Next Page 
బస్తీమే సవాల్ పేజి 1

                                 


                                                 బస్తీమే సవాల్
           
                                             -చందు సోంబాబు

                                                 



   
    బస్తీ మే సవాల్-

    రండి బాబూ రండి!

    రాణీని గెలుచుకోండి!

    రెట్టింపు పైకం పొందండి.

    అందమైన గొంతు. మాటల్లో రెచ్చగొట్టగల చాతుర్యం సవాల్ చేస్తున్న ఆ అమ్మాయిలో ఉన్నాయి.

    ఆమె చుట్టూ చేరిన జనానికి సవాల్ విసురుతోంది. పేకముక్కల్ని షఫుల్ చేస్తూ విశాలమైన కళ్ళతో చుట్టూ పరికించి చూస్తూ ఆశని రేకెత్తిస్తోంది.

    పదికి పది- యాభైకి యాభై - వందకి వంద- ఎంతైనా సరే-రెట్టింపు పైకం బస్తిమే సవాల్! అందామ్మాయి.

    ఆ 'సవాల్' అనే మాట వినగానే కాళ్ళకి బ్రేకులు పడినట్టుగా ఆగిపోయాడు పరుశురామ్.


    కళ్ళు సగం మూసి సిగరెట్ దమ్ము పీలుస్తూ అటు చూశాడు. చిన్న గుంపు. ఆ గుంపు మధ్యలోనుంచి ఓ ఆడపిల్ల మాటలు కవ్వింపుగా వినబడుతున్నాయి. ఆ మాటలు పలుకుల రత్నాల్లా రాలుతుంటే ఏరుకోడానికి అన్నట్లుగా జనం మూగుతున్నారు.

    కొన్ని గంటల క్రితమే పరుశురామ్ ఈ మహానగరంలో అడుగు పెట్టాడు.

    తల్లి కడుపులోంచి బయటపడిన పసికూనలా అయోమయంగా ఉందతనికి.

    ఆ వాతావరణం, భాష, మనుషులు, రోడ్లు, వాహనాలు... గజిబిజిగా అనిపించి కాస్త బెరుకు బెరుకుగా వుందతనికి.

    అంతకంటే కూడా రోడ్డుమీద ఏదన్నా పోలీసు జీవుగానీ, వాన్ గానీ కనబడితే కంగారుగానూ వుంది.

    తనని పోలీసులు వెంటాడుతున్నారేమో అన్న అనుమానంతో స్వేచ్ఛగా గాలి కూడా పీల్చుకోలేకపోతున్నాడు పరుశురామ్.

    చేతివేళ్ళు చుర్రుమన్నాయి. సిగరెట్ పీకని అవతల పడేసి మరో సిగరెట్ వెలిగించి ఆ గుంపుని తోసుకుంటూ అడుగుముందుకు వేశాడు పరుశురామ్.

    ఎదురుగా ఓ పద్దెనిమిదేళ్ళ అమ్మాయి. చురుకుగా పేకముక్కల్ని కలుపుతూ సవాల్ విసురుతూ మూడు ముక్కల్ని కింద పరుస్తోంది.

    జనం పందెం వేస్తున్నారు.

    ఓడిపోతున్నారు. గెలుచుకున్న సొమ్ముని ఆమె జాకెట్లో దాచేసుకుంటోంది.

    "బస్తీమే సవాల్" అంటోందా చిన్నది.

    "ఏయ్ పిల్లా!" ఎవరో పిలిచాడు.

    గబుక్కున వాడి షర్ట్ కాలర్ పట్టుకొందా అమ్మాయి.

    "ఓయ్ ఓయ్! పిల్లా గిల్లా అంటున్నావు. తోమి పారేస్తాను."

    దాంతో వాడు కంగారుగా పడిపోయాడు.

    "అది కాదమ్మా-బస్తీమే సవాల్" అని ఈ ఆటని అనరు.

    'కాయ్ రాజా కాయ్' అనాలి వివరణ చెప్పాడతను.

    "ఇది జూదం కాదుగా కుయ్యా. సవాల్... నా ఆటలోని చాతుర్యానికి నగిషీలు తెలుపడానికి చేస్తున్న సవాల్ ఇది. నన్ను గెలవాలనుకునే వాళ్ళకే సవాల్.... బస్తీమే సవాల్" అంటూ అతన్ని వెనక్కి తోసేసింది.

    ఆమె చేతుల్లో పేకముక్కలు కదలిక కంటి చూపు వేగానికి అందటం లేదు. ఆమె వేళ్ళ కదలికలో అంత చురుకుతనం ఉంది.

    పరుశురామ్ చాలా జాగ్రత్తగా, పరీక్షగా గమనిస్తున్నాడు ఆమెని, ఆమె చేతి వేళ్ళ కదలికని.

    ఆ ఆట గురించి అతనికి తెలుసు. అది అతనికి కొత్తకాదు. అది మూడు ముక్కలాట.

    మూడు ముక్కల్లో బొమ్మను గుర్తించి పందెం కాయాలి.

    ఆ అమ్మాయికేసి చూశాడు పరుశురామ్. పద్దెనిమిది... లేక పందొమ్మిది ఉండవచ్చు. లేత కొబ్బరిముక్కలా వుంది. సన్నగా, పొడుగ్గా వుంది. మంచి రంగే... గిరజాల జుత్తు కత్తిరించి భుజాలవరకు వదిలేసింది. పెద్ద కళ్ళు. చురుగ్గా వున్నాయి. చెవులకు చవకబారు రింగులు....

    ముక్కుకి చిన్న పోగు....

    మెడలో పూసల దండ.

    నున్నని చెంపలు... కొనతేలిన ముక్కు, చిన్న గెడ్డం, కమలాపండు తొనల్లా పెదిమలు, శిఖరాల్లా తన్నుకొచ్చిన ఎత్తైన గుండెలు.... అర్ధ నగ్నంగా ఆమె వేసుకొన్న జాకెట్ పైనించి పైకి ఉబికి ప్రత్యేకమైన ఆకర్షణని కలిగిస్తున్నాయి ఆటగాళ్ళకి, చూసేవాళ్ళకి.

    ఆట ఆడకపోయినా, ఆమె కేసి చూస్తూ పెదిమ తడుపుకోవడానికి కొందరు చేరారక్కడ. దాని జోలికి వెళితే అది నడిరోడ్డుపైన చితకబాదు తుందేమోనని భయం కొందరికి. దాని వెనకనున్న గ్యాంగ్ ని చూసి మరి కొందరికి హడల్. అవకాశం దొరికితే దాన్ని హాంఫట్ చేయాలని కొందరు జులాయిల్లా అక్కడున్నారు.

Next Page