రౌడీ పిల్ల
సీత మా మామయ్య కూతురు. నాకంటె అయిదేళ్ళు పెద్దది. నాకు బాగా గుర్తుంది. చిన్నప్పుడు నేను మాణిక్యాలరావు పంతులు బడికి వెళ్ళనని మారాం చేస్తుంటే, మా అమ్మ, రెండిళ్ళవతల ఉన్న మామయ్య వాళ్ళింటికెళ్ళి సీతతో చెప్పి వచ్చేది. వెంటనే సీత వచ్చి నా చెవి మెలిపెట్టి తనతోపాటు బడికి లాక్కుపోయేది. అంచేత అప్పట్లో సీతంటే నాకు భయం, కోపం కూడా ఉండేవి. అప్పుడప్పుడు తనమీద కోపమొచ్చి 'రౌడీ' అని తిట్టేవాడిని. తను నవ్వి ఊరుకొనేది. ఇలా అన్జెప్పి అనడం నేనొక్కడినే కాదు. మా బంధువులూ, మాపేటలో కుర్రాళ్ళూ అందరూ అనేవాళ్ళు. ఆఖరికి అత్తయ్య కూడా సీత చేసే అల్లరి పనులకు విసిగిపోయి 'నిజమేరా చిన్నా! ఇది వట్టి రౌడీ పిల్ల. నా కడుపునెలా పుట్టిందో తెలీడం లేదు. ఛస్తున్నాననుకో దీంతో!" అనేది.
తను అయిదోక్లాసు రెండో సంవత్సరం చదువుతూండగా జరిగిన ఓ సంఘటన నేను మరిచిపోలేను. బహుశా అప్పటినుంచే సీతకి 'రౌడీపిల్ల' అనే పేరు వచ్చిందనుకొంటాను. ఆ రోజు రీసెస్ లో కొంతమంది కుర్రాళ్లు సీతవాళ్ళ పెరట్లోని జామచెట్టెక్కి కాయలు కోసుకోవడం మొదలెట్టారు. సీత వాళ్ళని చూసి ఇంట్లోకెళ్ళి ఓ కర్ర తెచ్చి తనూ చెట్టెక్కి వాళ్ళని కొట్టడం మొదలెట్టింది. ఆ కంగారులో ఓ కుర్రాడు చెట్టుమీద నుంచి కింద పడిపోయాడు. కొద్దిగా దెబ్బల్తగిలినయి. వెంటనే అతనిని హాస్పిటల్ కి తీసుకుపోయారు. ఆ రోజు నుంచీ సీత కథ మొదలయిందనుకోవచ్చు. సీతతో మాట్లాడ్డానిక్కూడా అందరికీ భయంగా వుండేది. తనకి మొహమాటం, భయం ఏమీలేవు. ఎవరినైనా సరే ఎంతమాటయినా సూటిగా అనేసేది.
సీత హైస్కూల్లో అడుగుపెట్టిన కొద్దిరోజుల్లోనే అందరిచేతా గుర్తించబడింది. మా వూళ్ళోజనం చాలా చిత్రమయినవాళ్ళు. ఏదయినా ఓ కొత్త వస్తువు కనబడితే ఎగబడి చూసేవాళ్ళు. అంతటితో వదలరు. దానిని హేళన చేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళకి ఏదయినా సరే 'పాత' అంటే ఇష్టం. అలాంటి మా ఊళ్ళో సీత మొదటిసారిగా పంజాబీ డ్రస్ వేసుకొని స్కూల్ కెళ్ళేది. నడక కూడా తలెత్తుకొని, ఠీవిగా, అచ్చం మొగపిల్లాడిలా నడిచేది. నేను ఫోర్త్ ఫారంలో కొచ్చేసరికి సీత యస్సల్సీ చదువుతోంది. రోజూ తనతోబాటు నన్నూ స్కూల్ కి పిల్చుకువెళ్ళడం మళ్ళీ మొదలయింది. హైస్కూల్లో కొచ్చింతర్వాత మొగపిల్లలు, ఆడపిల్లల్లోని ఆడతనం కోసం వెదుకుతారు. సీతా చాలామంది యస్సల్సీ కుర్రాళ్ళ దృష్టి నాకర్షించింది. స్కూల్లో చాలామంది ఆడపిల్లలకంటే సీత అందంగా వుండేది. ఉన్నట్లుండి రాత్నారావ్ అనే కుర్రాడొకతను సీతని ప్రేమించటం మొదలెట్టాడు. అతను ఓ చిన్నసైజు రౌడీ. యస్సల్సీ అప్పటికి నాలుగోసారి చదువుతున్నాడు. రోజూ సీత వెనక తిరగడం, నవ్వడం, ఫోజులు కొట్టటం చేస్తున్నాడట. ఇలా అని చాల్రోజుల తర్వాత నాతో చెప్పింది.
"చూస్తుండు! ఎప్పుడో వాడి భరతం పడతాను" అనికూడా అంది. నాకు చాలా భయం వేసింది. వాడితో పోట్లాడ్డం అంత మంచిదికాదు. అదే సీతతో చెప్తే "ఉహు! అలాగా! సిగ్గులేకపోతేసరి. నీకెందుకు? వాడి సంగతి నేను చూసుకొంటానని ధైర్యం చెప్పబోయి నన్ను కూడా భయపెడుతున్నావా? అంటూ సిసింద్రీలా లేచింది. సరేనన్జెప్పి నేను నోర్మూసుకూరుకుండిపోయాను. సీత చెప్పినంతా చేసింది. తను ఇంటికొచ్చేప్పుడు ఓరోజు రత్నారావు దోవలో ప్రేమలేఖ అందించాడట. ఆ ఉత్తరం మర్నాడు ప్రొద్దున్న తీసుకెళ్ళి హెడ్మాష్టరు రామయ్యగారంటే సామాన్యమయిన మనిషికాదు. విద్యార్థుల క్రమశిక్షణ విషయంలో ఆయన చాలా నిర్ధాక్షిణ్యంగా, ఓ డిక్టేటర్ లా ప్రవర్తించేవాడు.
'నా విద్యార్థులకి చదువు రాకపోతే ఫరవాలేదు. కానీ వాళ్ళల్లో క్రమశిక్షణ లోపిస్తే సహించను' అంటూండేవాడు. అప్పటికప్పుడే అన్ని క్లాసులకీ నోటీస్ పంపించి స్కూలంతటినీ అసెంబుల్ చేయించారు. అందరిముందు రత్నారావుని నుంచోబెట్టి అతను చేసిన మహత్తరమైన పనినీ, అందుమూలాన అతనికి లభించిన బహుమతి 'టి.సి. ఇచ్చి గెంటేయడం' అని వివరించి, అక్కడే కేన్ తో అతగాడిని సత్కరించి వదిలారు. ఆ తరువాత రత్నారావు మళ్ళీ నాక్కనిపించలేదు. ఇంత జరిగినా సీతంటే కుర్రాళ్ళకి వెటకారం మరింత ఎక్కువైంది.
'ఒరేయ్! అగ్గి బరాటా వస్తోందిరోయ్ తప్పుకోండి! లేకపోతే టి.సి. ఇప్పించేస్తుంది...' అంటూండేవాళ్ళు - ఆమెను చూడగానే. ఇవిగాక కొన్ని అసభ్యకరమయిన మాటలు గూడా వినబడుతుండేది. సీతని గురించి కొన్ని ఈక్వేషన్లు గోడమీద వెలిసినయ్. ఈ పరిస్థితుల్లో ఆమెతోపాటు స్కూల్ కి పోవాలంటే నాకు చచ్చేంత సిగ్గుగానూ, భయంగానూ ఉండేది. ఆమె నుంచి తప్పించుకు తిరగటానికి విశ్వప్రయత్నం చేసేవాడిని. ఆయేడు సీత యస్సల్సీ పాసయి కాలేజిలో అడుగుపెట్టిం తర్వాత నాకు కొంచెం రిలీఫ్ దొరికింది. అయినా మా కాలేజి, హైస్కూల్ రెండూ ఒకే కాంపౌండ్ లో ఉండట మూలాన, అప్పుడప్పుడు ఆమెతో కలిసి వెళ్ళక తప్పేదికాదు. కాలేజీలో సంగతులన్నీ అప్పుడు నాతో చెప్పేది. తన స్నేహితురాండ్ర గురించీ, వాళ్ళ ప్రేమికుల గురించీ వాళ్ళు తనకు చూపించిన ప్రేమలేఖలు గురించీ, నవ్వుకొంటూ చెపుతూండేది. కాలేజి లెక్చరర్లకి తమాషా పేర్లు కూడా పెడుతూండేది. తోటరాముడనీ, అగ్గిరాముడనీ, చారల గుర్రం అనీ, రకరకాలుగా వుండేవి. ప్రిన్సిపాల్ పేరు బేబి ఎలిఫెంట్ అట.
నేను యస్సల్సీ పాసయి పి.యు.సి. లో కొచ్చేసరికి సీత బి.ఏ. సెకండియర్ లుంది. అప్పటికి 'సీత' అంటే ఎవరో కుర్రాళ్ళందరికీ తెలిసిపోయింది. కారణం ఆవిడ సైకిల్. అయేడు మావయ్యతో పోట్లాడి ఎలాగయితేనేం ఓ ఆడపిల్లల సైకిల్ కొనిపించింది. సీతకి సైకిల్ కొనే విషయమయి అత్తయ్య, మామయ్య పోట్లాడుకొని రెండ్రోజులు మాట్లాడుకోలేదు.
'ఇదుట్టి రౌడీ పిల్లయిపోతోంది. ఏ ఆడపిల్లా తొక్కని సైకిల్ దీనికి మాత్రం ఎందుకు?' మొన్నటికి మొన్న వద్దంటున్నా వినకుండా, టైలర్ దగ్గర కెళ్ళి మొగపిల్లాడిలా చొక్కా, పంట్లాం కుట్టించుకొంది. దాన్ని పూర్తిగా మీరే చెడగొడుతున్నారు. దీని వెకిలి చేష్టలు చూస్తే, కుర్రాళ్ళు వేళాకోళం పట్టించక వదుల్తారేంటి? ఏమయినా సరే సైకిల్ కొనడానికి వీల్లేదు - అంటూ పట్టుబట్టింది అత్తయ్య.
కాని మామయ్య వినిపించుకోలేదు. ఆయనకి సీతంటే విపరీతమయిన ప్రేమ. కొడుకయినా కూతురయినా తనొక్కర్తే అవడం మూలాన అడిగినదేదీ కాదనకుండా సమకూరుస్తూండేవాడు. అంచేత అత్తయ్య మాటలకి సున్నా మార్కులేసి సైకిల్ కొనేశాడు. అక్కడ్నుంచీ ఓ వారం రోజుల పాటు ఏనుగుల బంగళా దగ్గర మైదానంలో నేను సీతకి సైకిల్ నేర్పాను. ఆ తరువాత ఝామ్మని సైకిల్ మీద రోజూ కాలేజీ కెళ్ళడం మొదలుపెట్టింది. ఆమెని చూడ్డానికి చాలామంది వరాసుపేట రోడ్డుమీద సాయంత్రం టైమ్ కి నుంచుంటుండేవాళ్ళు.
అదే సంవత్సరం నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. సుమారుగా నెల్రోజులు మంచం మీదుండిపోయాను. ఆ నెల్రోజులూ తనూ కాలేజి ఎగ్గొట్టి ఆమె నాకు చేసిన శుశ్రూషలు తలుచుకుంటే ఇప్పటికీ నాకళ్ళ వెంబడి నీళ్ళు తిరుగుతాయి. అప్పటినుంచి నేను సీతని మామూలు అమ్మాయిలాకాక ఓ దేవతలా భావించుకొనేవాణ్ణి. ఆ నెల్ర్రోజుల్లోనూ తను బాగా చిక్కిపోయింది. జ్వరం తగ్గిం తరువాత నేను ఆమెతో అన్నాను. 'సీతా! నువ్వు మా అమ్మకంటె ఎక్కువగా ఈ నెల్ర్రోజులూ నన్ను కనిపెట్టుకొని ఉన్నావ్. ఇలాంటి విపరీతమైన అభిమానం నేను సినిమాల్లో చూసినప్పుడు హేళనగా నవ్వుకొనేవాణ్ణి. కాని నిన్ను అదే పరిస్థితిలో చూస్తుంటే నేనెంత అమాయకుడినా అని ఆశ్చర్యం వేసింది' ఆరోజు నుంచీ సీత నాకు ఆత్మీయురాలయిపోయింది. ఏ పనయినా ఆమె సలహాలేందే చేసేవాణ్ణి కాదు. నాకు సంబంధించిన ప్రతి విషయమూ ఆమెకు తెలియాల్సిందే.
ఆ మరుసటి సంవత్సరమే సీతకి వివాహం చేయడానికి ప్రయత్నాలు జరిగినయ్. అత్తయ్య కొంచెం పూర్వకాలపు మనిషవటం మూలాన సీత పెళ్ళి విషయమై మామయ్యని పోరేసింది. సీతని చూడ్డానికి మొదటగా ఓ మెడికల్ రిప్రజెంటేటివ్ వచ్చాడు. ఆరోజు నేనూ అక్కడే ఉన్నాను. అత్తయ్య ఆమెని అలంకరించబోతే ఎదురుతిరిగి "ఛప్! వాడెవడి కోసమో నేనలంకరించుకోవటమేంటి?" అనేసి చకచకా నడిచి అతని కెదురుగా సోఫాలో కూలబడింది. ఆ తరువాత అతనో ప్రశ్న అడిగితే, తను రెండు ప్రశ్నలడగడం మొదలెట్టింది. ఇంత గొడవ జరిగినా ఆ కుర్రాడికి సీత నచ్చింది. పెళ్ళాడ్డానికి ఒప్పుకొన్నాడు.అందరూ తీరిగ్గా సంతోషపడుతూంటే సీత ఛివాలున హాల్లో కొచ్చి 'ఆ నల్లటి కుర్రాణ్ణి నే చేసుకోను..." అనేసింది. మా పిన్ని పిల్చి అదేమిటీ! నలుపయితేనేం? కుర్రాడు చక్కగా ఉన్నాడుగదా' అని నచ్చచెప్పబోతే అంతచక్కగా ఉంటే బాబాయికి విడాకులిచ్చి ఆ కుర్రాణ్ణి నువ్వే చేసుకో! అని క్రూయల్ గా జవాబిచ్చింది. దాంతో మా పిన్నికి వళ్ళుమండిపోయి సీతనలా చిన్న పెద్దా లేకుండా పెంకిగా, పెంచినందుకు అత్తయ్యని దులిపేసి బండెక్కేసింది. నాకు మాత్రం సీత ఆ కుర్రాణ్ణి వద్దనటంలో అనౌచిత్యం ఏమీ కన్పించలేదు. తెల్లగా అందంతో మెరసిపోయే సీతకి ఆ కుర్రాణ్ణి కట్టెయాలని చూడడం నాకూ నచ్చలేదు. అంత ధైర్యంగా వ్యవహరించినందుకు ఆరోజు సాయంత్రం సీతకి అభినందనలు తెలిపేను.