Previous Page Next Page 
జీవితం చేజారనీయకు పేజి 11

    "నా గొడవలతో ఇంట్లో పెళ్ళి జరుగుతోందన్న సంతోషం కూడా లేకపోయింది. అన్నయ్యలయితే, "నీ వింక అసలు అక్కడికి వెళ్ళడానికి వీలులేదు. డర్టీరోగ్.... పెళ్ళాంతో ఎలా బిహేవ్ చెయ్యాలో తెలియని వెధవకి కాపురం ఎందుకు? మరేం ఫరవాలేదు. లోకం నాలుగు రోజులు అంటుంది. తరువాత నోరు మూసుకుంటారంతే. ఈ అన్న వాళ్ళందరూ వచ్చి నీ కాపురం చక్కదిద్దుతారా? ఎంతమాత్రం వెళ్ళొద్దు. ఏం చేస్తారో చూద్దాం" అన్నారు కోపంగా.
    నాన్నగారు నా భవిష్యత్తు గురించిన చింతతో ఏం చెయ్యాలో తోచక, ఎటూ చెప్పలేక నలిగిపోయారు. అమ్మ ఓసారి కూతురి కాపురం ఇలా అయిందని ఏడుస్తుంది. మరోపక్క ఎవరేం అంటారన్న దందభావాలతో సతమతమవుతుంది. ఏదియేమైనా అందరిముందు ఈ ఏడాది చదువు పూర్తి చెయ్యమని, ఈ లోగా వాళ్ళు దారికి వచ్చేదీ లేనిదీ తేలిపోతుందని, అప్పుడే ఏం చెయ్యాల్సిందీ ఆలోచిద్దాం అన్న నిర్ణయానికి వచ్చారు."
    నిర్మల నిట్టూర్చింది. "నీ మారీడ్ లైఫ్ అలా అయినందుకు సారీ విద్య. నిజం చెప్పాలంటే..... నీ పెళ్ళి రోజున పెళ్ళి పీటల మీదనీ పక్కన అతన్ని చూస్తుంటే ఎందుకో, ఏదో అపశృతి అన్పించింది. నీలాంటి లైవ్ లీ, కేర్ ఫ్రీ గర్ల్ కి అతను మరీ సీరియస్ టైపు అన్పించింది. కాని విద్య, నీకంటే పదిహేనేళ్ళ పెద్దగా ఓ మాట చెపుతున్నాను. నీవు ఈ ఏడాది చదువు ఆపకు. ఎమ్మే పూర్తి చెయ్యి. కానీ వాళ్ళతో ఇప్పుడు మీరేం చెప్పొద్దు..... మరీ తొందరపడి తెగతెంపులు చేసుకోవాలని ఆరాటపడవద్దు.           
    అతనెలాగూ ఓ ఆరునెలలు జర్మనీ వెడతాడు. నీవెలాగో ఈలోగా చదువు పూర్తి చెయ్యాలి కనక ఇప్పుడు రాను అని చెప్పచ్చు అడిగితే.... అతను తిరిగి వచ్చాక ఈ ఏడాదిలో మనుషులెలా మారతారో చూద్దాం. మీరూ పట్టుదలగా ఉన్నారని వాళ్ళు తగ్గవచ్చు. వాళ్ళకీ కోడలి కాపురం వదిలిపోయిందంటే అవమానమేగా? కొడుకు కాపురం చెడటం వాళ్ళకీ ఇష్టం ఉండదుగా..... ఈలోగా వాళ్ళూ సర్ధుకునిదారికి రావచ్చు. వాళ్ళలో అప్పటికీ ఏ మార్పూ రాలేదంటే అప్పుడే నీవో నిర్ణయానికి రావచ్చు. అంచేత వాళ్ళిప్పుడు ఏం అన్నా, ఏం రాసినా, నువ్వు ఎమ్మే కంప్లీట్ చెయ్యాలి అన్నమాట తప్ప ఇంకేం జవాబు చెప్పకండి." నిర్మల సలహా ఇచ్చింది.
    "ఆంటీ ఇలాంటి మనుషులు మారతారని మీకింకా నమ్మకం వుందా? మారినా అది నిజమైన మార్పు అవుతుందా? మనుషులు బేసిక్ నేచర్ ఎలా మారుతుంది? నన్ను రప్పించేందుకు మారినట్టు నటించి, తీరా మళ్ళి నేవెళ్ళాక బాధపెడితే ఎలా ఆంటీ? నాకెందుకో ఈ కాపురం సాగేది కాదు అన్పిస్తోంది. ముందురోజు నించే ఇద్దరి మధ్య విముఖత చోటు చేసుకున్నాక ఆ సంసారంలో సామరస్యం ఏం ఉంటుంది? అలా సర్దుకు బతకాల్సిన లైఫ్ నాకక్కరలేదు ఆంటీ.... నా భర్త మనసా వాచా నన్నే కోరుకుని, నాకోసం ఏదన్నా చేయగల్గినవాడయి వుండాలి గాని ప్రతిదానికీ సాధించి ఏడ్పించేవాడు నాకక్కరలేదు. ఐ కెనాట్ ఎడ్జస్ట్ టు దట్ సార్ట్ ఆఫ్ లైఫ్."
    "విద్యా..... ఈనాడు వున్న నీ అభిప్రాయాలు ఇంకో పదేళ్ళు పోయేసరికి మారిపోతాయి. అప్పుడు..... అప్పుడు..... నీవు పశ్చాత్తాపడినా ప్రయోజనం వుండదు. ఏ భర్తా పూర్తిగా పర్ ఫెక్ట్ గా ఉండడు. నూటికో కోటికో ఏ అదృష్టవంతురాలికో సరసుడు, సహృదయుడు అయిన భర్త దొరుకుతాడు. కొందరు కొత్త మోజులో కాస్త లాలన, అనురాగం చూపచ్చు. ఓ రెండేళ్ళు గడిచేసరికి, ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చేసరికి జీవితం రొటీన్ అయిపోతుంది. ఎవరో అన్నట్టు 'మేరేజ్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ ఏన్ ఏడ్జస్ట్ మెంట్.' ఇద్దరూ కలిసి సర్దుకుని బతకాల్సిన జీవితం పెళ్ళి అంతే. ఒకరి ఆశలు, ఆశయాలు, కోరికలు ఒకరివి ఒకరికి నచ్చకపోయినా సర్ధుకుంటూ వచ్చే అండర్ స్టాండింగ్ వున్న వివాహం చిన్న చిన్న ఒడిదుడుకులున్నా సాగిపోతుంది.
    ఆ ఎడ్జస్ట్ మెంట్ లేని దంపతులు కొట్టుకుంటూ తిట్టుకుంటూ బతుకీడుస్తారు. అంతే తప్ప ప్రేమలు, అనురాగాలు, సినిమాల్లో మాదిరి ఒకరిని చూసి ఒకరు మైమర్చిపోవడం, కళ్ళల్లోకి అనురాగంగా చూసుకోడం, ఒకరికోసం ఒకరు త్యాగాలు చేసేసుకోవడం అంతా అందమైన కల్పన. నిజజీవితంలో అదంతా సత్యదూరం! పరస్పర అవగాహన, పరస్పర గౌరవం ఇచ్చి పుచ్చుకునే దంపతులు నూటికి ఒకరున్నా సంతోషమే! కొంతమంది మనసులో ఏం ఉన్నా పైకి నటిస్తారు. అది చేతకాని వాళ్ళు బ్లంట్ గా మాట్లాడి ఇతరులను నొప్పిస్తారు. ఏ పురుషుడైనా తనది కానంతవరకే ఆ స్త్రీ పట్ల మక్కువ, ప్రేమ చూపిస్తాడు. విలువ ఇస్తాడు. భార్య కాగానే కొత్త మోజు నాల్గు రోజులుంటుందే తప్ప పాతపడగానే అసలు రంగులు బయటికి వస్తాయి. అంచేత నేను చెప్పేదేమిటంటే..... నీవూహించిన జీవితానికి, నిజ జీవితానికి వున్న తేడా చూసి బెంబేలు పడిపోయి తొందరపడి ఏవో నిర్ణయాలు తీసుకోవద్దనే."     
    "నేను పట్టు పాన్పులు, పూల పాన్పులు కావాలనలేదు. సినిమాలలో మాదిరి డ్యూయట్లు పాడాలనలేదు. ఒక చిరునవ్వు, ప్రేమగా పలకరింపు, కాసింత క్షమ, ఔదార్యం..... ఏ భార్య అయినా ఆశించే కనీసపు కోరికలు ఇవి. ఆ మాత్రం సానుభూతి చూపలేని భర్తతో కాపురం చెయ్యమని చదువుకున్న మీరు అనడం ఆశ్చర్యంగా ఉంది ఆంటీ....."   
    హుఁ..... ఈ చదువు జీవిత పాఠాలు చెప్పదు విద్యా. ఈ చదువు విజ్ఞానాన్ని ఇస్తుంది గాని జీవితంలో అనుభూతులని ఇవ్వలేదు. అనుభూతి లోపించిన జీవితం గమ్యం లేని ప్రయాణం లాంటిది, విద్యా..... నీకిప్పుడు పట్టుమని ఇరవై ఏళ్ళు లేవు. ఇంకో పదేళ్ళుపోతే ఈ వేడి, ఆవేశం తగ్గి వెనుదిరిగి చూసుకుంటే నీవు నష్టపోయింది భూతద్దంలో మాదిరి పదిరెట్లు కనబడి నీ మనశ్శాంతిని హరిస్తుంది. చేజారిపోయిన కాలాన్ని వెనుదిప్పలేక, ముందుకుసాగే కాలంతో నిస్పృహతో కదలాలి. అప్పుడు ఆ నిస్పృహనించి నిర్లిప్తత, నిరాసక్తత, నిస్తబ్దత బయలుదేరి బతుకు భారం అనిపిస్తుంది. బతుకులో సారం లోపించాక బతుక్కి అర్థం కనబడదు...." నిర్మల చెప్పుకుపోతుంది.   
    విద్య నిర్మలను ఆశ్చర్యంగా చూసింది. "ఆంటీ.... మీరేమిటీ ఇవాళ ఇలా మాట్లాడుతున్నారు? మీ గురించిన నా అంచనాలన్నీ తారుమారు చేస్తున్నారు ఈనాడు. మీ భావాలకి, చేతలకి, ఈనాటి మీ మాటలకి పోలికలేదు ఆంటీ!"       
    "ఇందాక చెప్పానుగా విద్యా, జీవితంలో అనుభవం నేర్పే పాఠాల ముందు మనం మన తల ఒగ్గాల్సి వస్తుంది ఏదో ఒకనాడు, చూడు, ఇందాకటి నుంచి నీవు చెప్పిన నీ కథ భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పమంటావా! నీ గతం మనకు తెలుసు! నీ భవిష్యత్తు నాకు తెలుసు! నీవు రేపు ఎదుర్కోవలసిన సమస్యలు, సంఘటనలు గురించి నేనీరోజు నీకు చెపుతాను. అక్షరాల అలా జరగకపోవచ్చు. కాని తొంభై శాతం జరుగుతుందని నేనీరోజు నీకు కాగితం మీద రాసిస్తాను. ఇంకో పదేళ్ళు పోయాక ఈరోజు నేను అన్నమాటలు గుర్తు తెచ్చుకుంటావు. కాని ఏం లాభం. ఇట్ విల్ బి టూ లేట్.... అందుకే నీ హితైషిగా బాగా ఆలోచించమని, తొందరపడవద్దనీ చెపుతున్నాను."

 Previous Page Next Page