ఇంతలో మరో సంఘటన. కొడితే మళ్లీ లేవకుండా కొట్టాలనే సూత్రాన్ని వంట పట్టించుకున్నట్లున్నాడు సుధీర్. ఈ సారి చాలా స్పష్టంగా అర్థమైంది కార్తీక్ కి.
ఏ కారణం లేకుండానే సుధీర్ తన మీద కక్ష పెంచుకున్నాడని తనకి బాగా తెలిసొచ్చేలా చేసిన సంఘటన అది.
ఎంఫిల్ పూర్తి చేసి ఓటమి కి, డిప్రెషన్ కి సంబంధించిన సబ్జెక్ట్ మీద పి హెచ్ డి చేస్తున్న రోజులు అవి. థీసిస్ ఆ రోజే సబ్మిట్ చేసి ఇంటికొచ్చాడు. రోడ్డు మీద ఎవరినో కనపడగానే తనతని మీద దాడి చేశాడని, ఆ వ్యక్తి చనిపోయాడని పోలీసులు పట్టుకెళ్ళారు. మధ్యలో ఏమైందో ఏమో తనని రకరకాల పరీక్షలకు గురి చేసి తన మానసిక పరిస్థితి బాగా లేదని మెంటల్ హాస్పిటల్ లో పడేశారు.
ఆ టైమ్ లో సుధీర్ వచ్చి కలిశాడు.
"నేను నీకు సహాయం చేయట్లేదని అనుకుంటారు అందరూ. జైల్ శిక్ష కనీసం పదమూడు ఏళ్లు పడేది. అది తప్పించటానికే ఇలా పిచ్చని మేనేజ్ చేయాల్సివచ్చింది. ఇందుకు ఎంత కష్టపడ్డానో తెలుసా?" చెప్తున్నాడు సుధీర్.
నవ్వొచ్చింది తనకి.
అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడే ఉంటే అతడిని కొడతానేమో అని తన మీద తనకే అనుమానం కలిగింది.
ఇక ఆ హాస్పిటల్ లో పిచ్చి వాళ్ళ మధ్యన, డాక్టర్స్ ఇచ్చే నానా రకాల ట్రీట్మెంట్ లతో మానసికంగా, శారీరకంగా చాలా బలహీనంగా పడిపోయాడు.
పీ హెచ్ డీ కి సంబంధించిన సబ్జెక్ట్ మీద చేసిన పరిశోధన లో శారీరక ఆరోగ్యం మనసు మీద, మానసిక కుంగుబాటు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది అనే విషయం కొంత మేరకు తెలిసినా ఇంత ప్రభావం ఉంటుంది అని మాత్రం హాస్పిటల్ లో ప్రాక్టికల్ గా తెల్సుకున్నాడు.
అదే సమయంలో తల్లి, తర్వాత తండ్రి ఆరు నెలల తేడా తో చనిపోయారు.
తనకి జరుగుతున్న అన్యాయం గురించిన మనో వేదన తోనే పోయుంటారు. తనకి డాక్టరేట్ వచ్చిందని అంతకు ముందొక రోజు వచ్చి చెప్పారు వాళ్ళు.
ఆ రోజు తండ్రి అన్నాడు.
"నువ్వు చేసిన థీసిస్ ఏమిటి? ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి ఏమిటి? ఎటువంటి కష్టాల్లో అయినా నీ మీద నువ్వు నమ్మకం కోల్పోకూడదు. అన్నీ బాగున్నప్పుడు అందరూ ఆత్మ విశ్వాసంతో ఉంటారు. ఏదైనా తేడా వచ్చినప్పుడే నువ్వేమిటో నిరూపించుకోవాలి. నీ చుట్టూ పెద్ద కుట్ర ఉందని తెలుసు. అందులో పాత్ర నీ అన్నదేననీ తెలుసు. ఏమీ చేయలేక, నిన్నిలా చూడలేక, ఎంత తల్లడిల్లిపోతున్నామో నీకు తెలీదు. ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితులోనైనా ధైర్యం గా ఉండరా! నువ్వు ఉన్న చోటే, నీ చుట్టూ ఉన్న వాళ్ళతోనే స్నేహం చేయి. వాళ్ళకి ఏదైనా అవసరం అయితే సహాయం చేయి. సంతోషంగా ఉండు!
వాడి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటే వాడి లాగే నువ్వూ తయారయినట్లు! పగలు, ప్రతీకారాలు మంచి చెయ్యవు. మా కోసం నువ్వు నీ లాగే ఉండు."
అదే ఆఖరి సారి వాళ్ళని చూడటం.
***
ఒక్కసారి మనసంతా విషాదంగా అయిపోయింది. దిగులు కమ్ముకున్నట్లుగా, ఏదో బెంగ గా అనిపించింది.
బలవంతంగా ఆ పరిస్థితి నుంచి బయటికి వచ్చి పక్కకు చూసేసరికి తనకి దగ్గరగా జరిగి నోరు తెరుచుకుని తననే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు విష్ణు.
నవ్వొచ్చింది...కవల పిల్లలు, ఒకేలా కనపడే అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు కనపడితే చాలా మంది ఇలాగే ప్రపంచ వింత ని చూసినట్లు ప్రవర్తిస్తారు.
"భలే తమాషా గా ఉన్నాడే సుధీర్ పీఏ!" అన్నాడు కార్తీక్.
"మా సార్ కి మీరు తమ్ముడైతే మీరెందుకు ఇన్నాళ్లూ ఇంటికి రాలేదు?" అడిగాడు విష్ణు.
అతనికి అంతా గందరగోళం గా ఉంది.
"ఈ డబ్బున్న వాళ్ల లీల లే వేరు" అనుకున్నాడు.
ఏం చెప్పాలో తోచలేదు కార్తీక్ కీ, బృంద కీ.
గభాల్న మాట మార్చేశాడు కార్తీక్.
"చెప్పు బృందా! ఏం చేయాలనుకుంటున్నావు?"
మళ్లీ తనే అన్నాడు.
"అన్నయ్య పదవి వదులుకుని ఎక్కడికీ వెళ్లడు. వాడి సంగతి మనకు తెలుసు కదా. ఏదో కొన్నాళ్ళు తెలీకుండా మేనేజ్ చేయండి. వచ్చేస్తాడులే."
"నీ సహాయం కోసం వచ్చాను" అంది బృంద.
"నా సహాయమా?" వింతగా అనిపించింది అతనికి.
"నేనేం చేయగలను? ఏదో మారుమూల ప్రాంతంలో నా చిన్న ప్రపంచంలో గడుపుతున్నాను."
"కొన్నాళ్ళ పాటు నువ్వు..." ఒక్క క్షణం తటపటాయించి అడిగేసింది "సుధీర్ లా నటించగలవా?"
"ఏంటి?" నిటారుగా అయ్యాడు కార్తీక్.
ఆవేశం తన్నుకొచ్చింది అతనికి.
"ఏం అడుగుతున్నావు తెలుసా?
అది ఎంత పెద్ద క్రైమ్ అవుతుందో తెలుసా? తర్వాత నన్ను నీ భర్తే ఆ నేరం మోపి జైల్ లో తోయించుతాడు."
"బృందా, సుధీర్ మీద నాకే రోజూ గొప్ప అభిప్రాయం లేదు, ఆశలు అంత కన్నా లేవు. కానీ నిన్ను మాత్రం గొప్పగా ఊహించుకుంటాను. నువ్వు కూడా ఇంత స్వార్థంగా అడుగుతావనుకోలేదు." అన్నాడు మళ్లీ.
"పదవులు లేకపోతే బ్రతకలేరా? మీ పదవులు, గొప్పలు నిలబెట్టుకోవటం కోసం మా లాంటి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవాలా? " కోపం ఆగట్లేదు అతనికి.
"సారీ కార్తీక్, నాకేం చేయాలో తోచక నీ దగ్గరకు వచ్చాను. పదవి పోయిన మరుక్షణం అంతకు ముందు అతను చేసిన ప్రతి తప్పుడు పనికి అతణ్ణి దోషిగా నిలబెడతారు. మొత్తం మన కుటుంబాల పరువులు పోతాయని భయం తో వచ్చాను. తప్పుగా అర్థం చేసుకోకు." అంది బృంద.
"బృందా, నువ్వంటే వాడికి ఇష్టం కదా. నువ్వు చెప్పి ఉంటే వాడు వినేవాడు కాదా? తప్పులు చేయకుండా సరిదిద్దే భాద్యత నీకు లేదా?" అన్నాడు కార్తీక్.
నవ్వి లేచింది బృంద.
"వెళ్ళొస్తా కార్తీక్"
తల ఊపాడు అతను.
విష్ణు బృంద ని అనుసరిస్తూ ఇంకా వెనకకి తిరిగి తననే చూస్తున్నాడు. అతనికి తనే సుధీర్ అయ్యుంటాడని ఇంకా మనసులో అనుమానం ఉన్నట్లుగా ఉంది.
నవ్వుకున్నాడు కార్తీక్.
***
ఆ సాయంత్రానికి ముఖ్యమంత్రి కనపడట్లేదు అన్న వార్త సోషల్ మీడియా లో వైరల్ అవటం మొదలెట్టింది.
------*------