Previous Page Next Page 
మరో ముందడుగు పేజి 11

 

    ప్రభాకర్ తండ్రి స్వాతంత్ర్యోద్యమ వీరుడు. గాంధీ గారి శిష్యుడు. ఆనాటి మేటి నాయకులతో సమంగా కార్యరంగంలోకి దుమికి ప్రఖ్యాతి పొందినవాడు. ప్రభాకర్ పదిహేనేళ్ళ వయసులో ఉండగా భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించారు. ప్రభాకర్ తండ్రి ఆదర్శవాది మాత్రమే కాక, కార్యవాది కూడా కావటం వల్ల అతి చాకచక్యంతో రాజకీయలలోనికి ప్రవేశించి ప్రధాన రాజకీయ నాయకులతో ఒకడయి పోయాడు. అయినా అతనిని స్వార్ధ పిశాచం అవహించలేదు. ఎప్పటికప్పుడు న్యాయం కోసం సాటివారితో ఘర్షణ పడుతూనే ఉండేవాడు. ప్రభాకర్ కూడా చురకయిన వాడూ సూక్మ గ్రాహి కావడం వల్ల తండ్రి అడుగుజాడల్లో నడిచి తనూ రాజకీయాలలో ప్రవేశించాడు. కొంత రాజకీయ ప్రయోజనమూ కొంత ఆదర్శమూ మేళవించి, గ్రామాభ్యుదయ కార్యక్రమాన్ని చేపట్టాడు. కొందరు అనునూయులతో అప్పటికి గ్రామాలు ఈనాటి కంటే బాగా వెనుకబడి ఉండేవి. అనేక రకాల పార్టీ తగాదాలుండేవి. ఇవి కాక పంట కాలువల దగ్గరా, సరిహద్దుల దగ్గరా తగవులకు లెక్కేలేదు. కులమత భేదాలు బాగా పాతుకుపోయి వుండేవి.
    కులమత భేదాలు నిర్మూలించటం, సంఘ సంస్కరణ కార్యక్రమాలు మొదలైనవి ధ్యేయంగా పెట్టుకుని గ్రామాలలో పర్యటన ప్రారంభించాడు ప్రభాకర్. అతడికి ఎప్పుడూ తండ్రి అండదండ లుండేవి. అంచేత ఎదురు చెప్పటానికి భయపడేవారు. ఈ పర్యటనలోనే కమల ఉన్న గ్రామానికి వచ్చాడు . అప్పటికి కమల భర్తని పోగొట్టుకుని తండ్రి దగ్గర కొచ్చేసింది. ఒక కొడుకు పోయాడు ఒక కొడుకు బ్రతికే వున్నాడు అప్పటికి గ్రామాలలో మూర్ఖత్వం ఇప్పటికంటే ఎక్కువగా ఉండేది. అమ్మవారికి ఎన్ని పూజలయినా చేసేవారు - ఎన్ని మేకలయినా, ఎన్ని గోర్రెలయినా బలి ఇచ్చేవారు. టీకాలు మాత్రం వేయించుకునేవారు కాదు. ప్రభుత్వం పంపిన టీకాలు వేసే వాళ్ళు వస్తే తప్పించుకుని పారిపోయే వాళ్ళు  ఇన్ని కారణాల చేత ఆ సమయంలో గ్రామాలలో మశూచి వ్యాపించింది. తన అనునూయులతో రంగంలోకి దిగాడు. ప్రభాకర్  అతని నుచరులూ ముందుగానే టీకాలు వేయించుకున్నారు. ఎప్పటి కప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలూ వాళ్ళకూ తెలుసు. అంచేత జబ్బు పడ్డ వాళ్ళను హాస్పిటల్లో చేర్పించటం, జబ్బు రాని వాళ్ళకు బలవంతాన వెక్సినేషన్ ఇప్పించటం - విదివశాత్తు మరణించిన వాళ్ళకు అతి జాగ్రత్తగా శవ సంస్కారాలు చేయటం - మొదలయిన పనులన్నీ ఈ బృనదం తమ పైన వేసుకుటుంది. ఈ సమయంలో కమల తండ్రికీ, కొడుకుకీ ఒకేసారి మశూచికం వచ్చింది. అంటుజబ్బని బంధువులు, పాలేళ్ళు, చాకళ్ళు పని మనిష్యులు పనులు మానేశారు.
    ఆ సమయంలో ప్రభాకరే ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు. కమల తండ్రిని కొడుకుని హాస్పిటల్లో చేర్పించాడు. భయపడుతున్న కమలకు నచ్చజెప్పి టీకాలు వేయించాడు. కమల తండ్రి బ్రతికాడు. కానీ, కమల కొడుకును ఎవరూ బ్రతికించలేకపోయారు. ఆ సమయంలో కమల గర్భశోకం చూడలేకపోయాడు ప్రభాకర్. "అయన పోయినా, వీడిని చూసుకుని బ్రతుకుతున్నాను. జీవితంలో సుఖ సంతోషాలకు నోచుకోకపోయినా తల్లిగా నయినా బిడ్డను చూచుకుని అనంద్ధామనుకున్నాను. ఇక నేనెందుకు బ్రతకాలి? నాకెవరున్నారు? అని ఏడుస్తున్న కమల దుఃఖం చూడలేక చటుక్కున "నేనున్నాను" అనేశాడు ప్రభాకర్. కమల తెల్లబోయి చూసింది ప్రభాకర్ ని - ఇద్దరూ ఒకరి నొకరు భయంగా చూసుకుని చటుక్కున ముఖాలు తిప్పెసుకున్నారు.  అప్పటి కింకా వితంతువులకు  వివాహాలు సర్వసాధారణం కాలేదు. బాల్య వితంతువులకు వివాహం చెయ్యటమే చాలా ఘోరమైన అపరాధంగా భావించబడుతూ ఉండేది. విశ్వనాధ సత్యనారాయణ వంటి కవి సామ్ర్తాట్ లు బాల్య వితంతు వివాహాలను గర్హిస్తూ "స్వర్ఘానికి నిచ్చెనలు" వంటి నవలలు వ్రాస్తున్న రోజులవి! ఆ సందర్భంలో ఇద్దరి పిల్లల తల్లి కమలకు వివాహమాడటం సామాన్యం కాదు. ఉభయ పక్షాలలో ఎవరూ ఒప్పుకోరూ? ఈ సంభాషణ జరిగాక ఒక్కరోజు మాత్రమే కమలా, ప్రభాకర్ లు తప్పుకు తిరిగారు. హాస్పిటల్లో పది ఉన్న తండ్రిని చూసుకోవటానికి కమల వచ్చింది అతడికి కన్నకొడుకులా సేవ చేస్తున్న ప్రభాకర్ ని చూసింది. ప్రభాకర్ కూడా కమలను చూసాడు. ఇద్దరూ ఒకరి నొకరు చూసుకుంటూ ఉండిపోయారు కొన్ని క్షణాలు. ఈసారి ఇద్దరిలో ఎవరూ ముఖం తిప్పుకోలేదు. కమలను చూడగానే కమల తండ్రి "అయ్యో? చిట్టిబాబు కూడా పోయాడా?" అని బావురుమన్నాడు. కమల కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి.
    కమలవేపు చూసి కమల తండ్రిని ఓదార్చాడు ప్రభాకర్.
    "ఏడవకండి! ఏడ్చి ప్రయోజనం లేదు. ముందు ఏం చేయాలో ఆలోచించుకొండి! ఇంకా ముందు జీవితం చాలా వుంది."
    కమల తండ్రి ఏడుస్తూ "ఇంకా నాకు ముందు జీవితం ఏమిటి నాయనా?" అన్నాడు.
    కన్నీళ్ళ మధ్య కమల పెదవులు కనీ కనబడని చితునవ్వుతో విచ్చుకున్నాయి. ఆ చిరునవ్వు ప్రభాకర్ మనసును తీయగా గిలిగింతలు పెట్టింది. కమల తండ్రి కోలుకున్నాడు, కానీ, కమల కోలుకోలేదు. శారీరకమైన అస్వస్థత నుండి కాదు.  మానసికమైన అస్వస్ధత నుండి.  అప్పటికి కమలకు పాతిక నిండలేదు. ముందు జీవితం  ఏమిటి? ఇలా ఒంటరిగా - కమలకు భయం వేసింది.
    "ఇంకా ముందు జీవితం చాలా వుంది" అన్న ప్రభాకర్ మాటలు గుర్తుకొచ్చాయి. ప్రభాకర్ రూపమూ, వ్యక్తిత్వమూ, మనసును ఊపివేస్తున్నాయి. కానీ, అలాంటి వ్యక్తీ తనకు దక్కుతాడా? ఎంతమంది కన్నె పిల్లలు తపస్సు చేస్తున్నారో అతని కోసం? ఇద్దరు పిల్లల తల్లిని పెళ్ళి చేసుకోవలసిన అవసరం అతనికేం వచ్చింది? నిగ్రహించుకోటానికి ప్రయత్నించిన కొద్ది కమల మనసు ప్రభాకర్ వైపుకే వురకలు వేయసాగింది. కానీ, ప్రభాకర్ మాత్రం కమల ఇంటికి రావటం మానేశాడు. కమల అతనిని ఆకర్షించక పోలేదు. కానీ, కమల తండ్రి చాంధస భావాలు అతని పలుకుబడి ప్రభాకర్ ని భయపెట్టాయి.
    ప్రభాకర్ కోసం ఎదురు చూసి చూసి  కమల నిరాశను ఎదుర్కోవలసి వచ్చేది. ఈ ఆశా భంగాన్ని కమల భరించ లేకపోయింది. ఒకరోజు తనే తిన్నగా ప్రభాకర్ దగ్గరకు వచ్చేసింది. తన కళ్ళను తను నమ్మలేకపోయాడు ప్రభాకర్. ఈ పరిణామం అతడు ఊహించనిది. దానిలోని సాధక భాధకాలను అతడెన్నడూ ఆలోచించలేదు.
    "ఆనాడు "నీకు నేనున్నాను" అన్నారు. అందుకే మీ దగ్గరకు వచ్చేసాను" అంది కమల.
    ప్రభాకర్ కి వెంటనే ఏ సమాధానమూ స్పురించలేదు. కమల అతని ముఖంలోకి కొన్ని క్షణాలు చూసి "వెళుతున్నాను" అని బయటికి పోబోయింది. అప్పటికి ఏదో కలలోంచి తెప్పరిల్లినట్లు కమలకు అడ్డుగా నిలబడి "వెళ్ళకు" అన్నాడు ప్రభాకర్ - అప్పటికే పోబోతున్న కమలను చెయ్యి పట్టుకుని అపు చేసాడు. ఆ రాత్రి కమలతో సిటికీ పారిపోయాడు ప్రభాకర్. ఆ తరువాత ఎంత జరగాలో అంతా జరిగింది. కమల తండ్రి మండిపడ్డాడు. "నా కూతురే" కాదన్నాడు.  ముఖం చుపించవద్దన్నాడు. ప్రాయశ్చిత్తాలు చేసుకున్నాడు. మనసు భయంతో వణికిపోతున్నా ప్రభాకర్ ఆవిడతో ఆ దుమారాన్ని తట్టుకోగలిగింది కమల. ప్రభాకర్ తండ్రి కూడా జరిగిన సంఘటనకు తక్కువ విచారించలేదు. కానీ, అతడు రాజకీయాలలో తల పండినవాడు , అంచేత సమస్యను అర్ధం చేసుకుని రాజకీయంగానే పరిష్కరించేసాడు. కమలకు ప్రభాకర్ కూ తానే స్వయంగా ఘనంగా వివాహం చేయించాడు. అదొక సంస్కరణ వివాహంగా ప్రచారం చేసాడు. అన్ని పత్రికలకు దంపతుల ఫోటోలు పంపించాడు. చివరకు కొడుకు చేసిన దుందుడుకు పనిని కూడా తన రాజకీయ సోపానాలలో మరొక సోపానంగా మలచుకున్నాడు.
    ఆనాడు తను చేసిన సాహసానికి కమల జీవితంలో ఎన్నడూ పశ్చాత్తాప పడలేదు. ప్రభాకర్ కమలను మనసారా ఆదరించాడు. కమలకు ప్రభాకర్ దేవుడే! కమల విచారం ఒక్కటే. రోగంతో మంచంలో మూలుగుతూ కూడా కమల తండ్రి కమలను చూడటానికి ఇష్టపడలేదు. తన ఆస్తి నంతా ధర్మ కార్యాలకు వినియోగించమని విల్లు కూడా వ్రాసేసాడు. ఆ విషయం విని కమల చాలా బాధపడింది. "అంత ఆస్తి నేను బ్రతికి వుండగానే ఎవరేవరికో ధారపోస్తున్నాడు. ఇన్నాళ్ళు నేను చేసిన సేవలు మట్టి గోట్టుకుపోయాయి అన్నది.
    "అయితే ఆస్తి కోసం సేవలు చేసావన్నమాట మీ నాన్నకి?" అని వేళాకోళం చేసాడు ప్రభాకర్. కమల ఆ మాటలు పట్టించుకోలేదు. ఆస్తి కోసం మధన పడటమూ మానలేదు.
    అప్పుడు కమలకు వేణు పుట్టాడు. మనవడు పుట్టాడని తెలుసుకున్నాక కమల తండ్రి మనసు మారింది. మనవుడిని చూడాలని తహతహలాడి పోయాడు. కోపం మరచి పోయి మనవుడిని తీసుకుని తన దగ్గరకు రమ్మని ఉత్తరం వ్రాసాడు కమలకు. కమల వెంటనే బయలుదేరింది. మనవడిని చూసుకుని మురిసిపోయాడు కమల తండ్రి. తన చివరి రోజులలో కమలను బిడ్డతో సహా తన దగ్గిర వుండమన్నాడు. ప్రభాకర్ ఒప్పుకోలేదు. కాని, కమల బ్రతిమాలి, బామాలి ఒప్పించింది. ఆస్తి తిరిగి తన కొడుక్కి రాబోతోంది. అంత కంటే ఏం కావాలి? "నువ్వక్కడ? నేనిక్కడ! ఆలోచించుకో కమలా!" అన్నాడు ప్రభాకర్ హెచ్చరింపుగా.  కొంచెం సేపు కమల మనసు అటు ఇటు వూగింది. కానీ ఆస్తి వదులుకోలేక పోయింది.

 Previous Page Next Page