Previous Page Next Page 
హౌస్ సర్జన్ పేజి 11


    నిద్ర రావటంలేదు గాని, సర్వేంద్రియాలా  శక్తి ఉడిగిపోయినట్లు  అచేతనానవస్థను  కోరుతున్నాయి.

    అట్లా ఓ అరగంట గడిచి వుంటుంది. ఇంతలో బయట  నుంచి 'సార్' అన్న  పిలుపు  వినిపించింది. తల ఎత్తి  చూసేసరికి  తలుపవతల  వర్డుబాయ్ కనిపించాడు, చేతిలో మెమో  పుస్తకంతో.

    అతను సర్జికల్  వార్డు నుంచి  వచ్చాడు. ఎస్. త్రీ. యూనిట్ లో  ఒక పేషెంటు  ఆపరేషన్ చేసిన చోట  నొప్పితో  బాధపడుతున్నాడట మృదులకు  ఆ తారీఖు.

    ఎమర్జన్సీ  ఆపరేషన్ కు  అటెండ్ అయి, అలసిపోయిన శరీరంతో  హాయిగా  నిద్రపోతున్నది ఆమె, ఆమెకు నిద్రాభంగం  కలిగించటం  యిష్టం లేక, ఆ పుస్తకం, సంతకం  పెట్టకుండా, అతనికి  తిరిగి యిచ్చేసి, అయిదు నిముషాల్లో  వస్తున్నానని  చెప్పి, పంపించేశాను.

    ఇటు తిరగ్గానే  మృదుల  నిద్రలో  ఎప్పుడు  కదిలిందో గాని  చెయ్యి పక్కన వున్నదల్లా  తలక్రిందకు వెళ్ళి  పమిట  స్థానం  తప్పింది. నాలో సౌందర్యరాహిత్యం  స్థిరనివాసం  చేస్తూ  వుందని  మృదుల ఎప్పుడూ  ఆక్షేపిస్తూ  వుంటుంది  ఆ క్షణంలో ఆకస్మికంగా  నాలో పొంగిన  భావాలు  ఆమె చదవగలిగితే  ఆ అభిప్రాయాన్ని శాశ్వతంగా  తుడిచివేసుకుని  వుండేది. ఫ్యాన్ గాలికి ముఖంమీదకు  పడుతూన్న  ముంగురులు, తలక్రింద కోమలహస్తం, ప్రక్కకి తొలగిన  పమిట....నిషా కలిగించే కావ్యకన్యలా  వుంది మృదుల. నా ఊపిరి బరువనిపించింది. ఇహ అక్కడ  వుండటం శ్రేయస్కరం  కాదనుకుని  బల్లమీది స్టెతస్కోప్  అందుకుని  గుమ్మం వైపు  కదిలాను. కాని  ఆ స్థితిలో  ఆమె నట్లా  వదలివెళ్ళటం  ధర్మం  కాదనిపించింది. ఒక గొప్పింటివారి పిల్ల....హాస్పటల్ లో  డ్యూటీరూమ్....వళ్ళెరుగని నిద్రావస్థ. నేను వెళ్ళాక  గదిలోకి  మరెవరైనా  అడుగు పెడితే ? వెంటనే  'నేనయితే పర్వాలేదామహా' అనిపించింది. అది సమాధానంలేని సందేహం. ఆమె మంచం   దగ్గిరకు  వెళ్ళి  కొద్దిగా  వొంగి, ఎక్కడ  కళ్ళు  తెరిచి  చూస్తుందోనన్న భయంతో  ముఖంలోకి  చూస్తూ  అతి మృదువుగా ఆమె పమిటను  యథాస్థానంలో  కప్పాను  ఎందుకట్లా  వణికింది  చెయ్యి ? ఆ సమయంలో  ఆమె కళ్ళు  విప్పి  చూస్తే  ఏం జరుగుతుంది ? మరెవరైనా  గదిలోకి  అడుగు పెడితే  అది చూసి  ఏమనుకుంటారు ?

    నేననుకున్నది  నెరవేరాక, గిరుక్కున  వెనుదిరిగి, బయటకు  నడిచి  చీకట్లో  కలిసిపోయాను.

        *    *    *

    ఆ పోవటం  పోవటం  తెల్లారేదాకా  తిరిగి  రావటం  పడలేదు. అటూ యిటూ  తిరుగుతూ  వార్డులమధ్య, రోగుల మధ్య  ఉక్కిరి బిక్కిరై పోయాను. ఒక రోగికి  కడుపునొప్పి. మరొకరికి  గుండె నొప్పి, యింకొకరికి సెలైన్ సరిగ్గా ఫ్లో అవడం లేదు. స్పెషల్ రూమ్ లో ఒక  పేషెంటుకు  నిద్రరావటంలేదు. ఇంకో పేషెంటుకు  వాంతి వచ్చేటట్లు  వికారంగా వుంది....

    అన్నీ చూసుకుని  డ్యూటీరూమ్ లోకి  అడుగు పెడుతూండే  సరికి  తూర్పున తొలిరేఖలు  విచ్చుకున్నాయి.

    గదిలో  మృదుల  అద్దం ముందు  కూర్చుని  జుట్టు  రెండు  చేతుల్తో సవరించుకుంటోంది. నేను రావటం  చూసి  ముఖం  యిటు త్రిప్పి  నవ్వుతూ "దొరగారికి  యిప్పుడయిందా  తీరిక ? రాత్రంతా  జాగారమే" అంది.

    రెండో కుర్చీని  యివతలకు  లాక్కుని  అందులో  కూర్చుంటూ  "అమ్మాయిగారు హంసతూలికా తల్పం  ఎక్కి  పవ్వళిస్తే, బయటే  తిరుగాడుతూ  జాగారం  చెయ్యక  ఏం చేసేది ?" అన్నాను.

    ఆశ్చర్యంగా  ఆమె కన్నులు  వెడల్పయినాయి. "అంటే  నువ్వు రాత్రి వచ్చావన్నమాట, అందుకే  నిన్ను  చూస్తే  కోపంవచ్చింది. మరి లేపలేదేం  నన్ను ?" అంది.

    "అంత  సుఖంగా  నువ్వు  నిద్రపోతూంటే__"

    "పో నువ్వు. జీవితంలో  అమూల్యమైన మూడు  నాలుగు గంటల కాలాన్ని  వృధాచేసేశావు. ఎంచక్కా  కబుర్లు  చెప్పుకొంటూ  కూర్చునే వాళ్ళంకదా."

    "మృదులా ! ఫస్టియర్ నుంచి  యింతవరకూ, ఆరేళ్ళపాటు  క్లాస్ మేట్లుగా గడిపాం. ఎన్నో వందల గంటలు కబుర్లు  చెప్పుకున్నాం, యీ రెండు మూడు గంటలేనా  అమూల్యమైనవి ?"

    "కఠిన శిలవి  కేవలం  మొరటు డాక్టరువి. నీకు అర్ధంకాదులే" అంటూ ఎర్రబడ్డ  తన ముఖాన్ని  ప్రక్కకి  త్రిప్పుకుంది.

    ఓ నిముషమాగి  ఆమెను  శాంతపర్చాలని "మృదులా" అని పిలిచాను.

    "ఊ" అంది ముఖం  త్రిప్పకుండానే.

    "శ్రీ మంతుల బిడ్డవి. నిద్రలేచీ  లేవగానే   కాఫీ త్రాగకపోతే  నీకు తలనొప్పి  యిత్యాదులు రావచ్చు. ముఖం  కడుక్కువస్తే  అలా వెళ్ళి  కాఫీ  త్రాగివద్దాం" అన్నాను.

    ఆమె విసురుగానే  నా వంక  తిరిగి  "ఆ అవశిష్టం  యిందాకనే  పూర్తి చేసుకున్నాను. మీరు కానిస్తే...." అంది.

    ఎందుకో  మృదుల  కోపం  అర్ధంలేనిదైనా  నాకు కోపాన్ని  తెప్పించదు. నవ్వుకుంటూ లేచి  ప్రక్కనే వున్న  బాత్ రూమ్ లో  వాష్ బేసిన్ దగ్గరకు  వెళ్ళి, అయిదు  నిమిషాల్లో  ముఖం  కడుక్కు వచ్చాను. "పద" అన్నాను.

    ఆమె బుద్ధిమంతురాలిలా  లేచివచ్చి  నాతో  నడవసాగింది. ఒక నిముషమన్నా  గడవక ముందే  తన కోపం  మరచిపోయింది.

    "నీ ముఖం  నిద్రలేక  ఎంత  వడిలిపోయిందో  తెలుసా ? కళ్ళు ఎర్రగా  వుండి చూడటానికి  భయమేస్తోంది" అంది  దారిలో.

    "అయితే చూడకు" అన్నాను నవ్వుతూ.

    అలా కబుర్లు  చెప్పుకుంటూ  కాఫీ త్రాగి  తిరిగి వచ్చేసరికి  ఏడయింది. అటెండెన్స్ యివ్వటానికి  కాబోలు, తెల్లటి యూనిఫారం  ధరించి  తాజాగా మెరుస్తూన్న  సిస్టర్లు  సూపరింటెండెంట్  ఆఫీసు దగ్గర గుమిగూడి  వున్నారు. అక్కడి పని పూర్తి చేసుకున్నవారు, వారివారి వార్డులకు  కదిలి  వెళ్ళిపోతున్నారు. నైట్ డ్యూటీ పూర్తిచేసుకున్న సిస్టర్లు, వారి డ్యూటీని కొత్తగా  వచ్చినవారికి  అప్పగించి, వాడిపోయిన  ముఖాలతో  నీరసంగా  నర్సెస్ క్వార్టర్స్ వైపు  నడుస్తున్నారు.
    "మన మింక  వెళ్ళిపోదాం. ఆలస్యమైపోతోంది" అని  గొడవపెడుతున్నది మృదుల. "ఇంకా ఎనిమిది కాలేదు. అంతవరకూ  మన డ్యూటీయే" అంటాను నేను.

    "ఎందుకు  నీకంత  పట్టుదల, ఎనిమిదింటివరకూ  వుండాలని ?"

    "సరిగ్గా ఏడు గంటలా  యాభయి నిముషాలకు  కేసేమైనా  ఎడ్మిట్ అయిందనుకో. అప్పుడు మనం లేకపోతే మాటెవరికి వస్తుంది ? మనకే కదా."            

    "అబ్బబ్బ ! ఈ సత్య హరిశ్చంద్రుడితో చచ్చిపోతున్నాంబాబు అంటూ మృదుల బలవంతం మీద ముళ్ళమీద వున్నట్లు టైము అయేదాకా గడిపింది.

    తర్వాత ఇద్దరం బయటకువచ్చి, చెరో రిక్షా ఎక్కాం. అప్పటికే కొంతమంది హౌస్ సర్జన్లు హాస్పిటల్ కు చేరుకుంటున్నారు.

    మెడికల్ స్టూడెంట్లు మాత్రం వాళ్ళ పోస్టింగ్స్ యింకా మొదలుకానందువల్ల ఎవరూ కనిపించటం లేదు.

    "మనం యివేళ ఎంత ఆలస్యంగా వచ్చినా ఫరవాలేదు నేను గంటలదాకా రాను" అంటూంటే ఆమె రిక్షా కదిలి వెళ్ళిపోయింది.

    "ఇంతకీ ఆమె ఎమర్జన్సీ ఆపరేషన్ గురించి అడగటమే మరిచిపోయాను. ఆ పేషెంటు ఎలా వున్నాడో" అనుకున్నాను, రిక్షా పోతుండగా వెనక్కి జారిగిలబడి.

                                                                *    *    *

    అట్లా పూర్తి అయింది నా తొలిరోజు. మొదటిరోజు డ్యూటీ కాబట్టి యింత విస్తృతంగా రాశాను. అట్లా ప్రతి సంఘటనా, ప్రతి అనుభవమూ చెప్పుకుంటూపోతే అంతు వుండదు, అది ఓ సంఘర్షణ, తపస్సు, ఓ యజ్ఞంలాంటిది.

    విద్యార్ధి దశలో నేను నేర్చుకోలేనివి, నాకు యిదివరకు తెలియనివి ఎన్ని నేర్చుకున్నానని !

    మెడిసన్ ఓ మహాసముద్రం. లోతు తెలియని, అవతలి ఒడ్డు తెలియని మహా సముద్రం. దాని లోతుపాతులు తెలుసుకోకుండా బయట నిలబడి చూస్తే అందులో యీదటం చాలా తేలికనిపిస్తుంది లోనికి దిగామా ఆ ఆరాటానికి అవధులు లేవు. విజ్ఞానంమీద తృష్ణేగాని తృప్తి అనేది లేదు.

    మెడిసిన్ ! మెడిసిన్ !! మెడిసిన్ !!! అవే నా కలలు. అదే నా ఆశాజ్యోతి అదే నా జీవిత పరమావధి.

    వారంర్జుల లోపునే రూమ్ ఖాళీ చేసి క్వార్టర్సులోకి వచ్చి చేరాను. దక్షిణంవైపున మరో పెద్ద కిటికీ వుండేవి. ప్రభాకరం అనే మరో హౌస్ సర్జన్ నా రూమ్ మేట్. నేనెప్పుడూ తూర్పువైపు కిటికీదగ్గరా, అతనెప్పుడూ దక్షిణంవైపు కిటికీదగ్గరా కూర్చునేవాళ్ళం. తూర్పునున్న కిటికీలోంచి హాస్పిటల్ కనిపిస్తూ వుంటుంది. దక్షిణంవైపున్న కిటికీలోంచి నర్సెస్ క్వార్టర్స్, అందులోని ముందు భాగంలోని గదులూ స్పష్టంగా కనిపిస్తూ వుంటాయి.

    వార్డ్ లో పనిచేస్తూంటే గంటలు నిముషాల్లా పరుగిడుతాయి. మొదటి హౌస్ సర్జన్ రౌండ్స్, తర్వాత అసిస్టెంట్ రౌండ్స్, తర్వాత ఏ వొంటి గంటకో చీఫ్ రౌండ్స్.

    చక్రపాణిగారు రౌండ్స్ కి వస్తున్నారంటే వాతావరణంలో గొప్ప సంచలన మేర్పడేది. సిస్టర్స్, స్టాఫ్ అంతా హడలిపోతుండేవారు. ఆయనకు ఏ విషయంలోనూ పట్టుబడకూడదని అతి జాగ్రత్తగా వ్యవహరించేవారు.

    పేషెంటుకి తలనూనె రాశారా లేడా అన్న విషయం దగ్గర్నుంచీ, బెడ్ షీట్ శుభ్రంగా వున్నదా లేదా, వాళ్ళకి సరిగ్గా మందులందుతున్నాయా లేదా, టెంపరేచర్ ఛార్జ్ సరిగ్గా నింపుతున్నారా లేదా, ఆహారం ఏమేమి యిస్తున్నారు అనేవరకూ అన్నీ శ్రద్ధగా గమనిస్తూ వుండేవారు. వాళ్ళ పాపమేమిటో - ఎంత జాగ్రత్తగా వున్నా, ఏదో ఒక తప్పు ఆయన దృష్టిపథంలో పడుతూనే ఉండేది. ఇహ దుయ్యబట్టటం మొదలు పెట్టేవాడు. మొదలు పెట్టాడంటే అవతలి వ్యక్తికి నషాళానికి ఎక్కి కళ్ళనీళ్ళు తిరిగేదాకా వదిలిపెట్టేవాడు కాదు.

    ఒకసారి రౌండ్స్ చేస్తూ చేస్తూ హఠాత్తుగా గుమ్మందగ్గర నిలబడి వున్న ఓ యువతిని స్టాఫ్ కి చూపుతూ, "ఆమె అక్కడ ఎందుకు నిలబడి వుంది" అనడిగాడు. 

 Previous Page Next Page