"ఇంతకీ ఎవరు?" అడిగేడు.
శాస్త్రి వివరాలు చెప్పేడు.
భోజనం చేసి గదిలోకి వచ్చేక "మరి తను వెళ్ళిపోతే ఇంట్లో ఇలా తిరగటానికి ఎవర్నైనా తెచ్చుకోవద్దూ?" అని వక్కపొడి వేసుకుంటూ పాణి అడిగేడు.
శాస్త్రికి ప్రశ్న అర్ధమైంది. నవ్వి, "ఆ విషయం ఆలోచించలేదు" అన్నాడు.
"మరి ఇంటిలో నీ విషయాలు చూసేది తనొక్కతేకదా" అన్నాడు పాణి శాస్త్రి తన చెల్లెల్ని ఎంత అభిమానిస్తాడో అతనికి తెలుసు. వాడికున్న బద్దకానికీ పల్లవేగానీ వాడి వెనుక అంతా సర్దుతూ ఉండకపోతే వాడి గదీ, వాడి వస్తువులూ ఎంత అస్తవ్యస్తంగా తయారవుతాయో కూడా అతనికి తెలుసు.
"నీకేమైనా మతిపోయిందా? - అందుకని పెళ్ళి చేసి పంపకుండా అలా ఉంచేస్తామా ఏమిటి?"
"అయితే, తొందర్లోనే మాకు విందు భోజనం ఉందన్న మాట" నవ్వేడు పాణి శాస్త్రి మాట్లాడలేదు. అలాగే కిటికీలోంచి బయటికి చూస్తూ ఉండిపోయేడు. పాణి పక్కమీద దుప్పటి సర్దుతూ, "ఇక ఇలా మనం పదకొండింటికి పన్నెండింటికి వస్తే ఎవరూ తలుపు తీయరన్నమాట" అన్నాడు నవ్వి.
శాస్త్రి దానికీ మౌనంగా వుండిపోయేడు. పాణికి ఏదోఅనుమానం వచ్చి "శాస్త్రీ" అంటూ దగ్గరగా వెళ్ళేడు.
శాస్త్రి వెనక్కి తిరిగేడు అతని కళ్ళనిండా నీళ్ళు చూసి పాణి కలవరపడి, "ఏమిట్రా యిది?" అన్నాడు. శాస్త్రి నవ్వి, "ఏమీలేదు, పల్లవి ఈ యింటిలోనుంచి వెళ్ళిపోవటాన్ని ఊహించుకుంటున్నానంతే" అన్నాడు.
"మరీ ఇంత సెన్సిటివ్ అయితే ఎలా?"
"ఆ మాత్రం సెన్సిటివ్ నెస్ లేకపోతే జీవితం కాజువల్ అయిపోదూ?" అన్నాడు శాస్త్రి నవ్వుతూనే.
"పల్లవి వెళ్ళిపోతుంది. కొంతకాలానికి ఇంకో అమ్మాయి నీ జీవితంలో భాగం పంచుకోవటానికి వస్తుంది. నీ అలవాట్లు గమనిస్తూ నిన్ను తీర్చిదిద్దుతుంది. ఆ ఆప్యాయతతోనువ్వా పల్లవిని మరచిపోతావ్" అన్నాడు పాణి. శాస్త్రి మాట్లాడలేదు. అంతలోనే పాణికి ఒక అనుమానం వచ్చింది.
"అంటే.... ఒకలా ఆలోచిస్తే..... పల్లవి స్థానాన్ని నీ భార్య భర్తీ చేస్తుందన్న మాట?" అన్నాడు సాలోచనగా.
"ఛా - చెల్లి, భార్య ఒకలా ఎలా అవుతారు?"
"కారు. నేనూ ఒప్పుకుంటాను. కానీ, ఇప్పుడు పల్లవి నిన్నెంత అభిమానిస్తుందో, రేపు నీ భార్యా నిన్ను అలానే అభిమానిస్తుంది. సెక్స్ వదిలిపెట్టు. పోతే ఇద్దరూ నీకు దగ్గిరవాళ్ళే?"
"కాదు. పల్లవిని నేను అభిమానిస్తాను, అంతే మా ఇద్దరి మధ్యా ఉన్నది ఆప్యాయత మాత్రమే. నా భార్యకీ, నాకూ మధ్యవున్న అనుబంధం ఇంకొంచెం ఎక్కువే."
"ఏమిటి సెక్సా?"
"అదొక్కటే కాదు. వీటన్నిటికీ అతీతమైనది ఇంకొకటి - ప్రేమ!"
"అదే నేనడుగుతున్నది. ప్రేమంటే ఆప్యాయత ప్లస్ సెక్స్ ప్లస్ ఇంకొకటి! ఆ ఇంకొకటి ఏమిటి?"
"సెక్స్ కాంత ఇంపార్టెన్స్ ఇవ్వక.....! ఉప్పొంగే ఆప్యాయతనీ, ప్రేమనీ వెలిబుచ్చటానికి అదొక మార్గం. కాబట్టి ఎంతో పెద్దదైన 'ప్రేమ'లో అదో భాగం అంతే" అన్నాడు.
వెంటనే పాణి అన్నాడు. "అయితే ప్రేమంటే ఏమిటి?"
శాస్త్రి మాట్లాడలేదు. క్షణం నిశ్శబ్దంగా గడిచాక మళ్ళీ పాణి అన్నాడు. "నీక్కోపం రాదంటే నిన్నో ప్రశ్న అడుగుతాను".
"అడుగు" అన్నాడు శాస్త్రి.
"ఆ హీరోయిన్ తో నేను మాట్లాడానూ అనగానే నువ్వు భయపడ్డది ఆ అమ్మాయిని నేనెక్కడ ప్రేమిస్తానోనని కదూ?"
"అహఁ నీ మీద నమ్మకంలేక కాదు. ఆ అమ్మాయి ప్రతివాణ్ణి సిన్సియర్ గా ప్రేమించినట్టు నటిస్తుంది. అనుభవంలేక నువ్వెక్కడ మోసపోతావోనని."
"అంటే నీ ఉద్దేశ్యం : నేను సెన్సిటివ్ ని కాబట్టి నా మొదటి అనుభవం ఇలా పాడవకుండా ఉండాలనే కదా నువ్వు హెచ్చరించింది."
"ఔను" అన్నాడు శాస్త్రి.
"మరి నీ ప్రేమించటం అనే అనుభవాన్ని మొట్టమొదటిసారి భార్య దగ్గర కాకుండా చెల్లెలి దగ్గరే ఎందుకు పొందుతున్నావ్?"
"చెల్లెలూ, భార్యా ఒకరే ఎలా అవుతారు?" అన్నాడు శాస్త్రి కొంచెం కోపంగా.
"సీరియస్ కాకు మరి" అన్నాడు పాణి నవ్వి, "ప్రేమ అనే విషయానికి సంబంధించినంతవరకూ ఇద్దరూ ఒక్కటేగా?"
శాస్త్రి క్షణం మాట్లాడకుండా ఆలోచిస్తూ వుండిపోయేడు. తరువాత అన్నాడు - "నీ వాదం ఒప్పుకోను నేను. ఇంట్లోంచి వెళ్ళిపోతుందనే భావంతోనే చెల్లెల్ని అభిమానిస్తాం. దానిలో పరిపూర్ణత్వం లేదు."
"అయితే, చెల్లెల్ని వదిలేయ్. పోనీ తల్లిని?" అన్నాడు పాణి.
శాస్త్రి మాట్లాడలేదు.
* * *
"నేనో అమ్మాయిని ప్రేమిద్దామనుకున్నాను" అన్నాడు పాణి.
శాస్త్రి నవ్వేడు. "ప్రేమిద్దామనుకోవటం ఏమిటి?" అన్నాడు గ్లాసు ఎత్తి గుటకవేస్తూ బార్లో ఎక్కువమంది జనం లేరు. నిశ్శబ్దంగా వుంది.
"నెలరోజుల క్రితం ఓ అమ్మాయితో పరిచయం అయిందిలే" అన్నాడు పాణి.
శాస్త్రి హుషారుగా ముందుకు వంగుతూ, "చెప్పు చెప్పు" అన్నాడు.
"ఏమీలేదు పరిచయం కొంచెం పెరిగింది. ఒక్కసారి పబ్లిక్ గార్డెన్స్ కి కూడా వెళ్ళాం" అంటూ ఆగేడు.
శాస్త్రి ఆసక్తితో "తరువాత ఏమైంది?" అన్నాడు.
పాణి నవ్వేడు. "ఏముంది? నేనే పరిచయాన్ని తెంచేసుకొన్నాను."
శాస్త్రి ఆశ్చర్యంగా "ఎందుకు?" అన్నాడు.
"నాలో ఏం చూసి ఆ అమ్మాయి నాతో పబ్లిక్ గార్డెన్స్ కొచ్చిందో నా కర్ధం కాలేదు"
"నీతో పరిచయం పెంచుకొని, పెళ్ళి చేసుకొందామనుకుని ఉంటుంది."
"అంటే ఈ ప్రేమ స్వార్ధంతో ఉద్భవించినదన్న మాటేగా? ఒకవేళ నేను పెళ్ళిచేసుకోను- అని తెలిస్తే నాతో తిరుగుడుకు గుడ్ బై చెప్పేసి ఇంకెవరన్నా తన వెనుక నాలుగు రోజులు తిరిగితే అతనితో కలిసి ఇంకే కిద్వాయ్ గార్డెన్స్ కో వెళతుందన్నమాట"
"అవును ప్రేమించటంలో ఆ మాత్రం రిస్క్ ఎప్పుడూ ఉంటుంది" అన్నాడు శాస్త్రి.
"భయం వుంటే అది ప్రేమ ఎలా అవుతుంది?"
"సర్లే, ఇంతకీ ఆ అమ్మాయి విషయం ఏం చేసేవ్?" అన్నాడు శాస్త్రి నవ్వుతూ.
"నెలరోజులపాటు జరిగిన ఆ స్నేహం నాలో వ్యధనే కలిగించింది. అనవసరమైన మానసిక సంఘర్షణ! ఈ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందా? లేకపోతే స్వార్ధంతో రిస్క్ తీసుకుంటుందా? ఇది తెలుసుకోవటం కోసం నేనూ ఒక రిస్క్ తీసుకొన్నాను."
శాస్త్రి ఆత్రుతగా "ఏం చేసేవ్?" అన్నాడు.
"ఒకరోజు నా రూమ్ కి వచ్చినప్పుడు నడుంచుట్టూ చెయ్యివేసి దగ్గరకు తీసుకొన్నాను."
శాస్త్రి ఒక్క గుక్కలో గ్లాసులో ద్రవం పూర్తిచేసి, "తరువాత?" అన్నాడు ఉత్సుకత భరించలేక.
ఆ అమ్మాయి సుతారంగా నన్ను విడిపించుకొని, 'ప్లీజ్ ఇప్పుడొద్దు' అంది.
"మంచి అమ్మయన్నమాట" అన్నాడు శాస్త్రి వెనక్కి వాలుతూ "తరువాత ఏం జరిగింది?"
"ఆ అమ్మాయితో స్నేహం తెంపేసుకొన్నాను."
శాస్త్రి ఆశ్చర్యంతో "అదేం?" అన్నాడు.
"ఆ అమ్మాయి నన్ను మనస్పూర్తిగా ప్రేమించటంలేదు. ప్రేమలో అనుమానాలకు తావులేదు. ఆమెలో నాపట్ల ప్రేమకన్నా జాగ్రత్తే ఎక్కువ వుంది. నిజమైన ప్రేమ ఇద్దరిమధ్యా ఒక తెగింపు, ప్రపంచం ఏమనుకున్నా ఫర్వాలేదు....అనే పిచ్చితనం కలగజేస్తుంది. అంతేగానీ, అంత కాషస్ మైండెడ్ వుండదు" అన్నాడు పాణి.