మీరోసారి రారాదూ! కంపెనీ లేక చచ్చిపోతున్నాను. బోర్ కొట్టేస్తోంది. మీ ఫ్రెండ్స్ కేమయినా ఇబ్బంది కలిగిస్తే నన్ను క్షమించాలి."
నా కాళ్ళూ చేతులూ వణుకుతున్నాయి. రాధ అతని కోరిక తీర్చేందుకు అజిత్ ని ఎక్కడ వదిలి వెళ్ళిపోతుందోనని.
"వాడ్డూ యు సే, అజిత్! ఈవేళ్టికి సినిమా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుందా! పాపం! శ్రీధర్ కి కంపెనీ లేదు."
"నో!" నవ్వుతూనే అన్నాడు అజిత్.
"సారీ, అజిత్! డోంట్ థింక్ అదర్ వైజ్... భానూ, సీ యూ టుమారో!" అంటూనే కారు ఎక్కి ముందు సీట్లో శ్రీధర్ పక్కనే కూర్చుంది. కారు విమానంలా దూసుకుపోయింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. డబుల్ డెక్కర్ బస్సు టర్నీంగ్ దగ్గర ఆగిపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా ముందుకీ, వెనక్కూ కదలకుండా అలాగే నించుండిపోయింది. పాసింజర్లందరూ పోలోమని బయటికొచ్చి తలోదారీ అయిపోతున్నాను. టాంక్ బండ్ కి చివర బస్టాప్ దగ్గర నేనూ, అజిత్ మిగిలిపోయాం. అతను నా వంక చూడటం లేదు. అతనికి చాలా పెద్ద దెబ్బ తగిలింది. కేవలం ఆ సంఘటనకి ప్రాధాన్యమిచ్చి, రాధను శాశ్వతంగా దూరం చేసుకొంటాడేమో అని భయం వేసింది. రాధ కొంచెం తొందరపడింది- అంతే! అది చాలా స్వల్పవిషయమని, ఆలోచించటం అనవసరమనీ చెప్పాలనిపించింది.
"మీరేం ఆలోచిస్తున్నారు? రాధ గురించేనా?" నవ్వుతూ అడిగానతన్ని.
బహుశా నా నవ్వు చాలా అసహజంగా ధ్వనించిందేమో, నావేపు అదోలా చూశాడతను.
"రాధకి కేవలం శ్రీధర్ అంటే అపేక్ష! అంతే! రాధ ప్రాణ స్నేహితురాలు మయూరి లేదూ, ఆమె తమ్ముడతను. మయూరి తనకేమీ తోచకపోతే ఎప్పుడూ శ్రీధర్ ని పంపి రాధని పిలిపిస్తూంటుంది."
"సరే! నేనిక వెళ్తాను" అన్నాడతను సీరియస్ గా.
నాకు నోట మాటలు దొరకడం లేదు. కళ్ళనిండుగా నీళ్ళు నిండిపోయినాయ్. అతని కలా అన్యాయం జరగడానికి కారణం నేనే అయినట్లూ, అసలు నేనే అతనికి అన్యాయం చేసినట్లూ పిచ్చిపిచ్చి ఆలోచనలు చుట్టుముట్టినాయి. నా కళ్లల్లోకి చూశాడతను. అదే ఆకర్షణ! పిచ్చెక్కిపోతూంది. జీవితం అతని చేతుల్లో ఉంచేయాలన్నంత బలమయిన కోరిక. రెండడుగులు నడిచి, వెనక్కు తిరిగి చేయి ఊపి ముందుకు నడిచాడతను. బహుశా ఇంక అతను కనిపించడు. అతనని ఆపాలని ఉంది. కాని, ఎలాగో తెలీటం లేదు.
తర్వాత కొద్ది నెలలకే రాధకి, శ్రీధర్ కి వైభవంగా వివాహం జరిగిపోయింది. నేను పెళ్ళికెళ్ళాను. కాని, ఓ స్నేహితురాలి వివాహం అవుతూందన్న సంతోషం నాకా పెళ్ళిలో కలగలేదు. ఆమె శ్రీధర్ తో కలకత్తా వెళ్ళిపోయింది. వెళ్ళే రోజు నాంపల్లి స్టేషన్ కు వెళ్ళి, ఆమెకు వీడ్కోలు ఇచ్చాను. బండి వెళ్ళిపోయింది తర్వాత ఒక్కర్తెనూ లేడీస్ వెయిటింగ్ రూమ్ లో కూర్చుని నాకు తెలీకుండానే చాలాసేపు ఏడ్చాను.
ఆ తర్వాత ఒక్కసారి అతను నన్ను కలుసుకున్నాడు.
"చాలా రోజులు పట్టింది - రాధ ఇచ్చిన షాక్ మర్చిపోడానికి! ఇప్పుడు కొంచెం ఎడ్జెస్ట్ అయింది మనసు. కనీసం అప్పుడప్పుడూ నీవైనా కలుసుకుంటుంటే పూర్తిగా మామూలు మనిషవుతానేమో"
కానీ వారం లోపలే సడెన్ గా మెం పూణెకి షిఫ్టయ్ పోవాల్సివచ్చింది. అంతే.
ఆ తరువాత అతను కనిపించలేదు.
* * * * *
ఎనిమిదేళ్ళ తర్వాత ఓ రోజు సాయంత్రం డ్యూటీకి వెళుతూంటే త్రోవలో అకస్మాత్తుగా చార్మినార్ దగ్గర వర్షం దిమ్మరించేసింది. ప్రక్కనే ఉన్న ఇరానీ హోటల్ దగ్గర నించున్నాను. పది నిమిషాల తర్వాత కొద్దిగా తగ్గింది. రెయిన్ కోటు తొడుక్కొని గొడుగుతో రోడ్ మధ్యగా నడుస్తున్నాడొకతను. నేనూ ఓ రెయిన్ కోటు కొనుక్కొంటే బావుంటుందనిపించింది. ఆ రెయిన్ కోటతను నాకు కొంచెం దూరంగా నించుండిపోయాడు.
"నిన్నే పిలిచేది ! ఇట్రా!" అన్నాడు నా వంక చూసి.
నాకు చాలా విస్మయం కలిగింది. అతన్ని పరీక్షగా చూశాను. అతను అజిత్.
"వర్షంలో తడిసిపోతావు! గొడుగులోకి రా?"
అతని గొడుగు క్రిందకు చేరాను.
"నర్సు ఉద్యోగం చేస్తున్నావన్నమాట!" అన్నాడతను నవ్వుతూ.
"అవును!"
"నువ్వు ఎంత మారిపోయావో తెలుసా? నేనయితే నిన్ను గుర్తించటానికి చాలా అవస్థపడ్డాను!"
చిన్నగా నవ్వాను.
"నేనేం మారలేదు సుమా! అదే ఉద్యోగం, అదే గది! అన్నట్లు, ఇప్పుడు నా రూమ్ కి రారాదూ? మనం చాలా మాట్లాడుకోవాలి. నీకోసం ఎప్పటినుంచో వెతుకుతున్నా. లక్కీగా ఇవాళ దొరికావ్"
తలెత్తి అతనివంక చూశాను. అదే ఆకర్షణ! జీవితమంతా అతని పక్కన గడిపేయాలనిపించేటంత బలమయిన ఆకర్షణ. ఈసారి ఆ ఆకర్షణ నుంచి తప్పుకోవటం నా చేతకాదు.
అతనేం మాట్లాడతాడు? నాకోసం ఎందుకు వెతుకుతున్నాడు?
ఇద్దరం ఆటో ఎక్కాం. ఒకవేళ అతను ప్రపోజ్ చేస్తాడా? అత్యాశకు పోతున్నానా? ప్రపోజ్ చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. ఎగిరి గంతేసి ఒప్పుకుంటుంది తను - కానీ అతనికి తనమీదసలు అలాంటి అభిప్రాయం ఉందా? ఒకవేళ రాధ గురించి మాట్లాడతాడా? ఏదేమైనాగానీ ఈసారి నేను అతని ఆకర్షణకి దూరం కాదల్చుకోలేదు.
* * * * *