Previous Page Next Page 
పార్ట్ టైమ్ హాజ్ బెండ్ పేజి 9

 

    "ఏయ్ , ఏమిటా పిచ్చి పాటలూ , పిచ్చి చేష్టలూనూ! లే త్వరగా!'
    ఉలిక్కిపడి కళ్ళు తెరచేసరికి తన చేతిలోని పైటను చప్పున లగేసుకుంటూ కనిపించింది శ్రీదేవి.
    అప్పుడే తలంటుకున్నట్లుంది. ఓ టవల్ చుట్టుకుంది తలకు -- మోకాళ్ళ మీద కూర్చుని తన మీదకు వంగి నిద్రలేపుతోంది.
    ఆమెకు మొఖంలో ముప్పయ్ సంవత్సరాల వయసుంది గానీ బాడీ మాత్రం పాతిక దగ్గరే ఆగిపోయినట్లుంది.
    "సారీ మేడమ్! తెల్లారుజామున కొంచెం కలలతో బిజీగా ఉంటాను ఎందుకంటె తెల్లారుజామున వచ్చే కలలు నిజమవుతాయని మా అమ్మ గారు చెప్పారు."
    'అయితే మాత్రం మరీ పైటలు లాగేసే కలలు కంటావా? కొంచెం వళ్ళు దగ్గరుంచుకో."
    "ఎవరిదండీ?" అయోమయంగా అడిగాడు.
    "ఏమిటేవరిది?"
    "అదేనండీ! ఎవరిదో వళ్ళు నా దగ్గరుంచుకోమంటున్నారు కదా!"
    'అదిగో -- ఆ అతివాగుడే వద్దన్నాను. త్వరగా రడీ అవ్! ఇవాళ నువ్వో డిటెక్టివ్ పనిచేయాలి."
    "ఏమిటండీ అది?"
    "అదే -- అయన తొమ్మిది గంటలకల్లా బయల్దేరి ఆఫీస్ కేళతారు కదా! సరిగ్గా అదే టైముకి ఆ మూడో ఇంట్లో ఆమె లేదూ/ ఆమె కూడా బయటికొచ్చి ఈయనకు వెనుకో ముందో నడుస్తోంది. ఇద్దరూ బస్ స్టాప్ లో ఏమయినా మాట్లాడుకుంటున్నారేమోనని అనుమానం."
    'మూడో ఇంటామే అంటే ధర్టీ ఫోర్ ట్వంటీ త్రీ ధ....."
    'ఆ పిచ్చివాగుడే వద్దు -- తెలుగు సినిమాలు చూసి మరీ ఇలా తయారయ్యావ్."
    "ఇంగ్లీష్ పిక్చర్ కూడా చూస్తానండీ."
    "నువ్ త్వరగా రడీ అవుతావా లేదా?"
    సురేష్ తలగొక్కున్నాడు. ఎలాగూ వెళ్ళక తప్పదు. కాఫీ టిఫిన్ కే ఎసరు పెట్టటం ఆరోగ్యం.
    "మీరూరికే అనుమానపడుతున్నారు గానీ మోహనరావుగారు మరీ అలా ఎవరి వెంబడి పడితే వాళ్ళ వెంబడి పడే రకం కాదండీ!"
    "ఇదిగో ఆయన్తో సంసారం చేస్తోంది నేనా, నువ్వా?" కోపంగా అంది.
    "మీరేనండీ?"
    'చీరాలలో అయన ఆడిన భాగోతం కళ్ళారా చూసింది నువ్వా నేనా?"
    "ఏమిటండీ ఆ భాగోతం?"
    "అదంతా నీకనవసరం!' ఇంకా కోపం పోలేదు.
    'అల్ రైట్ ! ఇప్పుడే రడీ అయి కొంచెం ఆ వీధి చివరి హోటల్లో కాఫీ, టిఫిను చేసి అప్పుడు బస్ స్టాఫ్ దగ్గర కెళ్ళి నిలబడతానండీ!"
    "ఏడ్చినట్లుంది. నీ పుణ్య కార్యాలన్నీ పూర్తయ్యేసరికి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం, బస్సేక్కటం కూడా జరిగిపోతుంది -- కాఫీ ఫలహారాలు నేనిస్తాన్లే త్వరగా రా!"
    థాంక్ గాడ్ మన్మధా! ఈరోజు ఓపెనింగ్ బావుంది! కనుక మిగతా భాగమంతా కూడా దున్నుకోవచ్చు ------
    'అలాగాండీ! అయితే నేను పావుగంటలో రడీ!
    ఆమె వెళ్ళిపోయి లిప్టు దగ్గర కెళ్ళి వెనక్కు తిరిగింది.
    "ఇవాళ నువ్ లిప్టు  వాడుకోడానికి పర్మిషనిస్తున్నాను! దిగుతూ వెంబడించాలంటే ఆలస్యమయిపోతుంది.
    "థాంక్యూ మేడమ్."
    త్వరగా రడీ అయి లిప్టు లో 601 చేరుకున్నాడు.
    మోహన్రావ్ అప్పుడే ఆఫీస్ కెళ్ళడానికి రడీ అవుతున్నాడు.
    "గుడ్ మాణింగ్ సర్"
    'గుడ్ మాణింగ్ సురేష్! ఏమిటి సంగతి? మొన్న బస్తాఫ్ లో ఓ మిడిలేజ్ బ్యూటీతో మాట్లాడుతున్నావ్?"
    శ్రీదేవితో పాటు తనూ ఉలిక్కి పడక తప్పలేదు.
    ఆ టైములో ఈ మహానుభావుడు కూడా అక్కడే అఘోరించాడన్నమాట.
    ఏమిటి చెప్పటం?
    శ్రీదేవి తన నుంచి ఎక్స్ ప్లనేషన్ కోసం చూస్తుంది. అనుమానంగా చిత్రంగా!
    'ఆవిడ మాకు బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండన్న మాటండీ! చాలా కాలం తర్వాత కలిసింది. అందుకని పలుకరించాను."
    "మరి నేనెవరో రాత్రంతా గుర్తు తెచ్చుకుని రండి. రేపు బస్టాఫ్ లో మళ్ళీ అడుగుతానన్నావ్ అంటే అంత క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ నిన్ను అసలు గుర్తేపట్టలేదా?"
    చావుదెబ్బ కొట్టేశాడు.
    తను కోలుకోవటం కల్ల శ్రీదేవి కళ్ళల్లో అనుమానం మరింత వేగముగా సుడులు తిరుగుతోంది.
    ఎందుకయినా మంచిదని పగలబడి నవ్వేశాడు.
    "అదా! అది జస్ట్ జోక్ లెండి! పెళ్ళయిన కొత్తలో వాళ్ళాయనతో హనీమూన్ వెళ్ళి మసక కళ్ళజోడు హోటల్ రూమ్ లో మర్చిపోవటం వల్ల బీచ్ లో అదే రంగు చొక్కా వేసుకున్న మరొకడితో తిరుగుతోందిట! అప్పటినుంచీ అదే గుర్తుచేసి ఎడిపిస్తుంటాను-- అంతే! జస్ట్ ఫర్ ఫన్ సేక్!"
    మోహన్రావ్ కి అనుమానం ఎక్కువైపోయింది.
    "జస్ట్ ఫర్ ఫన్ సేక్?"
    'అవునండీ! జస్ట్ ఫర్ ఫన్ సేక్!"
    'అలాంటి ఫన్ లు కాపురాలు కూలుస్తాయి జాగ్రత్త "
    శ్రీదేవి కాఫీ ఫలహారాలు తెచ్చి పెట్టింది.
    త్వరగా తినమన్నట్లు సైగ చేస్తోంది.
    ఫలహారం, కాఫీలు ముగించేసరికి మోహన్రావ్ ఇంకా అద్దం ముందు నిలబడి రడీ అవుతూనే వున్నాడు.
    సెంట్లు, హేయిరాయివలు, కారా కిల్లీలూ , మడత నలగని బట్టలూ, అందులో లేటెస్ట్ ఫాషన్ లు ...... తక్కువ వాడెం కాదు, మహా శృంగారపురుషుడే.
    "వస్తానండీ " ఆమెకు సైగ చేసి లిప్ట్ లో కిందకు దిగి మోహన్రావ్కి కనబడకుండా మెట్ల వెనక స్కూటర్ పార్కింగ్ దగ్గర దాక్కున్నాడు.
    మోహన్రావ్ విజిలేసుకుంటూ లిప్టు నుంచి బయటికొచ్చాడు.
    అతనిని కొంతదూరం నడవనిచ్చి నెమ్మదిగా ఫాలో అవటం ప్రారంభించాడు.
    మూడో ఇంటి నుంచి ఎవరయినా బయటికోస్తారేమోనని చూస్తూనే ఉన్నాడు గానీ ఎవరూ రావటం లేదు. బస్టాఫ్ కి చేరుకునేసరికి బస్టాఫ్ లో కనిపించిందామె.
    ఆమెకు సమీపంగా నిలబడి మొహన్రావ్ కోసం వెతుకుతుంటే వెనుక నుంచి భుజం మీద చేయి పడింది.
    "హలో ! గుడ్ మార్నింగ్"
    మోహన్రావ్ గొంతు.
    కానీ పలుకరించింది తనను కాదు, ఆ మూడో ఇంటి కేస్ ని!
    "గుడ్ మాణింగ్ " అందామె కూడా చిరునవ్వుతో.
    బస్ వచ్చింది. ఆమె లేడీస్ ఎంట్రన్స్ వేపు వెళుతోంది.
    'సాయంత్రం సంగీత్ కొచ్చేయండి' ఆమెకు వినిపించేలా చెప్పాడు.
    'ఓ.కె."
    ఆమెతో పాటు బస్ వెళ్ళిపోయింది.

 Previous Page Next Page