Previous Page Next Page 
జాలిలేని జాబిలి పేజి 11


    ఈ మాటలు అతనికి విచిత్రంగా ధ్వనించి, ఆమెముఖంకేసి చూశాడు. ఇద్దరికళ్లూ కలుసుకున్నాయి. ఇద్దరి పెదాలమీద చిరునగవు అవతరించింది.

    "నీ కథలోలాగా" అన్నాడు మధుబాబు.

    రాజ్యలక్ష్మి నవ్వాపుకుంది.

    "పోదురూ!"

    మరుక్షణంలో అతని ముఖం మలిన పూరితమయిపోయింది. "నన్ను క్షమించు రాజ్యలక్ష్మి.....ఆ రాత్రి....." అంటూ ఆగిపోయాడు.

    ఆమె తలవంచుకొని ఆలోచిస్తోంది! ఎట్లా చెప్పటమా ఈ విషయమని. అవును. గ్రీన్ రూంలో కవిగారు చేసినపని ఆలోచించదగినదే. తను శిక్షకూడా విధించింది. కాని శిక్షముందు, నేరం తర్వాత. బొటనవ్రేలితో నేలను రాస్తూ "ఎట్లా చెప్పను? ఇతనికి ఎట్లా చెప్పను" అనుకుంటోంది.

    మధుబాబు భావనాపరంపరలో వున్నాడు. బహుశా రాజ్యలక్ష్మి మనసు లోనూ ఇదే సమస్య ఉత్పన్నమై వేధిస్తోందేమో! తను ఆమెను ప్రేమించాడా? దాన్నిగురించి ఎంతోలోతుగా, విలువయినదిగా చెబుతారే. తనవరకు వస్తుందా? క్షణికమైన వ్యామోహం తనది. ఈ ఆత్మవంచనతో ఆమె జీవితంలో జొరబడే సామర్థ్యం, తెగింపు తనకు లేవు. అదీగాక ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే విస్తుపోవటమే గాకుండా నవ్వులపాలుకూడా కావాల్సి వస్తుంది. ఒక విధంగా తనింకా జీవితం ప్రాథమికదశలో వున్నాడు. ఒకవేళ ఆమెను ప్రేమించాననుకుంటే పెళ్ళి చేసుకునే శక్తి తనకిక వుందా? తనమాటలు ఎవరూ ఖాతరుచెయ్యరు. ఆమెను తన తల్లిదండ్రులు ఇష్టపడకపోతే, వాళ్లని ఎదిరించే సాహసం ఉందా? "ఏడిశావ్! నోరు మూసుకో" అంటాడు తండ్రి. తను రచయిత. లోకానికి ఎలుగెత్తి చాటగలడు. ఇంట్లో తనమాట సాగదు. తన విద్య, అభివృద్ది వీటన్నిటిముందూ యీ ప్రేమ భస్మీపటలమైపోతుంది."

    "మీకో విషయం చెబుదామని వచ్చాను" అది రాజ్యలక్ష్మి తలవంచుకుని.

    "ఏమిటీ" అన్నట్లు చూశాడు మధుబాబు జాలిగా.

    "నన్ను మరిచిపోండి" ఆమెకంఠం జీరపోయింది. నయనాంచలాలనుండి జలజల నీరుకారింది.

    "ఏడుస్తున్నావా  రాజ్యలక్ష్మి!" అన్నాడు మధుబాబు వ్యాకులపాటుతో.

    "ఏం చేసేది ఏడవక? నన్ను మరచిపోండి. అదే నేను కోరేది" అంటూ ఆమె రివ్వున లేచినిల్చుని "వస్తాను మరి సెలవు" అని అతను పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటకు వెళ్లిపోయింది.

    అతను నిశ్చేష్టితంగా చూస్తూ వుండిపోయాడు.

    ఓ ఘడియ గడిచాక సుందరమ్మగారు వచ్చి "ఎవర్రా ఆ అమ్మాయి" అనడిగింది.

    అతను ఉలికిపడి "మాకు  జూనియర్ అమ్మా. ఆ అమ్మాయినే రౌడీలు రాయిపెట్టి కొట్టింది" అన్నాడు.

    "పాపం! ఈ అమ్మాయినేనా? అప్పుడే వెళ్లిపోయిందేమి?"

    "కాలేజికి టైము అయిందట" అన్నాడు అతను తడుముకోకుండా. తనకు ఆడపిల్లలతో పరిచయం వున్నట్లు తెలియటం, తనకోసం ఆమె ఇక్కడికి రావటం....అతనికి ఆవిడముందు చాలా ఇరకాటంగా వుంది.

    ఆమె అక్కడ్నించి వెళ్లిపోయాక ఈ విపరీతపరిణామాన్ని గురించి తలపోస్తూ పడుకున్నాడు. రాజ్యలక్ష్మి తనహృదయంలో మంటరేపిపోయింది. ఆమె అలా అనడానికి కారణమేమయి వుంటుంది? తను ఆమెని మరిచిపోకపోతే ఏమౌతుంది? తను చేసిన పనిని గర్హించడం, హర్షించటం ఈ రెండూ వొదిలేసి అర్థంకాని అయోమయస్థితిలో పడేసిపోయింది. చిత్రమైన పిల్ల రాజ్యలక్ష్మి.


                              *    *    *

    మధుబాబుకు బాగా నిమ్మదించాక ఆరోజు విశ్వనాథంగారు అడిగారు. "నాకు చెప్పనన్నా చెప్పకుండా నాటకంలో వేషం ఎందుకు వేశావురా?"

    ఈ ప్రశ్న తండ్రి నోటినుంచి వెలువడుతుందని అతనికి తెలుసు. ఆ సమయం ఎప్పుడాసన్నమౌతుందోనని భయపడుతూనే వున్నాడు.

    "తప్పనిసరి అయింది నాన్నగారూ" అన్నాడు తలవంచుకుని వినయంగా.

    "తప్పని. సరి అయితే అయింది. నా పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు?"  అతను మెదలకుండా వూరుకున్నాడు.

    విశ్వనాథంగారు ఓ ఘడియతాళి ఉపక్రమించాడు. "చూడూ! ఈ నాటకాలంటే నాకు ఇష్టంలేదు. వాటిని నేను అసహ్యించుకుంటాను. అదో వ్యసనం. ఆ వ్యాసనంలో పడినవాడెవడూ బాగుపడడు. చదువు అంటదు. నువ్వు చదువుకోవాలి, పైకి రావాలి. నువ్వు బిజినెస్ పనికిరావు. ఇవన్నీ జీవితంలో దమ్మిడీఎత్తుకూడా ఫలంలేని వ్యాపకాలు. నువ్వు కథలు రాసుకుంటూంటే హర్షించి ఊరుకున్నాను. నాటకంలో వెయ్యటం మాత్రం హర్షించలేను. తెలిసిందా?" మధుబాబులో వేదన చెలరేగింది.

           
                                                                      10


    పరీక్షలు సమీపిస్తున్నాయి. మధుబాబు శ్రద్ధగా చదవసాగాడు. అతి ప్రయత్నంమీద ఏకాగ్రత అలవర్చుకుంటున్నాడు.

    రాజ్యలక్ష్మి అతడ్ని కలవరస్తోంది. చాలాసార్లు ఆమెను విపులంగా అడుగుదామని ప్రయత్నించాడు. కాని ఆమె అవకాశం ఇవ్వటంలేదు. మామూలుగా, ఏమీ తెలియనట్లుగా మాట్లాడేది. భగీరధ ప్రయత్నంమీద అలా నటిస్తుంది అన్న సత్యం స్పురిస్తూనే వుండేది. నవ్వుతూ వుండడానికి వ్యర్థప్రయత్నం చేసేది. దిగులుగా, విరక్తిగా గోచరించేది రాజ్యలక్ష్మి.

    ఒకసారి సాయంత్రం "మీకో విషయం చెప్పాలి మధుబాబూ" అన్నది అనుచుకోలేక.

    "ఏమిటి రాజ్యలక్ష్మి! ఏమిటి నీ మనోవేదన?"

    "ఇప్పుడు కాదులే మధుబాబూ! మీ పరీక్షలు కానివ్వండి. నా గురించి ఆలోచనలతో మనసు పాడుచేసుకోకండి. మీరు ఫస్ట్ క్లాసులో పాస్ కావాలి. పరీక్షలు రాశాక చెబుతాను. అప్పటిదాకా నన్నేమీ ప్రశ్నించకండి. ప్లీజ్" అన్నది.

    మధుబాబు ఆమెని విడిచిపెట్టి ఖేదంతో వెళ్లిపోయాడు.

    పరీక్షలు ముగిశాయి. చివరి నెలరోజులూ చాలా శ్రమించి చదివాడు మధుబాబు. నిరంతరం తండ్రి అన్నమాటలే గుండెల్లో ధ్వనిస్తూ వుండేవి. ఓపికను మించి, శక్తినంత ధారపోసి చదివాడు.

    చివరిపేపరు రాసివస్తోంటే గేటుదగ్గర రాజ్యలక్ష్మి పలరించింది. "బాగా రాశారా?"

    "అనుకుంటున్నాను."

    "క్లాస్ వస్తుందా?"

    "చెప్పలేను రాజ్యలక్ష్మి. మంచిమార్కులతో పాస్ అవుతానని మాత్రం చెప్పగలను. ఇంకా ప్రాక్టికల్స్ వున్నాయిగా."

    ఆమె అటూయిటూ చూసి కంఠస్వరం చిన్నదిచేసి "సాయంత్రం కృష్ణానదీ తీరానికి వస్తారా? పాత రేవువైపు" అన్నది.

    అతనామె కళ్ళలోకి చూస్తూ "తప్పకుండా వస్తాను రాజ్యలక్ష్మి" అన్నాడు. ఆమె చిన్నగా నడచి వెళ్ళిపోయింది.

    సాయంత్రం అయిదయేసరికి బట్టలువేసుకుని తయారై కృష్ణాతీరానికి వెళ్ళాడు. వేసవి ప్రారంభమైంది. కాని నదీతీరం కాబట్టి అక్కడ చల్లగా, హాయిగా వుంది. ఆనకట్ట ప్రకనుంచి కార్లూ, బళ్ళూ పోవటం  ప్రారంభమైంది. దూరంగా నదీతరంగాలమీద  తెరచాప యెత్తి రెండు పడవలు  కదిలిపోతున్నాయి. బెస్తవాళ్ళు వలలవేసి చేపలు పట్టుకుంటున్నారు. ఒడ్డున అక్కడక్కడా ఒకడూ యిద్దరూ తప్ప మనుషులు లేరు. ఒక చాకలిపడుచు మధుబాబు నిల్చున్న ప్రదేశానికి వచ్చి బట్టలు ఉతకసాగింది. నీళ్లు చింది అతని ముఖాన పడ్డాయి. ఆమె నాలిక కొరుక్కుని "దూరంగా తొలగండి బాబూ! దగ్గరుంటే నీళ్ళు చిందుతయ్" అని అతనికి కోపం రాకుండా వుండేందుకు చిన్నగా  నవ్వింది. అతడు దూరంగా జరుగుతూ తలత్రిప్పి చూశాడు.

    ఇసుకలో రాజ్యలక్ష్మి నడిచివస్తోంది.

    మధుబాబు గుండె గబగబా కొట్టుకుంది. ఏమి చెబుతుంది రాజ్యలక్ష్మి అట్లాగే చూస్తూ నిలబడ్డాడు.

    చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ చివరకు రాజ్యలక్ష్మి దగ్గరకు వచ్చి "ఎంతసేపయింది వచ్చి?" అన్నది కొంచెం నవ్వుతూ.

    "కొద్ది నిముషాలు."

    "రండి అలా కూర్చుందాం" అందామె అతనికి చేరువగా వచ్చి. ఇద్దరూ కలిసి కొంతదూరం నడిచి..... నీటికి దగ్గరగా యిసుకలో కూర్చున్నారు.

    రాజ్యలక్ష్మి ముఖం అలసిపోయినట్లుగా, బలహీనంగా వున్నది. ముంగురులు చెదురుగా కళ్ళమీదుగా పడుతున్నై.

    "చెప్పు రాజ్యలక్ష్మి" అన్నాడు మధుబాబు తొందరగా.

    వాళ్ళిద్దరూ ఒకరికొకరు చాలా దగ్గరగా వున్నారు. "నన్ను మరిచిపొండి" అన్నది ఆమె దీనంగా ముఖంపెట్టి.

    మధుబాబు మనస్సు వికలమైపోయింది. "ఎందుకని?" అన్నాడు విషాదంగా.

    "మన ప్రేమకు పర్యవసానం వుండదు కాబట్టి."

    "నువ్వు నన్ను ప్రేమించావా రాజ్యలక్ష్మీ" అనడిగాడు హఠాత్తుగా.

    ఆమె యీ ప్రశ్నకు అదిరిపడింది. కనుకొలుకుల్లోంచి అతడ్ని చూస్తూ "ఎందుకొచ్చింది మీకా సందేహం..... యిప్పుడు?" అంది చిన్నగా.

    "ఏముందని..... నాలో ఏముందనీ?" అని గొణిగాడు మధుబాబు అస్పష్టంగా.

    "అది నాకు తెలియదు మధుబాబూ" అన్నది రాజ్యలక్ష్మి కంపితస్వరంతో. "అలా చేసేశారు ఆరోజు. పాపిష్టిదాన్ని, మిమ్మల్ని హింసించాను. ఆ రాత్రంతా ఎంత ఏడ్చాననుకున్నారు? మీ రూపమే, స్మృతే నన్ను ఆక్రమించుకుని వేధించసాగింది. ఆ క్షణమే తెలుసుకున్నాను...... మిమ్మల్నే ప్రేమిస్తున్నానని. కాని సమయం మించిపోయింది మధుబాబూ. బంధితురాల్ని నేను."

    "అదెలా రాజ్యలక్ష్మీ?" అనడిగాడతను వ్యాకులపాటుతో.

    ఆమె తలవంచుకుని సన్నని స్వరంతో "నేను చెప్పేది విని నన్నసహ్యించుకోకుండా వుంటారా?" అన్నది.

 Previous Page Next Page