Previous Page Next Page 
థ్రిల్లర్ పేజి 11


    "కరవ్వు. అదిగో చూడు. పాము కరచినా, తిరిగి ప్రార్థిస్తే అవి విషాన్ని వెనక్కి పీల్చుకుంటాయని ఈ సినిమాలో ఎంత బాగా చెప్తున్నారో.... ఈ సినిమాలో గొప్ప నీతికూడా వుంది గమనించావా?"

    "ఏమిటి?"

    "మొగవాడి విషం అతని పెదవుల్లో వుంటుంది. అన్నట్టు ఈ హాల్లో అటూ ఇటూ తిరుగుతున్న పాము సపోజ్ నిన్ను కరిచిందనుకో, పాము కాటుకు ప్రథమచికిత్స తెలుసా?"

    "లేదు" అంది స్నేహితురాలు భయంగా.

    "పాము కరవగా వెల్లకిలా పడుకుని నాగదేముణ్ణి ప్రార్థించాలి. అందమైన కుర్రవాడి రూపంలో అతనొచ్చి మనని ముద్దు పెట్టుకుంటాడన్నమాట- అన్నట్టు నువ్వుకూడా కా...ల...క్షే...ప....ం... సంఘం సభ్యురాలివేగా?"

    "అవును. ఏం?"

    "ఊరికే మీటింగులు పెట్టి ఊదరగొట్టే బదులు ఈ సినిమాల్ని ప్రభుత్వం బాన్ చేయాలని ఉద్యమం లేవదీయకూడదు? వాళ్ళు వప్పుకోకపోతే ఇలాగే సినిమాహాళ్ళల్లో పాముల్ని రహస్యంగా వదిలితేసరి! రెండుసార్లు పామొచ్చిందని తెలిస్తే పాముల సినిమాకి ఎవరూ రారు. అలాగే బూతుల సినిమాల్ని ప్రతిఘటించదానికి ఇంకో మార్గం ఏమిటంటే...."

    "సినిమా బోరుకొడ్తూంది వెళ్దామా" కాళ్ళకేసి చూసుకుంటూ స్నేహితురాలు అంది.

    "మరి అదే కదా నేను చెప్పింది కూడా" అంది విద్యాధరి లేస్తూ.

    ఇద్దరూ బయటకు వస్తూంటే విద్యాధరి రహస్యం పంచుకుంటున్నట్టు "టైటిల్సప్పుడు ఇలాగే పాకింది. అప్పుడే అడిగాను వెళ్ళిపోదామా అని. నువ్వు వినలేదు" అంది.

    "నిజమా! అమ్మో. ఎంత గండం తప్పిందో, అదృష్టం బావుంది" అంది గుండెలమీద చేయివేసుకుంటూ.

    "మీ కాలక్షేపం సంఘంవాళ్ళు అదృష్టాన్ని నమ్మరనుకుంటానే?"

    "పోన్లే ఇక ఆ సంగతి వదిలిపెట్టు-" రిక్షా పిలుస్తూ అంది. వాళ్ళిద్దరూ రిక్షా మాట్లాడుతూ వుండగా ఒక పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చి "మాడమ్. ఒక నిముషం" అన్నాడు.

    ఆడవాళ్ళిద్దరూ భయం భయంగా చూసుకున్నారు.

    "మా కమీషనర్ గారు పిలుస్తున్నారు" అంటూ కారువైపు చూపించాడు. ఇద్దరూ అనుమానంగా అటు వెళ్ళారు.

    కార్లో వున్న వ్యక్తిని గుర్తుపట్టగానే విద్యాధరి మొహం విప్పారింది. అయన ధర్మారావు.

    ఇరవై సంవత్సరాల క్రితం యస్సైగా చేసే రోజుల్లో ఇంటికొస్తూ వుండేవాడు. తండ్రికి పరిచయం. కథలూ, ఒకటి రెండు నవలలూ వ్రాశాడు. తండ్రి తాలూకు లంచగొండితనాన్ని ఎదిరించి ఆ గ్రూప్ లోంచి తప్పుకున్న ఇద్దరు ముగ్గురు రచయితల్లో ఆ రోజుల్లో అతనొకడు. ఇప్పుడు కమీషనర్ అయ్యాడన్నమాట. అప్పుడు ఇంటికొస్తే చాక్లెటిచ్చి ఎత్తుకునేవాడు. అంకుల్ అని పిలిచేది. మరి ఇప్పుడు అలా పిలవాలో లేదో తెలీదు.

    "నువ్వు విద్యాధరివి కదూ" అన్నాడాయన. పక్కనే ఆయన భార్య వుంది.

    విద్యాధరి తలూపి "అవునంకుల్" అంది అప్రయత్నంగా.

    "కారెక్కు. ఎక్కడికెళ్ళాలి?"

    ఆమె చెప్పింది. ఇద్దరూ కారు ఎక్కారు. స్నేహితురాలు జంక్షన్ లో దిగిపోతానంది.

    "ఎందుకు సినిమా మధ్యలో అలా అరిచారు?" అన్నాడాయన. "ఇంటర్వెల్ లోనే గుర్తుపట్టాను, మీ నాన్న చచ్చిపోయినప్పుడు వచ్చానుగా. పోలికలు గుర్తున్నాయి పలకరిద్దామనుకుంటే అరవటం ప్రారంభించావు. పక్కనెవడో కూర్చున్నాడు. కదూ, నువ్వు అరవటం మొదలు పెట్టగానే జారుకున్నాడు. అంతా గమనిస్తూనే వున్నాన్లే. మా యస్సైని పట్టుకొమ్మని పంపేను. స్టేషన్ కి తీసుకొస్తూ వుంటాడు. అసలేం జరిగింది."

    విద్యాధరి పూర్తిగా వినలేదు. "అనుదీప్ ని పట్టుకోవటానికి యస్సై వెళ్ళాడు" అతడు చెప్పిన వాక్యం దగ్గరే ఆమె గుండె వేగం హెచ్చింది.

    లాకప్ లో అనుదీప్....!

    అసలా ఆలోచనే భరించలేకపోయింది.

    ఆమె పైకి అలా వుందిగానీ మనసంతా కల్లోల జలపాతంలా వుంది. స్నేహితురాల్తో పాముల మీద జోకులు వేస్తూంది గానీ అనుదీప్ గురించీ, అనుదీప్ భుజం దగ్గర్నుంచీ శూన్యంగా వున్న ప్రదేశం గురించి ఆలోచిస్తూ వుంది. తనేదో సరదాగా అనుకుంది గాని దాని పరిణామం ఇంత ఘోరంగా వుంటుందని ఊహించలేదు. ఆమెకి అతడిమీద కోపం కూడా వచ్చింది. మరోవైపు జాలి. కత్తితో కోసుకుని వుంటాడా? గొడ్డలితో నరికేసుకుని వుంటాడా? లేక రైలు క్రింద భుజంవరకూ పెట్టేసి వుంటాడా? అసలంత బాధ ఎలా భరించి వుంటాడో... తెగిన చెయ్యి.... రక్తపు మడుగు....

    ఆమె శరీరం జలదరించింది.

    సజావుగా సాగిపోతున్న తన జీవితంలోకి తుపానులా ప్రవేశించి అల్లకల్లోలం సృష్టించటం.... అంతవరకూ బాగానే వుంది. థ్రిల్లింగ్ గా కూడా వుంది, కానీ ఈ చెయ్యి తెగ్గొట్టుకోవటం....

    ధర్మారావు ఆమె ఆలోచనలో వుండటం చూసి చెప్పటానికి ఆమె తటపటాయిస్తుందని గ్రహించాడు. ఈ లోపులో స్నేహితురాలు జంక్షన్ లో దిగిపోయింది.

    "విద్యాధరపురంలో ఎవరితో వుంటున్నావు?" అడిగాడు. ఆమె తల్లి చిన్నప్పుడే చచ్చిపోయిందని ఆయనకి తెలుసు.  

    "ఒక్కదాన్నే.... రూమ్ లో."

    "అయితే ఇప్పుడెందుకమ్మా గదికి? మా ఇంటికిరా. భోజనంచేసి వెళ్దూగాని-" అప్పటివరకూ నిశ్శబ్దంగా వున్న కమీషనర్ భార్య అంది. నిజానికి విద్యాధరికి గదికి వెళ్ళాలని లేదు. ఈ రాత్రికి అనుదీప్ ఆలోచన్లతో నిద్రపట్టదు. ఒంటరితనం మరింత బాధాకరం.

    ఆమె

మౌనం వహించటం చూసి కమీషనర్ డ్రైవర్ కి చెప్పాడు. కారు ఇంటివైపు మళ్ళింది.

    ధర్మారావుకి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఒక కొడుకు, కూతురు ఇంజనీరింగ్ చదువుతున్నారు. మరొకతను బి.యస్సీ. ముగ్గురూ ఇంట్లోనే వున్నారు. విద్యని స్నేహపూరితంగా ఆహ్వానించారు. రెండు నిముషాల్లో వారిలో కలిసిపోయింది ఆమె.

    ఆ కుంటుంబాన్ని చూస్తుంటే ఎంతో ముచ్చటగా అనిపించింది. పిల్లలందరూ విచ్చిన గులాబీల్లా ఫ్రెష్ గా వున్నారు. మగపిల్లలు విద్యని అక్కలాగే చూసుకున్నారు. కృతిమత్వం-ట్రాప్ చెయ్యటం కోసం కన్విన్సింగ్ గా మాట్లాడటం-ఇలాంటివేమీ లేవు. అన్నిటికన్నా ఎక్కువగా ఆ కుటుంబ సభ్యుల మధ్య పెనవేసుకున్న ఫ్రెండ్ షిప్ ఆమెకి అపురూపంగా తోచింది. తల్లిదండ్రులు బ్రతికున్న రోజుల్లో ఏ ఒక్కరోజు కూడా ఇలాంటి "దినం" తమ ఇంట్లో లేదు.

    ధర్మారావు అన్నాడు- "మీ నాన్నా నేనూ ఒకప్పుడు చాలా మంచి స్నేహితులమమ్మాయ్. ఆ రోజుల్లో నేను కథలు వ్రాసేవాడిని."

    "తెలుసు" అంది విద్యాధరి నవ్వి. ఆమెకి ఆయన చెప్పని విషయాలు కూడా చాలా తెలుసు.

    భోజనాలు పూర్తయ్యాయి.

    "మా యస్సై ఇంకా ఫోన్ చెయ్యలేదు ఎందుకో.... ?" సాలోచనగా అన్నాడు.

    అప్పుడప్పుడే సర్దుకుంటున్న ఆమె మనస్సు మళ్ళీ విచలితమైంది. అనుదీప్ ని ఈపాటికి లాకప్ లో పెట్టి వుంటారు.

    "నా పక్కన కూర్చున్న అబ్బాయి తప్పేమీ లేదంకుల్" అంది తొందర తొందరగా.

    ఆయన విస్మయంగా చూసి, "మరెందుకు అరిచావు?" అన్నాడు. పాము తాలూకు కథ చెప్పింది.

    ఆయన అంతా విని నవ్వేసి, "చూడమ్మాయ్! నా పోలీసు అనుభవంలో అబద్ధాలు చెప్పేవాళ్ళని కనీసం లక్షమందిని చూసి వుంటాను. అసలు జరిగిందేమిటో చెప్పు" అన్నాడు.

    విద్యాధరి సిగ్గుపడింది. పిల్లలూ, ఆయన భార్యా కుతూహలంతో చూస్తున్నారు.

    ఆమె ముందు కొద్దిగా ప్రారంభించింది. తరువాత అది ఆగలేదు. ఈ విషయాలన్నీ ఎవరికైనా చెప్పాలన్న కోర్కె ఆమె మనసులో ఎంతగా వున్నదీ తల్చుకుంటే ఆమెకే ఆశ్చర్యం అనిపించింది. ఒక మనిషి తన అనుభవాల్నీ ఆలోచన్లని మరో మనిషితో పంచుకోవాలన్న తాపత్రయమే హ్యూమన్ రిలేషన్స్ కి పునాది కాబోలు.

    తన శరీరంమీద అతడు ప్రేమలేఖ వ్రాయటం మినహా- మిగతా అంతా చెప్పింది. ఏడు సంవత్సరాల క్రితం తనని చూడటం, తపస్సుకి వెళ్ళటం వగైరా....

    పిల్లలు అద్భుతమైన థ్రిల్లర్ సినిమాని చూస్తున్నట్టు ఆమె చెప్పినదంతా విన్నారు. ఆమె చెప్పటం పూర్తి అవుతూ వుండగా ఫోన్ మ్రోగింది. కమీషనర్ లేచి పక్కగదిలోకి వెళ్ళాడు. కుర్రవాళ్ళు ఇంకా ఆ అనుభూతి నుంచి తేరుకోలేదు.

    "ఇదంతా నేను నమ్మలేను. ఇంపాజిబుల్" అన్నాడు ఇంజనీరింగ్ చదువుతున్న కుర్రవాడు.

    "నిజంగా అతడి చెయ్యి భుజం దగ్గిర్నుంచీ లేదా అక్కా?" అడిగాడు రెండోవాడు. విద్యాధరి తలూపింది. తనతోపాటూ ఈ అనుభవాన్ని వాళ్ళు పంచుకోవటం ఆమెకి రిలీఫ్ గా వుంది.

    "అబ్బ నిజంగా అంత అలా ప్రేమించే వాళ్ళుంటారా?" తనలో అనుకోబోయి పైకి అని, మళ్ళీ తల్లి తన మాటలు విన్నదేమో అని భయంగా చూసింది కమీషనర్ గారి అమ్మాయి.

    "నేను అమ్మాయినైతే అలాటి వాడికోసం ప్రాణాలైనా ఇచ్చేసి వుండేవాడిని" గర్వంగా అన్నాడు రెండోవాడు.

    "ఊరికే కబుర్లు" వెక్కిరించింది చెల్లెలు.

    తల్లి వాళ్ళని మందలిస్తూ "ఈ వయసులో ఏమిట్రా ఆ మాటలు" అంది. పిల్లలు ముసిముసిగా నవ్వుకున్నారు వాళ్ళలో వాళ్ళే. ఈ లోపులో కమీషనర్ ఆ గదిలోకి వస్తూ "ఇంకెక్కడి నుంచో ఫోను. మా యస్సై కాదు-" అని వచ్చి కూర్చుంటూ, "అయితే వాడు నీ గురించి చెయ్యి తెగ్గోసుకున్నాడంటావ్?" అన్నాడు.

    "అవునంకుల్, కళ్ళారా చూశాను."

    ఆయన నవ్వేడు. "మెస్మరిజం అన్నమాట ఎప్పుడన్నా విన్నావా? దాని అర్థం తెలుసా?"

    "పేరు చాలాసార్లు విన్నాను, అర్థం సరీగ్గా తెలీదు."

    "మ్యాజిక్ హిప్నాటిజం- ఈ రెండింటికన్నా ఒక మెట్టుపైది. మనదేశంలో మెస్మరిస్టులు చాలా తక్కువ. వేళ్ళమీద లెక్క పెట్టవచ్చు. ఇదొక అద్భుతమైన కళ కాబట్టి, దాంతో ఎన్నో అద్భుతాలు చెయ్యవచ్చు. కాబట్టి మెస్మరిస్టులందరూ దాదాపు బాబాలుగా తయారయ్యారు. అవతలివాళ్ళ మనసుని చాలా సులభంగా వశీకరణలోకి తెచ్చుకుంటారు. అంగీలోంచి శివలింగం తీసినా గాలిలోంచే సృష్టించినట్లు మనకి భ్రమ కలుగుతుంది. అంతలా మనసుని కంట్రోలు చేస్తారన్నమాట. ఈ కోణంనుంచి - ఇప్పటివరకూ జరిగిన సంఘటనలన్నీ ఆలోచించు. నీకే బోధపడుతుంది." ఆమె అనుమానాలన్నీ ఒక్కసారిగా మంచు విడిపోయినట్టు విడిపోయాయి.

    తన శరీరంమీద అక్షరాలు వ్రాయలేదు అతడు. కేవలం అవి వున్నట్టు తనకి భ్రమ కలిగించాడంతే. అలాగే తన బ్యాగ్ లోంచి పువ్వు తీయటం.... చక్రధర్ కి ఫోటో చూపించటం.... అంతా తన భ్రమే.

    ఆమెకి వళ్ళు మండిపోసాగింది. తనని అతడు ఇంత బాగా ఫూల్ ని చేస్తాడనుకోలేదు. మూర్ఖురాలిలాగా అతడు చెప్పేసిందంతా నమ్మేసింది. ఏడు సంవత్సరాలు తపస్సు చేశానంటే నిజమేనేమో, అనుకుంది. 

 Previous Page Next Page