ఓ తాటిచెట్టు కథ
చాలామంది రచయితలు - ఇతరులు గుర్తించినా, గుర్తించకపోయినా.... తాము చాలా గొప్ప రచయితలమనే స్థిరాభిప్రాయం కలిగివుంటారు. ఆ అభిప్రాయాన్ని తమతో మాట్లాడిచ్చిన వారి నెత్తిన - పిచ్చివాడి తలపై నిమ్మకాయచెక్క రుద్దినట్లు, రుద్దడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటివారిని చూస్తుంటే నవ్వూ వస్తుంది. జాలీ వేస్తుంది.
నాకు ఏ ఊరు వెళ్లినా, అక్కడి రచయితలను కలుసుకుని కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడుకోవడం ఒక హాబీలాంటి అలవాటు.
ఒకసారి నేను మద్రాసు వెళ్లాను. అక్కడ ఒక ప్రముఖ ఉప సంపాదకుడుగా పనిచేస్తూ, అప్పుడప్పుడే పేరులోకి వస్తున్న ఒకనవ, యువ రచయితని కలుసుకొని నన్ను నేను పరిచయం చేసుకున్నాను.
'ఎప్పుడొచ్చారు? ఎక్కడ దిగారు? ఎన్నాళ్ళుంటారు?' వంటి ప్రారంభప్రశ్నలు మూడు నాలుగు అయ్యాయో లేదో... .ఆ రచయిత ఆకస్మాత్తుగా -
"మీరు తాటిచెట్టు చదివారా?" అని ప్రశ్నించాడు.
నాకు మతిపోయింది.
'వీడిల్లు బంగారంగానూ... తాటిచెట్టు చదవడమేమిటీ? ఇంకా తాటిచెట్టు ఎక్కారా? అంటే సందర్భశుద్ది వున్నా, లేకపోయినా - కనీసం ఆ ప్రశ్న అర్దవంతంగా వుంటుంది' అనుకున్నాను.
నేను వెర్రిముఖం వేసుకుని, బుర్ర గోక్కోకుండా, ఆ తాటిచెట్టు సంగతేమిటో అతని నోటి వెంట చెప్పిద్దామనుకొని, 'ఎలా సమాధానమిస్తే బాగుంటుందా....' అని ఆలోచిస్తున్నాను.
ఇంతలో... నా పాలిటి దైవమల్లే వచ్చాడు కంపోజిటర్ - చేతిలో ప్రూఫ్ కాగితం పట్టుకొని! ఆ కాగితాన్ని సదరు సబ్ - ఎడిటర్ కమ్ రచయిత ముందు పెట్టాడు.
"సార్.. ఎక్స్యూజ్ మీ - జస్ట్ ఏ మినిట్!" అని నాతో అని, ప్రూఫ్ రీడింగ్ లో మునిగిపోయాడు అతను.
నేను తాటిచెట్టును గురించిన ఆలోచనలో మునిగిపోయాను.
అతడు ఆ ప్రూఫ్ ని దిద్దుతున్నంతసేపూ 'చుప్.. చుప్....'మంటూ పెదవి విరుస్తూ, అస్పష్టంగా గొణుక్కుంటూ దిద్దసాగాడు. ప్రూఫ్ రీడింగ్ సాగుతున్న కొద్దీ అస్పష్టంగా వున్న సణుగుడు అంతకంతకీ స్పష్టమై, సుస్పష్టమైన చివరికి పరాకాష్ట నందుకుంది.
"ఏమి కంపోజింగయ్యా ఇది? ఎన్ని మాట్లు చెప్పినా ఒకటే తప్పులా? చెప్పి చెప్పి నా నోరు పడిపోతోంది. ఊ...... తీసుకెళ్లు - కరెక్షన్స్ త్వరగా చేసి మళ్ళీ ప్రూఫ్ పంపించు....." అంటూ తెలుగు సినిమాల్లో అత్తగారిలా .. .అంటే - శేషమాంబ లేక సూర్యకాంతం మోడల్లో మాటలకి తగ్గ హస్త, ముఖ భంగిమలని ప్రదర్శిస్తూ విరుచుకుపడ్డాడు.
పాపం.... ఆ కంపోజిటర్ కూడా సినిమాల్లో కోడలులాగా నోరెత్తకుండా, తల దించుకుని వెళ్లిపోయాడు.
ఆ ' ప్రూఫోపాఖ్యానం' కళ్ళారా చూస్తున్నా, నా మనస్సు మాత్రం - తాటిచెట్టు చుట్టూ తిరుగుతూనే వుంది.
'ఒకవేళ నేను అగ్రికల్చర్ స్టూడెంటనుకున్నాడో! లేదా తాను అగ్రికల్చర్ స్టూడెంటేమో! ఏ స్టూడెంటైనా ఫలానా దానిని గురించి అడగదలుచుకుంటే, హాయిగా ఏ మామిడిచెట్టునో, కనీసం ములగచెట్టుని గురించో అడగకుండా, మధ్యది ఈ దిక్కుమాలిన తాటిచెట్టును గురించి అడుగుతాడేమిటి? కొంపదీసం నేనేమైనా కల్లు తాగుతాననుకున్నాడా ఏమిటి? అనుకుంటే మాత్రం - సభ్యత లేకుండా ఇలరా అడగడమేమిటి? ... పరిపరి విధాల పోతున్నాయి నా ఆలోచనలు. అవి మాత్రం తాటిచెట్టుకంటే చాలా ఎత్తుగా పోతున్నాయి.
"చూడండిసార్... నేను చేసేది సబ్ ఎడిటర్ ఉద్యోగం. నాలాంటి వాళ్లు ఇక్కడ ఇంకా అరడజన్ మంది వున్నారు. మా ఎడిటర్ గారికి మాత్రం నేనంటే చచ్చేటంత నమ్మకం. అన్నీ నన్నే చూడమంటారు. నా మొదటి రచన చదవడంతోనే, ఆయన నన్ను స్వయంగా పిలిపించారు. ఈ ఉద్యోగం ఇస్తానన్నారు. నేను తటపటాయిస్తూంటే, బలవంత పెట్టి ఒప్పించాను. పేరుకి ఆయనే ఎడిటర్ కాని, అన్నీ నేనే చూసేది. మనం ఇంత బాధ్యతతో పనిచేస్తున్నామా..... చూడండి - ఈ పనివాళ్ళు!? లక్షసార్లు చెప్పాను - కంపోజింగ్ ఎంతో నీట్ గా వుండాలని, ఎలా వుండాలో...! అబ్బే... ఒక్కడు కూడా మాట వినిపించుకోడండీ!" అంటూ అనర్ఘళంగా, నయాగరా జలపాతంలాగా వార్ఘరిని వదిలేశాడు.
ఆయన మాటలతో తిరిగి ఈ లోకంలోకి వచ్చాను.
కంపోజిటర్ ధర్మమా.. .అని తాటిచెట్టు పీడ వదిలింది కదా - 'బ్రతుకుజీవుడా....' అని సంతోషిస్తూ, మళ్ళీ అది చుట్టుకోకుండానే జారుకుందామని, "సార్.... నేను వెళ్ళొస్తాను. ఇంకోసారి కలుస్తాను...." అంటూ సగం లేచాను.
"అమ్మమ్మ. రాక రాక వచ్చారు. కాఫీ అయినా త్రాగకుండా మీరు వెళ్తానంటే ఎలా? అసలు మనం ఏమీ మాట్లాడుకోందే?" అంటూ కాలింగ్ బెల్ నొక్కాడు.
బాయ్ రాగానే రెండు కాఫీలు పట్రమ్మని ఆర్డరు ఇచ్చాడు.
'చచ్చాంరా దేవుడా! ఇంక ఈ శిక్ష నాకు తప్పదు. తాటిచెట్టు సంగతి తేల్చందే నన్ను ఒదిలేట్టు లేడు. ఎరక్కపోయి చిక్కబడ్డాను' అనుకుంటూ తిరిగి కుర్చీలో కూలబడ్డాను.
"ఆ .. ఇంతకీ మీరు చెప్పనేలేదు - తాటిచెట్టు చదివారో, లేదో?" అంటూ మళ్ళీ అందుకున్నాడు అతను.
'ఆరి... వీడిల్లు బంగారంగాను - ఈ పీడాకాలపు తాటిచెట్టు వదిలేట్టు లేడే!?' అని మనస్సులోనే అనుకుని పైకిమాత్రం ముక్తసరిగా -
"లేదండీ...!" అన్నాను.
"తాటిచెట్టు చదవలేదూ? వేసిన కాపీలన్నీ నెల తిరగకుండానే అమ్ముడై పోయాయండీ! ఎంత గొప్ప సమీక్ష వచ్చిందనుకున్నారు!? ఈమధ్య అనేకమంది నిర్మాతలు దానిని సినిమా తీస్తామంటూ, హక్కులు అమ్మమంటూ నా చుట్టూ తిరిగిపోతున్నారు. ఇంకా ఎవరికి ఇవ్వాలో నిర్ణయించుకోలేదు. నిన్నొకాయన వచ్చి డైలాగ్స్ కూడా నన్నే రాయమన్నాడు. ఆయనకు ఇస్తే బాగుంటుందేమోనని ఆలోచిస్తున్నాను..." అన్నాడు ఆ రచయిత ఒక్కబిగిన.
అప్పటికి నాకు అర్దమైంది - ఆ తాటిచెట్టనేది.. ఈ మహానుభావుడు రాసిన ఒక నవలారాజం అని! ఇంక ఫర్వాలేదు.. సమాధానం చెప్పడానికి ఓ దారి దొరికింది.
"తాటిచెట్టు గురించి చాలా విన్నానండీ. ఎన్నో మంచి సమీక్షలు కూడా చూశాను. ఏదీ... కొందామంటే ఎక్కడా ఒక్క కాపీ కూడా దొరకందే?తీరిక చేసుకుని ఏ లైబ్రరీకన్నా వెళ్లి చదువుతాను" అన్నాను -ముఖానికి నవ్వు పులుముకుని.
"చూశారా ... నాకు తెలుసు - మీరు అలా అంటారని...! దానికి వున్న డిమాండ్ అటువంటింది. మీలాంటి ఇంటరెస్ట్ వున్నవారికి ఒక కాపీ ఇద్దామన్నా, ఒక్క కాపీ కూడా మిగిలిలేదు. ఆ పబ్లిషర్ కేవలం పది కాపీలు మాత్రమే ఇచ్చాడు. నేను కాపీలు ఇయ్యలేదని కొందరు ఆప్తమిత్రులకి నామీద కోపం కూడా వచ్చింది. ఏం చేస్తాను చెప్పండీ... ఎవరికని ఇస్తాను చెప్పండి?" అన్నాడు కట్టలు తెంచుకున్న ఉత్సాహంతో - ఒక పక్క నాకు కాపీ ఇయ్యలేకపోయినందుకు బాధను నటిస్తూ.