Previous Page Next Page 
ప్రేమ నక్షత్రం పేజి 11


    అతను సిగ్గుపడలేదు. గర్వంగా నిలబడ్డాడు.

 

    ఆమె దుఃఖం ఆపుకోలేక అక్కణ్నుంచి గబగబ నడిచి, చీకట్లోంచి ఎటో వెళ్ళిపోయింది.

 

    రాత్రివేళ స్టేషన్ లో లైసెన్స్ కూలీలా పనిచేస్తే......?

 

    శైలజ రైలుదిగింది "కూలీ! కూలీ!"

 

    పరుగున వెళ్ళి ఆమె లగేజీ అందుకుని తలమీద పెట్టుకున్నాడు.

 

    శైలజ సుకుమారంగానే వుంది. కాని ఆమె సామాను బరువుగా వున్నాయి.

 

    బయటకు వచ్చాడు. లగేజి క్రిందపెట్టి భుజంమీద గుడ్డతో చెమట తుడుచుకున్నాడు.

 

    "ఎంత?" ఆమె పర్సు జిప్ ను లాగుతూ ముఖంలోకి చూసింది. నిర్విణ్నురాలయిపోయింది.

 

    "ఫణీ? ఫణీ?"

 

    రిక్షావాడిగా, కూలివాడిగా, టాక్సీడ్రైవరుగా, ఫ్యాక్టరీ వర్కర్ గా ఏరూపంలో వున్నా-అన్ని చోట్లా శైలజే సాక్షాత్కరిస్తోంది. అతని నిర్దాక్షిణ్యమైన ఆలోచనల్లో అపురూపంగా అవతరిస్తోంది.

 

    పదిగంటలకు అలసిపోయి గదికివచ్చి పడుకున్నాడు.

 

    మరునాడు అలాగే యూనివర్సిటీకి వెళ్ళాడు. నిస్సత్తువగా వుంది. అయినా శక్తినంతా కూడదీసుకుని క్లాసెస్ కు అటెండ్ అయి మామూలుగానే తిరిగాడు.

 

    ఎంతో ప్రయత్నించినమీదట ఆమెతో ఒక్కనిముషం మాట్లాడటానికి అవకాశం దొరికింది.

 

    "శైలజా! కోపంపోలేదా?"

 

    ఆమె జవాబు చెప్పకుండా ముఖం ప్రక్కకి త్రిప్పుకుంది.

 

    "శైల......"

 

    దూరంగా వెళ్ళిపోయింది.

 

    అతనికి పిచ్చెత్తినట్లుగా అయింది. కోపంవచ్చింది, ఏడుపువచ్చింది. బస్సులోకూడా ఆమె ఏమీ మాట్లాడటానికి అవకాశమివ్వలేదు.

 

    ఆ రాత్రి మరింత నిర్దాక్షిణ్యంగా గడిచింది.

 

    మరునాడు...

 

    మరింత నిస్సత్తువగా ఉంది. మొన్నటి మధ్యాహ్నంనుంచి ఇంతవరకూ ఏమీ తినలేదు. పచ్చి మంచినీళ్ళు తప్ప ఏమీ త్రాగలేదు.

 

    మంచంమీదనుంచి లేవటానికే కష్టమనిపించింది. అసలు గది ఊడ్చే నారాయణమ్మ వచ్చి లేపేవరకూ కళ్ళు విప్పలేదు.

 

    ఇవేళ కాలేజి మానేద్దామనుకున్నాడు. కానీ ఎవరిమీదనో కసివున్నట్టు, ఆ కసి తనని తను శిక్షించుకుని తీర్చుకుంటున్నట్లు లేని శక్తితెచ్చుకుని లేచి స్నానంచేసి యూనివర్సిటీకి బయలుదేరాడు. అతనిదగ్గర బస్సుకు సీజన్ టిక్కెట్ వుంది.

 

    క్లాసులో శైలజవంక చూడలేదు. ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించలేదు.

 

    ప్రొఫెసర్ ఆల్డిహైడ్స్ మీద పాఠం చెబుతున్నాడు. ఉన్నట్లుండి శైలజను ఏదో ప్రశ్న అడిగాడు. అంతరంగమంతటా ఆలోచన నిండిపోయివున్న ఆమె తన పేరువిని ఉలిక్కిపడి చూసింది. ఆయనేదో ప్రశ్నవేసినట్లు తెలిసింది. కానీ అర్థంకాలేదు, అయోమయంగా చూసింది.

 

    ప్రొఫెసర్ ఫణివంక చూశాడు. "యూ! మిస్టర్ ఫణీంద్రా!"

 

    ఫణి లేచినిలబడ్డాడు. ఇవేళ గడ్డంకూడా చేసుకోలేదు. కళ్ళు లోతుకుపోయి ముఖం పీక్కుపోయి వుంది. అయినా కంఠంవిప్పి ఆయనడిగిందానికి జవాబు చెప్పటం మొదలుపెట్టాడు.

 

    మూడు నిముషాలు ప్రవాహంలాగ, నిరాటంకంగా మాట్లాడేశాడు. క్లాసంతా స్పెల్ బౌండ్ అయినట్లుగా వింటున్నారు. శైలజ ఆశ్చర్యంగా, కన్నార్పకుండా చూస్తోంది.

 

    "వెరీగుడ్! కానీ మిస్టర్ ఫణి, వై ఆర్ యు లైక్ దట్? యూ సీమ్ టు బి సిక్."

 

    "నో సర్! ఐ యామ్ ఆల్ రైట్" ఫణి కూర్చున్నాడు.

 

    శైలజకి ప్రొఫెసర్ మాటలు గుండెల్లో పొడిచినట్లు అవగా అతనివంక పరిశీలనగా చూసింది. "రెండురోజుల్లో ఎంత చిక్కిపోయాడు? ఏం జరిగింది? కేవలం తను మాట్లాడకపోవటంవల్లనా?"

 

    ఆ సాయంత్రం బస్ స్టాప్ దగ్గర ఇద్దరూ ప్రక్కప్రక్కన నిలబడ్డారు. శైలజ పలకరిద్దామా అనుకుంటోంది. కానీ అహం అడ్డొస్తోంది. అతను బింకంగా వున్నాడు. ఆమెవైపు చూడటం లేదు.

 

    బస్సు వచ్చాక ఇద్దరూ ఎక్కారు. ఆ టైముకు ఎప్పుడూ క్రిక్కిరిసే వుంటుంది. ఎప్పుడోగాని చోటు దొరకదు.

 

    ప్రక్కప్రక్కనే నిల్చున్నారు. భుజం భుజం రాసుకుంటున్నాయి.

 

    ఫణి ఆలోచించే స్థితిలోలేడు. కళ్ళు తిరుగుతున్నట్లుగా వున్నాయి. నిలబడ లేకుండా వున్నాడు. ఒకటిరెండుసార్లు తూలి ఆమెమీద పడబోయి, కష్టంమీద సర్దుకున్నాడు........"తనని పిలిచాడా?" అనుకుంటూ ఆమె అతనివంక అప్రయత్నంగా చూసింది. కాని అతని చూపిటులేదు.

 

    అతను దిగాల్సినచోటు వచ్చింది. వళ్ళు తెలియటంలేదు. ఎలాగో మనుషుల్ని తప్పించుకుంటూ బయటిదాకావచ్చి, మెట్టుమీద కాలువేయబోయి, యిహ సంభాళించుకోలేక, తూలి క్రింద పడిపోయాడు.

 

    "అరెరె! పడిపోయాడు, పడిపోయాడు."

 

    "ఏం జరిగింది?"

 

    "బస్సువాడిదేం తప్పులేదు. నీరసంగా వున్నట్లుంది, కళ్ళు తిరిగివుంటాయి."

 

    శైలజకు అర్ధమయింది "ఫణీ!" అనుకుంటూ గుమ్మందగ్గరకు పరిగెత్తింది. అప్పటికి కొంతమంది గుమిగూడి కదిలించేవాళ్ళు కదిలిస్తున్నారు. ముఖంమీద నీళ్ళు ఛల్లేవారు చల్లుతున్నారు.

 

    ఫణి నెమ్మదిగా కళ్ళు విప్పాడు.

 

    "ఎవరితను?"

 

    "యూనివర్సిటీ స్టూడెంటు. పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు అనుకుంటాను."

 

    శైలజ ముందుకు వెళ్ళింది. ఈ పరిస్థితిలో అతన్ని ఎక్కువసేపు వుంచటం ఆమెకు నచ్చలేదు.

 

    "నాకితను తెలుసు. నే తీసుకువెళతాను. దయవుంచి ఓ రిక్షాను పిలవండి" అంది క్రిందపడ్డ అతని పుస్తకాలు ఏరుతూ.

 Previous Page Next Page