తన గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటూనే వుంది. మోహన్రావ్ ఇంత పబ్లిగ్గా తన ఎదురుగ్గానే ఆమెతో మాట్లాడటం , ప్రోగ్రాం ఫిక్స్ చేసుకోవటం చూస్తుంటే పరమశృంగారచక్ర బిరుదివ్వవచ్చేమో!
"ఇంకేంటి విశేషాలు?" తనవంకే చూసి నవ్వుతున్నాడు.
కొంపదీసి తను శ్రీదేవి పంపిన డిటెక్టివ్ అన్న విషయం తెలీలేదు కదా?
"ఏముంటావ్? ఏమీ లేవు ....."
"ఎలా వుందా ఫిగర్?"
"ఎవరు?"
"తెలీనట్లు భక్త మార్కండేయ ఫోజెట్టకు ........అదే ........ఆ మూడో ఇంటి కేస్ "
"ఆవిడా? ఆవిడకేం బాగానే వుంది."
"సాయంత్రం యిద్దరం సినిమా కెళుతున్నాం ?"
"ఏ పిక్చరుకి?"
"ఏదయితే నీకెందుకులే గానీ నీకేంతివ్వాలి?"
ఊపిరి సలపటం లేదు.
"ఎమిటేంతివ్వాలి ?"
"అదిగో --- మళ్ళీ భక్త అంబరీష ఫోజు ! అదే మనకు నచ్చదు..... చీరాలలో కూడా ఇలాగే నన్ను కనిపెట్టమని ఓ డిటెక్టివ్ ని పెట్టింది . వాడికి రోజుకి పది కొట్టి మానేజ్ చేసేవాడిని! నీ సంగతేంటో చెప్పు ! అవతల నాకు ఆఫీస్ టైమవుతోంది."
ఇంక దుప్పట్లో దొంగాట అనవసరం!
రెండు వేపులా గుంజటం సరదాగానే వుంటుంది. అదేం కొత్త పద్దతి కూడా కాదు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో కొంతమందికి అదే వృత్తి.
అయినా గాని ఓ ప్రయత్నం చేయటంలో తప్పేం లేదు.
"మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్ధం కావటం లేదు.
"చీరాల కుర్రాడు కూడా అచ్చం ఇలానే అన్నాడు ముందు!"
ఇంక లాభం లేదు తెగించేయడమే-
"రోజుకి అయిదు "
'చాలా ఎక్కువ! చీరాల కుర్రాడికి రోజుకి పది చొప్పున నెలకు నాలుగు రోజులే ఇచ్చేవాడిని --"
"అప్పటికీ ఇప్పటికీ ధరలు ఎంత పెరిగాయో చూడండి! పోనీ నెలకు యాభై ఫిక్స్ చేసుకుందామా?"
"సరే! కానీ ! మా ఆవిడకు మాత్రం మంచి రిపోర్ట్ లు యిస్తుండాలి!"
అతను వవెళ్ళిపోయాడు.
"ఫర్లేదు! వ్యాపారం అభివృద్ధి చెందుతోంది.
మాయా అపార్ట్ మెంట్స్ లో శ్రీదేవి టెర్రెస్ మీద నిలబడి కసిగా ఎదురుచూస్తోంది.
"ఏమైంది? దొరికారా?"
"ఇంకా లేదండీ! ఆమె బస్ స్టాఫ్ కి చేరుకుంటుండగానే బస్ వచ్చేసింది. బస్సులో వెళ్ళిపోయింది!"
"మరి ఈ మనిషి?"
"ఈ మనిషి కూడా బస్స్క్కడానికి ట్రై చేశాడు గాని నేను అడ్డు పడి ఆ రష్ లో ఎక్కనీయకుండా మానేజ్ చేసేశాను ......."
ఆమె ముఖంలో సంతృప్తి కనిపించింది.
"మంచిపని చేశావ్! రేపు కూడా వెంబడించు! సంగతేమిటో తెలిసే వరకూ వదలకు!"
"భలేవారే! మీకు తెలీదు గానీ నాదసలే ఉడుముపట్టని అందరూ అంటుంటారు."
ఆమె లిప్టులో వెళ్ళిపోయింది.
వాటర్ టాంక్ కింద దూరి సూట్ కేస్ లో నుంచి ఫైల్ చూశాడు.
ఆ రోజు ఒక్క ఇంటర్ వ్యూ కూడా లేదు.
అంటే ఈరోజు తనకి 'వీక్లీ' ఆఫ్....."
కనుక ఇంటివేట జరపాలి! టెర్రస్ మీద వాటర్ టాంక్ కింద కాపురం వుంటానికి తనకు శ్రీదేవి కేవలం మూడు నెలలు గడువు మాత్రం ఇచ్చింది. ఈలోగా ఎక్కడో చోట గది వెతుక్కుని వెళ్ళి పోవాలి.
బయట బుక్ స్టాల్ దగ్గర స్కూలు పిల్లలు గుమిగూడి వారపత్రికల మీదున్న సెక్సీ బొమ్మలు చూస్తున్నారు.
ఆ షాప్ ఓనర్ జగదాంబ పిల్లలను కసిరికొడుతుంది.
"ఆ పుస్తకాలు మీకోసం కాదు! పొండిక్కడి నుంచి!"
"మేమెందుకు చూడకూడదు?" ఓ కుర్రాడు కొంచెం ఫ్యూచర్ రౌడీ కమ్ రాజకీయనాయకుడి ఫోజులో అడిగాడు.
"వాటిలో 'బూతు' ఉంటుంది! చూస్తె చెడిపోతారు !"
"మరి నువ్వు అన్ని పుస్తాకాలు చూస్తుంటావుగా! నువ్ చేడిపోయావా ?"
జగదాంబకు వళ్ళు మండిపోయింది. ఆ పక్కనే వున్న కర్ర తీసుకుని వెంటపడేసరికి వాళ్ళు పారిపోయారు. సురేష్ ఎదురుగా వచ్చేసరికి ఆమె సిగ్గుపడింది.
"ఇంకా ఉద్యోగం దొరకలేదా?" పైట సరిజేసుకుంటూ అడిగింది.
"లేదు! ఎప్పటికయినా మీకిందే ఉద్యోగం చేయాల్సి వస్తుందేమో!"
"ఈ షాపు మీదోచ్చేది నాకే చాలదు! ఇంక నువ్వేం చేస్తావ్?"
"పోనీ మీ నాలుగో మొగుడు వేకెన్సీ వస్తే ......ఆ పోస్ట్ అయినా నాకే ఇస్తానని ప్రామిస్ చేయండి."
'థూ! పాడు! నీకేందిల్లగీ గున్నదా? కోపంగా అంది." ఏవళయినా అశుభం మాట్లాడతారా?"
"నేనేం తప్పు మాట్లాడానా? మొదటి మొగుడు మీ పెళ్ళయిన మూడు నెలల్లో బాల్చీ తన్నేశాడు. రెండోవాడు ఆరునెలల్లో సన్యాసుల్లో కలిసిపోయాడు. మూడో వాడు ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోతున్నాడు. గనుక నాలుగో వేకెన్సీ రావటానికి ఏంతో కాలం పట్టదు ."
ఆమె నవ్వేస్తోంది.
'థూ! నీ మాటలన్నీ ఇట్టనే ఉంటాయ్.....అయినా గానీ నీకేం ఖర్మ? పెద్ద ఉద్యోగం వస్తుంది .....గొప్పింటి పిల్లనే జేసుకుంటావ్! నా వంక కూడా సూడవప్పుడు !"
సురేష్ ఆమె మాటలు వినిపించుకోవడం లేదు. చకచక అన్ని న్యూస్ పేపర్లూ ఓసారి తిరగేస్తున్నాడు.
పైకలా అంటుంది గానీ తనలా చిల్లరగా మాట్లాడటమే జగదాంబకు ఇష్టం.
అలా మాట్లాడటం వల్లే తను న్యూస్ పేపర్ కొనే పనిలేకుండా వాంటెడ్ కాలమ్స్ చూసుకో గలుగుతున్నాడు.
ఎంప్లాయ్ మెంట్ క,మ్ మారేజ్ కమ్ హోస్ కమ్ షేర్ బ్రోకర్ చుట్టూ చాలామంది కూర్చుని వున్నారు.
"మంగితా ఎలక్ట్రానిక్స్ షేర్స్ ఎన్ని దొరుకుతే అన్ని కొనేయండి! రెండు నెలల్లో వంద రూపాయలు దాటిపోతుంది."
"నారాయణ్ గూడాలో టూ బెడ్ రూం ఇల్లుంది. పదహారొందలు చూసి రండి! ఇదిగో అడ్రస్....."
"మీ అబ్బాయికి రెండు లక్షల కట్నం దొరికే సంబంధాలు కావాలన్నారు కదా! ఇదిగో ! తీసుకోండి" అందరినీ చకచకా డిస్ పోజ్ చేసేస్తున్నాడతను.
సురేష్ ని చూడగానే గుర్తుపట్టాడు.
"ఓ! మీరా? ఇదిగో అడ్రస్! బెస్టా ఫ్ లక్...."
సురేష్ ఆశ్చర్యపోయాడు.
తను కనీసం ఏదయినా పార్ట్ టైం ఉద్యోగం చూపించమని రెండు రోజుల క్రితమే అతనికి యాభయి రూపాయల ఫీజు కట్టాడు.
ఖచ్చితంగా రెండో రోజు వచ్చేసరికి అతను అడ్రస్ ఇచ్చేడు. చాలా గొప్ప ఎచీవ్ మెంట్ అనిపించింది.