అది వినబడిన సంభ్రమంలో ఆ కంఠం మరో మూడు నిముషాల్లో శాశ్వతంగా మూగపోతుందన్న నిజం....!!!
ఆమె ఉక్కిరి బిక్కిరి అవుతూంది కానీ ఆ ఫీలింగ్స్ అన్నీ తీరిగ్గా అనుభవించటానికి కూడా వీల్లేనంత వత్తిడి....సమయం అసల్లేదు.
"హల్లో" అంది వణుకుతూన్న కంఠంతో.
అన్నేళ్ళ తరువాత వికసించిన ఆమె కంఠం అతడిని ఆనందంలో ముంచెత్తింది. "అనూహ్యా'...." అన్నాడు. "నాకింకా అదృష్టం ఏమూలో మిగిలి వుందన్నమాట. లేకపోతే ఇంత కొద్ది సమయంలో నువ్వు దొరకటం ఏమిటి చెప్పు- ఇన్ని సంవత్సరాలు వెదికితే లేనిది...." అతడి స్వరంలో మార్పొచ్చింది. ".....అనూహ్యా! నేను నీకు ఇంతకీ గుర్తున్నానా!"
ఆమె గొంతులో ఏదో అడ్డుపడినట్టు అయింది. "య.....యశ్వంత్" అంది రుద్ధకంఠంతో, ఆ ఒక్కపదం చాలు. అతడికి అర్థం అయింది. సన్నని నిట్టూర్పు.
"మనం విడిపోయేటప్పటికి నువ్వు చిన్నపిల్లవి. ఇప్పుడు ఎలా వున్నావ్ అనూహ్యా నువ్వు? నేనంటే భయం పోయిందా?"
.......ఆమెకి ఏడుపొస్తూంది.
"మాట్లాడు అనూహ్యా! నేను మరణ ద్వారంలోకి అడుగు పెట్టటానికి ఇంకా రెండు నిమిషాలు మాత్రమే వుంది. ఒక్క ప్రశ్న అడుగుతాను సూటిగా సమాధానం చెప్పు. మనం విడిపోయాక - ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారైనా నేను గుర్తొచ్చానా?"
అయ్యో? నీకెలా చెప్పి నిన్ను నమ్మించను? నీ తాలూకు ఆలోచన్లనుంచి బయటపడలేక చివరికి మానసిక శాస్త్ర నిపుణుడి దగ్గిర క్కూడా వెళ్ళానని.... చివరి క్షణాల్లో ఎలా అదంతా వర్ణించను? దుఃఖాన్ని ఆపుకుని ఆమె అంది-
"యశ్వంత్? నువ్వు బ్రతుకుతావు యశ్వంత్! ణా కెందుకో నమ్మకం కలుగుతోంది. నా మనసు చెపుతోంది యశ్వంత్...."
అట్నుంచి నవ్వు! నీకింకా చిన్నతనం పోలేదు అనూహ్యా.....అన్నట్టు.
కంప్యూటర్ 100 సెకన్లు చూపిస్తూంది. నౌకను వదిలెయ్యటానికి పూర్తిగా రెండు నిముషాలు కూడా లేదు సమయం.
"ఇన్ని సంవత్సరాలూ నేను నీ గురించే ఆలోచిస్తున్నాను అనూహ్యా నమ్ము. ఇది చేబుదామనే ఈ ఆఖరి క్షణాల్లో నీ కోసం ప్రయత్నించాను. అదృష్టవశాత్తు నువ్వు దొరికావు. దేవుడికి దగ్గరగా రోదసీలో వున్నాను. రోదసీలో మరణించబోతున్నాను. రేపు దేవుడి దగ్గరకు వెళ్ళాక ఒక్కటే వరం అడుగుతాను. వచ్చే జన్మలో మనిద్దరి మధ్యా వయసు వ్యత్యాసం కాస్త తగ్గించమని. అతగాడు దానికి ఒప్పుకున్న పక్షంలో..... అనూహ్యా.... కెన్ యు లవ్ మి?"
కెన్ యు లవ్ మి?
కెన్ యు లవ్ మి?
లక్షమైళ్ళ పైగా దూరంనుంచి తన మాజీ భర్త అడుగుతున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అని. మరణానికి మరో నిమిషం వుందనగా అతను ప్రశ్నిస్తున్నాడు- నేను నీకు ఒకసారి అయినా జ్ఞాపకం వచ్చానా? అని. ఇక్కడ ఆమె స్థితికాదు ముఖ్యం. అతడు ప్రశ్న అడిగిన పరిస్థితి.....ఆమె మరింకేం ఆలోచించలేదు. వాయుపుత్ర గురించిగానీ, సైకియాట్రిస్టు చెప్పినదాని గురించీగానీ ఆలోచించలేదు. వాస్తవంకన్నా ఎమోషన్ గొప్పది!
ఆమె చేతిలో ఫోన్ వణుకుతూంది. నీళ్ళు నిండిన కళ్ళతో చెంపలు తడిశాయి. "ఐ లవ్యూ యశ్వంత్.." అంది కంపించే కంఠంతో ఆవేశంగా! ".....అంతేకాదు యశ్వంత్.... మనం విడిపోయిన రోజునుంచి నువ్వు గుర్తురాని రోజులేదు. నిజం........"
ఆ మాటలకి భారరహిత స్థితి అతడి మనసుకి కూడా సోకింది. ఆనందంతో అది తేలిపోతూ వుండగా,"థాంక్యూ అనూహ్యా.....ధాం...." అంటూంటే ఫోన్ కట్ అయింది. తన చివరి ఆనందం కూడా ఆ విధంగా చివరవరకూ వెల్లడి చేయనివ్వకుండా మధ్యలో అంతరాయం కలిగించిన వారిమీద అతడికి అంతులేని కోపం వచ్చింది. కోపంగా ఏదో అనబోతూ వుంటే లాంచ్ కంట్రోలర్ లైన్ లోకి వచ్చి "యశ్వంత్! నీతో వాయుపుత్ర మాట్లాడతాడంట" అన్నాడు.
యశ్వంత్ కంప్యూటర్ వైపు చూశాడు.
50 చూపిస్తూంది!
మరణానికి యాభై సెకన్ల ముందు అతడు తనతో ఏం మాట్లాడతాడు? ఇన్నేళ్ళ తరువాత మనసుకి స్వాంతన లభించే ఈ ఆఖరి క్షణాల ఆనందాన్ని అతడు ఎందుకు పాడుచేశాడు?
అంతలో అట్నుంచి వినపడింది-"వాయుపుత్ర హియర్. నాకొక ఆలోచన వచ్చింది."
"ఏమిటి?"
"మీ స్పేన్ సూట్ (అంతరిక్షంలో వ్యోమగాములు ధరించే దుస్తులు)కి మీతోపాటూ టెన్-ఎమ్ రేడియో అమర్చుకోండి. మేము రాడార్ మీద ట్రాక్ చేసి పట్టుకుంటాము-"
అంత టెన్షన్ లోనూ యశ్వంత్ కి నవ్వొచ్చింది. "ఇరవయ్యో శతాబ్దపు ఆర్థర్ క్లార్క్ కథ లేమైనా చదివావా" అన్నాడు.
వాయుపుత్ర దాన్ని పట్టించుకోలేదు. సమయం ఇంకా 36 సెకన్లుంది. గబగబా మాట్లాడుసాగాడు. ".....సరిగ్గా అరగంటలో మేము బయల్దేరతాము. మీరు చెయ్యవలసిందల్లా ఒకటే. వ్యోమనౌక నుంచి బయట శూన్యంలోకి వచ్చేటప్పుడు వీలైనంత బలంగా దాన్ని తన్నటం....."
"ఏమిటీ?"
"చంద్రుడిమీద పడిపోకుండా ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువసేపు కక్షలోనే తిరుగుతూ వుండటానికి ప్రయత్నం చేయండి."
ఒక విమానంలోంచి బంతి విసిరితే అది భూమిమీద పడుతుంది. ఈ లోపులో ఇంకో విమానంలో బయల్దేరి, ఆ బంతి నేలమీద పడేలోపులో దాన్ని మధ్యలోనే గాలిలో పట్టుకోవటం - అదీ వాయుపుత్ర చెప్పే సలహా!
"మీకు మతిపోయింది-" అన్నాడు యశ్వంత్ కౌంట్ డౌన్ 26 చూపిస్తూంది.
"ఏమీ చెయ్యకుండా వుండడం కంటే ఏదో ఒకటి చెయ్యటం మంచిది."
"థాంక్స్-"
"నేను చెప్పినట్లు చేస్తారు కదూ"
"నేను థాంక్స్ చెపుతున్నది అందుకు కాదు"
"మరి?"
"చివరి నిముషంలో చావబోయే ముందుకూడా కాస్త ఆశతో చచ్చేలా చేస్తున్నందుకు."
"మేము బయల్దేరుతున్నాం. మీరు చేస్తున్నరంతే" ఫోన్ కట్ అయింది.
కంప్యూటర్ ఇరవై సెకన్లు చూపిస్తూంది. అతడు వెనుక వైపువున్న డెస్క్ లోంచి స్పేస్ సూట్ తీసుకున్నాడు. దానితోపాటే 10- ఎమ్ రేడియో కూడా అమర్చుకున్నాడు. దానివల్ల పదిమైళ్ళ వ్యాసార్థంలో ఎక్కడున్నా రాడార్ పట్టుకుంటుంది. ఇదంతా చేస్తున్నాడన్న మాటేకాని అతడికి నమ్మకం లేదు. అతడు లెక్కవేశాడు. తన వీపు దగ్గిర అమర్చిన ఆక్సిజన్ దాదాపు పది గంటలు వస్తూంది. ఆక్సిజన్ సమస్యకాదు, వ్యోమనౌక నుంచి బయట పడేటప్పుడు ఎంత వేగంగా తను బయటకు రాగలిగితే* అన్ని ఎక్కువ రౌండ్లు చంద్రుని చుట్టూ తిరుగుతాడు. కానీ క్రమంగా చంద్రుడి మీదకు జారిపోతాడు. శరీరం చిద్రమై పోతుంది.దీనికి రెండు గంటలు కన్నా ఎక్కువ సమయం పట్టదు. ఎందుకంటే ఎన్ని రౌండ్లు పరిభ్రమించినా శూన్యంలో రెండు గంటలకన్నా ఎక్కువకాలం వుండలేడు. చంద్రుడి ఆకర్షణ శక్తికి లొంగిపోతాడు. ఈ లోపులో, భూమ్మీద వాళ్ళు బయల్దేరతారు. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా, భూమ్మీద ఎంత వేగంగా పనులు పూర్తిచేసుకుని బయల్దేరినా, చంద్రుణ్ణి చేరుకోవటానికి వాళ్ళకి నాలుగు గంటలు పడుతుంది. అదీగాక, ఇక్కడకు వచ్చాక, రాడార్ సాయంతో తనని వెతికి పట్టుకోవాలి. ఇంత విశాలమైన శూన్యంలో పదిమైళ్ళ రేడియో వ్యాసార్థపు సాయంతో తన శవాన్ని వెతకటానికే నాలుగురోజులు పడుతుంది.
అతడికి భూలోకవాసులు (అప్పటికే తను వేరే, వాళ్ళు వేరు అన్న భావంతో) మీద కృతజ్ఞత ఏర్పడింది చరిత్రలో, చంద్రుడి మీద మరణించిన వాళ్ళు తక్కువ కాదు. కాని చంద్రుడిమీద మరణించినవాడి శరీరాన్ని తీసుకువెళ్ళటం కోసం అంత ఖర్చుతో ఒక వ్యోమనౌక బయల్దేరటం....చరిత్రలో ఇదే మొదటిసారి.
ఇంకా ఏడు సెకన్లు వుంది.
ఆఖరిసారి అతడు తను గడిపిన 'గది' వైపు చూసుకుని,Air Lock దగ్గరకి వచ్చాడు. నెమ్మదిగా దాన్ని తెరిచాడు.
విశాలమైన విశ్వం..... లెక్కలేనన్ని నక్షత్రాలు..... తమ వైపు ఆహ్వానిస్తూ..... అతడు గుండెల్నిండా వూపిరి పీల్చుకున్నాడు.
ఎదురుగావున్న శూన్యం ఎంత ధైర్యవంతుడినైనా వళ్ళు గగుర్పాటు చెందేలా చేస్తూంది. విమానంలోంచి పారాచూట్ కట్టుకుని గాలిలోకి దూకేవాడిలా అతడు సిద్ధపడ్డాడు. ఆ క్షణం అతడి భయాలూ, భద్రతా రాహిత్యం..... అన్నీ తొలగిపోయాయి. నిండా శూన్యంలో మునగబోయే వాడికి భయం ఏమిటి?
________________________________________________________________
*(ఒక లమైన అయస్కాంత క్షేత్రానికి తాడుకట్టి దాని చివర ఒక మేకుకట్టి బలంగా తప్పితే, విష్ణుచక్రం తిరిగినట్టు ఆ మేకు దానిచుట్టూ కొన్ని రౌండ్లు తిరుగుతుంది. కానీ క్రమంగా దాని వేగం తగ్గిపోయి, ఆ అయస్కాతంవైపు వెళ్ళిపోతుంది. ఎంత ఎక్కువసేపు తిరుగుతుంది అన్నది- ఎంత బలంగా ఆ మేకుని తోశాడు అన్న దానిమీద ఆధారపడి వుంటుంది. ఈ థియరీయే ఇక్కడ కూడా వర్తిస్తుంది.)
ఎదురుగా చంద్రుడు పుట్ బాల్ కన్నా వందరెట్లు పెద్దసైజులో కనిపిస్తున్నాడు. మరొకవైపు సూర్యుడు భూమి వెనుక వైపు కృంగిపోతున్నాడు. పగలుకీ రాత్రికీ మధ్యరేఖ చాలా అద్భుతమైన దృశ్యంగా కనపడుతూంది. ఇంకా పూర్తిగా చీకటి కాలేదు. కానీ భూమి వెనక్కి సూర్యుడు వెళ్ళటంవల్ల పౌరాణిక చిత్రాల్లో దేవుడి తల వెనుకనుంచి వెలుగు వచ్చినట్టు, సూర్యుడు కనపడకుండా వెలుగు వృత్తాకారంలో బహిర్గతమవుతూంది. ఆ వెలుగులో చంద్రుడిమీద వున్న పర్వతాలు, క్రీటర్స్ లీలగా కనపడుతున్నాయి.
అతడు తనకాళ్ళని అంతరిక్ష నౌక గోడలకి గట్టిగా అదిమి పెట్టాడు. అతడి మొహం నక్షత్రాలకి అభిముఖంగా వుంది. సత్తువంతా కాళ్ళలోకి తీసుకుని తీసుకుని శూన్యంలోకి గెంతాడు.
అంతరిక్ష నౌకనుంచి అతడు విడివడుగానే, అతడికీ ఆ నౌకకీ మధ్యదూరం రెప్పపాటులోనే ఎక్కువైంది. అతనెంత వేగంగా ప్రయాణం చేస్తున్నాడో అతడికి అర్థమైంది. క్రమంగా చిన్నదయిన రాకెట్ పెద్ద విస్ఫోటనంతో ముక్కలుగా మారింది. అతడికి ధ్వని వినిపించలేదు. (శూన్యం కాబట్టి). కానీ వెలుగు మాత్రం కళ్ళు మిరుమిట్లు గొలిపేలా కనిపించింది. ఇప్పుడు తనతో పాటు ఆ ముక్కలు కూడా శూన్యంలో పరిభ్రమిస్తూ క్రమంగా చంద్రుడి మీదకు రాలిపోతాయని అతడికి తెలుసు. ఆ ముక్కలు తనని ఢీకొనే ప్రమాదం కూడా వుంది.
చంద్రుడికి రెండువేల మైళ్ళ దూరంలో, శూన్యంలో ఒంటరిగా వున్నాడు అతడు. 'నేను జీవితంలో ఏకాకిని. మరణంలో కూడా ఒంటరినే' అనుకున్నాడు విరక్తిగా.
అంతరిక్ష నౌకనుంచి ఎంత వేగంతో తను తను దూకివుంటాడు? గంటకి ఐదుమైళ్ళు???-ఆ వేగం తనని ఎంతసేపు శూన్యంలో ఆపగలదు? తను వేగంగా చంద్రుడికి అవతలవైపు"కి వెళ్ళటాన్ని అతడు గమనించాడు. అప్పుడే ఒక రౌండు పూర్తికావవస్తూందన్నమాట. సూర్యుడు పూర్తిగా మాయమవగానే భూమి మరింత ప్రకాశవంతంగా ప్రతిబింబిస్తూంది. ఆ వెలుగులో అతడు ధరించిన సూటు మిలమిలా మెరుస్తూంది.
అతడు తనచుట్టూ తాను తిరుగుతూ చంద్రుడిచుట్టూ తిరుగుతున్నాడు. ఒకసారి తనచుట్టు తాను తిరగటానికి పది సెకన్లు పడుతూంది అతడికి. దాన్ని ఎక్కువ చేయలేడు. తక్కువ చేయలేడు. అతడి చేతుల్లో ఏమిలేదు. అటు తిరిగిననప్పుడు నక్షత్రాలు, ఇటు తిరిగినప్పుడు చంద్రుడు అతడిని పలకరిస్తున్నారు.