Previous Page Next Page 
వివాహం పేజి 9

   
    మర్నాడు రాత్రి పందిరి మంచం మీద పడుకుని, కలెక్టరు దగ్గిర్నించి వొచ్చిన "మెమో"లో కోపభావ  మేమాత్రం కనబడుతోందని ఆలోచించు కుంటోండగా, రావమ్మ పక్కన కూచుని, గుండ్రని బొజ్జమీద చెయ్యేసి, అదే కథ చెప్పింది. వంటకి సామానులివ్వడం, చాకలి పద్దు వెయ్యడం, బజారునుంచి వొచ్చిన సామాను సరిచూడడం, దీపాలు చక్కగా తుడిపించడం, పిల్లలకు అన్నాలు, అన్నీ రవణే. యేదన్నా పని చెయ్యాలని వెడితే, యెవరో ఆ పని అంతకుముందే చేసివుంచుతారు. తనకు యింక పనులేం లేక గిలగిల కొట్టుకొని, ఆడవాళ్ళకి మీటింగులు పెడదామా చంకీ పటాలు కుట్టడం ప్రారంభిద్దామా, యేదన్నా యాత్రకు బయలుదేరుదామా, అని ఆలోచిస్తూంది రామమ్మ.

    "కాని యెన్నాళ్ళుంటుంది? రెండేళ్ళలో వెళ్ళి పోతుంది. మళ్ళీ మన అవస్థ మనకి వుండనే వుంటుంది" అంది.

    మళ్ళీ వంటావిడ చద్దెన్నాల విషయమై పోట్లాడటం, పిల్లల మారామూ, యింట్లో దుమ్మూ, అన్నీ కళ్ళకి కనపడ్డాయి. మళ్ళీ తన గదిలో విరిగిపోయిన సామాన్లూ, చిరిగిపోయిన పరుపులూ, విడి దూదీ కనబడ్డాయి వెంకన్న పంతులికి. ఇద్దరూ నిష్కారణంగా నిట్టూర్పులు విడిచి, ఒకరికేసి వొకరు దొర్లి, ఆనుకుని పడుకున్నారు. రవణని తలుచుకుంటో.

    గోపాలరావు యింటో స్థిరపడ్డ కొద్దిరోజులకే వంటామె పోట్లాడి వెళ్ళిపోయింది. రామమ్మకి ఈ రోజనే తలనొప్పి వొచ్చింది. అప్పమ్మ మడికట్టుకుంది. వంటావిడి మళ్ళీ రానూలేదు, రామమ్మగారు సంపూర్ణారోగ్యం కలగనూ లేదు- ఆమె చేసే కూరల రుచుల్ని పొగడడము తల గొరిగించుకోడానికి నెలకొక అణా, ఆమెకి వెంకన్న పంతులిచ్చే జీతం. గోపాలరావు పరీక్షలై వచ్చిన తరువాత వారం రోజుల్లో, చాకలి వారం రోజులు పెళ్ళికి శలవు తీసుకుని వెళ్ళాడు. ఇంటినిండా మనుషులే గాని మార్కెట్టుకీ కూరలకి వెళ్ళేవాళ్లే లేరనుకుంటో గోపాలరావు ముందు నించి యిటూ అటూ నాలుగైదుసార్లు తిరిగింది రామమ్మ. గోపాలరావే మంటాడు? వెళ్ళాడు. చాకలాడ పెళ్ళినుంచి వొచ్చాడు, కాని గోపాలరావే కూరలకి మామూలైనాడు. మొదట్లో గోపాలరావు దొరకగానే, సమర్తీడు పిల్లనించి తమని తప్పించిన దైవంలాగు తోచిన సంగతీ, రెండువేలు కట్నమన్నా సరేయిచ్చి రవణని పంపించెయ్యాలను కుంటో వుంటే, ఒక్క దమ్మిడీ ఖర్చులేకుండా పెళ్ళి చేసుకున్న సంగతీ, అన్నీ మరిచి పోయినారు. తమ తిండి వూరికే పనీపాటా లేకుండా తినే సోమరుల్లాగా కనపడ్డారు, తల్లీ కొడుకూ, ప్లీడర్లని పావలా ఆరా అడిగి బతికే అలవాటు అతని స్వభావాన్ని గట్టిగా పట్టింది. యెంత ప్రయత్నించినా అల్లుడి దర్జా అతనికి రాలేదు. యేదో ధర్మార్ధం పోషించే పిల్ల మొగుణ్ణి వాళ్ళు అల్లుడుగా చూసుకోరు. అందులో కట్నం లేకుండా చవకగా దొరికిన వాడు చవకైనాడు, వూరికే వచ్చిన కాయకూరలమల్లే. గోపాలరావుని చూసినవాళ్ళ కసలు అతన్ని మర్యాద చెయ్యాలని బుద్ధి పుట్టదు. అతన్ని "యేమిరా" అనాలనిపిస్తుంది. "యామండీ" అంటే కోపమొస్తుందేమో అతనికి అనుకుంటారు. ఎవరేం పని చెపుతారా చెయ్యడానికి సిద్ధంగా వున్నానన్నట్టుంటుంది అతని చూపు. పదిహేను రోజుల్లో అప్పమ్మవంటా, రవణ పైపనీ, గోపాలరావు వూళ్ళో పనికింద స్థిరమయింది.

 Previous Page Next Page