"లేస్తే..... ఆకలి గుర్తుకొస్తుంది.....అందుకే లేవలేదు....."
"ఈరోజు దక్కన్ క్రానికల్ చూశారా?"
"దక్కన్ క్రానికల్ రేటెంత?"
"రూపాయి పావలా....?"
"రూపాయి పావలా ఉంటే పేపర్ కొనను నేను. ఓ ప్లేట్ ఇడ్లీ ఆరు గిన్నెల సాంబారు లాగించేస్తాను...."
"అందుకే మీకు కాఫీ పొడి సుద్ద ఇవ్వాలనిపిస్తుంది."
"ఎందుకు?" ఆశ్చర్యపోయాడు.
"ఆకలిని కూడా చిరునవ్వుతో ఎదుర్కోవడం నేర్పిన ది గ్రేట్ చార్లీ చాప్లిన్ అంటే నాకు ప్రాణం. అదే లక్షణం మీలో ఉంది." అందామె కిందే నించుని.
"డిగ్రీ చదివి ఎలాంటి హిపోక్రసీ లేకుండా పనిమనిషిగా చేస్తున్నా మీ ముందు నేనెంత...?"
ఆమె కొంచెం ఇబ్బంది పడింది.
"మీ ఇంట్లోకి రానివ్వరా" ఆమె తమాషాగా తలూపుతూ అడిగింది.
అతను కంగారుపడ్డాడు.
ఎందుకు రానివ్వను....." కానీ ఈరోజు లుంగీ వంతు నాది....." అన్నాడు.
ఆమెకర్ధం కానట్లు చూసింది.
"మాకు ఒకే లుంగీ ఉంది. రోజుకళ్ళం దాన్ని వంతుల వారి కట్టుకోవాలి. ఇవ్వాళ నా అదృష్టం బావుండి లుంగీ వంతు నాకొచ్చింది. లేని మిగతా ఇద్దరూ గోనె సంచులు చుట్టుకుంటారు.
"మీ అదృష్టం కాదు- నా అదృష్టం బావుంది....."
అతనికర్ధం కాలేదు.
ఆమె రాబోతున్న నవ్వును బలవంతాన ఆపుకుంది.
అతనికి అర్థమైంది.
వెంటనే పెద్దగా నవ్వాడు.
అప్పటికే మిగతా ఇద్దరూ లేచి బట్టలు సర్దుకొని డోర్ దగ్గరకు వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పారామెకు.
"నీ కసలు బుద్ధి లేదురా..... అక్కడే నిలబెట్టి మాట్లాడతావా? కాఫీ దాత సుఖీభవ.... రండి మదీయగృహంబులోకి అడుగిడి పావనము చేయండి" అన్నాడు నారాయణ్ ఒకింత నాటక ఫక్కీలో.
అనిల్ తప్పుకున్నాడు.
ఆమె బస్ లోకి ఎక్కింది.
వరుసగా అటూ, ఇటూ ఉన్న ప్యాసింజర్ సీట్స్ స్కెలెటన్స్ లా ఉన్నాయి.
సీట్ల వరస మధ్యలో వారి పడకలు. క్రింద గోనె సంచులు పరిచి ఉన్నాయి. ఓ వేపున రెండు జతలు బట్టలు వేలాడదీసున్నాయి.
బస్ బ్యాక్ సీట్ దగ్గర ఓ స్టవ్, రెండు సత్తుగిన్నెలు, సత్తు గ్లాసులున్నాయి.
"రండి కూర్చోండి" అని టాగూర్ కొద్దిగా బాగున్న సీట్ చూపించాడు.
ఆమె మొహమాట పడుతూ కూర్చుంది.
"ఎక్స్ క్యూజ్ మీ......" అంటూ నారాయణ్. టాగూర్ ఒకరికొకరు సైగ చేసుకొని బస్ దిగి వెళ్ళిపోయారు.
"బస్ లో ఓ యువతి నించున్నప్పుడు ఎడం చేత్తో పై కడ్డీని పట్టుకోకూడదు...... ఎందుకో తెలుసా?" అనిల్ నవ్వుతూ అడిగాడు.
ఆమెకర్థంకాలేదు.
తెలీదన్నట్లుగా తల అడ్డంగా ఊపింది.
"పోనీ చెప్పండి" అంది బుంగమూతితో.
"చెబితే బాగా అర్ధంకాదు. అనుభవంలోకి వస్తేనే బాగా అర్థమవుతుంది. లేచి నించుని ఎడంచేత్తో ఈ పై బార్ ని పట్టుకోండి......" అన్నాడు.
ఆమె లేచి బస్ లో పై నుండే బార్ ని ఎడంచేత్తో పట్టుకుంది.
ఇప్పుడు అనిల్ ఆమెకు ఎడం చేతివేపున నించుని ఉన్నాడు.
అతను ఆమెవేపు చూశాడు.
"ఊ......చెప్పండి......ఎందుకు?"
"ఇప్పుడు నేను ఎటువేపు చూస్తున్నానో చూస్తే మీకే అర్థమవుతుంది." అన్నాడు రాబోతున్న నవ్వును బలవంతాన ఆపుకుంటూ.
ఆమె అతనికేసి చూసింది.
అతను సరీగ్గా తనవేపు చూస్తున్నాడు. అదీ లేచిన తన ఎడం చేతి దిగువుగా చూస్తున్నాడు. ఓసారి తను భుజం మీదుగా వంచి అతనెక్కడ చూస్తున్నాడో గమనించి సిగ్గుపడి పోయింది. చట్టుకున్న చేతిని దింపేసింది.
"ఆడవాళ్ళు పైటను ఎడంవేపుకు వేసుకుంటారు. ఎప్పుడైతే ఎడం చేతిని పైకిలేపి బార్ ని పట్టుకుంటారో ఒక విండో......"
"వద్దు......వద్దు......అర్థమైంది. ఇలాంటి పనులు చేస్తుండే వాళ్ళా సిటీ బస్ లెక్కినప్పుడు.....?" చిరుకోపాన్ని అభినయిస్తూ అడిగింది.
"మీరు సరదాగా తీసుకోవాలి....." అన్నాడతను ఒకింత కంగారు పడుతూ.
ఆమె కొద్ది క్షణాలు మౌనంగా ఉంది.
అతను భయంగా ఆమెకేసి చూశాడు.
ఆమె ఫక్కున నవ్వింది.
ఆమె నవ్వుతూనే ఉంది.
అంతలో చటుక్కున వంగి ఆమె ముందు ఏదో ఏరుకుంటున్నట్లు నటించసాగాడు.
"ఏమిటి వెతుకుతున్నారు?" ఆమె ఆశ్చర్యపోతూ అడిగింది.
"మీ నవ్వుల పువ్వుల ముత్యాల" అన్నాడు తల మాత్రం పైకెత్తి సీరియస్ గా.
ఆమె ఇక ఆపుకోలేకపోయింది నవ్వును.
ఆమె....అలా నవ్వుతూనే ఉంది.
అతనలా జలపాతంలా.....వెన్నెల వర్షిస్తున్నట్లు నవ్వుతున్న ఆమెకేసే తన్మయంగా చూస్తుండిపోయాడు.
కొద్ది క్షణాలకి ఆమె నవ్వును ఆపుకుంటూ, పొట్టను చేత్తోపట్టుకొని "యూ నాటీ" అందామె.
అతని చిలిపితనానికి..... చిలిపి ఆలోచనకు ఆమెకు కోపం రాలేదు.
"నిజమే.....ఇంతవరకు ఏ ఆడపిల్లకూ ఈ విషయం తట్టి ఉండదు." అందామె.
"అయ్యో రహస్యం చెప్పేసానా?" అతను గొప్ప అవకాశం చేజార్చుకున్నానన్న భావాన్ని పలికిస్తూ అన్నాడు.
"ఎడంచేయి పైకెత్తి పట్టుకున్నప్పుడు పైట పూర్తిగా పైకెళ్ళి ఎడంవేపు బ్రెస్ట్ మొత్తం..... ఛీ.... ఛీ... పాడు పిల్లాడా!"
"అమ్మయ్యో...... గొప్ప దివ్యదర్శనం మిస్ అయిందే?"
"మీరు నిజంగానే ఇడియట్ గదా?" అందామె అతన్ని ఉడికిస్తూ.
అవునవును.... ఇక మీరు ఎడంచేత్తో బార్ ని పట్టుకోరు. ఆ విధంగా నేను నిజంగానే ఇడియట్ ని."
ఆమె మరలా నవ్వింది.
"ఇంకెన్ని రకాలుగా ఆడదాని శారీర భాగాల్ని దొంగ చాటుగా చూస్తుంటారు?"
"ఆమ్మా నేను చెప్పను....." అన్నాడతను ఆమెకి దగ్గరగావస్తూ.
"ప్లీజ్ చెప్పరా? అందామె బ్రతిమిలాడుతున్నట్టుగా.
"మీకు కోపం రాలేదా?" అతను తన సందేహాన్ని నివృత్తి చేసుకొనేందుకు అడిగాడు.
"నో.... నో...." అందామె నవ్వుతూ.
"దీనికి కంటిన్యుటీ చెప్పనా?" అన్నాడతను ధైర్యంగా.
"వూ.....చెప్పు" అందామె ఆసక్తిగా చూస్తూ.
మీరు కేరళకు చెందిన సాంప్రదాయ స్త్రీయో..... లేక విశాఖపట్నం ప్రాంతానికి చెందిన జాలరుల యువతో అయ్యుంటే?"
ఆమెకు నవ్వుతో పాటు చిరుకోపం వచ్చింది.
"యూ....." అంది అతన్ని కొట్టబోతున్నట్లు మీదకొస్తూ. అతనిలో అంత సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నట్లు అంతవరకు తను పసిగట్టలేకపోయినందుకు ఆమె ఆడపిల్లలా సిగ్గుపడింది.
"ఇప్పుడు వాళ్ళుకూడా జాకెట్లు అదే బ్లౌజులు వేసుకుంటున్నారు." అంది.
"బొత్తిగా సాంప్రదాయాల మీద గౌరవం లేకుండా పోయింది" అన్నాడు నొచ్చుకుంటున్నట్లు.
అంతలో బయటకు వెళ్ళిన ఇద్దరూ వచ్చారు.
నారాయణ్ చేతిలో కాఫీ గ్లాసుంది.
అదామెకు అందించాడు.
"మరి మీ ఫ్రెండ్ కి?"
"ఫర్వాలేదు మీరు తాగండి" అన్నాడు టాగూర్.
"నో.... నో" అంటూ ఆమె బ్యాక్ సీట్ దగ్గరకు వెళ్ళి అక్కడున్న సత్తు గ్లాస్ తీసుకొని అందులోకి సగం వంపి, అనిల్ కి అందించింది.
"మీకున్న ప్రేమలేదు వీళ్ళకు. ఈడియట్ ఫ్రెండ్స్" అన్నాడు గ్లాసునందుకుంటూ.
ఆమె కొద్ది క్షణాలు అదోలా చూసింది అనిల్ వైపు.
కాఫీ త్రాగారిద్దరూ:
"ఇంతకీ నేనెందుకొచ్చానంటే.....టీవీలో ఆడిషన్ టెస్ట్ జరగబోతోందట. అప్లై చేయమని చెబుదామని వచ్చాను...." అంది అనీల్ వేపు చూస్తూ.
"దానికి అప్లై చేయవలసింది డబ్బున్న వాళ్లు లేదా భాషరాని బడామనుష్యులు పిల్లలు. మనం కాదుగా?" అనిల్ తేలిగ్గా తీసిపారేస్తూ అన్నాడు.
"అదేం కాదు..... అలా కొన్నిపోయినా, రియల్ గా టాలెంట్ ఉన్న వాళ్ళకు కూడా ఇస్తారు.... మీరు తప్పక అప్లై చేయాలి..... నేను చేస్తున్నాను....." అందామె.
"చెయ్యరా బాబు" నారాయణ్, టాగూర్ ఇద్దరూ ఒకేసారి అన్నారు.
కొద్దిక్షణాలు ఆలోచించిన అనిల్ "అలాగే" అన్నాడు.
ఆమె వెళ్తూ, వెళ్తూ అనిల్ కేసి ఓసారి చూసింది.
ఆమె చూపులోని భావాన్ని విశ్లేషించుకుంటుండి పోయాడు అనిల్.
* * *
దాదాగంజ్ ఫోన్ చేసి ఆ వేపు రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తుండగా విల్సన్ లైన్ లోకి వచ్చాడు.
"చిన్న రిక్వెస్ట్ ....." దాదాగంజ్ మర్యాదగానే అన్నాడు.
"చెప్పండి.... ఇంతకీ మీరెవరు?" విల్సన్ అడిగాడు- ఓవేపు హడావుడి పడిపోతూ.
"నేనెవరన్నది తెలుసుకోవటం మీకంత అవసరం ఉంటుందని నేనను కోవటంలేదు. పైగా అలా తెలుసుకోవటం మీకు ప్రమాదం. తెలుసు కొనేందుకు ప్రయత్నించటం కూడా మంచిది కాదు....."
"ఇంతకీ విషయమేమిటి?" విల్సన్ లో ఆసక్తి పెరిగింది.
"గోవాలో అందాలేనా?"