Previous Page Next Page 
అతడు ఆమె ప్రియుడు పేజి 11


    కొద్దిసేపటిలో మృత్యువుకు చేరువవుతానన్న నిజం తెలిసి రవితేజ స్థంభించిపోయాడు. మెదడు చుట్టూ చీకటి ఆవరించింది. గుండె మాములుకన్నా ఎక్కువ వేగంతో కొట్టుకోసాగింది. చావు తప్పదనుకొని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు.

    అయిపోయింది. తన జీవితానికి ఇదే అంతిమ గడియలు. బాధను భయాన్ని జయించిన అతీతమైన పరిస్థితిలో అతని  అంతర్చక్షువు తెరుచుకుంది.

    ఉరికంబం ఎక్కబోతున్న ఖైదీలో కలిగే సంచలనం రవితేజలో కలిగింది. వెనక్కీ చేతులు కట్టుకొని (కట్టబడని) ఉరికంబం వైపు నడుస్తున్న మనిషి (అతను నిర్దోషి కావచ్చు) ఈ  సమయంలో అక్కడినుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించడు.

    పుట్టిన ప్రతివాడు ఎప్పుడో ఒకప్పుడు చావక తప్పదనే ఆలోచన వల్ల  మృత్యువుతో రాజీకి వస్తాడు.

    అతను చేసిన నేరానికి పశ్చాత్తాపపడతాడా? శిక్ష అనుభవిస్తున్న కాలంలో గిల్టీగా ఫీలవుతాడేమో కానీ,  చావుకి సిద్ధపడ్డప్పుడు మాత్రం వేదాంతి అయిపోతాడు. ఐహిక బంధాలను తెంచేసుకుంటాడు. తన ఆత్మీయుల్ని, తన వాళ్ళని మర్చిపోతాడు. జ్ఞాపకాలను బలవంతంగా వెనక్కి తోసేసుకుంటాడు.

    పాతికేళ్ళ అనుభవం ఇవ్వలేని జ్ఞానం ఆ కొద్దిసేపటిలో అవగతమవుతుంది.

    ఏడవటం కాని, వదిలిపెట్టమని ప్రాధేయపడటం కానీ చేయడు. ఎలాంటి వ్యక్తయినా సరే...... నిర్వేదంగా..... యోగిలా మరణం వైపుకి వెళతాడు.

    రవితేజ జరగబోయే పరిణామాలను ఊహిస్తున్నాడు. తన శరీరం నేలను  తాకిన తర్వాత ఏమవుతుంది? కొబ్బరికాయలా తల పగులుతుంది. మెదడు చిట్లిపోతుంది. ఏ కీలు కా కీలు విరుగుతుంది. ఇంతకీ తను బోర్లా పడతాడా? వెల్లికిలా పడతాడా? బోర్లాపడితే మాత్రం మొహం చదునయిపోయి గుర్తుపట్టటానికి వీల్లేకుండా భయంకరంగా మారిపోతాడు. పడగానే ప్రాణం పోదు. కొద్దిసేపు గిలగిలా కొట్టుకుంటాడు. చుట్టూ జనం మూగుతారు. ఎవరో పోలీస్ స్టేషన్ కి ఫోన్  చేస్తారు. తన మృతదేహాన్ని అంబులెన్స్ లో తీసుకెళ్తారు. ప్రాణంలేని శరీరాన్ని పోస్ట్ మార్టం చేస్తారు. పాడవకుండా వున్న అవయవాలని తీసుకుంటారేమో. చివరకు తన శరీరాన్ని తన వాళ్ళకి అప్పజెపుతారు....... దహన సంస్కారాలు జరుగుతాయి. పేపర్లో తన చావు గురించి ఫోటోతో సహా పడుతుంది. ఆ తర్వాత ......తర్వాత .... ఇంకేముంది?

    బాధ పడుతుంటే నీలో చేర్చుకోకుండా పరిహసిస్తావు. జీవితపు విస్తట్లో అన్నీ అమరి రుచి చూడబోతుంటే నిర్థాక్షిణ్యంగా లాగేసుకుంటావు.

    జీవితకాలమంతా తెలుసుకోలేని ఒక విషయాన్ని మరణశయ్యపై ఉన్న మనిషి అర్థం చేసుకుంటాడు. ఈ ప్రపంచంలో ఎవరినైనా ఏ లంచం ఇచ్చి అయినా లొంగదీసుకొవచ్చు. చాలా మార్గాలున్నాయి. కానీ మృత్యువు మాత్రం దేనికీ లొంగదు. ప్రాణం మూల్యంగా చెల్లించాల్సిందే.

    నేలపై పడబోయే చివరి క్షణంలో అతనికి సిరిచందన గుర్తుకొచ్చింది. ఒకవేళ సిరిచందన బాయ్ ఫ్రెండ్ తో రెడ్ హాండెడ్ గా  పట్టుబడి వుంటే ఆమెను పెళ్ళి చేసుకునేవాడా?

    అవును..... కాదు..... అని నిర్ణయించుకునే లోపల రవితేజ శరీరం నేలను తాకింది. అతనికి స్పృహ తప్పింది.


                         *    *    *

    అతికష్టంమీద పెదాలు బిగపట్టినవ్వు ఆపుకుంది సిరిచందన - పదే పదే రవితేజ గుర్తుకొస్తున్నాడు. మొదటిచూపులోనే ఆమెకి అతడు నచ్చాడు. అతని మొహంలోని ఆ గాంభీర్యత చూడగానే నాలుక బయట పెట్టి వెక్కిరించింది. కవ్వించాలనిపించింది. ఆ కోరికను పరాకాష్టే ఫోన్ చేసి అబద్ధం చెప్పటం.

    రవితేజ ఏం చేస్తాడు? హొటల్ కెళ్తాడా? లేక ఆ విషయమేంటో తననే  అడిగి తెలుసుకుంటాడా? ఈ రెండూ కాకుండా తనమీద నమ్మకంతో..... నమ్మకం...... అవును నమ్మకం ఎట్లా కలుగుతుంది? అంతకు ముందు అతనికీ తనకు అస్సలు పరిచయం లేదు. పెళ్ళి చూపుల్లోనే కదా చూసుకోవటం, తన స్వభావం..... ప్రవర్తన అతనికి  తెలియదు.

    డైరెక్టుగా ఆ విషయం అడుగుతాడు. లేదా హొటల్ కి వెళతాడు. ఒకవేళ హొటల్ కి వెళితే..... నవ్వు ఆపుకోలేక పోయింది.

    ఆమె ఆలోచనలకి భంగం కలిగిస్తూ ఫోన్ రింగయ్యింది. ఆమె ఫోన్ లిప్ట్ చేసింది. అవతల పరిచితమైన గొంతు. "నేను రవితేజ తండ్రి సత్యనారాయణని" ఆయన మాటల్లో తడబాటు స్పష్టంగా తెలుస్తోంది.

    "నమస్కారమండి. నేను సిరిచందనని" ఆమె ఇంకేదో చెప్పబోయింది. పూర్తిగా వినకుండానే మాట్లాడాడు.

    "రవి హొటల్ పై అంతస్తునుంచి కిందపడిపోయాడు. హాస్పిటల్ లో చేర్చించారు" గబగబా హాస్పిటల్ అడ్రస్ చెప్పాడు. మ్రాన్పడిన సిరిచందన తేరుకొని ఏదో అడిగే లోపల క్లిక్ మని ఫోన్ పెట్టేసిన చప్పుడయింది.


                         *    *    *

    వర్మ ఫోనెత్తి "......హలో" అన్నాడు.

    "నేనూ - మహర్షిని మాట్లాడుతున్నాను."

    వర్మ చేయి ఫోన్ చుట్టూ బిగుసుకుంది. "నిన్నటి నుంచీ నీ కోసం చూస్తున్నాను. ఎక్కడున్నావ్ నువ్వు? హొటల్ కి ఫోన్ చేస్తే రెండు రోజుల క్రితమే ఖాళీ చేసావన్నారు. అలా రాత్రికి రాత్రి ఖాళీ చేయవలసిన అవసరం ఏమొచ్చిందా అని కంగారు పడ్డాను. పోలీసులకి ఆచూకీ దొరికిందా?"

    "అటువంటిదేమీ లేదా వర్మా."

    "మరి?"

    "నేను ఇంకో హత్య చేసాను వర్మా" నిశ్శబ్దాన్ని చీలుస్తూ మహర్షి కంఠం నెమ్మదిగా వినిపించింది. వర్మ ఉలిక్కిపడ్డాడు. వ్హాట్" అని అరిచాడు. అతని కంఠం కీచుగా ధ్వనించింది. "......ఎవర్ని?"

    "శ్రీవాణీ ప్రియుడిని"

    "మైగాడ్. వాడు నీకెక్కడ కనపడ్డాడు?"

    "నేనున్న హొటల్ కె వచ్చాడు. చూడగానే ఆవేశం ఆపుకోలేక పోయాను. పైనుంచి తోసేసాను...."

    అతడి మాటలు కట్ చేస్తూ "పేపర్లో చదివాను. ఎవరో పోలీస్ ఆఫీసర్  స్మగ్లర్స్ తోసేస్తే పడిపోయాడని వ్రాసేరు. ఆస్పత్రిలో వున్నాట్ట...... నువ్వే నన్నమాట .....అతడు నిన్ను చూశాడా?"

    "లేదు"

    "అంతవరకూ మంచిదే. పోతే...... నేను ఆ కాలేజీకి వెళ్ళాను. రెండు రోజులు వెతికినా సిరిచందన అడ్రసు దొరకలేదు."

    "వర్మా......"

    "చెప్పు"

    .........

    "ఏమిటి మహర్షి? సంశయం ఏమిటి? చెప్పు?

    "నామీద నీకు అసహ్యం కలగటం లేదా?"

    వర్మ మాట్లాడలేదు.

    "చెప్పు వర్మా! నీ మౌనం నన్ను రంపంలా కోస్తూంది."

    "శ్రీవాణి డైరీ చదివావా?"

    తన ప్రశ్నకూ, ఆ తిరుగు ప్రశ్నకూ సంబంధం ఏమిటో అర్థంకాక "......చదివాను" అన్నాడు.

    "ఆ డైరీ చదివిన తరువాత నువ్వు ఏం చేసినా నీ మీద కోపంగానీ, అసహ్యంగానీ కలగదు. నాకే కాదు. ఎవరికీ కలగదు."

    "థాంక్స్."

    "ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావ్?"

    "కొంతకాలం ఎక్కడికయినా వెళ్ళి దాక్కోవాలి. హొటల్ కి పోలీసులు వెళ్ళి ఎంక్వయిరీ  చేస్తే నా రూపురేఖలు వాళ్లు చెప్పొచ్చు. మరి కొంతకాలం చూసి సర్రెండరయిపోతాను."

    "నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను మహర్షీ. నువ్వు ఎక్కడున్నావో చెప్పు, వచ్చి కలుసుకుంటాను".

    "ఈ రోజు వద్దు. నేను ఢిల్లీ వెళ్తున్నాను. సిరి క్లాస్ మేట్ ఒకమ్మాయి అక్కడుంది. తనకి సిరి అడ్రస్ తెలుసేమో కనుక్కుని వస్తాను".

    "ఈ పరిస్థితుల్లో నువ్వు అలా బయట తిరగడం అంత క్షేమం కాదేమో మహర్షీ....."

    "చెప్పానుగా, ఏ అపాయమూ నన్ను భయపెట్టదని-"

    "సరే నీ ఇష్టం. నేనూ ఇక్కడ ప్రయత్నిస్తాను....." అన్నాడు వర్మ. "....... నాకొక కోరిక కలుగుతుంది."

    "ఏమిటి?"

    "ఆస్పత్రికి వెళ్ళి ఆ రవితేజ చచ్చిపోయే లోపులో చెప్పాలని వుంది. 'నిన్ను తోసింది మహర్షి' అని."

    "వద్దొద్దు. అయినా ఎందుకు?"

    "నీకు తెలీదు మహర్షీ! నీ కేసు కోర్టులో నడుస్తున్నాప్పుడు అతడిని నేనూ, లాయరుగారూ కలిసి ఎంతో బ్రతిమాలాం. డిఫెన్సు తరపు సాక్షిగా ఒక్కసారి కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పమన్నాం. అప్పుడు అతడు చెప్పిన సమాధానం, చూపించిన నిర్లక్ష్యం ఇంకా నా కళ్ళముందు కదుల్తూనే వున్నాయి! అతడికీ తెలియాలి. అతడి వల్ల నువ్వు ఉరికంబం ఎక్కుతూ ఎలాంటి మానసిక క్షోభ అనుభవిస్తున్నావో- మరణానికి దగ్గిరవుతూన్న అతడికీ తెలియాలి!"

    "వద్దు వర్మా! అంత రాక్షసత్వం వద్దు. నేనంటే ఏదో ఆవేశంలో చేసేసాను."

    "ఊరికే అన్నాన్లే"

    "మరి నేను వుంటాను. సరిగ్గా నాల్రోజుల తరువాత ఊరిచివర అంబేద్కర్  కాలనీలో వున్న హింద్ హొటల్ కి సాయంత్రం నాలుగింటికి రా. ఎదురుచూస్తుంటాను."

    "మంచిది."

    మహర్షి ఫోన్ పెట్టేశాడు. ఆ సాయంత్రమే అతడు ఢిల్లీ బయల్దేరాడు.

   
                                4

    ప్రొద్దున్న అయిదింటికి- పోలీస్ కమీషనర్ అశ్వద్థామ  బెడ్ రూం అలారం మ్రోగింది. నిద్రలోంచి మెలకువలోకి వస్తూ, దాన్ని ఆపి, బయటకొచ్చాడు. ఆయన్ని చూడగానే ఇన్ స్పెక్టర్ లేచి సెల్యూట్ చేసాడు.

    అశ్వద్థామ చాలా సిస్టమాటిక్ పోలీస్ ఆఫీసర్.

    రవితేజకి సీరియస్ అయితే ఆ విషయం వెంటనే తనకి తెలుపమని లేకపోతే ప్రొద్దున్న అయిదింటికి ఇంటికొచ్చి రిపోర్ట్స్ చేయమని ఇన్ స్పెక్టర్ కి  ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చాడు.

    "రవికి స్పృహ రాలేదు సర్" అన్నాడు ఇన్ స్పెక్టర్.

    అశ్వద్థామ భృకుటి ముడిపడింది. అరగంటలో ఆస్పత్రికి బయలుదేరాడు.


                           *    *    *

    .... ఆ గది నిశ్శబ్దంగా వుంది.

    బాటిల్ లోంచి సన్నని ట్యూబ్ ద్వారా తేజ మోచేతి పైభాగంలోకి గ్లూకోజ్  ప్రవహిస్తూ వుంది. అధునాతనమైన గవర్నమెంట్ హాస్పిటల్ లో స్పెషల్  వార్డులో బెడ్ మీద పడుకొని వున్నాడు రవితేజ.

    అతనికి దూరంగా అతని తండ్రి కూర్చొని వున్నాడు.

    రాత్రి పదకొండు ప్రాంతంలో తేజాని కమీషనర్ స్వయంగా తీసుకొచ్చి హాస్పిటల్ లో చేర్పించటంతో అప్పటికప్పుడు ఆపరేషన్ జరిగింది.

    తేజాకి స్పృహ రాలేదు.

 Previous Page Next Page