"వెళ్ళారా మీ డాడీ? వాళ్లేం అన్నారు?" ఆరాటంగా అడిగింది నిర్మల.
"ఆ.... వెళ్ళారు. ఆ మర్యాదా అయింది. వాళ్ళు ఇవే మాటలు అన్నారట. మర్యాద లేని మనుషులని ముందే తెలిస్తే ఈ సంబంధం చేసుకునేవారం కాదు - అని మొహం మీదేదులిపారట. మా యింటికి వచ్చిన పిల్ల మా అదుపాజ్ఞాలలోఉండాలి. నా యిష్టం అంటే ఊరుకోం. మీ అమ్మాయికి కాపురం కావలిస్తే పెద్దలపట్ల గౌరవం, అణుకువగా ఎలా మెలగాలో ముందు నేర్పి పంపండి" అని నానా మాటలూ అన్నారుట.
విని విని నాన్న వళ్ళుమండి" ఈ కాలంలోనూ మీలాంటి అత్తమామలు ఉంటారని తెలిస్తే పురాణగ్రంథాలు అన్నీ వల్లవేయించి, పతివ్రతల కథలు బట్టీ పెట్టించి అత్తమామల పాదాలు ఎలా వత్తాలో నేర్పే వాళ్ళం. రోజులు మారాయి. మనుషులు మారి వుంటారనుకున్నాం. పెద్దలంటే గౌరవం కల్గాలంటే పెద్దరికం నిల్పుకుంటే పిల్లలు గౌరవిస్తారు. ఈ రోజుల్లో ఎవరి కాపురాలు వాళ్ళు చూసుకోగలరు. ఆడపిల్లలంటే వంటింటి కుందేళ్ళు అనుకునే రోజులుపోయాయి. ఇదివరకులా ట్రీట్ చేస్తే నా కూతురే కాదు ఏ ఆడపిల్లా సహించదు. వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళకీ ఓ వ్యక్తిత్వం వుందని గుర్తించారు. మీరెలా పడివుండమంటే అలా పడి వుండే రోజులుపోయాయి.
ఆడదానికి మొగుడెంత అవసరమో, మగాడికి పెళ్ళామూ అంతే అవసరం అని వాళ్ళకి తెలుసు. నా కూతురైనంతమాత్రాన నీ భర్తే దైవం, కొట్టినా తిట్టినా ఇక్కడే పడుండు అంటే వినరు ఈ కాలం పిల్లలు. మీ వాడికి పెళ్ళాం అక్కరలేదంటే, మా అమ్మాయి మొగుడు అక్కరలేదనుకోడానికి సిద్ధంగా ఉంది. మీరు ఆలోచించుకుని మా అమ్మాయితో మీ అబ్బాయి కాపురం చెయ్యలేడనుకుంటే కోర్టులున్నాయి విడిపోవడానికి. మాకు మానం మార్యాద వుందన్న సంగతి మరిచి మాట్లాడకండి. మీరు మీ అబ్బాయి ఏ సంగతీ తేల్చుకుని మా పిల్ల అక్కరలేదనుకుంటే నెలరోజుల్లోగా తెలియ చెయ్యండి. అంతేగాని మీ యిష్టం వచ్చినట్లు ట్రీట్ చేస్తే సహించం" అని గట్టిగా చెప్పి వచ్చేశారట. కాళ్ళ బేరానికి వచ్చి ప్రాధేయపడ్తారని, తప్పయింది క్షమించండి అంటారని ఆశించిన వాళ్ళు నాన్న మాటలకి తెల్లపోయి మొహాలు మాడ్చుకున్నారు."
"మీ ఆయనకి తెలుసా ఇలా అన్నారని? తరువాత ఏం జరిగింది?"
"ఎందుకు తెలియదు. తండ్రి కొడుకులు ఉత్తరాలు రాసుకున్నారు. తండ్రి ఉత్తరం చూసి మా ఆయన రెండు రోజులు మొహం మాడ్చుకున్నారు? నాతో మాటలు ఇంకా తగ్గించారు."
"అంటే..... కాస్త తగ్గారన్నమాట!"
"ఏమో? ఏం జరిగిందో కాని ఈలోగా అన్నయ్యకి సడన్ గా పెళ్ళి కుదిరింది. మళ్ళీ మూఢం వస్తుందని పదిహేనురోజులలో ముహూర్తాలు పెట్టుకున్నారు. నాన్న నాకు ఫోను చేసి పెళ్ళికి పదిరోజులు ముందుగా రావాలని, బట్టలు అవి కొనాలని, పనులున్నాయని రమ్మన్నారు. నాకు సంతోషం కలిగింది. అన్నయ్య పెళ్ళి సంతోషం కంటే ఈ నరకం నుంచి వెళ్ళి వాళ్ళతో కొన్నాళ్ళయినా సరదాగా గడపవచ్చని సంబరపడ్డాను. ఆ సంబరం మీద వెంటనే ఈయన నీళ్ళు చిలకరించారు. "ఇంకా పదిరోజులుంది, ఇప్పటినుంచి ఏం వెళ్ళక్కర్లేదు. తరువాత చూడవచ్చు" అన్నారు అడిగితే.
"మా డాడీ ఫోను చేశారు, చీరల అవి కొనాలని ముందుగా రమ్మన్నారు."
"అయితే వెళ్ళు. నా పర్మిషన్ అక్కరలేనప్పుడు, నా మాట విననప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. నీకు మొగుడు అక్కరలేదు. మీ నాన్నకీ అల్లుడు లెక్కలేదు . అలాంటప్పుడు ఇంకా వుండటం ఎందుకు, ఏకంగా వెళ్ళు" అన్నాడు రెచ్చిపోతూ.
"ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి - అన్నయ్య పెళ్ళికి వెడతాననడం మొగుడి లెక్క లేనట్టా? ఏదో వంకన కయ్యానికి కాలు దువ్వకండి." కోపంగా అన్నాను.
"మా ఇంట్లో పెద్దవాళ్ళున్నారు. మీ వాళ్ళు మర్యాదస్థులు అయితే ముందుగా మా నాన్నగారిని అడగాలి పంపమని. ఏం, నేనింట్లో లేకపోతే తరువాత ఫోను చేసి చెప్పారా నాకు - మా నాన్నను అడగందే పంపను" అన్నారు మూర్ఖంగా.
"ఏమిటి..... నేను నా అన్న పెళ్ళికి వెళ్ళడానికి మీ నాన్నగారి పర్మిషన్ తీసుకోవాలి. నేను అత్తవారింట్లో ఉంటే మీ నాన్నగారి పర్మిషన్ కావాలన్నా బాగుంది. నేనిక్కడ ఉంటే, నా మొగుడు మీరు ఉండగా ఎక్కడో ఉన్న మామగారి పర్మిషన్ తీసుకోవాలా - మా నాన్న మీకోసం రెండుసార్లు ఫోన్ చేశారు - మీరు లేరు. మనింట్లో ఫోను లేదు, పక్కింటికి ఎప్పుడు బడితే అప్పుడు ఎన్నిసార్లు చేస్తారు. నన్ను చెప్పమన్నారు. మీకు ఉత్తరం రాస్తానన్నారు - అందరికీ ఉత్తరాలు, శుభలేఖలు వెళ్ళినప్పుడు మీ వాళ్ళకీ వెడ్తుంది. నేనంటే కూతురిని గనక నాకు ముందు చెప్పారు. అందరికీ ముందు ఫోనులు చేస్తారా ఎవరన్నా. కావాలని వంకలు ఎన్నుతే ఎన్నయినా దొరుకుతాయి. అనవసరంగానాతో గొడవ పెట్టుకోకండి. నేను రెండు రోజుల్లో బయలుదేరి వెడ్తున్నాను. "ఖచ్చితంగా చెప్పాను. చేతిలో పుస్తకం విసిరికొట్టి లేచి వెళ్ళిపోయారు.
నేనే స్టేషన్ కి వెళ్ళి టిక్కెట్టు కొనుక్కున్నాను. వెళ్ళే రోజున సామాను సర్దుకుంటుంటే - "అయితే వెడ్తున్నావన్నమాట, వెళ్ళు. మరి రాకు." ఉక్రోషంగా అన్నారు. నేను లేచి నిలబడి సూటిగా ఆయన వంక చూశాను. "సరే రాను, ఇలా అన్న పెళ్ళికి వెడితేనే కాపురం వదులుకోమని చెప్పే మొగుడు నాకు అక్కరలేదు. ఇంత సుళువుగా తుమ్మితే ఊడే ముక్కులాంటి కాపురం కావాలన్న మోజు నాకూ లేదు. నువ్వు రాకు అంటూ బెదిరించకండి" అని చెప్పేశాను. నేను బయలుదేరే సమయానికి ఇంట్లో లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. నేను తెచ్చుకున్న సామానంతా తీసుకుని తాళం పక్క వాళ్ళింట్లో ఇచ్చేసి వచ్చేశాను." విద్య చెప్పడం ముగించింది.