Previous Page Next Page 
కాంతం కాపరం పేజి 11


    "ఆమాట లేమిటీ? పద్మములతో సమానమైన ముఖము గలదానా అని అనటం ఎందుకూ నన్ను వచ్చీ రావటంతోనే_ఇవీ ఆవిడ మాటలు.

    నిన్నెవరన్నారూ? ఇవి నా మాటలు.

    "మరి ఎవరి నాన్నారేమిటి? నేను ఇంకా నన్నే అన్నారనుకొంటున్నా, ఇంకా ఎవరినైనా కూడా_ఇలాంటి మాటలు అంటూ వున్నారా ఏమిటీ!! లేకపోతే కలవరిస్తున్నారా?" అన్నది మా కాంతం నా ప్రక్కనే నన్ను అనుకుని కూర్చుని.

    దానికేదన్నా జవాబు చెప్పాలెగదా నేను. చెప్పలేదు. నవ్వనైనా నవ్వలేదు. ఊరికే అల్లాగ ఉండిపోయినాను. పుస్తకంలాగ పడుకొని ఊరుకొన్నాను. పలకలేదు; ఉలక లేదు.

    నేనంటే బుద్ధి చెప్పుకొని ఊరుకొన్నానుగాని ఆ నోరులేని చేతులకు ఏం తెలుసు పాపం తలక్రింద నున్న ఎడమచేయి పడగ విప్పిన పాములాగ లేచి ఆమె కంటి స్థానాన్ని చుట్టి వేసింది. ఇక అంతపని జరిగిన తరువాత ఊరుకోవటం ఎందుకని నేనూ, ఒక వేలును నాభిస్థానానికి తాకించి చక్కిలిగింత పెట్టాను.

    నిన్ను అనటం కాదూ...ఇంకొకరిని అనటమూ కాదు. పుస్తకాల్లో మాటలు చదువుతున్నాను." అని అప్పటికి తెముల్చుకొని జవాబు చెప్పగలిగాను. "అల్లాగా! ఏమిటి? చదవండి. ఎవరూ అంటూ ఉన్నారూ. ఏమిటి సందర్భం? చెప్పండి కథ ఏమిటో _వింటానూ.' అన్నది మా ఆవిడ వంగి, నా ముఖం మీద ముఖం పెట్టి, చెదరిన నా క్రాపును సవరిస్తూ.

    "చెప్పటానికి పెద్ద కథ ఏమీ లేదు ఇందులో, ఇదొక వైద్య గ్రంథమూ, ఇందులో..."

    "వైద్య గ్రంథమూ అంటే మందూ మాకూ"

    "ఆ అదే అదే. రోగాలూ, రోగలక్షణాలూ వాటిని చికిత్స చేయాల్సిన విధం అదంతా ఈ పుస్తకంలో వ్రాశాడు గ్రంథకర్త" అన్నాను.

    ఈ మాటలు అంటూనే వున్నానూ, నా కుడిచెయ్యి పుస్తకాన్ని వదిలేసి. అమాంతంగా, దానంతట అదే వెళ్ళిపోయి ఆమె చెక్కిళ్ళమీద పడిపోయింది. అందులో నా ప్రయత్నం ఏమీ లేదు.

    ఆవిడ నా చెయ్యి మెల్లగా, బహు జాగ్రత్తగా తీసింది. అదేదో నలిగిపోగల మెత్తని పువ్వులాగతీసి, తన రొమ్ముపై నానించుకొని నా వేళ్ళసందుల్లోకి తన వెళ్ళు పోనిచ్చి, విలాసంగా నొక్కుతూ మళ్ళీ అన్నదీ "అయితే చూడండీ. రోగాల సంగతి చదువుతుంటే నవ్వు ఎందుకు వచ్చిందండీ?" అని.

    "దానికి  ఒకటీ...రెండూ.....చూశావా  రెండు కారణాలున్నాయి" అన్నాను, చెయ్యి చిలిపి చేష్టలు చేస్తూ ఉండగానే.

    "ఆ రెండు కారణాలూ ఎల్లాంటివో నొక్కి వక్కాణించండి అన్నది మా ఆవిడ నవ్వుతూ, నా చెక్కిళ్ళు కూడా నొక్కింది."

    "అల్లాగే...అంతకంటే సంతోష విషయమేముందీ? మొదటి విషయం, ఈ వైద్య గ్రంథకర్త లోలంబరాజు, వైద్య గ్రంథాన్ని అంతా తన ప్రియురాలుకు చెప్పినట్లుగా వర్ణించాడు.

    "అయితే మీకు నవ్వు ఎందుకూ?"

    "నేను నా కథలన్నీ నీపేరనే వ్రాసినట్టుగా వుందని నవ్వు వచ్చింది."

    "అల్లాగ కాదు. మీరు వ్రాసే పుస్తకాలన్నీ కూడా నాకు చెప్పినట్లుగా వ్రాయండి. "ఓ కాంతం_అక్బరు చక్రవర్తి మహమ్మదీయుడు అయ్యు_హిందువుల యెడ మిక్కిలి దయతో ప్రవర్తించడం చాలా గొప్ప విషయం సుమూ! అని ఈ ధోరణిలో వ్రాయండి."

    "సరేలే. అది అట్లాగుంచు. ఇక్కడ వ్రాస్తాడూ, ఓ రత్నకలా, కటకరోహిణి కషాయము నోటి అసహ్యమును పోగొట్టుటయున్నూ తామర మొగ్గవంటి కుచములు గల స్త్రీని ఆలింగనము చేసికొనుట వలన స్త్రీకి సంతోషము గలుగుటయున్నూ, అను నీ రెండున్నూ నాకు ఆశ్చర్యముగా వున్నవీ అని."

    "ఇక ఈ విషయం ఈ పాటున కట్టి పెట్టి మీరు నవ్వటానికి ఆ రెండో కారణం ఏదో అది కొంచెం నొక్కకుండా వక్కాణించండి."  
            
    "రెండోది ఏముందిలే_అది సామాన్యవిషయమే. ఆ పుస్తకంలో రోగాలను గురించి చదువుతూ వుంటే ఆ రోగ లక్షణాలన్నీ నాకు ఉన్నట్లు తోస్తున్నది. సన్ని పాత లక్షణాలను గురించి చెపుతూ_శరీర మంతయు నొచ్చుట మొదటి విషయమూ అన్నాడు. ఇప్పుడు నాకు శరీరమంతా నొప్పులుగా ఉంది. 'ఉరిమి చూచుట అన్నాడు తరువాత.'

    "అది మీకు అలవాటే ఆయెను, చీటికి మాటికి ఉరిమి చూస్తుంటారు. ఈ లక్షణం మటుకు మీకు తీవ్రంగా ఉన్నట్లు నేనే ఒప్పుకొంటాను" అన్నది. 

      "సరే నీవే ఒప్పుకొన్నావా! ఇక మూడో లక్షణం కనుబొమ్మలు ముడి పడటం మనకు సహజ లక్షణాలేనాయె. తరువాత?"

    "తరువాత ఆడటం__పాడటం అన్నాడు"

    "అవి ఇంకా పుట్టలేదనుకొంటా" అన్నది మా ఆవిడ.

    "పుట్టకేం? ఇపుడు పుట్టినాయి. ఇపుడు లేచి ఆడి పాడుదామా అనిపిస్తున్నది."

    "కాబట్టి ఏమంటారు ఇంతకూ?"

    "ఏమనేది, ఏమున్నదీ_చిత్తవిభ్రమ సన్నిపాతం నాకు పూర్తిగా కలిగింది."

    "ఎబ్బే? ఏం మాటలివీ__"

    "ఉన్నమాట అంటే నీకు అంత కష్టం ఎందుకూ? కలిగిన మాట నిజము_చిత్త...విభ్రమ...సన్నిపాతం _తెలిసిందా?" అని మాట విడదీసి ఉచ్చరించాను.

    "మీకా, చిత్త_విభ్రమ_సన్నిపాతమా? అని పకపకా నవ్వుతూ, తన రెండు చేతులలో నాతలను తన మెత్తని ముఖానికి అద్దుకొంది."

    పేరంటానికి వెళ్ళి వచ్చింది కాబోలు ఆరోజు, మెడకు మంచి పరిమళము గల గంధం పూశారు, ఆ సువాసన, ఆ తల నూనెకు సంబంధించిన పరిమళం నాకు మత్తెక్కించినాయి. నాకు కళ్ళు మూతలు పడ్డాయి.

    ఆమె పెదవులు నా బుగ్గలను వెచ్చగా తాకేటంత వరకు నాకు ఈ లోకమే తెలియదు.

    నిజంగా నేను ఆరోజున ఏదో స్వర్గసౌఖ్యాన్ని అనుభవించాను. నేను కవినిగాదు, భాషరాదు. ఆ సౌఖ్యాన్ని వర్ణించలేను. కాని అనుభవించాను. ఈ జన్మకు ఆఖరుసారి అనుభవించాను. ఆ సౌఖ్యము యొక్క లోతూ రంగూ, ఆనందమూ అనుభవించిన వాళ్ళకే తెలియాలె.

    కాని ఆ ఆనందం ఇలాంటిదీ అని చెప్పడానికి నోరు లేదే అని ఏడుపొస్తున్నది చెప్పలేక పోనీండి. కాని నేను ఆనందాన్ని పొందిన మాట నిజమేగా!! అనుభవించాను. అనుభవించాను. అనుభవించాను, జన్మలో ఇక అనుభవించాను, ఆ రోజున నిజంగా చిత్త విభ్రమ సన్నిపాతం కలిగింది. ఆ రోజున నిజంగా చిత్తవిభ్రమ సన్నిపాతం కలిగింది. అందుకని అన్నానూ ఆవిడతో అప్పుడూ "నిజంగా కాంతం ! నాకు ఆ జబ్బు ఏర్పడ్డదీ" అన్నాను.

 Previous Page Next Page