"చివరి రోజులలో నాన్నని ఎలా వదలనండీ? మీకు వీలయినప్పుడు , మీరు వద్దురు గానీ, లేదా నేనే వస్తూ వుంటాను వీలయినప్పుడల్లా! డబ్బుకు కొదవ లేదు గదా!" అంది. కమలతో వాదించి ప్రయోజనం లేదని ఊరుకున్నాడు ప్రభాకర్. అప్పటికే అతను తండ్రి వెంట తిరుగుతూ రాజకీయ నాయకులలో ప్రముఖుడవుతున్నాడు. అంచేత ఆ వ్యవహరాలలా మునిగిపోయాడు. వేణుతో తండ్రి దగ్గరకు వచ్చేసింది కమల. వృద్ధాప్యంలో కమల తండ్రి కంటికి వేణు దీపమయ్యాడు. ఇద్దరు పిల్లలను పోగొట్టుకుని , ఇక తల్లినయ్యే భాగ్యం లేదని కృంగిపోతున్న సమయంలో భగవంతుడు ప్రసాదించిన అపురూపమైన వరంలా కలిగిన వేణు కమలకు జీవిత సర్వస్వమయ్యాడు. తండ్రి దగ్గరే వుండి నెలకు ఒకసారి విమానంలో కొడుకుతో సహా ప్రభాకర్ దగ్గరకు వెళ్ళేది కమల. రాకరకా వచ్చిన కొడుకుకు వున్న నాలుగు రోజులు అడిగినదల్లా యిచ్చి అల్లారుముద్దుగా చూసేవాడు ప్రభాకర్.
ఇలా పెరిగాడు వేణు. చేతిలో డబ్బుంటే పాడైపోయే అవకాశాలు పట్టణాలలో కంటే పల్లెలలోనే ఎక్కువ. సహజంగా సంస్కారం లేని విద్యాశూన్యలయిన కూలి నాలి జనంలో దురలవాట్లకు తక్కువ లేదు. వాటికి డబ్బు తోడయితే అగ్నికి ఆజ్యం పోసినట్లే! ఆ రకంగా వేణు చిన్నతనంలోనే దురభ్యాసలకు అలవాటు పడిపోయాడు. కమల మందలించకపోలేదు. కానీ ఆమె మెత్తని మందలింపుకు లొంగనంత ముదురు పాకంలో పడిపోయాయి అతని అలవాట్లు . తాతగారు కూడా మందలించినా డబ్బు అడిగినప్పుడల్లా కాదనకుండా ఇచ్చేవారు, ఇలా వేణు క్రమక్రమంగా దారి తప్పటం మొదలు పెట్టాడు. చివరి రోజులు అనుకున్న కమల తండ్రి అనందం వల్లనో, మన స్థిమితం వల్లనో ఆ చివరి రోజులు చివరకు రాకుండానే పెరగసాగాయి.
ప్రభాకర్ అసలు యింటి విషయం పట్టించుకునే స్థితిలో లేడు. పాలకవర్గంలో అవినీతి, నిరంకుశాధికారం పెచ్చు పెరిగి పోవటం వల్ల, ఆ వర్గాన్ని , ప్రతిఘటించాలని కోరుకున్నారు కొందరు . ప్రభాకర్ అందులో ప్రధముడు. అయితే అతడు మిగిలిన వారిలా బాహాటంగా ప్రతిఘటించలేదు. పాలక వర్గానికి అజ్ఞాత శత్రువులా వారిమధ్యనే ఉండిపోయాడు. ప్రతిఘటించిన వారిలో కొందరు అరెస్టు చేయబడ్డారు. మరికొందరు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు. ప్రభాకర్ బయట ఉంటూ అండర్ గ్రౌండ్ లో వున్నవారికి లింక్ లా వుపయోగించేవాడు. పాలకవర్గంలో జరుగుతున్న తంత్రాలు ఎప్పటికప్పుడు అండర్ గ్రౌండ్ లో వున్నవాళ్ళకి తెలియపరిచేవాడు. జైళ్లలో వున్నవారి సమాచారం బయటివారికీ, బయటివారి సందేశాలు జైళ్ళలో వారికీ అందించటానికి సహకరించేవాడు. ఈ గందరగోళంలో మునిగివున్న ప్రభాకర్ కి కమల గురించి కొడుకు గురించి ఆలోచించే తీరికే లేకపోయింది. అదీగాక వాళ్ళు సిరిసంపదలతో మావగారి దగ్గర సుఖంగా వున్నారనే భరోసా----
ఎలాగైనా పాలక వర్గాన్ని పడగొట్టాలని ప్రభాకర్ వర్గంవారు అతి తీవ్రంగా ప్రయత్నించారు. నాటకాల ద్వారా, బుర్ర కధల ద్వారా వ్యంగ్యంగా జరుగుతున్న అవినీతిని విప్పి చెబుతూ ప్రజలలో చైతన్యం కలిగించటానికి ప్రయత్నించారు. చివరకు అతి ప్రయత్నం మీద పాలకవర్గాన్ని చిత్తుగా ఓడించగాలిగారు. ఆ సంతోషంలో ఘనంగా ఏర్పాటు చేసుకున్న విందు వినోదాల మధ్య అందింది కమల టెలిగ్రాం. వెంటనే రమ్మని. ఏం జరిగిందోనని వెంటనే బయలుదేరి వచ్చాడు. అప్పుడు తెలిసింది ప్రభాకర్ కి, తన సుపుత్రుడు ఏ మర్గాన ఎంతగా భ్రష్టుడయ్యాడో , పోలీసులకు వేణు ఘనకార్యం తెలిసిపోయింది. కేసు పెట్టడం అంటూ జరిగితే వేణుకి శిక్ష పడటం మాట ఎలా వున్నా, తన పరువు బజారున పడటం ఖాయం . అందుకే ఆలోచింది మయూరా వేణులకు వివాహం జరిపించేసాడు.
అలాంటి కమల ఈనాడు యిలా మాట్లాడటం ఆశ్చర్యం కదా మరి?
10
దూరం నుంచి ఏదో ప్రణవ నాదం వినిపిస్తోంది. జేగంట గణగణ మ్రోగుతోంది - మయూర కళ్ళు తెరవాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది - అవి మూసుకు పోతున్నాయి. ప్రణవ నాదం మరింత స్పుటంగా వినిపిస్తోంది. ఆ నాదం మయూర ఆణువణువూలోనూ ప్రవేశించి ఏదో నూతనోత్తేజం కలిగినట్ల యింది. మైకం నెమ్మది నెమ్మదిగా కరిగిపోసాగింది - కళ్ళు విడివడ్డాయి. మంచం మీద లేచి కూర్చుంది - ముకుందమాల స్తోత్రాలు అతి శ్రావ్యంగా, గంభీరంగా వినిపిస్తున్నాయి. ఆ ధ్వని కెరటాలు కెరటాలుగా వాతావరణమంతా అలముకుంటుంది - శారీరం తూలింది, నిలదొక్కుకుంది. కళ్ళు తిరుగుతున్నాయి - అయినా , మంచం మీద పడుకోలేదు. తూలుకుంటూనే ముందుకు నడిచింది. పూజా మందిరంలో భగవంతుడి ముందు కూచొని తనలో తాను లీనమై ముకుందమాల శ్లోకాలు చదువుకుంటున్నాడు ప్రభాకర్. ఆ మందిరం గుమ్మం వరకూ వచ్చి ఆగిపోయింది మయూర. లోపలి అడుగు వేయలేదు. కళ్ళు మూసుకుని ఎవరికో నివేదిస్తున్నట్లు భావో ద్రేకంతో స్తోత్రాలు చదువుతున్న ప్రభాకర్ - దేదీప్యమానంగా వెలుగుతున్న జ్యోతులు - పోగలుపోగలుగా అస్తిత్వాన్ని జరిగించుకుంటూ ఎక్కడికో ఎగిరిపోతున్న ఊదవత్తులు - వీటన్నింటి మధ్యా చిరునవ్వులు చిందిస్తూ చిలిపి కృష్ణుడు - ఆదర్శాలు రూపుదాల్చిన ఉదార గంభీర మూర్తి సీతా లక్ష్మణ సహిత శ్రీరామ చంద్ర మూర్తి - ఈ రెండూ ఒక విరాట్వ రూపుని రూపాలే అంటున్నట్లున్న పరమయోగి రామకృష్ణ పరమహంస.........
స్తోత్రం ముగించి కళ్ళు తెరిచాడు ప్రభాకర్ - ఎదురుగా నిలబడ్డ మయూరను చూసి అతడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు.
"అమ్మా! లేచావా!" అన్నాడు ఆప్యాయంగా దగ్గరగా వచ్చి - మయూర అతణ్ణి వింతగా చూసి , చుట్టూ చూసింది.
"ఇదేమిటి? నేనెక్కడున్నాను? ఇదేవరిల్లు? మీరెవరూ?" అంది.
ప్రభాకర్ కళ్ళలో కరుణ తొణికిసలాడింది. దారితప్పిన పసిపాపను చూసినట్లు మయూరను చూస్తూ అభిమానంగా "నువ్వు నా కోడలివమ్మా!" అన్నాడు.
అదిరిపడింది మయూర - అప్పుడు మెడ వైపు చూసుకుంది. ధగధగ లాడుతూ పైటలోపల నుంచి మెరుస్తూ కనబడింది మంగళ సూత్రం వెంటనే ఘాటైన బ్రాందీ వాసన - మొరటు చేతులు - అత్యంత జుగుప్సాకరమైన స్పర్శ - ఒకదాని నొకటి తరుముకుంటూ మనసులో మెదిలి, భరింపరాని చీదరతో మనసును ఊపేశాయి- ఆర్తనాదం చేసున్నట్టుగా 'అయ్యో?' అని గుమ్మంలో కూలబడిపోయింది. ప్రభాకర్ మయూర పరిస్థితి అర్ధం చేసుకున్నాడు. ఆవిడ అనుభవిస్తున్న చిత్త సంక్షోభానికి అయన మనసు కరిగిపోయింది. అయినా ఆ సమయంలో ఆయనకు ఆవేదన కంటే ఆనందమే ఎక్కువ కలిగింది. మయూరలో పూర్వపు స్థితి పోయింది. ప్రస్తుతానికి అది ముఖ్యం. ఆ తరువాత పరిస్థితి అర్ధం చేసుకొంటుంది. నెమ్మదిగా తనే సర్దుకుంటుంది. ఎంతటి వారైనా ఏదో ఒక దశలో జీవితంలో రాజీ పడవలసిందే.
"అమ్మా! భగవంతుడికి నమస్కారం చెయ్యి." బుజ్జగిస్తున్నట్లుగా అన్నాడు ప్రభాకర్. మయూర నమస్కారం చెయ్యలేదు. శూన్యంగా చూసింది. భగవంతుడు! ఆనాడు ఈ భగవంతున్నే మనసారా ధ్యానించింది. ఈ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్న పారవశ్యంలో తానున్నప్పుడే , ఆ రోజు ...... నిలువునా వణికింది మయూర. అది ప్రభాకర్ దృష్టిని దాటి పోలేదు.
"నమస్కారం చేయమ్మా." అన్నాడు శాంతంగా.
"నువ్వు చేసిన ఈ అన్యాయానికి అర్ధమేమిటి," అన్నట్లు భగవంతున్నే చూస్తోన్న మయూర తన చూపులను ప్రభాకర్ వైపుకి తిప్పింది.
"నేను చెయ్యను ఈ భగవంతుడే నన్ను సర్వనాశనం చేసాడు- ఇంకా మీదట ఈ భగవంతున్ని నేను నమ్మను."
ఆ మాటల్లో, ఆ చూపుల్లో వున్నా విరక్తి అర్ధమయింది ప్రభాకర్ కి.