ఆ రోజు అంకిత్ ని తీసుకుని నేనూ అరుంధతీ ఆస్పత్రికి వెళ్ళాం.
ఆరోజే మొ...ద....టి...సా....రి అంకిత్ కి డయాలిసిస్ ...రక్తశుద్ధి.
గంభీరంగా కనపడకుండా వుండటానికి నేను వాడితో కబుర్లు చెపుతున్నాను. మాటి మాటికి జ్వరం రాకుండా ఉండటం కోసం చిన్న ఇంజెక్షన్ ఇస్తారని చెప్పి తీసుకొచ్చాం! వాడు కుతూహలంగా ఎన్నో ప్రశ్నలు వేసాడు. కొన్ని అబద్ధాలు కొన్ని సగం నిజాలూ చెప్పాం.
డాక్టర్ వాడిని లోపలికి తీసుకెళ్ళాడు.
అరుంధతి అద్దాల్లోంచి లోపలికి చూడటానికి ప్రయత్నిస్తోంది.
నేను వార్డులోకి నడిచాను.
శృతికి పెయింటింగ్ ట్యూబులు తీసుకెళ్ళటం మర్చిపోలేదు. కానీ ఆ బెడ్ ఖాళీగా వుంది.
"డయాలిసిస్ కి తీసుకెళ్ళారా?" అడిగాను.
"శృతి నిన్నరాత్రి మరణించింది" అంది సిస్టర్.
చిన్న ప్రకంపనం- ఒక్కసారిగా పెద్దదై ప్రపంచాన్ని మింగేసాక- మిగిలిన నిశ్శబ్దం.
ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ సిస్టర్ అంటూంది.
"......చిన్న పిల్ల...... ఎంతకాలం మిషన్ల మీద బతగ్గలదు? శరీరంలోంచి మొత్తం రక్తమంతా తోడి, శుద్ధిచేసి మళ్ళీ ఎక్కించటమంటే మాటలా? ఆ తల్లిదండ్రులు నిజంగా రాక్షసులు. నువ్వు కిడ్నీ ఇవ్వొచ్చు-' అంటే 'నువ్వు ఇవ్వొచ్చు కదా' అని దెబ్బలాడుకున్నారు. కన్న కూతురికి ఒక కిడ్నీ ఇవ్వటానికి ప్రాణం పోయినట్టు విలవిలలాడతారెందుకో అర్థంకాదు..... ధూ....... వీళ్లకన్నా పశువులు నయం. పాపం..... ఆ శృతి .....ఎంత అందమైన పిల్ల..... ఎంత హుషారుగా ఉండేది? రక్తం గ్రూపు చాలా క్లిష్టమైనదట. టిష్యూ మాచింగ్ దొరకలేదు. అప్పుడు బాధలేదుగానీ- ఇప్పుడు తీరిగ్గా ఏడుస్తూన్నారు స్వార్థపరులు. ప్రొద్దున్నే వచ్చి శవాన్ని తీసుకెళ్ళారు....."
ఒక అచేతన నిర్వికల్ప సమాధిలో ఉన్నవాడిలో నేను వింటున్నాను.
4
నిజం- అన్వేషణలోంచి వస్తుంది. గెలుపు- కృషి లోంచి వస్తుంది.
* * *
నేనూ అరుంధతి ప్రేక్షకుల్లా చూస్తున్నాము. అద్దాల గదిలోకి అంకిత్ ని తీసుకు వెళుతున్నారు. దిగులు, టెన్షన్- ఇలాంటివి ఏమీలేవు నాలో, నేనా స్థితుల్ని ఎప్పుడో దాటిపోయాను. ఒక విధమైన చావు తెగింపు వచ్చినట్టుంది.
డాక్టర్ మహారధి తెల్లని కోటులో ఉన్నాడు. ప్రక్కనే మృణాళిని.
మృణాళిని.....! ఆమెకి నలభయ్ అయిదేళ్ళ వయసుంటుంది. ఒక విశిష్టమైన యువతి. డాక్టర్ అంటే ఎలా ఉండాలని మనం అనుకుంటామో అలాగే వుంటుంది. ఉహు! అలాకాదు. అంతకన్నా ఎక్కువగా! పేషెంట్ తాలూకు బంధవులు తెలుసుకోవలసిన విషయాలన్నీ ఆమె దగ్గర్నుంచే తెలుసుకున్నాను. అన్నీ విపులంగా, ఓపిగ్గా వివరించి చెప్పింది. చిరునవ్వు ఆమెని విడిపోలేదు. చెపుతున్నంతసేపూ అలాగే వుంది. నేను గమనించిన మరొక విషయం ఏమిటంటే ఆమె కళ్ళలో ప్రశాంతత! మంచులాంటి స్వచ్ఛమైన కళ్ళు భయం, దుఃఖం, ఆందోళనలేని వారికే ఆ ప్రశాంతత! వస్తుందనుకుంటాను. అలా దయ నిండిన కళ్ళతో ఆమె మాట్లాడుతూ ఉంటే, స్వరం నుంచి స్వాంతన ప్రవహించి, ఆప్యాయతతో మిళితమై దాహార్తిలో ఉన్న పేషెంట్లకు ధైర్యపు తీర్ధాన్నిస్తుంది.
నర్సు అంకిత్ ని లోపలికి తీసుకువెళుతోంది.
పిస్టులా ఆపరేషన్ కోసం-
నేను అరుంధతి వైపు చూసాను! ఆమె మొహం తెల్లగా పాలిపోయి వుంది. వేలి చివర్లు సన్నగా వణుకుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే మనిషి ధైర్యంగా వుండాలనీ, దిగులు పడటం వలన సమస్య దూరంకాదనీ అంటాడు జాన్ డేవిడ్! కానీ మామూలు మనుష్యులకు అది సాధ్యమా? నేను అరుంధతీ చాలా సామాన్యమైన మనుష్యులం. వేదనకి అతీతులం కాదు.
మేము కూర్చున్న భంగిమచూసి, మమ్మల్ని దూరంగా వుంచటంకన్నా దగ్గరగా వుంచటమే మంచిదనుకుందో ఏమో, మృణాళిని మమ్మల్ని లోపలికి పిలిచింది. అరుంధతి నెమ్మదిగా నన్ను అనుసరించింది. ఇద్దరం లోపలికి వెళ్ళాం.
"ఇది ఏ జంతువు?" మిషన్ మీద అంటించిన బొమ్మని చూపిస్తూ అడుగుతున్నాడు అంకిత్.
"జిరాఫీ" నవ్వింది మృణాళిని.
వాడు ఆ బొమ్మని పరీక్షగా చూస్తూ, "కాదు, ఇది 'పీపో' అని, జిరాఫీలాగే ఉండే జంతువు. దక్షిణాప్రికాలో వుంటుంది....." అన్నాడు.
ఆమె అతడివైపు అభినందన పూర్వకంగా చూసి, "నిజామా! నాకు తెలీదే" అంది.
డాక్టర్ మహారధి తన పని తాను చేసుకుపోతున్నాడు. మొదట అంకిత్ బి.పి ఆ తరువాత నాడి పరీక్ష చేస్తున్నాడు. అక్కడ నిశ్శబ్దం మమ్మల్ని భయపెడుతుందని తెలిసి, దానితో యుద్ధం చేస్తోంది మృణాళిని. అంకిత్ ని అడిగింది. "నీకో చిన్న క్విజ్ పెడతాను. తెలివైన వాడివైతే సరి అయిన సమాధానం చెప్పాలి....."
మహారధి ట్యూబుల్నీ, సూదుల్నీ సరిచేస్తున్నాడు. అరుంధతీ కన్నార్పకుండా వాటివైపే భయంగా చూస్తోంది.
"ఏమిటా క్విజ్?" అంకిత్ అడిగాడు.
నేను వినటం లేదు. ఇప్పట్నుంచీ ఇక మూడు రోజుల కొకసారో వారానికోసారో ఈ తంతు అంతా అంకిత్ శరీరంమీద జరగబోతుందన్న ఆలోచన నన్ను వణికిస్తోంది.
"క్విజ్ ఏమిటి?" అంకిత్తిరిగి అడిగాడు.
"నువ్వు పుట్టినప్పుడేగా జెమినీ టి.వి., ఈ టి.వి. వచ్చినవి?"
"అవును".
"మీ అమ్మగారి వయసున్న మీ పక్కింటావిడ, నీకు పద్దెనిమిదేళ్ళ వయసు వచ్చేసరికే టి.వి.లో ఎన్ని సినిమాపాటలు చూసుంటుంది?" మాట్లాడుతూనే అంకిత్ చేతిని తన చేతిలోకి తీసుకుని, ఒక సూది రక్తనాళం లోకి గుచ్చింది. వాడు సన్నగా మూలిగాడు. అయితే, వాడి ఏకాగ్రత అంతా ఆమె అడిగిన ప్రశ్నమీద వుండటంతో, ఆ నొప్పిని అంతగా పట్టించు కోలేదు. ఆమె అడిగిన ప్రశ్న నాక్కూడా ఇంటరెస్ట్ గా అనిపించటంతో- మనసులో లెఖ్క కట్టసాగాడు.
"ఇంతసేపా? క్షణాల్లో చెయ్యాలి....." చేతికి గుచ్చిన సూదిని ఒక రబ్బరు ట్యూబ్ లోకి తోస్తూ అంకిత్ తో అంది. "నేనూ మూడు ఛాయిస్ లు ఇస్తాను. ఏది దగ్గర్లో వుందో చెప్పాలి".
అంకిత్ రెండో చేతిమీద స్పిరిట్ వ్రాస్తూ అంది. "ఎ) అయిదు వేలు బి) పదివేలు సి) యాభైవేలు".
అంకిత్ క్షణం కూడా ఆలోచించకుండా ".......యాభైవేలు" అన్నాడు. నేను విస్మయంతో వాడివైపు చూసాను. "తప్పు" అని మృణాళిని అంటుందేమో అనుకున్నాను. కానీ ఆమె నవ్వుతూ "కరెక్ట్ " అంది. వాడిని సంతోష పెట్టటానికి అలా అన్నదేమో అనుకున్నాను. కానీ ఆలోచిస్తే అనిపించింది. సగటు గృహిణి రోజుకి కనీసం పది పాటలు టి.వి. ముందు కూర్చుని చూడదూ! సగటున మూడొందల రోజులు సంవత్సరానికి అంటే యా...భై వేలు!
"బాగా నొప్పి వుంటుందా!" అంకిత్ మాటలకు ఈ లోకంలోకి వచ్చాను. మృణాళిని స్టూలు లాక్కుని దగ్గరగా కూర్చుంటూ, అవును. కొద్దిగా నొప్పిగా వుంటుంది, ఎంతంటే .....దోమ కుడితే ఎంత నొప్పిపుడుతుంది? అంతన్నమాట. చాలా తక్కువ కదూ".
అంకిత్ ఆమెవైపు అవిశ్వాసంగా చూసాడు- ఆమె అరుంధతివైపు తిరిగి, "అంకిత్ ఎంత నొప్పినైనా వోర్చుకుంటాడు అని చెప్పారు కదూ" అంది. అరుంధతి మాట్లాడలేదు, మరొక ప్రశ్న అడిగితే ఏడ్చేసేటట్టూ వుంది ఆమె స్థితి. మృణాళిని గ్రహించినట్టు వుంది. అంకిత్ వైపు తిరిగి, "ఇవ్వాళ మనిద్దరం కలిసి టి.వి. చూడబోతున్నాం. కార్టూన్ ఫిల్మ్" అంది.
"ఉహూ..... వద్దు. ఆర్ధర్ క్లార్క్ UNKNOWN WORLD బి.బి.సి.లో మధ్యాహ్నం వస్తుంది. అది చూద్దాం" అన్నాడు అంకిత్ హుషారుగా. "సరే" అని వెంటనే వప్పేసుకుంది. ఆ తరువాత పెద్దసూదిని మరో చేతికి గుచ్చి తెల్లటేపు అంటించింది. తరువాత మిషన్ లో ఒక "నాబ్" తిప్పింది.
అరుంధతి సన్నగా వణుకుతూ అంకిత్ కి అమర్చిన ట్యూబుల్నీ, సూదుల్నీ చూస్తోంది. నేను అరుంధతి చేతిని ధైర్యం చెపుతున్నట్టు పట్టుకున్నాను. అయితే ఆ చర్య అరుంధతికి ధైర్యం చెప్పటానికి మాత్రమే కాదు, ణా టెన్షన్ తగ్గించుకోవటానికి కూడా!
ఒక చేతినుంచి ట్యూబ్ ద్వారా మిషన్ లోకి ప్రవేశించిన రక్తం, తిరిగి మరో చేతిగుండా శరీరంలోకి ప్రవహిస్తోంది. ఇంజెక్షన్ చేసినపుడు ఒక్క క్షణానికే విలవిలలాడతారు చాలామంది. అటువంటిది- రెండు మూడు గంటలపాటూ.....
ఏదో మత్తు ఆవరించనట్టు అంకిత్ కళ్ళు మూతలు పడసాగాయి. మృణాళిని వాడిని నెమ్మదిగా వెనక్కి పడుకోబెట్టి. దిండు సర్దసాగింది. మేమంతా పక్కన వుండటంవల్లా...... మృణాళిని సహచర్యంవల్లా వాడికి ఆ మిషన్ పట్ల విముఖత కలిగించలేదు.
పిల్లలు జబ్బు పడినప్పుడు తండ్రులు ఎందుకు పక్కన లేవడు. మీరు అప్పుడొచ్చి తీసుకెళ్ళవచ్చు".
"నేనుంటాను" క్లుప్తంగా అంది అరుంధతి.
నేను మహారధితో కలిసి బయటకొచ్చాను. ఆయన అన్నాడు..... "ప్రతిసారీ ఇలా సూదులు గుచ్చి చేయం".
కాస్త తేలికైన మనసుతో, "మరేం చేస్తారు?" అని అడిగాను.
"కడుపుకి చిన్న రంధ్రం చేసి, శాశ్వతంగా ట్యూబ్ అమర్చాలి".
నా ఆనందం ఆవిరైపోయింది, నిశ్చేష్టగా అతడివైపు చూసాను. తెల్లకోటు విప్పి కుర్చీ వెనుక పెడుతూ అన్నాడు. "అప్పుడు ఆ ట్యూబ్ ద్వారా పని సులువవుతుంది. దానికే డైరెక్టు కనెక్షన్ ఇస్తాం".
తడారిన గొంతుతో "జీవితాంతం అంకిత్ ఆ ట్యూబ్ తో తిరగాలా?" అని అడిగాను.
"జీవితా....." అతడేదో చెప్పబోయి విరమించుకుని..... 'అవును" అన్నాడు క్లుప్తంగా. "ఆ రంధ్రం చుట్టూవున్న ప్రాంతాన్ని చాలా పరిశుభ్రంగా, ఇన్ ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి".
.....అయిదు నిమిషాల తరువాత నేను సముద్రం ముందు కూర్చుని వున్నాను. వేళకాని వేళ అవటం వలన జనం లేరు. నేనూ నాకు తోడుగా ఒంటరి సముద్రం.
ఇదే సముద్రం ఒడ్డున లేడిపిల్లలా నాతో కలిసి గెంతులేసిన అంకిత్ కడుపుకి రంధ్రంతో, బయటకొచ్చిన ట్యూబ్ తో.
నాకు సముద్రమంత దుఃఖం కలిగింది. ఎల్లలు లేని దుఃఖం.