Previous Page Next Page 
లవ్ స్టోరీస్ పేజి 10


    దానిష్టం. ఏమే, ఉంటావా?" అడిగింది రాధ.

    "మా ఇంట్లో కోప్పడతారేమో?" అన్నాను అర్ధంగాకారం సూచిస్తూ.

    "ఏమీ అనరు! నేను చెబుతాలే! అయినా, ఇద్దరం కంబైన్డ్ గా తిరిగితే ఎవరికీ అనుమానంరాదు!" ముగ్గురం లేచి నడవసాగాం . కార్లు, బస్సులు చాలా వేగంగా పక్కనుంచీ దూసుకుపోతున్నాయి. చలి కొంచెం ఎక్కువయింది. టాక్సీలో బార్ కి చేరుకున్నాం. అప్పటికి టైమ్ పదయింది. అన్ని టేబుల్స్ దగ్గర చాలామంది స్త్రీలు, పురుషులు కూర్చుని ఉన్నారు. మేము కూడా రిజర్వ్ అయిన టేబుల్ దగ్గర కూర్చున్నాం.

    "ఏ డ్రింక్ కావాలి?" అడిగాడతను.

    "జిన్" అంది రాధ. అంతవరకూ రాధ తాగుతుందనిగాని, తాగగలదని గాని నేననుకోలేదు.

    "నీకో?" నన్నడిగాడతను.

    "థాంక్స్! ఏమీ వద్దు?"

    వాళ్ళిద్దరూ నన్ను చూసి నవ్వారు.

    "మరేం ఫర్వాలేదులే, నేను ఇంతకుముందు ఒక్కసారే తాగానది. నిషా ఎక్కదు. కొంచెం తాగు!" అంది రాధ.

    మా ఇద్దరకూ చెరో పెగ్ జిన్, తనకో పెగ్ విస్కీ తెప్పించాడతను. జిన్ తాగుతుంటే నా కది లిక్కర్ అనిపించలేదు. ఓ రకమయిన కూల్ డ్రింక్ తాగుతున్నట్లనిపించింది. అందరం ఎగ్ బిర్యానీ తిన్నాం. సరిగ్గా అప్పుడే ఓ అమ్మాయి డయాస్ మీద కొచ్చి ఆర్కెస్ట్రాతో హిందీ పాటలు పాడటం మొదలుపెట్టింది. రెండు మూడు పాటలు పాడాక, మరో అమ్మాయి చెంగున బోనులోనుంచి బయటకు దూకిన పులిలాగా డయాస్ మీద కెగిరి నృత్యం మొదలెట్టింది. ఆర్కెస్ట్రా ఊపు కనుగుణంగా ఊగుతోందామె. రెండు నిమిషాలు అలా ఊగి ఊగి చటుక్కున కాళ్ళ చెప్పులు తీసి దూరంగా కూర్చున్న ఓ సర్దార్జీ మీదకు విసిరేసింది. మరికాసేపటికి గౌను తీసి అవతల పారేసింది. ఇంకొంచెం సేపటికి బ్రాసియర్స్ లాగి విసిరేసింది. మగవాళ్ళు పిచ్చికుక్కల్లా అరుస్తున్నారు. ఆడవాళ్ళు సిగ్గులేకుండా విరగబడి నవ్వుతున్నారు. నృత్యం బాగున్నా, రాను రాను ఆ పిల్ల పిచ్చి చేష్ట లెక్కువైపోయాయ్. చివరకు వంటిమీద దారంలాంటి పేలికలతో మిగిలిందామె. మగాడు చూడకుండా ఆమె దాచుకున్నదేంటో నాకర్థం కాలేదు. ఆమె నృత్యం ముగించి లోపలకు వెళ్ళిపోయింది. మొదటి అమ్మాయి మళ్ళీ హిందీ పాటలు అందుకొంది. ఓసారి అందరి ముఖాల్లోకి చూశాడు. అందరి ముఖాల్లో పైశాచికమయిన ఆనందం కనిపిస్తోంది. ఇంకెప్పుడూ  అలాంటి చోట్లకు రాకూడదనిపించింది. రాధకి కూడా అదేమంత నచ్చినట్లు లేదు. మరో డాన్స్ ఆరంభమవగానే పోదామంటూ లేచి బయటికి వచ్చేసింది.

    ఇల్లు చేరుకునేసరికి పన్నెండు దాటుతోంది. ఆ రాత్రి రాధ గదిలోనే పడుకొన్నాను. నిద్రలో ఆ రోజు వచ్చిన కలలు చాలా భయంకరంగా ఉన్నాయి. అదృష్టవశాత్తూ అవి ఉదయం వరకూ గుర్తులేవు. ఆ మర్నాడు కాలేజీ నుంచి రాధ నాతో ఇంటికి రాలేదు. అజిత్ తో ఎక్కడికో వెళ్ళింది. నన్నూ రమ్మని పిలిచింది గాని నాకు అంతకుముందు రోజు అనుభవం గుర్తుకొచ్చి రానన్నాను. ఆ రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి వచ్చింది. వాళ్ళిద్దరి మధ్యా పానకంలో పుడకాలా ఉండటం నాకిష్టంలేదు. అందుచేత ఆ తర్వాత కూడా చాలాసార్లు ఏదో సాకు చెప్పి వాళ్ళతో తిరక్కుండా తప్పించుకొన్నాను.

    ఒకరోజు రాధ స్నేహితురాలు మయూరి తన పుట్టినరోజు సందర్భంగా మమ్మల్ని డిన్నర్ కి పిలిచింది. రాధతోపాటు నేనూ వెళ్ళాను. గెస్ట్ లందరూ వెళ్ళిపోయాక నేనూ, రాధా, మయూరీ వాళ్ల మేడమీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. మయూరి మమ్మల్ని వాళ్ళింట్లో వాళ్ళకు పరిచయం చేసింది. శ్రీధర్ కు పరిచయం చేసినప్పుడు మాత్రం నాకు కొంచెం సిగ్గనిపించింది. అతను మయూరి తమ్ముడు. ఇరవై సంవత్సరాలుంటాయి. తెల్లగా, అందంగా ఉన్నాడు. అయితే, ఇతని అందం ఆడవాళ్ళ అందంలాంటిది. నాజూగ్గా వున్నాడు. అతనితో రాధ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నాకెందుకో భయం వేసింది. అతను కూడా రాధచాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు. అతను ఇంజనీరింగ్ చదువుతున్నాడట. ఇంటికొచ్చేటప్పుడు సెలవు తీసుకొంటూ- "మళ్ళీ కలుద్దాం" అంది రాధ అతన్తో.

    "సర్టెన్లీ" అన్నాడతను.

    ఇంటి దగ్గర ఆ రాత్రంతా రాధ గురించే ఆలోచిస్తూ, నిద్రపోకుండా గడిపాను. రాధ నాకు అర్థం కావటం లేదు. ఆమె శ్రీధర్ స్నేహాన్ని ఎందుకు వాంఛిస్తోంది? అతను ఆమెకన్నరెండేళ్ళు చిన్నవాడు. అదీగాక తను అజిత్ ను ప్రేమించింది. అతనూ ఆమెను ఆరాధిస్తున్నాడు. మరిప్పుడు మరో మగవాడితో స్నేహం చేయాల్సిన అవసరమేమొచ్చింది? నా ప్రశ్నలకు సరయిన సమాధానం దొరకలేదు. ఒకవేళ నా ఆలోచనలన్నీ తప్పేమో అనిపించింది. ఏ దురద్దేశమూ లేకుండా అతనితో అలా అందేమో! రాధ ఎవరితో, ఎలా స్నేహం చేసినా నాకేం అభ్యంతరం లేదు. నా భయమల్లా కేవలం అజిత్ గురించే! అతనికి అన్యాయం జరగకూడదు.

    నాలుగు రోజులు ఏ గొడవా లేకుండానే గడిచినయ్. అయిదో రోజు నేను వణికిపోయేటంత సంఘటన జరిగింది. కాలేజీ వదలకముందే నా క్లాస్ కొచ్చి - "నేను మయూరి ఇంటకెళ్తున్నాను. అజిత్ వస్తే ఇంటికెళ్ళిపోయానని చెప్పు" అనేసి, నేనేమంటున్నదీ వినిపించుకోకుండా తన దారిన తాను వెళ్ళిపోయింది. అజిత్ కు ఏం చెప్పాలో తెలీక ఆఖరి పిరీడ్ ఎగ్గొట్టి నేనూ ముందుగానే ఇంటికెళ్ళిపోయాను. ఆ రాత్రి కిటికీ దగ్గర కూర్చుని చదువుకొంటూంటే, పదకొండు గంటలకు ఇంటి ముందు ఆగిన ఓ కారు దిగి, రాధ ఇంట్లోకి వెళ్ళటం చూశాను. అంతసేపు ఎక్కడ తిరిగిందీ నా కర్థం కాలేదు. ఒవేళ మయూరితో కలిసి సినిమా కెళ్ళిందని సరిపెట్టుకొందామనుకున్నాను గానీ నావల్ల కావటం లేదు. ఆ మర్నాడు ఆమెను కలుసుకొన్నాను. క్రితం రోజు జరిగిన సంగతులేమీ చెప్పకపోవడంతో, ఆమె మొండితనం చూసి భయం వేసింది.  

    రెండ్రోజుల తర్వాత కాలేజీ నుంచి నా రెక్క పుచ్చుకొని ఆటోలో మదీనా హోటల్ కు లాక్కుపోయింది. అజిత్ అక్కడే ఎదురు చూస్తున్నాడు.

    ముగ్గురం కాబిన్ లోకి నడిచి కూర్చున్నాం. ముగ్గురికీ 'పౌనా' ఆర్డర్ చేశాడతను.

    "నాలుగురోజుల్నుంచీ అంతులేకుండా, నాకు కనిపించకుండా ఎక్కడ తిరుగుతున్నావ్?" అడిగాడతను.

    "మయూరి అనీ మా ఫ్రెండ్ ఒకామెకి మారేజీ సెటిలయింది. శారీస్ సెలక్ట్ చేస్తున్నాం - హైద్రాబాదంతా తిరిగి!"

    "ఈ నాలుగు రోజులూ కనిపించనందుకు సెకండ్ షో సినిమాకి రావాలీవేళ!" అన్నాడతను.

    "సరే! ఒప్పుకున్నాను" అంది రాధ.

    "నువ్వేమంటావ్- పాపా?"

    "నా పేరు పాప కాదు."

    "అయినా ఇంకా పాపవే నువ్వు"

    "నా వయసు పదహారేళ్ళు..."

    "సరే మనకి వాదం ఎందుగ్గానీ నువ్వూ వస్తున్నావా?"

    "ప్రయత్నిస్తాను" అన్నాను.

    రాత్రి ఇంటిదగ్గర భోజనాలు ముగించి నేనూ, రాధా టాంక్ బండ్ దగ్గర అజిత్ ను కలుసుకొన్నాం. ముగ్గురం నెమ్మదిగా ఎంబసీ వేపు నడవసాగాం. వెన్నెల కాంతిముందు వీధిలైట్లు వెలవెలబోతున్నాయి. మాకు పక్కనే అందమయిన కారు సడెన్ బ్రేకులతో ఆగింది డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఓ యువకుడు రాధను పలుకరించాడు.

    "హల్లో, రాధాదేవీ! మీకోసం అక్కా, నేనూ మీ ఇంటికెళ్ళాం..."

    అతనెవరబ్బా! ఎక్కడో చూశాను... ఆ గుర్తుకొచ్చింది. మయూరి తమ్ముడతను.

 Previous Page Next Page