Previous Page Next Page 
హౌస్ సర్జన్ పేజి 12

 


    స్టాఫ్ కి నెత్తిమీద పిడుగు పడినట్లయి, తికమకపడుతూ "తెలీదండీ" అన్నది.

    "ఎందుకు తెలీదు ? ఆమె అక్కడ నిలబడి ఆతృతగా చూస్తూంటే కారణం తెలుసుకోవాలని మీలో ఒక్కరికీ అనిపించలేదా ?" అంటూ గబగబా ఆ యువతి దగ్గరకు పోయి "ఎందుకమ్మా యిక్కడ నిలబడ్డావు? అని ప్రశ్నించాడు.

    ఆమె భయభయంగా చూస్తూ, "పొద్దున్న మా అమ్మని వార్డులో చేర్పించమని ఓ.పి. లో చెప్పారండీ. కాయితాలు తీసుకొచ్చి, మా అమ్మనక్కడ చెట్టుకింద కూర్చోపెట్టి, చేర్చుకుంటారేమోనని చూస్తున్నాను" అంది.

    "ఎంతసేపటినుంచి నిలబడ్డావు యిక్కడ ?"

    "రెండుగంట లయిందండీ."

    ఆయన స్టాఫ్ వైపు తిరిగాడు. "సంస్కారం అనేది జీన్స్ నుంచి రావాలండీ. తరతరాలుగా రక్తంలో జీర్ణించుకుని వస్తుంటాయి గుణాలు. పొట్టతిప్పలకోసం, నాలుగురాళ్ళు సంపాదించుకుందామని ఉద్యోగంలో చేరిన వాళ్ళకి ఒక్కమాటు మారవు గుణాలు. రెండు గంటలనుండీ ఆమె అక్కడ పడిగాపులు కాస్తుంటే, ఎవరో, ఎందుకోసం నిలబడిందోనని మీకు తట్టకపోవటం నాకేం ఆశ్చర్యంగా లేదు" అన్నాడు.

    స్టాఫ్ కు ముఖం రక్తంలేనట్లు తెల్లగా పాలిపోగా, జవాబు చెప్పలేక మెదలకుండా నిల్చుంది.

    అట్లా వుండేవి ఆయన వ్యాఖ్యానాలు. అసిస్టెంట్స్ తోనైనా సరే హౌస్ సర్జన్లతోనైనా సరే కటువుగా, మొహమాట పడకుండా మాట్లాడేవాడు. డ్యూటీమీద ఆయనకున్న ధ్యాస యింతా అంతా కాదు అవకాశం వచ్చినప్పుడల్లా తన విద్యార్ధిదశలోని అనుభవాలూ, అప్పటి తరంలోని క్రమశిక్షణా, ఉదాహరణంగా తీసుకొచ్చి చెబుతూండేవారు. ఆయన మాటల్లో సత్యమున్న మాట నిజమేగాని, అంతకంటే ఎక్కువగా హేళన ఎత్తిపొడుపూ ధ్వనిస్తూవుండి, ఆయనమీద ఎప్పటికప్పుడు ఏర్పడబోయే,ఆపేక్షను ఎగరగొట్టివేస్తూ వుండేవి.

    అయితే నేనుమాత్రం ఎన్నడూ  ఆయనకు  దొరికిపోలేదు. ఆయన దగ్గర దోషిగా నిలబడేటట్లు ఏ సంఘటనా జరగలేదు.

    డాక్టరుగా వృత్తిధర్మం  నిర్వహించటానికి  ఎంత  ఓర్పు కావాలో, ఎంత ప్రశాంతబుద్ధి అలవరుచుకోవాలో  మొదటి  కొద్దిరోజుల్లోనే  తెలిసి వచ్చింది.

    హాస్పిటల్ వాతావరణం  చాలా విచిత్రమైనది. అది ఓ వింత ప్రపంచంలాంటిది. రకరకాల మనస్తత్వాలు, భిన్నప్రవృత్తులు అక్కడ కనపడుతాయి. ఒక్కోసారి  సహజలోకానికి  దూరంగా, ఏదో  కృత్రిమ ప్రపంచంలో  జీవిస్తున్నట్లు  వుంటుంది, ఒక్కోసారి  యిదే  నిజం, యిదే సత్యం, సృష్టికి మొదలూ  తుదీకూడా యిక్కడే  అనిపించి తెలియని గర్వం కూడా ఆవహిస్తూ వుండేది.

    మొదట్లో  అక్కడి  పనిచేసే ప్రతిడాక్టరూ, ప్రతి సిస్టరూ  చాలా కృత్రిమంగా, ఒక్కొక్కరూ మేనరిజమ్ తో  కనిపించేవారు. వాళ్ళ పెదవుల మీద మెరిసే  చిరునవ్వులకుగాని, ఒకళ్ళమీద ఒకరు  విసురుకునే  పరాచికాలకుగాని ఒక అర్ధమూ, అందులో లోతూ  కనిపించేది కారు. అంతా ఒక సూత్రప్రకారం, ఏదో నియమాలు అమలులో  వున్నట్లు  జరుగుతూవుండేవి  కాని రానురానూ  ఆ వాతావరణానికి  నేను అలవాటు పడిపోతూ, అందులో యిమిడిపోసాగాను.

    అంతవరకూ  విద్యార్ధిగా వుండి  హౌస్ సర్జన్ గా మారిన  మనిషి యీ మార్పును అన్ని రకాలా  ఉపయోగించుకోవాలన్న  ఆరాటం  కనబరిచేవాడు. పేషెంటుముందు  తన  హౌసునంతా  ప్రదర్శించేవాడు పేషెంటు ఏదన్నా గ్రుచ్చి గ్రుచ్చి అడిగితే  "నీకు తెలుసంటావా ? నాకు  తెలుసంటావా ?" అని వాళ్ళను  దబాయిస్తూ  వుండేవాడు.

    విద్యార్ధిదశలో  సిస్టర్స్ తో  కబుర్లాడటానికీ ,కాలక్షేపం  చెయ్యటానికి  వాళ్ళకు  కుదిరేది కాదు. అధవా  ఎప్పుడైనా  కల్పించుకొని  మాట్లాడినా, సిస్టర్స్ పెడసరంగా  సమాధానంచెప్పేవారు. ఏ స్టూడెంటయినా  "సిస్టర్ ! బి.పి. ఆపరేటస్  కావాలండీ" అని అడిగితే  "పోయి  తెచ్చుకోండి" అని నిర్మొహమాటంగా సమాధానం చెప్పేవాడు. గైనకాలజీ  కేరల్స్ కు ముందు  యిన్ స్ట్రుమెంట్స్  చూసుకుందామని  ఫైనలియర్ లో  మేము నాలుగురంవిద్యార్ధులం  లేబర్ రూమ్ లోకి  వెళ్ళబోతే  "లోపల  డెలివరీ కేసు  వుంది. వెళ్ళటానికి  వీల్లేదు" అని ఓ సిస్టర్ అటకాయించేసరికి, పెద్ద  గొడవకూడా జరిగిందోసారి.

    విద్యార్ధి  దశ నుంచి  హౌస్ సర్జన్  దశకు  వచ్చేసరికి, అమాంతంగా ఒకరికొకరు  ఎంతో చేరువై  పోతారు. అంతేకాదు, స్టూడెంట్లను  గురించి  అతనలాంటివాడినీ, ఇతనిలాంటివాడనీ  వ్యాఖ్యానాలు  చేసి నవ్వడం.

    డ్యూటీ సమయంలో  రాత్రుళ్ళు  వార్డుల  ముందు నుంచి  నడిచి పోతూంటే  ఎన్నో ఆశక్తి దాయకమైన  దృశ్యాలు కనిపిస్తూ  వుండేవి. ఒక చోట  ఒక హౌస్ సర్జనూ, సిస్టరూ  వేరు శెనక్కాయలు  తింటూ  కబుర్లు చెప్పుకుంటూ  నవ్వులూ, కేరింతలతో  కనిపించేవారు. ఒక్కోసారి  పరాచిశాలు పరాకాష్ఠ నందుకుని  ఒకరి  బుగ్గలమీద మరొకరు  చిటికెలు  వేసుకోవటం  వీపు మీద  చిన్న దెబ్బ  వేయటం  యిత్యాది దృశ్యాలు కూడా  కళ్ళబడుతూ  వుండేవి. ఒకసారి  అర్దోపిడిక్  వార్డులో  యిద్దరు  హౌస్ సర్జన్లు  కూర్చుని  ఆనందిస్తూ  వుండగా  ఒక సిస్టర్ సినిమా పాటలు  పాడి వినిపిస్తోంది.
    ఈ వాతావరణం  అర్ధంగాక  మొదట్లో  చాలా తికమక పడుతూండేవాణ్ణి.

    జగన్నాధం  కాంటీన్ లో  కూర్చుని, తరచు  బహిరంగంగా  యీ ప్రసంగాలే  చేస్తూండేవాడు. ఏ యే వార్డులలో  ఏ యే సిస్టర్ పనిచేస్తోందో, పేర్లతో సహా అతనికి  కంఠతావచ్చు. ఎవరు ఎవరెవరికోసం  తాపత్రయపడుతున్నారో, ఆ జాబితా అంతా  ఏకరుపు  పెట్టేవాడు. ఏమాత్రం తీరిక చిక్కినా "రౌండ్సుకి వెళ్ళాలి" అంటూ  హడావుడి  పడుతూ, నాలుగు వార్డులా  కలయ తిరిగి, అక్కడ  పోస్టు అయిన నర్సులను  పలకరించి, కాసేపు వారితో  ముచ్చటలాడి  వచ్చేవాడు.

    నా రూమ్ మేట్ ప్రభాకరం  చాలా  గుట్టయిన  మనిషి. జగన్నాధంలా  పైకి  బడబడలాడేవాడు కాదు. తన స్వవిషయాలలోకి  ఎవరికీ  చోటు దొరకనిచ్చేవాడు కాదు. ఒంటరిగా  నిరంతరం తన ప్రయత్నాల్లో  మునిగివుండేవాడు. అతనసాధ్యుడని, జీవితాన్ని  బ్రహ్మాండంగా  అనుభవిస్తున్నాడనీ  నలుగురూ  చెప్పుకునేవారు కూడా.

    ఒకసారి  నళిని  "మీ జగన్నాధం పచ్చి రౌడీ" అన్నది.

    నవ్వి ఊరుకున్నాను.

    "అందరితో  ఒకేలా  ఎంతో  చనువున్నట్లు  మాట్లాడతాడు. మా క్వార్టర్స్ లో  అతన్ని  గురించి  రకరకాల  కథలు  చెప్పుకుంటారు" అంది.

    "మీ సిస్టర్స్ కు  వేరే  పని లేదా, మా  గురించి  చెప్పుకొనటం  తప్పితే" అన్నాను.

    ఆమెకు  రోషం  వచ్చింది. "మమ్మల్ని  గురించి  అతను  చులకనగా  మాట్లాడకండీ  కాలక్షేపం కోసం  అనేక  విషయాలు  మాట్లాడుకుంటాం. అందులో  యిది  ఒకటి" అన్నది పౌరుషంగా.

    "అనేక విషయాలు  మాట్లాడుకుంటారా ? అయితే  మంచిదే" అన్నాను ముక్తసరిగా.

    "మీ పేషెంటు వచ్చిందండి  డాక్టరుగారూ! మీరు స్వయంగా  పరీక్ష చేయాలిట" అనేది తరచు నళిని  ఆట పట్టిస్తున్నట్లు.

    ఆమె అనటం  తేజోమయి  గురించి. ఆమె సాధారణంగా  రిపీట్ ఓ.పి. కి వస్తూ వుండేది .వచ్చినప్పుడల్లా  వంట్లో  ఏదో బాధ చెప్పి  పరీక్ష చెయ్యమని  అడిగే మాట కూడా నిజమే.

    "పాపం, ఆ అమ్మాయి కెప్పుడూ  వంట్లో  బాగుండదు" అనేవాణ్ని, గంభీరంగా ఏమీ అర్ధం చేసుకోనట్లు.

    "అంతే కాదు లెండి. మీరంటే  చాలా గురి  అనుకుంటాను. మీ హస్తవాసి  మంచిదని  నమ్మకమేమో !"

    "అలా అనుకుంటే  మనం చీట్లు  రాయటమేగాని  మందిచ్చేది  లేదుగా" అనేవాణ్ని.

    నాయుడుగారు  చెడ్డ  విసుగు  మనిషి ఓ.పి. కి వచ్చాడంటే  గబగబ ఓ గంటలో  యిరవై మందిని  చూసేసి  అలా బయటకు  వెళ్ళిపోయేవాడు, హడావుడిగా. ఓ అరగంట పోయాక వచ్చి  "ఇంకా  అయిపోలేదా డాక్టరుగారూ !" అంటూ మళ్ళీ  కుర్చీలో, మరో యిరవైమంది వరకూ చూసేసేవాడు. తర్వాత పేషెంట్లు  అయిపోతే సరేసరి, లేకపోతే వీళ్ళని మీరు చూసి  పంపించెయ్యండి  డాక్టరుగారూ ! నేను వార్డుకి  వెడుతున్నాను. పని పూర్తి చేసుకుని  మీరూ  వచ్చెయ్యండి" అని చెప్పి వెళ్ళిపోయేవాడు.

    ఆయన  డ్యూటీ  వస్తే సిస్టర్సు  హడలిపోతూ  వుండేవారు. ఆయన అడిగిందానికి  సరైన సమాధానం  చెప్పలేకపోయినా, ఏదయినా  వస్తువు ఇవ్వమని  అడిగినప్పుడు  ఒక నిమిషం  ఆలస్యమైనా  చికాకుతో  వాళ్ళమీద  విరుచుకు పోయేవాడు.
    నేను  మెడికల్  వార్డులో  వున్నంతకాలమూ  మృదులకూ  నాకూ  కలిసే డ్యూటీలు పడుతుండేవి.

    "డ్యూటీ  అంటే నీకు పరమానందం. ఇహ  అన్నమూ, నీళ్ళూ అక్కర్లేదు. నేనెంత విసుగు మనిషినైనా, నాకూ  పరమానందంగానే వుంది. ఎందుకో  చెప్పుకో" అనేది  మృదుల.

    నేను అర్ధం కానట్లు  ముఖం పెట్టి  "ఏమో నాకు తెలియదు" అని జవాబిచ్చేవాణ్ని.

    ఒకరోజు  నాయుడుగారు, నేను డ్యూటీలో  వున్నాం. ఐసోలేషన్ వార్డు నుంచి మెమో వచ్చింది. మొదట నేను వెళ్ళి  చూసేసరికి_ మూడేళ్ళ పిల్లవాడు, డిప్తీరియా  వొచ్చి  ఊపిరందక  తలక్రిందులై  పోతున్నాడు. టంగ్ డిప్రెసార్ తో  గొంతు  చూసేసరికి  నల్లటి  మెంబ్రేన్  భయంకరంగా కనిపించింది. ఏం చెయ్యటానికి  నాకు వెంటనే  పాలుపోక, అసిస్టెంటుకి మెమో  రాశాను. ఆయన వచ్చేసరికి  ఓ పావుగంట అయింది. కేసు చూసి, "మొదట యాంటీడిప్తీరిటిక్ సీరమ్ యిచ్చెయ్యండి. ఓ గంట లోపల  ట్రేకి యాటమీ చెయ్యకపోతే  పిల్లాడు  సర్ వైవ్ అవడు. ఇది   ఇ.ఎన్.టి. కేసు. నేనిప్పుడే  ఇ.ఎన్.టీ. అసిస్టెంట్ కి  మెమో  రాస్తున్నాను. ఆయన  వచ్చి ట్రేకియాటమీ చేస్తాడు" అని, అప్పటికప్పుడు  మెమో  రాసి  వార్డు  బాయ్ కిచ్చి  సైకిలుమీద  ఇ.ఎన్.టి. అసిస్టెంట్ ఇంటికి  పంపించాడు. తర్వాత "మీరు జాగ్రత్తగా  చూస్తూ వుండండి  డాక్టరుగారూ! నేను మళ్ళీ  కాసేపట్లో  వస్తాను" అంటూ వెళ్ళిపోయాడు.

 Previous Page Next Page