వేదాంతయ్య కుతూహలంగా చూస్తూ తను పడుకున్న వాలు కుర్చీలోంచి లేచి కూర్చోవటానికి కుర్చీ చూపించి "తమరెవరో తెలుసుకోవచ్చా?" అన్నాడు.
నాపేరు ప్రభాకర్. కాంగ్రెస్ కార్యకర్తల్లో ఒకడిని ప్రస్తుతం యం.పి గా వున్నాను.
వేదాంతయ్య కంగారుగా "తమరా! తమ పేరు విన్నాను తమ ఫోటో కూడా ఆమధ్య పేపర్లో చూసాను. ప్రస్తుతం నా మనసులో మనసులో లేదు. ఆ కారణం చేతనే తమను గుర్తించలేక పోయాను." అన్నాడు.
"ఫరవాలేదండీ! ప్రస్తుతం మనం వున్నా పరిస్థితుల్లో మీరు నన్ను అంత మన్నించక్కర్లేదు. నేనే మిమ్మల్ని ఒకటి యాచించడానికి వచ్చాను."
"అయ్యో! అయ్యో! ఎంతమాట! సెలవియ్యండి. మీరు అడగటమూ నేను కాదనటమూనా! తమకు ఇయ్యగాలిగింది నా దగ్గిరేముంది?"
"మా అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలి"
"ఆ! తెరిచిన నోరు ముయ్యటం మరిచిపోయి విభ్రాంతితో చూశాడు వేదాంతయ్య. ప్రభాకర్ వేదాంతయ్య దగ్గిరగా వచ్చి అతని రెండు చేతులూ పట్టుకున్నాడు.
"వేదాంతయ్య గారూ ! మీ దుఖం నేను అర్ధం చేసుకోగలను. ఈ సంగతి తెలిసినప్పటి నుంచి నా మనసు చెరువై పోతోంది. ఇలాంటి దుఃఖం పగవాడికైనా వద్దు. నాకు నిన్ననే తెలిసింది. ఈ ఘాతుకం చేసింది నా పుత్రుడు వేణు అని . ఈ సంగతి తెలియగానే వాడిని ముక్కలు, ముక్కలుగా నరికి కాకులకూ, గద్దలకూ వేయాలనిపించినది. కానీ అలా చేస్తే మీ అమ్మాయికి ఏం లాభం? ప్రస్తుత సమస్యకు తక్షణ పరిష్కారం మావాడితో మీ అమ్మాయికి పెళ్ళి జరిపించటమే ననిపిస్తోంది. ఆలోచించుకోండి. మాకు సిరి సంపదలకు ఏం లోటు లేదు. వేణు బాగా అల్లరి చిల్లరిగా తయారయ్యాడు నిజమే! కానీ, ఇకమీదట వాడిని దారిలో పెట్టటానికి శాయశక్తుల ప్రయత్నిస్తాను. నా మాట నమ్మండి. నా కంఠంలో ప్రాణం వుండగా మీ అమ్మాయికే లోటూ రానీయను."
ప్రభాకర్ మాటలోని సారాంశం జీర్ణించు కోటానికి వేదాంతయ్యకు కొన్ని క్షణాలు పట్టింది. అతనికి గాడంధకారంలో మెరుపు మెరిసినట్లయింది. అన్ని విధాల అల్లరి పాలైన మయూర జీవితంలో ఇంతకంటే అదృష్ట మేముంటుంది! తనంత తానుగా వచ్చి మయూరను కోడలుగా స్వీకరించడానికి సిద్దపడుతున్న ఆ మహానుభావుడు తరువాత బాగోగులు చూడకుండా వుంటాడా?
"ఆలోచించుకోండి. నేను రేపు మళ్ళీ వస్తాను. మీ ఉభయులకూ అంగీకారమయితే పై వారంలోనే పెళ్ళి జరిపించేద్దాం. ఏర్పాట్లాన్నీ నేను చూసుకుంటాను." అనేసి వెళ్ళిపోయాడు ప్రభాకర్ కారులో.
వేదాంతయ్య రాజ్యలక్ష్మితో సంగతంతా చెప్పాడు. ఆవిడ పరమానందంతో వెంటనే ఒప్పుకుంది. ఇదొక్కటే అత్యుత్తమ పరిష్కార మార్గంగా తోచింది. ఆ తల్లికి అంత దారుణంగా ఒక అమాయకురాలిని మానభంగం చేసిన వ్యక్తితో , తన కూతురు ఏం సుఖపడుతుందనే ఆలోచన రానే లేదు. ఆవిడకి తన కూతురిని పాడుచేసినవాడే , పెళ్లి కూడా చేసుకుంటున్నాడు . "శీలం" పాడయినట్లు కాదు. అని స్థిమిత పడింది. అంతేగాక , కూతురికి కాబోయే అత్తవారి 'ఐశ్వర్యాన్ని' తలుచుకుని లోలోపల ఆనందించింది.
ఎవరి గురించి ఇన్ని ఆలోచనలు జరుగుతున్నాయో, ఆ మయూర మాత్రం వంటిమీద తెలివి లేకుండానే వుంది. షాక్ నుంచి ఇంకా తెరుకోలేదన్నారు డాక్టర్లు. ఎవరైనా తినిపిస్తే తింటుంది. లేకపోతె లేదు. పిచ్చి చూపులు చూస్తుంది.
మయూర పరిస్థితి ఇంత అధ్వాన్నంగా వున్నా ఇంట్లో దుఖపు నీడలు వెనుక బడ్డాయి. ఇల్లు పెళ్ళికళతో కళకళ లాడింది. పెళ్ళి ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. అన్నీ ప్రభాకర్ స్యయంగా జరిపిస్తున్నాడు. ఖర్చులన్నీ తనే పెట్టుకుంటున్నాడు.
వేణు ఇంతవరకు ఎన్ని వెధవ పనులు చేసినా అన్నీ తండ్రికి తెలియకుండా చేసాడు. తండ్రి ద్రుష్టిలోకి రాకుండా చేసాడు. ఈనాడు తండ్రి కాలస్వరుపుడై తనముందు నిలిచేసరికి అతడికి నోట మాట రావటం లేదు. అయినా సాహసించి "ఆ అమ్మాయిని నేను పెళ్ళి చేసుకోను!" అన్నాడు తండ్రితో. అంతే, అతని చెంప చెళ్ళుమంది. కళ్ళు భైర్లు కమ్మాయి ఇదే సమాధానమన్నట్లు "గెట్ వుట్" అన్నాడు.
"నోరు మూసుకుని పెళ్ళి చేసుకుని నీ మర్యాద కాపాడుకుని నా మర్యాద నిలబెట్టు. లేకపోతె కాళ్ళూ చేతులూ కట్టి , ఈడ్చుకొచ్చి పెళ్ళి చేయిస్తాను" అని అరిచాడు. వేణు చెయ్యగలిగింది ఏమి లేకపోయింది. వేణు తల్లి కమలకు కూడా ఇదంతా సంకటంగానే వుంది. ఇంత సామాన్య కుటుంబంలోంచి ఇలాంటి కోడల్ని కాదు. ఆమె ఆశించింది. కానీ, భర్త మాటల్ని బట్టి ఇంతకంటే చెయ్యగలిగింది లేదని అర్ధం చేసుకుంది. సహజంగా సాత్వికురాలు కనుక పరిస్థితులకు సర్దుకుంది.
మహా వైభవంగా పెళ్ళయిపోయింది మయూరకు. అత్తవారు పెట్టిన చీరలూ, నగలూ చూసి అమ్మలక్కలూ ఈర్ష్యతో చెవులు కొరుక్కున్నారు. పెళ్ళి జరుగుతున్నా మరబోమ్మలాగే కూచున్న మయూరను చూసి కొందరు వింతగా చెప్పుకున్నారు. కారులో మేళాలతో ఊరేగింపు కూడా ఏర్పాటు చేసాడు ప్రభాకర్. మయూర పక్కన పెళ్ళి కొడుకుగా ఊరేగుతూ కారులోంచి పక్కకు చూసిన వేణుకి గోడలమీద ఒకనాడు తాను వ్రాయించిన 'యతి, మయూర' అనే పేర్లు కనిపించాయి. ఆ పేర్లను చూసి యతి? మయూర పకపక ఉల్లాసంగా నవ్వుకున్న దృశ్యం కళ్ళముందు మెదిలింది. గుండెల్లో ఏదో పదునైన బాగు దిగేసినట్లయింది. అంతేనా? ఆ రోజు తనే కాదు, తన స్నేహితులిద్దరూ కూడా , తన కళ్ళముందే మయూరను చెరిచారు. ఆ రోజు పైశాచికంగా నవ్వుకున్నాడు. ఇప్పుడా దృశ్యమే తిరిగి తిరిగి గుర్తుకొస్తూ మనసును విషపు సూదులతో కుళ్ళ బోడుస్తుంది.
అప్పటివరకు అతడు కోపంతో మయూరను సరిగ్గా చూడలేదు. మయూర వైపు చూసాడు తనేం ఆలోచిస్తోందోనని మయూర పిచ్చి చూపులు చూసింది!
"ఓరి దేవుడా! దీనికి పిచ్చి కూడా ఎక్కింది!"
వేణు గుండె గుభీల్లుమంది!
9
శోభనం ఏర్పాట్లు జరుగుతున్నా చైతన్యం లేకుండా కూచున్న మయూరను చూసి గుండె బెదిరిపోయింది రాజ్యలక్ష్మికి. భర్తతో రహస్యంగా "ఎలాగండీ!" అంది. అతడు అయోమయంగా "అన్నీ అవే చక్కబడతాయి లేవే!" అన్నాడు. మయూరను చక్కగా అలంకరించి గదిలోకి పంపారు. యాంత్రికంగా వెళ్ళి మంచం మీద కూచుంది. 'హమ్మయ్య' అనుకున్నారు. కొందరు అమ్మలక్కలు మాత్రం "బొత్తిగా సిగ్గులేదు . అవునులే! ఇంకా సిగ్గేలా ఉంటుందీ?" అని వెటకారంగా గుసగుసలాడుకున్నారు.
చాలా కోపంగా గదిలోకి వచ్చాడు వేణు. కానీ మంచం మీద మూర్తిభవించిన సౌందర్యరాశిలా వున్న మయూరను చూడగానే, అతనిలోని పశు ప్రవృత్తి చెలరేగింది. అమాంతం వెళ్ళి మయూర మీద పడ్డాడు. కెవ్వున కేక పెట్టింది. మయూర - అంతలోనే ఆమె సర్వంగాలు వణికిపోవటమూ, స్పృహ తప్పటమూ జరిగిపోయింది. భయపడిపోయి తలుపు తెరచుకుని బయటకు వచ్చాడు వేణు. అప్పటికే మయూర కేకలకు అందరూ తలుపు దగ్గర చేరారు. తెలివి తప్పి పడివున్న మయూరను చూసి రాజ్యలక్ష్మి గుండె బాదుకుని ఏడుస్తుంటే , కమల "నా కర్మ" అని తల బాదుకుంది.
"అవతల నా కొడుకు జైలులో మగ్గుతుంటే , ఇలా వేడుకగా పెళ్ళి చేసుకుంటే . ఏం జరుగుతుందీ?" అని సాగదీసింది అక్కసుగా సుబ్బాయమ్మ.
ప్రభాకర్ అందరినీ ఎడంగా తోస్తూ తను ముందుకు వచ్చాడు. మయూర పరిస్థితి చూసాడు. "ఇప్పుడీ వేడుకలేమి వద్దు. అమ్మాయిని హైదరాబాదు తీసికెళ్ళి స్పెషలిస్టులకు చూపిస్తాము" అన్నాడు వేదాంతయ్యతో.
వేదాంతయ్య తల ఊపాడు.
ఏడుస్తోన్న రాజ్యలక్ష్మినీ, కండువాతో ముఖం తుడుచు కుంటున్నట్లు కళ్ళు తుడుచుకుంటూన్న వేదాంతయ్యనీ, దీనంగా నిలబడ్డ సుబ్బాయమ్మనీ , ఎవరినీ చూడకుండా కమలా ప్రభాకర్ దంపతులతో హైదరాబాదు బయలుదేరింది మయూర. వేణుని తమతో రానియ్యలేదు ప్రభాకర్. "ఆ చదువేదో పూర్తిగా తగలబెట్టరా!" అన్నాడు.
"ఇంక ఈ టౌన్ లో చదవను " అన్నాడు వేణు.
"అయితే టి.సి తీసుకుని మరెక్కడయినా చదువు అంతేకాని హైదరాబాద్ మాత్రం రాక. నువ్వు కొన్నాళ్ళ వరకూ అమ్మాయి కంటికి కనబడటానికి వీల్లేదు."
నిస్సహాయంగా నోరు మూసుకోవలసి వచ్చింది వేణు, కమల ఊరుకోలేక పోయింది.
"ఇదేక్కడ న్యాయమండి? ఎవరి కోసమో, తన బిడ్డని ఇంటికి రావద్దంటారా?" అంది.
ప్రభాకర్ కమలను తీక్షణంగా చూసి "ట్రైన్ కదిలే టైమవుతోంది. లోపలికి పోయి కూచో! అమ్మాయిని జాగ్రత్తగా చూడు!" అన్నాడు. ఏ పరిస్థితిలో అయినా ప్రభాకర్ ని ఎదిరించి మాట్లాడలేదు కమల ..అందుకే కంపార్టు మెంట్ లోకి పోయి కూర్చుంది....
"ఇకనైనా వెధవ వేషాలు వెయ్యకుండా చదువుకో! లేకపోతే జాగ్రత్త!" అని వేణుని చివరిసారిగా హెచ్చరించి తను కూడా కంపార్ట్ మెంట్ లోకి వచ్చి కూర్చున్నాడు. ట్రైన్ కదిలింది. దూరమవుతున్న కొడుకును చూస్తుంటే దుఃఖం నిగ్రహించుకోవటం కష్టమయింది కమలకి.
"ఈ పాడైపోయిన దాని కోసం ఎందుకండీ , ఇలా కన్న కొడుకునే దూరం చేసుకుంటున్నారు?" అనేసింది.
నిర్ఘాంతపోయారు ప్రభాకర్.
"కమలా! నువ్వు.....నువ్వేనా, ఇలా మాట్లాడుతోంది. నీ దృష్టికి కూడా ఒక ఆడదాని జీవితం అంత చులకనగా ఉందా?"
కమల వంచిన తల ఎత్తలేకపోయింది అతనికి సమాధానం చెప్పలేకపోయింది.
నిజానికి ఆరోజుల్లో ప్రభాకర్ కమలను పెళ్ళి చేసుకోవటం చాలా పెద్ద సాహసం- ఇద్దరు పిల్లల తల్లి. దురదృష్టవశాత్తు చిన్నతనంలోనే పోయారు. ఇద్దరు పిల్లల తల్లి కావటం మాత్రమే కాదు చాలా సాంప్రదాయ కుటుంబంలో పుట్టింది. అంతేకాదు తండ్రి ధనవంతుడు, పలుకుబడి కలవాడూ ఆచారాల కోసం సంప్రదాయాల కోసమూ ప్రాణాలు వదిలి పెట్టేవాడు.