"అంతే అయితే నేను ఫోన్ చేయవల్సిన అవసరం లేదు."
"మరి?:"
"మా బాస్ తన గర్ల్ ఫ్రెండ్ తో ఉండగా మీ మేడమ్ కెమేరాను ఆవేపుకు తిప్పింది. అప్పుడే- ఆ దృశ్యం మీ కెమెరాలో నిక్షిప్తమై పోయింది."
"ఇంతకీ మీకేం కావాలి?" విల్సన్ చిరాగ్గా అడిగాడు."
"ఇప్పుడా క్యాసెట్ ని ఏం చేయబోతున్నారు?"
"టెలివిజన్ లో ప్రసారం చేయబోతున్నారు?"
"టెలివిజన్ లో ప్రసారం చేయబొతున్నారు."
"ఎవరు.....?"
విల్సన్ కి కోపం వచ్చింది. తనను బోనులో నిలబెట్టి మాట్లాడుతున్న అగంతుకుడెవరు? డబాయించి మాట్లాడుతున్న మర్యాద తెలీని ఈ స్ట్రేంజర్ ఎవరు?"
"ఎవరు.....?" తిరిగి ఫోన్ లో గట్టిగా వినిపించాయి మాటలు.
"ఎవరేంటి? గోవా టూరిజమ్ డెవలప్ మెంట్ వాళ్లు, హైదరాబాద్ దూరదర్శన్ లో ప్రసారం చేసేందుకు గోవా టూరిస్ట్ అట్రాక్షన్స్ మీద ఫిల్మ్ తయారుచేసి ఇవ్వమన్నారు."
"ఇచ్చారా?" దాదాగంజ్ మాటలు ఎప్పుడూ అవతల వ్యక్తిని డామినేట్ చేస్తున్నట్లుగా ఉంటాయి.
"ఇచ్చాం. అయినా ఏమిటీ క్రాస్ ఎగ్జామినేషన్.....?"
"అదే మంచిది కాదంటున్నాను..." దాదా చాలా కూల్ గా అన్నాడు.
విల్సన్ సరిగ్గా ఆ సమయంలో బిజీగా ఉండటం, ఆ రోజు మధ్యాహ్నం నుంచి షూట్ చేయవల్సిన బ్యాలెన్స్ వర్క్ ఉండడం , ఆ ఏర్పాట్లు పూర్తి చేస్తుండగా ఓ ఆగంతకుడి నుంచి ఫోన్ రావటం- అతను ఫోన్ లో బెదిరిస్తున్నట్లు మాట్లాడ్డం ఓ ప్రక్క విస్మయంగాను, మరోపక్క కోపంగానూ ఉంది.
అందుకే విల్సన్ టక్కున ఫోన్ పెట్టేశాడు. భవానీకి, లైట్ బాయ్స్ కి సూచనలు ఇస్తూ తిరిగి వర్క్ లో మునిగిపోయాడు.
మరలా ఫోన్ మోగింది. ఓ క్షణం ఎత్తాలా వద్దా అనే మీమాంసలో ఉండగా హంపీ వస్తూనే ఫోన్ ఎత్తింది.
ఆమె ఫోన్ అలా ఓ నిమిషం వరకు చెవి దగ్గరే ఉంచుకుంది.
ఆ తరువాత ఫోన్ పెట్టేస్తూ 'గోవా క్యాసెట్ ఎడిటింగ్ టేబుల్ మీదకు వచ్చిందా?' అని అడిగింది. విల్సన్ కి అర్థమైపోయింది- తనతో కొద్ది క్షణాల క్రితం మాట్లాడిన వ్యక్తే తిరిగి ఫోన్ చేస్తుంటాడని.
"రేపోస్తుంది మేడమ్....."
"టెలీ కాస్ట్ ఎప్పుడు?" ఆమె టీవీ అండ్ వీడియో మేగ్ జైన్ తిరగేస్తూ అడిగింది.
"బహుశా మరో రెండు వారాల్లో కావచ్చని ఇన్ ఫర్మేషన్ వచ్చింది...."
ఎడిటింగ్ చేసేటప్పుడు ఓ ఇన్సిడెంట్ ని కట్ చేయాలి...."
"అర్థమైంది మేడమ్- అతను ఇంతకుముందే నాకు ఫోన్ చేసాడు....."
"ఓ....కే.....నెక్ట్సు.....?" ఆమె ఓ ప్రక్క మాట్లాడుతూనే ఇండియాస్ నెంబర్ ఒన్ టీవీ స్టార్ ప్రైమ్ మినిష్టర్ అనే ఆర్టికల్ ని చకచక చదివేస్తోంది.
ఈ రోజు మనం ఓసారి టీవీ స్టేషన్ కి వెళ్ళాలి..... మన స్క్రిప్ట్ గురించి కొద్దిగా డిస్ కస్ చేయవల్సి ఉందని దూరదర్శన్ వాళ్ళు మెసేజ్ పంపిచారు. వసంతరాగం సీరియల్ లోని లాస్ట్ ఎపిసోడ్ పూర్తిచేయవల్సివుంది..." గడగడా చెప్పుకెళ్ళిపోయాడు విల్సన్.
"లాస్ట్ పార్ట్ కాస్టూమ్స్ రెడీ అయ్యాయా?" ఆమె కళ్ళు అక్షరాల వెంట పరుగెడుతూనే ఉన్నాయి.
"లేదు మేడమ్" చిన్నగా అన్నాడు.
"ఏం.....?" ఆమె ఒకింత చిరాగ్గా అడిగింది.
"మీకు తెలిసిందే గదా మేడమ్.....స్క్రిప్ట్ అప్రూవ్ అయింది. పైలెట్ ఓకే అయింది. ఇకిప్పుడు మనం ఎలా తీసినా చెల్లుబాటవుతుంది. ఎందుకండీ అనవసరంగా డబ్బు దండగా? వేషాలెయ్యాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు వీధికి వందమంది చొప్పున తయారయ్యారు. వేషం కావాలంటే ప్రయాణపు ఖర్చులు ఎవరికివారే భరించాలి. ఎవరి బట్టలు వాళ్ళే కుట్టించుకు రావాలన్నా సవాలక్ష మంది ఎగబడుతున్నారు అని చాలాసార్లు అన్నాడండి ప్రొడ్యూసర్. అలాంటి మనిషితో లాస్ట్ ఎపిసోడ్ గ్రాండ్ గా రావాలన్నా వింటాడా?"
"ఆమె కుర్చీలోంచి విసురుగా లేచింది. "ఏ ప్రోగ్రామ్స్ వస్తేనేం, ఎలా వస్తేనేం మన అవసరాలు తీరితే చాలని టీవీ వాళ్ళు, సీరియల్ ఎలా వస్తేనేం స్పాన్సరర్ ఒప్పుకున్న డబ్బు మొత్తం ఇస్తేచాలని నిర్మాతలు, ఏదో ఒక సీరియల్ అయితే చాలు మన కమీషన్ మనకు వస్తే పోలా అని అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలు- దూరదర్శన్ మీద ఎక్కువ ఆదాయం వస్తే చాలని కేంద్ర సమాచార శాఖ ఆలోచిస్తుంటే మంచి సీరియల్స్ ఎలా పుట్టుకొస్తాయి? కెమేరాను ఓ చోట పాతేసి కూర్చోవటం -కెమేరా ముందున్న చిన్న స్టేజీ మీద నటీనటులు అరుస్తూ, డైలాగ్స్ చెప్పటం చూస్తుంటే అసహ్యమేస్తోంది.
ప్రతివాళ్ళు టీవీ నటీనటులై ప్రేక్షకుల మెదడు తిని పారేస్తుంటే ప్రేక్షకుల మీద జాలి పుట్టుకొస్తోంది.
ఒక డ్రామాని డైరెక్ట్ చేసినవారు కూడా టెలీ సీరియల్ కి డైరెక్టర్ అవటం చూస్తుంటే బాధగా ఉంది. నటననే వృత్తిగా తీసుకున్న ఆర్టిస్టులు కరువైపోయారు. ఓ ప్రక్క ఉద్యోగాలు- అందునా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ తీరిక వేళల్లో ఎందుకు ఖాళీగా ఉండాలి, ఓ సీరియల్ లో నటిస్తే పోలా అనే అర్భకులు తయారయ్యారీ మధ్య. పిచ్చి కేకలు- చలిజ్వరం వచ్చిన వాళ్ళలా మెలికలు తిరగటం- హారిబుల్" అంటూ చేతిలోని మేగ్ జైన్ ని టేబుల్ మీదకు విసిరికొట్టి "వెళ్దాం పదండి" అంది తను క్రిందకు దిగుతూ.
* * *
"కథ అదేనా?" హంపీ తండ్రి సీతారామారావు భార్యను ఉద్దేశించి అడిగాడు. అదేనట..... అందుకే అప్పుడు నెత్తి బాదుకొని చెప్పాను. అలాంటి వృత్తిలోకి దింపవద్దని, మీరే కూతురెక్కడ బాధపడుతుందోనని సరే అన్నారు. ఇప్పుడు మీ జీవితాన్నే యధాతథంగా వ్రాసి దూరదర్శన్ లో సబ్ మిట్ చేసిందట.
దాన్ని వాళ్ళు అంగీకరిస్తే ఏమవుతుందో ఊహించారా? పాతిపెట్టిన గత జీవితం వెలుగులోకి వస్తుంది. దానికి సంబంధించిన వాళ్ళు చూస్తూ ఊరుకోరు. ఆడపిల్లకు పెళ్ళిచేసి పంపించేద్దాం అనంటే మీరు తేలిగ్గా తీసుకున్నారు. అది ఒట్టి మొండిఘటం......"
కూతురేమైపోతుందోనన్న బెంగ పట్టుకుందామెకు.
ఆయన మౌనంగా ఉండిపోయాడు.
కొద్దిక్షణాల తర్వాత లేచి కూర్చున్నాడు.
"దాన్ని కూతురులా పెంచలేదు నేను. కొడుకు అనుకొనే పెంచాను. ఇప్పటికీ అలాగే చూస్తున్నాను. నాకు జరిగిన నష్టాల్ని నేనే దిగమ్రింగుకుంటే మనకు మేలు జరగదు సరికదా..... మనలాంటి మరెందరో బలైపోతారు. అది నాకిష్టంలేదు. అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకునే తరంకాదు హంపీది.....నువ్వు అనవసరంగా దానికి పిరికితనం నూరిపోయ్యకు" అన్నాడు సాలోచనగా సీతారామారావు.
ఆమె నిట్టూరుస్తూ కెళ్ళిపోయింది.
హంపీ, విల్సన్ ఎక్కిన కారు దూరదర్శన్ ముందాగింది.
ఓ స్లిప్ మీద తనపేరు వ్రాసి డిప్యూటీ డైరెక్టర్ రూమ్ లోకి పంపించి సోఫాలో కూర్చుండిపోయింది హంపీ.
"స్క్రిప్ట్ లో మేజర్ ఛేంజస్ సూచిస్తే ఎలా మేడమ్?" విల్సన్ ఆమెకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ అన్నాడు నెమ్మదిగా.
ఆమెలో ఎలాంటి రియాక్షన్ కనిపించలేదు విల్సన్ కి.
ఆమె కూడా ఆలోచిస్తోందని గ్రహించిన అతను మౌనంగా ఉండిపోయాడు.
సరిగ్గా ఐదు నిమిషాలకి లోపల నుంచి పిలుపువచ్చింది.
తను హంపీతో పాటు లోపలకు వెళ్ళాలా వద్దా అనే సందిగ్దంలో పడి ఉన్నచోటునుంచి కదలలేదు విల్సన్.
ఆమె డోర్ వరకు వెళ్ళి చటుక్కున వెనుతిరిగి రమ్మన్నట్లుగా విల్సన్ కి సంజ్ఞచేసి లోపలకు వెళ్ళిపోయింది.
"మీ స్క్రిప్టులో కొన్ని పాత్రలు, సంఘటనలు అసహజంగా ఉన్నాయని మా అభిప్రాయం. వాటిని సరిచేస్తే.....బావుంటుంది....." డిప్యూటీ డైరెక్టర్ నిర్మొహమాటంగా అన్నాడు.
సంవత్సరంపాటు తను నిరంతరం శ్రమిస్తే ఉద్భవించిన సీరియల్ అది. ఆమె దానిమీద ఎన్నో ఆశల్ని పెట్టుకొని అప్రూవల్ కోసం ఎదురు చూస్తోంది. కథను విన్న నలుగురైదుగురు సాహిత్య విమర్శకులు సయితం అద్భుతంగా ఉందన్నప్పుడు తను పొందిన ఆనందం ఇప్పుడు ఒక్కసారిగా అదృశ్యమైపోయింది.
కొద్దిక్షణాల పాటు ఆమెకేం మాట్లాడాలో తోచలేదు.
"చెప్పండి- మీ అభిప్రాయం?" అతను తిరిగి అన్నాడు.
ఆమె ఆ షాక్ నుంచి క్రమంగా తేరుకుంది.
"ఏదైనా మతాన్నిగాని, కులాన్నిగాని, రాజ్యాంగాన్ని గాని కించపర్చే విధంగా ఉన్నాయా?" ఆమె డిప్రసివ్ గా అంది.
"అలా లేకపోవచ్చు. కాని కొన్ని సంఘటనలు ఎందుకో మా కమిటీలో చాలామంది సభ్యులకు నచ్చలేదు.
"ఎందుకు నచ్చలేదో తెలిస్తే గదా సార్..... వాటిని సరిదిద్దుకొనేది?" విల్సన్ సర్ క్కాస్టిగ్గా అన్నాడు. అతనికి బాధగానే ఉంది- రాత్రింబవల్లు ఎంతో దీక్షతో, పట్టుదలతో శ్రమించి సానపట్టిన అద్భుతమైన కథ అది. సమకాలీన సమస్యలపై స్పందించి సృష్టించిన మాస్టర్ పీస్.
ఆమెకు అప్పుడు గుర్తుకొచ్చాయి. తన గురువు సునిల్ విన్నెంట్ అన్న మాటలు. ఓడిన ప్రతిచోట అనుభవాన్ని మిగుల్చుకో- ఆ చోటే తిరిగి విజయం సాధించేందుకు నిరంతరం శ్రమించు. గెల్చిన ప్రతిచోట నూతనోత్సాహాన్ని ప్రోది చేసుకో. నేటి దూరదర్శన్ కేంద్రాలు అవినీతి నిలయాలు. స్వార్థపరులకుహరాలు.
ఆదర్శం గొప్పదైనప్పుడు- లక్ష్యం ఎంత దూరంలో ఉన్నా వెనకంజవేయవద్దు. ఈ వ్యవస్థలో బ్రతకాలంటే కొన్ని బాధల్ని భరించాలి. ఎదురు దెబ్బల్ని తట్టుకోవాలి. ఒకింత మొండిగా, ధైర్యంగా ముందుకు సాగాలి. ప్రతి చిన్న విషయానికీ చలించిపోయే సున్నితత్వాన్ని కొంత అందరూ అభినందిస్తారని ఆశించిన ఆమెకు ఆశాభంగం ఎదురైంది.
ఎన్నో దారుణమైన కథల్ని....ప్రోగ్రామ్స్ ని అంగీకరించి టెలీకాస్ట్ చేసిన అధికారే, ఇప్పుడు తన కథలో కొన్ని అసహజమైనా సంఘటనలు ఉన్నాయంటున్నాడు- కొన్ని సంభాషణలు ఇబ్బంది పెట్టేవిగా ఉన్నా యంటున్నాడు.
"మీరు ఆలోచించుకునే చెప్పండి. మీ స్క్రిప్టు నచ్చని చోట రెడ్ పెన్ తో మార్క్ చేసి ఉంచాను. తీసుకెళ్ళండి. మరోసారి చూసుకొని మేము సూచించిన సంభాషణల్ని, భావాల్ని తొలగించి అప్పుడు సబ్ మిట్ చేయండి..." హంపీకి ఫైల్ అందిస్తూ అన్నాడు.
ఆమె వెంటనే లేస్తూ ఫైల్ అందుకొని ఆవేశంగా బయటకు నడిచింది.
కొద్దిక్షణాల్లో కారు లోకేషన్ కేసి సాగిపోయింది.
శిరీష బలవంతం మీద అనిల్ దూరదర్శన్ కెళ్ళి అప్లికేషన్ ఫారమ్ ఇచ్చాడు. అతనికే మాత్రం నమ్మకం లేదు తను సెలక్టు అవుతానని.
"చూడండి.....మీరేదో ముచ్చట పడుతున్నారుగాని మనకెవారిస్తారండి అవకాశం?" గోడమీంచి శిరీషకేసి చూస్తూ అన్నాడు అనిల్.