Previous Page Next Page 
ఆపరేషన్ మేడిపండు పేజి 11

    "కానీ -మీరు ఇందాకా అన్నప్పుడు అది లూజ్ టాక్ లా లేదు" అన్నాడు గజపతి అయినా మీకు నమ్మకం  కుదరకపోతే- మీ సుబ్రహ్మణ్యంగారినే అడగండి" అన్నాది నారాయణ.
                                     *    *    *
    రెండు బెడ్రూముల పరిమాణంలో వున్న ఆ డ్రాయింగ్ రూమ్ అందంగాను ఖరీదైనా అలంకారాలతోనూ వుంది.
    ఖరీదైన సోఫాల్లో ఒకరికొకరు ఎదురుగా-గజపతి, సుబ్రహ్మణ్యం.
    "మీరెవరో నేను తెలుసుకోవచ్చా?" అనడిగాడు సుబ్రహ్మణ్యం.
    "సైంటిస్టుని. జర్నలిస్టుని. సిబిఐ ఆఫీసర్ని-ఎవరనైనా అనుకోండి. కానీ నా ప్రశ్నలకు జవాబు చెప్పాలి...." అన్నాడు గజపతి  అధికారయుతంగా.
    సుబ్రహ్మణ్యం నవ్వుతూ-"మీరు సిబిఐ ఆఫీసరనుకుంటాను. అప్పుడేసీరియస్ గా మీ ప్రశ్నలకు జవాబులు చెప్పగలను" అన్నాడు.
    "ప్రొఫెసర్ అజేయ్  కిడ్నాపయ్యారు-తెలుసుకదా మీకు!"
    "సర్ యాబ్సెన్స్ ని ప్రతిక్షణం ఫీలవుతున్నాను" అన్నాడు సుబ్రహ్మణ్యం బాధగా .
    "సుబ్బపురం ఘనవిజయాలందుకు కారణమని అనుమానించాం. కానీ  సుబ్బాపురం వ్యవహారమంతా ఫ్రాడ్  అని ఎప్పుడో  తేలిపోయింది....." అన్నాడు గజపతి.
    సుబ్రహ్మణ్యం  ముందు ఒప్పుకోలేదు. గజపతికి చాలా విషయాలు తెలుసునని గ్రహించేక అతడు అయిష్టంగా తలాడిస్తూ-
    "ఇది ఫ్రాడ్ అని మాత్రం నేనొప్పుకొను" అన్నాడు.
    "ఎందుకని?"
    "ఎన్నికల్లో నెగ్గడానికి బియ్యం కిలోరెండ్రూపాయలన్నారు. ఆ డబ్బు ఇస్తున్నదెవరు? వాగ్దానం చేసిన  రాజకీయ నాయకులా-కాదే! ప్రజల డబ్బునే దారి మళ్లించి ఇస్తున్నారు. అందువల్ల కొందరికి ప్రయోజనం కలుగుతోందికదా-ప్రజా ధనంతో కొందరు ప్రయోజనాన్ని పొందితే నాయకులకే ఫలితం దక్కుతోంది. పేరుప్రతిష్ఠలు వస్తున్నాయి ఇలాంటివి ఒకటా-రెండా?
    1989-90 ఎన్నికల్లో నెగ్గడానికి ఓ నాయకుడు పదివేల రూపాయలగ్రామీణ బ్యాంకుల రుణాలన్నీ మాఫీ చేశాడు. అలా చేసి కొన్నివందల లేక వేళ కోట్ల ప్రభుత్వదాయాన్ని పోగొట్టి తనకు పదవిని  సంపాదించుకున్నాడు. అది ఫ్రాడ్ అన్నారా?
    అలాంటప్పుడు ఇదీ ఫ్రాడ్ కాదు. ప్రజలకు నష్టం కలిగే విధంగా బియ్యాన్నమ్మిన బాకీలు రాద్దుచేసినా తప్పుకాకపోతే నాదీ తప్పు కాదు. సౌరయంత్రాల పేరుతొగ్రాంట్ను వచ్చాయి. ఆ గ్రాంట్సు ప్రజల మేలుకే కదా ఉపయోగించాం! ఊరు ఊరంతా బాగుపడింది. ఆ పేరు నాకు అవార్డులొచ్చాయి. ప్రమోషనోచ్చింది. నేను ప్రజాధనాన్ని డుర్వినియోగం చేయలేదు"
    "కానీ మోసం చేశారు. లేని టెక్నాలజీని వుందన్నారు" అన్నాడు గజపతి
    "ఈ దేశంలో మోసం లేనిదెక్కడ? ఉద్దేశ్యం మంచిదైతే ఫలితం బాగుంటే- తప్పు తప్పు కాదని గీతాకారుడే అన్నాడు" అన్నాడు  సుబ్రహ్మణ్యం.
    "ఆ శ్లోకం ఉదహరించగలరా?" అన్నాడు సుబ్రహ్మణ్యం.
    సుబ్రహ్మణ్యం నవ్వి, "నేను చెప్పింది గీతాసారం" అన్నాడు.
    "అంటే-ఇక్కడా ఫ్రాడే" అన్నాడు గజపతి.
    "ప్రాడ్ అంటే నేను  ఒప్పుకోను...."
   "అయితే మీరింకా ఇది కొనసాగిస్తారా?"
    "మన పల్లెటూళ్లు బాగుపడాలని రాజకీయనాయకుల కంటే  ఎక్కువగా కోరుకుంటున్నవాణ్ణి. క్రమంగా ఒకో ఊరునే  దత్తత చేసుకుంటూ వెళ్లాలని నాకుంది. కానీ  నేను ప్రభుత్వవిధానాలను అనుసరించగలను కానీ శాసించలేనుకదా" అన్నాడు సుబ్రహ్మణ్యం.
    "అంటే?"
    "సౌరశక్తి పేరిట గ్రాంట్స్ రాకపోవచ్చునని  నాకు తెలిసింది...."
    "రాకపోతే ఏంచేస్తారు?"
    "ఏ ప్రాజెక్టుకు గ్రాంట్స్ వస్తే ఆ ప్రాజెక్టు తీసుకుంటాను. బోటనీ కాకుండావుంటే చాలు" అన్నాడు సుబ్రహ్మణ్యం.
    "బోటనీ అయితేనేం?"
    "అది నా ఫీల్డు"
    "మీ ఫీల్డు అయితే మీకు  మరింత సులభం కదా"
    "సమస్య సులభమా, కష్టమా అని కాదు. అంతరాత్మ సమస్య. నా ఫీల్డులో ఈ తరహా ప్రాజెక్టులకు అంతరాత్మ ఏమాత్రం అంగీకరించదు. క్షుణ్ణంగా టెక్నికల్  డిటైల్స్  తెలుసును కాబట్టి!"
    "అంటే మీరు  అంతరాత్మ ఒప్పని పనులే చేస్తానంటారు"
    "వాటికే మన ప్రభుత్వ విధానాల ప్రోత్సాహముంటుంది"
    గజపతి గంభీరంగా, "సుబ్బాపురం వ్యవహారం సిబిఐ దృష్టికి వచ్చింది. మీకు  భయంగా  లేదా?" అన్నాడు.
    "భయమెందుకు- సహేంద్ర తక్షకాయస్వాహా!" అన్నాడు సుబ్రహ్మణ్యం.
    "అంటే?"
    "సుబ్బాపురం వ్యవహారంలో రాజకీయనాయకులెందరో వున్నారు. వాళ్లే నన్ను కాచుకుంటారు. ఆ ధైర్యం నాకుంది. ఒక్కటంటే ఒక్క పైసా మేము స్వాహా చెయ్యలేదు. అందువల్ల ప్రజల మద్దతు మాకుంది. మొత్తం సుబ్బపురం గ్రామం మాకు ఓటేస్తే ఏ రాజకీయం నన్ను కాదంటుంది?"
    గజపతి  మాట మార్చుతూ, "రాజయాలు సుబ్బాపురం వ్యవహారాన్ని ఘన విజయంగా చిత్రిస్తున్నాయి. ఆ ఘనతను  ప్రొఫెసర్ అజేయ్ కిచ్చాయి. అజేయ్ కిడ్నాప్ కావడానికి కారణం అదేనంటారా?" అన్నాడు.
    "అజేయ్ సర్ బహుముఖ ప్రజ్ఞాశాలి అనడంలో సందేహం లేదు. అయితే ఈ ఫీల్డులో ఆయనకంతగా  ఆసక్తిలేదు. ఆసక్తి వుంటే ఏ సబ్జక్టునైనా ఆయన వారంరోజుల్లో మాస్టర్ చేయగలరు. ఆ విషయం అందరికీ తెలుసు. అయితే ఆయనలో గొప్పతనమేమిటంటే-తనకు సంబందించని ఫీల్డులో ఎవరైనా సమర్థతను నిరూపించుకుంటే ఇక అందులో తను జోక్యం చేసుకోరు. అలాంటివారికి పూర్తి స్వేచ్చనిస్తారు"
    "ఆ స్వేచ్చకు ప్రతిఫలంగా ఆయనకూ అయాచితంగా కీర్తి లభిస్తోందేమో"
    "కావచ్చు. కానీ ఆదాయనకేం అవసరంలేదు" అన్నాడు సుబ్రహ్మణ్యం. "ఆయన కిడ్నాప్ కావడానికి అవసరమైన  ప్రాజెక్ట్స్ ఇంకా చాలా వున్నాయి. వాటి గురించి సైంటిస్టు బ్రహ్మానికి ఎక్కువ తెలుసు"
    "మీరు ప్రొఫెసర్ కు మరీ  అంత దగ్గర మనిషి కారా?"
    "ఆయన తన సబ్జక్టువారినే  చేరదీస్తారు. మిగతావారికి స్వేచ్చనిస్తారు"
    గజపతి ముందుకు వంగి-" సైంటిస్టు బ్రహ్మనికి ఆయన కిడ్నాప్  కావడానికి కారణం తెలిసుండోచ్చా?" అన్నాడు.
    అతడీ ప్రశ్నను యథాలాపంగా అడగడంవల్ల వచ్చిన సమాధానానికి ఉలిక్కిపడ్డాడు .
    "ఊఁ" అన్నాడు సుబ్రహ్మణ్యం.
                                                                   *    *    *
    సుబ్బాపురం వ్యవహారం పేపర్లో వచ్చింది.
    దియాలో చెప్పలేనంత సంచనలం.
    సుబ్రహ్మణ్యం సంపాదించి పేరుప్రతిష్ఠలను చూసి అసూయపడుతున్న వారందరికీ హృదయం ఉప్పొంగిపోయింది.
    అయితే అక్కడ సుబ్రహ్మణ్యం అనుచరులేం తక్కువమంది లేరు.
    ఆ ప్రాజెక్టులో నలుగురు రీసెర్చి స్కాలర్లున్నారు. ముగ్గురు  సైంటిస్టులున్నారు.
    డిజైనింగ్ సెక్షన్ కీ, వర్క్ షాపుకీ  చేతినిండా పని వుంటోంది.
    ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీలో కంప్యూటర్ సెక్షన్ ముఖ్యపాత్ర వహిస్తోంది.
    ఇంకా టైపింగ్, అకౌంట్స్ , అడ్మినిస్ట్రేషన్, పర్చేజ్....
    ఒకటా- రెండా-ఒకరా-ఇద్దరా....ఎన్నికలొస్తే ఎన్నికల కమిషన్ కు చేతినిండా వున్నట్లు-ప్రతి ప్రాజెక్టుకూ ప్రాజెక్ట్ కమిషన్ పనిచేస్తూనేవుంటుంది.
    సుబ్రహ్మణ్యం ప్రాజెక్టు పేరుచెప్పి కొందరు ఓవర్ టైమ్ పుచ్చుకుంటే, కొందరుటూర్లకు వెడితే, కొందరు సెమినార్లలో పాల్గొంటే-కొందరు మిగతా పనులు చేస్తూంటే-
    సుబ్రహ్మణ్యం దియాలో పెద్ద టాకింగ్ పాయింట్-స్టార్ అట్రాక్షన్!
    అతణ్ణి స్టార్ లా చూసినా వారందరి ముఖాలూ ఇప్పుడు వ్రేలాడిపోయాయి.
    సుబ్రహ్మణ్యం మాత్రం ఆఫీసులో మామూలుగా తిరుగుతున్నాడు. ఎవరైనా ఏమైనా  అడిగితే "నో కామెంట్స్" అంటున్నాడు.
    అయినా కొందరతణ్ణి విడిచిపెట్టడంలేదు. అప్పుడు "సమస్యంటూ వుంటే అదినాది. ప్రొఫెసర్  మీద  ఈగ  కూడా వాలనివ్వను" అన్నాడు.
    నీ సమస్యను  నువ్వెలా పరుష్కరించుకుంటావంటే-
    "పత్రికలు కాలక్షేపానికి. అందులో వచ్చేవి వార్తలు కాదు. కాలక్షేపం. కాలక్షేపం కబుర్లు సమస్య కాదు" అనేశాడు.
    రాజు మాత్రం సుబ్రహ్మణ్యన్ని కలుసుకోలేదు. అతడు బ్రహ్మంగదిలో వున్నాడు.
                                   *    *    *
    "ఇప్పుడు సుబ్రహ్మణ్యానికేమవుతుంది?" అన్నాడు రాజు.
    "సర్ రావాలి. అంతవరకూ ఏమీ తెలియదు" అన్నాడు బ్రహ్మం.
    "సుబ్రహ్మణ్యం సైన్సు పేరుతో ప్రబుత్వాన్ని మోసం చేశాడని తేలిపోయింది. ఇందులో సర్ పాత్ర వుందని కూడా  తేలిపోయింది" అన్నాడు రాజు.
    "సర్ పాత్ర  వుందా-నీకెవరు చెప్పారు?" అన్నాడు  బ్రహ్మం ఆశ్చర్యంగా.
    "సుబ్రహ్మణ్యాన్ని సర్ ఏయే సందర్భాల్లో ఎలా ఎలా పోగిడారో కూడా పేపరువాళ్లు రాశారు. ఆ పొగడ్తలు వాళ్లిద్దరూ ఒక్కటేనని రుజువుచేస్తాయి."
    "బ్రహ్మం నవ్వి. "సర్ సంగతి నీకు తెలియదు. ఆయన మహామనిషి. నీకు  ధర్మరాజు- దుర్యోధనుడు కథ తెలుసుకదా" అన్నాడు.
    రాజుది చురుకైన బుర్ర. వెంటనే అర్థమైందతడికి.
    ఒకసారి ఎవరో  చెప్పారు- ప్రపంచంలో మంచివాళ్ళదీ జాబితాలు తయారుచేయమని. ధర్మరాజుకు చెడ్డవాళ్లు ఒక్కరు కూడా కనిపించలేదు. దుర్యోధనుడికి మంచివాడొక్కడూ కనపడలేదు.
    "సర్ కి అందరిలోనూ గొప్పతనం కనబడుతుంది. ఆయన శత్రువుల్లో కూడా  గొప్పతనాన్ని అభినందించాగలరు. వేదికమీద కూర్చున్నప్పుడు పచ్చి వ్యభిచారిణినికూడా ఓ మహాసాద్విగా అభివర్ణించడానికి ఏ మాత్రమూ తడబడని వ్యక్తిత్వం ఆయనది...." అన్నాడు బ్రహ్మం.
    ఎందుకో రాజుకు ఒళ్ళు జలదరించింది.
    "సర్ చాలా గొప్పవారు" అన్నాడు అప్రయత్నంగా.
    "ఆయన గొప్పతనం-గొప్పతనం  లేనివాళ్ళని పొగడ్డంలోనే కాదు- గొప్పవాళ్ళను తయారుచేయడంలోకూడా వుంది...." అన్నాడు బ్రహ్మం.
    రాజుప్రశ్నలు వేయలేదు. నిశ్శబ్దంగా అతడు చెప్పేది వింటున్నాడు.
    "ఆపరేషన్ మేడిపండులో మొదటిప్రాజెక్టు విజయం గురించి చెప్పాను. కానీ ఆ ప్రాజెక్టే ఒక మేడిపండని ఇప్పుడు తేలిపోయింది. సుబ్రహ్మణ్యం వంటి మేడిపండును నమ్మడంవల్ల సర్ ప్రతిష్ఠకు భంగం వచ్చింది.
    ఒకవిధంగా సర్ కు ఇది మంచిదే-ఆయన ఎంత మంచివారంటే-ఈ విధంగా  తప్ప సుబ్రహ్మణ్యం  అసలురంగు బయటపడేదికాదు"
    "ఎందుకని?"
    "సర్ చెడు కనరు, అనరు, వినరు. అందుచేత కొంత చెడు  ఆయన హయంలో వర్థిల్లగలుగుతోంది"
    "ఇంతకీ సుబ్రహ్మణ్యం  ప్రాజెక్టు కారణం కాకపోతే సర్ ని ఎవరు ఎందుకు కిడ్నాప్ చేసినట్లు?" అన్నాడు రాజు.
    "ఆపరేషన్ మేడిపండు ఫైల్లో-ప్రథమస్థానాన్ని సర్ సుబ్బాపురం ప్రాజెక్టుకిచ్చాడుగానీ- అందులో ఏదో తిరకాసుందని నాకు అనుమానంగానే వుంది. సుబ్రహ్మణ్యం అంత  నమ్మతగ్గ వ్యక్తి కాదని అంతా అనుకుంటారు. ఆ విషయం ఇప్పుడు  రుజువైపోయింది. నా అనుమానం-గోల్డ్ రేస్ మీద వుంది"
    "అంటే?"
    "గోల్డ్ రేస్ -అంటే స్వర్ణకిరణాలు" అన్నాడు బ్రహ్మం.
    "కాస్త వివరంగా చెబితే కానీ నాకర్థంకాదు" అన్నాడు రాజు.
    "చెబుతాను. ఆపరేషన్ మేడిపండులో రెండోది అదేకదా!"
    రాజు వింటున్నాడు.
    "గోల్డ్ రేస్ ఒక కొత్త తరహ కాంతికిరణాలు. వాటిని ప్రసరించగల దీపాన్ని దియాలో జగన్నాద్ అనే సైంటిస్టు కనిపెట్టాడు. జగన్నాథ్  సుబ్రహ్మణ్యం వంటివాడుకాదు  పెద్దమనిషి. నెమ్మదస్థుడు. నిజాయితీపరుడు. అందువల్ల ఆ పరిశోధనకెంతో విలువుంది. ఆ కిరణాలు బంగారురంగులో వుండడంవల్ల గోల్డ్ రేస్ అన్నారుకానీ వాటికి వున్న  అద్బుత లక్షణాలు  కొన్ని తర్వత తెలిశాయి. వాటిలో ముఖ్యమైనది-బంగారపుకణాల్ని ఒకచోట చేర్చడం. అంటే వాటిని కోలార్  బంగారుగనుల్లో ప్రసరింపజేస్తే కనుకకాసేపట్లో బంగారమంతా ఒకచోటకు చేరుకుంటుంది. వింటున్నావా?" అని ఆగాడు బ్రహ్మం.
    ఖనిజాల నుంచి బంగారాన్ని  తీయడం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని.ఖనిజంటన్నుల్లో వుంటే బంగారం గ్రాముల్లో వుంటుంది. అందులోనూ కోలార్ బంగారంగనులు ఇప్పుడు వట్టిపోయాయి. బంగారపు స్థాయి గ్రాముల నుంచి మిల్లీగ్రాములకు పడిపోయింది.
    కాంతికిరణాలను ప్రసరింపజేయడంద్వారా బంగారాన్నంతా ఒకచోట చేర్చగలిగితే అది బంగారం చరిత్రనే మార్చివేయగలుగుతుంది.
    "నమ్మశక్యంగా లేదు" అన్నాడు రాజు.
    "అది జగన్నాధ్ పరిశోధనా ఫలితం కాకపోతే ఎవరూ నమ్మేవారు కాదు. అతడు లాబొరేటరీలో బంగారపు పొడిని ఇసుకలోనూ, మట్టిలోనూ, ఇనుపొడిలోనూ కలిపి తన కిరణాల సాయంతో  ఇంచుమించు నూటికి నూరుపాళ్ళూ  బంగారాన్ని వేరుచేయగలిగాడు. సర్ థ్రిల్లయిపోయారు. వెంటనే గనులకు ఈ పద్దతిని పాటించాలన్నారు...."
   "పాటించారా?"
    "ఇంకాలేదు-వచ్చిన సమస్య ఏమిటంటే గోల్డ్ రేస్ వల్ల క్యాన్సర్ ప్రమాదముందిట. అందుకని గనుల్లో వీటిని  ప్రసరింపజేయడానికి అనుమతి లభించలేదు"
    "సర్ ఏమంటారు?"
    "ఇది రాజకీయవాదుల  కుట్ర అంటారు. ఈ పరిశోధనను పైకి రానివ్వకూడదని కొందరు ప్రముఖులు ప్రయత్నిస్తున్నారంటారు..."
    " జగన్నాధ్ ఏమంటాడు?"
    "గోల్డ్ రేస్ కనిపెట్టడంలో సర్ హస్తం కూడా వుందంటాడు. లాబొరేటరీ ప్రయోగాల దాకా తను గట్టినమ్మకంతో వున్నాననీ-గనుల విషయం ఇంజనీరుకి సంబంధించినదనీ-అది సర్ చెప్పాలనీ అంటాడు"
    "సర్ ఇంజనీరు కాదుకదా!"
    "ఇంజనీరింగ్  డిగ్రీలతో ముడిపడ్డది కాదనీ-అనుభవానికి సంబంధించినదనీ  అంటారు సర్"
    "అవును-సర్  అనుభవం అంతా ఇంతా కాదు. అయితే ఆయన ఒక పనిచేయాల్సింది. ఈ పరిశోధనా ఫలితాలను ఫారిన్  జర్నల్స్ లో  ప్రకటించవలసింది- అప్పుడు  క్యాన్సర్  గురించిన అసలురంగు బయటపడేది"
    "సర్ ఈ ఫలితాలను బట్టబయలు చేయదల్చుకోలేదు. దీన్ని పేటెంటు చేస్తారట. అయితే  గనుల్లో  ప్రయోగాలయ్యేదాకా  పేటెంటు కూడా చేయ్యరుట...."
    "ఇప్పుడు నాకు అర్థమైంది, గోల్డ్ రేస్ గురించే సర్ కిడ్నాపయ్యారు. అయితే  కిడ్నాపర్స్ తెలివితక్కువవాళ్ళనిపిస్తుంది.  జగన్నాధ్ ని కిడ్నాప్  చెయ్యక సర్ జోలికెందుకు వెళ్ళారో?"  అన్నాడు రాజు.
    " జగన్నాధ్ పేరు ఈ పైల్లో తప్ప ఇంకెక్కడా లేదు. అతడీ ప్రాజెక్టులో వున్నట్లు దియాలో నాలాంటి కొందరికి తప్ప ఎక్కువమందికి తెలియదు. గోల్డ్  రేస్  గురించి సర్ కి ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చింది!" అని ఒక్కక్షణం ఆగి,
    "గోల్డ్ రేస్ ని కొద్దిగా సవరించగల చిన్న ట్రిక్స్ వున్నాయట. అవి సర్ కి  తప్ప తన క్కూడా తెలియవని  జగన్నాధ్ అంటాడు" అన్నాడు బ్రహ్మం.
    "అదెలా సాధ్యం?"
    "సర్ బుర్ర బ్రహ్మాండం.  జగన్నాధ్ డిస్కవరీ యాక్సిడెంటల్"
    రాజు ఆలోచిస్తూ. "మొన్ననే  గనుక నువ్విది నాకు చెప్పివుంటే ఆలోచనక్కూడా ఆస్కారం లేదు. సర్ దగ్గర రీసెర్చికి చేరివుండేవాణ్ణి కాదు. ఆయన బుర్ర చాలా గట్టిది.నన్ను భయపెడుతోంది" అన్నాడు.    "గుడ్ డెసిషన్" అన్నాడు బ్రహ్మం.
    "నేను మొన్నటి సంగతి చెప్పాను. ఈ రోజు సంగతి వేరు"
    "ఎందుకని?"
    "ఆపరేషన్ మేడిపండు కదా-ఆలోచించాల్సిన విషయమే!" నవ్వాడు రాజు.
                                                                     *    *    *
    "నేను మీకు  నచ్చాను కదూ" అందామె.
    "ఈ గది నేనున్నానుకదా" అందామె.
    "అందుకే వుండగల్గుతున్నాను. అంతమాత్రాన గది నచ్చదు"
    "ప్రొఫెసర్ అజేయ్!నాకు మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది"
    "ఎందుకు?"
    "పేపర్లో సుబ్బాపురం వార్త చూశారుకదా"
    "చూశాను. నన్ను విడిచిపెడితే వెంటనే వెళ్ళి ఆ సుబ్రహ్మణ్యాన్ని దిస్మాస్ చేస్తాను అన్నాడు అజేయ్ పళ్ళు పటపట కొరుకుతూ.
    "అతడేం చేసినా మీ ప్రోత్సాహంతోనే కదా"
    "నేను విద్యాధికుల  సచ్చీలతను నమ్ముతాను"
    "అందువల్ల దేశం నష్టపోతే?" అందామె.
    "అమాన దేశం నష్టపోతున్నది అపనమ్మకం వల్లనే. నమ్మకం వల్లకాదు"
    ఆమె నవ్వి, "అయితే  జగన్నాధ్ ని కూడా మీరు నమ్ముతున్నారా?" అంది.
    " జగన్నాధ్ ఎవరు?"
    " జగన్నాధ్-గోల్డ్ రేస్"
    అజేయ్ కంగారుగా "ఇప్పుడతడి ప్రసక్తి ఎందుకు?" అన్నాడు.
    ఆమె తన  బ్లౌజ్ లోకి చేయిపెట్టి ఒక కాగితాన్నతడికందించింది.
    అజేయ్  చూశాడు. అది తాజా దినపత్రిక నుంచి  కటింగ్.
    ఆత్రుతగా చదివేడాయన. చదువుతూంటే భ్రుకటి ముడతలు పడింది.
    గోల్డ్ రేస్ గురించి  జగన్నాధ్ తన అభిప్రాయాన్ని ప్రకటించాడు. అతడు చెప్పిన ప్రకారం వాటినతడు ఏదో ప్రయోగంలో యాక్సిడెంటల్ గా గురించాడు. ఆ తరహ ప్రయోగంలో ఆ తరహా  కాంతికిరణాలను అతడూహించలేదు. అందుకని పుస్తకాలు తిరగేశాడు. ఎక్కడా సమాచారం దొరకలేదు.
     జగన్నాధ్ఉత్సాహం పట్టలేకపోయాడు. అజేయ్ కు విషయం చెప్పాడు.
    ప్రొఫెసర్ అజేయ్ ఆ ప్రయోగాన్ని శ్రద్దగా గమనించాడు. ఆపైన తనూ కొన్ని ప్రయోగాలు చేశాడు. వాటి ఫలితాలు ఆసక్తికరంగా లేవు.
    అజేయ్ కు సెన్సేషనల్ న్యూస్  అంటే ఇష్టం. గోల్డ్ రేస్ కు  బాగా పబ్లిసిటీ  ఇచ్చాడు. అవి ఖనిజాలనుండి బంగారాన్ని వేరుచేస్తాయన్నాడు.
    ప్రయోగశాలలో వుండే పరిస్థితులు వేరు. ఆ పరిస్థితుల్లో గోల్డ్  రేస్ బంగారపు పొడిని ఇతర పదార్థాల నుంచి కొంత వేరుచేసిన మాట నిజం. కానీ అవి ఖనిజాలు నుంచి బంగారాన్ని విడదీయలేవు.
    అజేయ్ ఒప్పుకోలేదు. ఆయన  జగన్నాధ్ కి కొన్ని ప్రయోగాలను  సూచించాడు. వాటి ఫలితాలను తొందరగా చెప్పమన్నాడు.
     జగన్నాధ్ ఏ ప్రయోగం చేసినా శ్రద్దగా చేస్తాడు. అతడు దేనికీ తొందరపడడు. కాస్తసమయం   తీసుకున్నా నిదానంగా చేస్తాడు. ప్రతి ఫలితాన్నీ అంతవరకూ అందుబాటులో వున్న సమాచారాన్ననుసరించి అంచనావేస్తాడు.
    ఏ విషయంలోనైనా  జగన్నాధ్ ఒక నిర్ణయానికి వచ్చాడంటే డానికి తిరుగుండదు కాక వుండదు. ఆ విషయం దియాలో  అందరికీ తెలుసు.
    అజేయ్  జగన్నాధ్ పరిశోధనల కోసం ఆగకుండా గోల్డ్ రేస్ గురించి పెద్దఎత్తున ప్రపంచవ్యాప్తంగా పబ్లిసిటీ ఇచ్చాడు. అది రామర్ పెట్రోలులా గొప్ప సంచలనాన్నే కలిగించింది. ఈ లోగా  జగన్నాధ్ పరిశోధనలు ముగిశాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అవి గనులకూ, ఖనిజాలకూ ఉపయోగపడవని అతడు నిర్ణయించాడు.
    అజేయ్ కు కోపం వచ్చింది. కానీ ఏంచేయాలో తెలియదు.
    ఆయన వెంటనే  రాజకీయ  నాయకులను ఆశ్రయించాడు. రాష్ట్రాల్లో , కేంద్రంలో ఆయనకు  చాలా పలుకుబడి వుంది. అదిప్పుడుపయోగపడింది.
    కోలార్ బంగారం గనుల్లో గోల్డ్ రేస్ ను  పరీక్షించడానికి ప్రభుత్వం ఒప్పుకోలేదు. అందుకు క్యాన్సర  సాకు వచ్చింది.
    తను చేసుకున్న  ఏర్పాటును తనే ప్రతిఘటిస్తున్నాడు ప్రొఫెసర్  అజేయ్ . ఆ విధంగా ఆయనకు పరువు దక్కింది.
    గోల్డ్ రేస్ ను గనుల్లో ప్రయోగించేదాకా పేటెంటు కూడా చేయనంటున్నాడాయన. నిజానికి గోల్డ్ రేస్ లో పేటెంటు చేయాల్సిన ప్రత్యేకత  ఏమీ లేదు. ఆసక్తికరమైన ఆ కొత్త ప్రయోగాన్ని ప్రస్తుతానికి మరుగున వుంచక తప్పలేదు.

 Previous Page Next Page