లత, సుధీర్ లకి చదువు మీద అస్సలు ధ్యాస ఉండేది కాదు. సుధీర్ కాపీ లు కొట్టి, లత ముక్కి మూలిగి ఏదోలా డిగ్రీలు ముగించారు ఇద్దరూ.
అసలు సుధీర్ ని, బృంద పెళ్లి చేసుకుంటుందని తను ఏనాడూ అనుకోలేదు. పరస్పర విరుద్ధమైన వ్యక్తిత్వాలు వాళ్ళవి. వాళ్ల పెళ్లి లతకు అస్సలు ఇష్టం లేదు. అక్కకు నచ్చజెప్పాలని చాలా ప్రయత్నించింది.
"వినట్లేదు. ఆమె ఖర్మ. నేనేం చేయలేను" విసుగ్గా అంది లత తనతో.
తన అన్న ని తన ముందే తీసిపారేయటం తనకి నచ్చలేదు.
"మీ అంత ఆస్తులు లేవని తప్ప మా అన్నయ్య కి ఏం తక్కువని?" అన్నాడు.
ఎప్పుడూ లేనిది ఆ రోజు గొడవయింది లత తో.
తన సంగతి తెలిసీ తనేదో డబ్బుకి ప్రాధాన్యత ఇస్తుందన్నట్లు మాట్లాడటం లత కి నచ్చలేదు.
ఆ రోజుతో తమ ఇద్దరి మధ్యా పెద్ద అగాధం ఏర్పడింది.
***
బృంద, సుధీర్ ల పెళ్లి అనుకోటానికి దాదాపు రెండు నెలల ముందు నుంచీ తనకీ, సుధీర్ కీ మధ్య ఏదో తేడా, అడ్డు పొర ఏర్పడ్డట్లుగా అనిపించేది. అది ఎందుకో, ఏమిటో చానాళ్ళ దాకా అర్థం కాలేదు.
తరచుగా సుధీర్ తన మీద కక్ష కట్టినట్లు ప్రవర్తించే వాడు. వీలు దొరికిప్పుడల్లా తన మీద కసి తీర్చుకోవాలన్నట్లుగా ప్రవర్తించేవాడు. ఇప్పటికీ అదే ధోరణి.
ఒక సంఘటన తనకు బాగా గుర్తు. మొట్టమొదట సారి తన మీద అతనికి ద్వేషం ఉందని బహిర్గతం అయిన సంఘటన.
***
సుధీర్ ఎమ్మెల్యే అయిన మొదటి సంవత్సరం.
కార్తీక్ సైకాలజీ లో ఎంఫిల్ చేస్తున్నాడు.
సాయంత్రం అయిదు అవుతోంది. చదువుతున్న బుక్ తీసి పక్కన పెట్టి, యూనివర్సిటీ లో క్రికెట్ మాచ్ ప్రాక్టిస్ కి వెళ్ళటానికి బట్టలు మార్చుకుంటుంటే బెల్ మోగింది.
తలుపులు తీసాడు. ఎదురుగా పోలీసులు.
ఆశ్చర్యంగా చూసాడు తను.
"స్టేషన్ కి పద" అన్నాడు ఒక పోలీస్.
"ఎందుకు?" అయోమయంగా అడిగాడు తను.
"మధ్యాహ్నం ఒకతన్ని చావ కొట్టినందుకు"
ఇంతలోకి కార్తీక్ తల్లి అక్కడికి వచ్చింది.
"వాడు ఇంట్లోనే ఉన్నాడు మధ్యాహ్నం. వాడు ఎవరో తెలుసా? ఎమ్మెల్యే సుధీర్ తమ్ముడు."
ఒక కొడుకు పదవి పేరు చెప్పి రెండో కొడుకు ని కాపాడే ప్రయత్నం చేసిందామె.
ఆమెని చూసి జాలి గా నవ్వి చెప్పాడు పోలీస్
"సార్ అనుమతి తీసుకునే వచ్చాం అమ్మా. అన్ని ఆధారాలు ఉన్నాయి"
ఇంట్లో ఉన్న వాడు ఏదో చేసాడు అని అడ్డగోలుగా అభియోగం మోపి తీసుకెళ్తుంటే ఏమి చేయలేక చేష్టలుడిగి చూస్తుండి పోయింది తల్లి.
పోలీసులు ఆధారాల కింద ఒక వీడియో ని ప్రొడ్యూస్ చేశారు. అందులో తను ఒకడిని చావ చితక్కొడుతున్నట్లుగా ఉంది. సరిగ్గా చూస్తే ఆ మనిషి తను కాదనీ, సుధీర్ అనీ తమ ఇద్దరినీ బాగా తెలిసిన వాళ్ళ కి మాత్రమే అర్థం అవుతుంది.
ఆలోచన లో పడ్డాడు కార్తీక్. ఒకవేళ అనుకోకుండా ఇరుక్కున్నాడేమో సుధీర్. పొలిటికల్ కెరీర్ కి ఇబ్బంది కాబట్టి తాము ఒకేలా ఉంటాము కాబట్టి తనని అడ్డం పెట్టుకొని తప్పించుకోవాలనుకున్నాడేమో?
అదే అయితే ఇంత డ్రామా అవసరం ఏముంది? తనకి ఒక్క మాట చెప్పి ఉంటే తనే చేశానని వొప్పేసుకునేవాడు కదా.
అయోమయంలో వుండగానే తన మీద అయిదారు కేసులు పెట్టి రెండు నెలలు జైల్లో కి తోసారు.
జైల్ బయటికి వచ్చాక స్నేహితుల ద్వారా తనకి తెలిసింది ఏమిటంటే.
తన మీద కేస్ పెట్టింది సుధీర్ అనుచరుల్లో ఒకడట.
"ఇదంతా నీ మీద కుట్ర రా. నిన్ను తప్పించమని అడగటానికి వెళ్ళిన మీ అమ్మా,నాన్నల్ని ఎన్ని మాటలు అన్నాడో తెలుసా? చిన్నప్పటి నుంచీ వాళ్ళకి నీ మీదే ప్రేమ ఎక్కువనీ, వాళ్ల గారాబం వల్లే నువ్వు చెడి పోయావనీ, ఇప్పుడు కూడా నీ పనుల వల్ల తనకి చెడ్డ పేరొస్తున్నా తన గురించి ఆలోచించకుండా నీ కోసం సహాయం అడుగుతున్నారనీ ఇలా చాలా మాటలు అన్నాడు".
"సుధీర్ స్వార్థపరుడు అనే విషయంలో ఎవరికీ సందేహం లేదు కానీ, నీ మీద ఇంత కుట్రపూరితంగా వ్యవహరిస్తాడు అని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ఆ రోజు అర్థం అయింది" అన్నాడు ఒక స్నేహితుడు.
"పెద్ద కొడుకు చిన్న వాడికి సహాయపడలేదనే బాధ ఒక వేపు, కొడుకు పదవి లో ఉండగా వేరే వాళ్ళని సహాయం అడిగితే అతను చులకన అయిపోతాడు అనే భయం ఇంకో వేపు మధ్య నలిగిపోయారు మీ అమ్మానాన్నలు. నువ్వు తప్పు చేయలేదని తెలిసీ, ఏమీ చేయలేక వాళ్ళెంత కుమిలి పోయారో నీకు తెలియదు".
నీ మీద ఏదో మనసులో పెట్టుకున్నాడు రా మీ అన్న. పదవి లో ఉన్న వాళ్ల తో పెట్టుకోవాలి అంటే నువ్వూ రాజకీయాల్లోకి అన్నా పోవాలి. లేదా వాళ్ళకి దూరంగా విదేశాలకి అన్నా పోవాలి" ఆవేశంగా అన్నాడొక స్నేహితుడు.
"నీ మొహం" పెద్దగా నవ్వేశాడు తను ఆ రోజు. చిన్న విషయాన్ని పెద్దగా చేయవద్దనీ, ఆ విషయం అక్కడితో వదిలేయమనీ గట్టిగా చెప్పాడు వాళ్ళతో.
***
జైల్ నుంచి బయటికి వచ్చాక నానా తంటాలు పడి మళ్లీ చదువు మొదలెట్టాడు.