దిగి తన ఇంటివైపు నడిచింది.
అతడు కారు రివర్స్ చేస్తున్నాడు. అతడి దృష్టి బొమ్మమీద పడింది. అప్రయత్నంగా దాన్ని స్పృశించాడు. కారు కుదుపుకి బొమ్మ నెమ్మదిగా అటూ ఇటూ వూగుతూంది.
6
పెండ్యులమ్ లా వూగుతున్న వైరు వైపు చూస్తున్నాడు అతడు. అతడి ముందో బీకరు వుంది.
1952లో అమెరికన్ సైంటిస్టు స్టేన్లీ మిల్లర్ చేసిన ప్రయోగం అది. ఇంకా జరుగుతూనే వుంది.
భూమి పుట్టిన కొన్ని కోట్ల సంవత్సరాలకి, తదేకమైన సూర్యరశ్మి సోకి యెక్కడో సముద్ర గర్భంలో ఒక జీవకణము ఉద్భవించి వుండవచ్చు. అప్పుడు విశ్వంలో హైడ్రోజన్, హీలియం, ఆక్సిజన్, నియాన్, సిలికాన్, కార్బన్, ఐరన్, సల్ఫర్, ఆర్గాన్ తప్ప మరేమీ లేవు.
ఒక చిన్న బీకరులో, భూమి పుట్టినప్పుడు ఏ వాతావరణం వుందో అదే వాతావరణాన్ని సృష్టించి- నియాన్, ఆక్సిజన్ లాటి వాటిని అందులో వుంచి, ఆగకుండా శక్తిని పంపుతూ వుంటే ఈ మూల పదార్థాల ద్వారా 'జీవం' సృష్టించబడుతుందా అన్న ప్రయోగం అది.
"సర్"
ఆలోచన్ల నుంచి చెదిరి అతడు పక్కకి తిరిగాడు.
"మీకు ఫోన్ కాల్"
అతడు ఆశ్చర్యపోయాడు. తమకి ఎంతో అవసరమయితే తప్ప ఫోన్స్ రావు. అందులోనూ తనకి.
వెళ్ళి అందుకొని "హల్లో" అన్నాడు.
అంతే. ఆ కంఠం గురించే చూస్తున్నట్టూ అవతల్నుంచి ఒక్కసారి ఏడుపు వినిపించింది. అది ప్రార్థనది. ".. నాన్నా.... తొందరగా రా నాన్నా! వచ్చెయ్యి తొందరగా" అని ఫోన్ పెట్టేసింది. అతడు స్థబ్దుడయ్యాడు.
అతడినే చూస్తున్న శేఖరం "ఏమైంది" అని అడిగాడు.
"ఏమో తెలీదు. ప్రార్థన స్కూల్ నుంచి ఫోన్ చేసింది. ఏడుస్తూంది" అని బయటకు పరుగెడుతూ "నువ్వూ వస్తావా... ప్లీజ్..." అన్నాడు.
ఇద్దరూ పది నిముషాల్లో స్కూలు చేరుకున్నారు. గేటు దగ్గిరే ప్రార్థన బిక్కమొహంతో నిలబడి వుంది. దూరంగా నలుగురు కుర్రాళ్ళు ప్రహరీ గోడనే చూస్తూ నవ్వుకుంటున్నారు.
ఆ గోడమీద అక్షరాల్ని చూస్తూనే విజయభార్గవ మొహం అమితమైన కోపంతో ఎర్రబడింది. అతికష్టంమీద తనని తాను తమాయించుకున్నాడు. తనే ఇంత షాక్ అయితే... ఆమె?
"ఏదీ మీ టీచర్?"
"ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోయింది డాడీ".
అతడు కారు ఎక్కి సర్రున పోనిచ్చాడు. శేఖరాన్ని గానీ, కూతుర్ని గానీ పట్టించుకోలేదు.
శేఖరం కూడా వెళ్లిపోతూన్న భార్గవని పట్టించుకోలేదు. గోడమీద అక్షరాల్నే చూస్తూ "ఇది ఎవరు వ్రాశారో తెలిసిందా?" అడిగాడు.
"ఉహు లేదు. హెడ్ మిస్ట్రెస్ వీటిని చెరిపిస్తానన్నారు. కానీ... కానీ..." ఆ పాప ఏడుపు ఆపుకోలేకపోయింది. అతడు ఆమెని ఓదారుస్తున్నట్టూ దగ్గిరకు తీసుకుని గోడవైపు మళ్ళీ ఇంకొకసారి చూశాడు. చూసి, ప్రార్థన వైపు తిరిగి, మీ స్కూల్లో కథలు వ్రాసేవాళ్ళు ఎవరైనా వున్నారా?" అని అడిగాడు.
ఆ స్థితిలో కూడా ప్రార్థన ఆశ్చర్యపోయి, "మా శారద టీచర్ వుంది.... ఏం?" అని అడిగింది.