Previous Page Next Page 
వివాహం పేజి 10

   
    వెంకన్న పంతులికి యిద్దరు కొడుకులు. నారాయణా, నరసూ. ఇద్దరూ సాధారణంగా పిల్లలు చేసే అల్లరికే మాత్రమూ తక్కువచెయ్యరు. ముందు సందేహాలడగడంతో మొదలు పెట్టి, చివరిరోజు పాఠాలన్నీ గోపాలరావే చెప్పేట్టుగా నిర్ణయమైంది, పెద్దల్ని చూసి, వాళ్ళూ అతన్ని అల్లరి చెయ్యడం మొదలు పెట్టారు. వాళ్ళు పరీక్ష ప్యాసు కావడం అతని బాధ్యతగా పెద్దవాళ్ళు మాటాడారు. మొదట వాళ్ళు అతని కాళ్ళమీద వుయ్యాలూగడం, భుజంమీద కూచోడం, తరువాత జుట్టుపీకటం, ముక్కులాగటం, అతను విసుక్కుంటే,

    "గాడిదా, వెధవా" అనడం. "అమ్మతో చెపుతా" ననడం.

    తన్నడం దగ్గిరికి వొచ్చింది.

    "ఎందుకు ఆయన్నట్లా అల్లరిచేస్తావు?" - రవణ.

    "నీకేం?"

    "తప్పవునా?"

    రవణని చూస్తే ఈ పిల్లలకి అమితమైన ప్రేమ!

    "కాదు."

    "కాదూ? యింకోళ్ళని తన్నడం తప్పుకాదా? నిన్నేం చేశారాయన?"

    "లెక్కలు చేసిపెట్టమంటే చేసిపెట్టాలా మరి"

    "నీకు వొచ్చేదెప్పుడు?"

    "నాకు అవే వొస్తాయి. చెయ్యడం వొచ్చు"

    "ఈసారి ఆయనేమన్నా చేస్తే నాన్నతో చెబుతా" చెప్పదనీ, సిగ్గనీ నారాయణకి తెలుసు.

    "తన మొగుణ్ణి యేమిటో చేస్తున్నామని అక్కకి ఉక్రోషం మొన్న పెళ్ళయిందో లేదో! పాఠం చదవలేదని నరుసుని గిల్లడం బాగానే వుంది. వీడెవడో తమ్ముణ్ణి గిల్లడానికి!" అని అరవడం మొదలు పెట్టాడు నారాయణ.

    గోపాలరావుకు, రవణ తన భార్య అనే దృష్టి బాగా కుదిరినట్టే లేదు. యింటో అతనికన్నా ఆమెకే గౌరవం. అతనూ ఆమెని  గౌరవంగా చూస్తాడు. రవణకి సిగ్గుపడి దాక్కోటం మామూలుకాదు. కాని మాట్లాడదు. మాట్లాడే అవసరం లేదు. గోపాలరావు యిట్లా నీచంగా బాధలుపడడం ఆమెకి కష్టంగా వుంది. పెళ్ళికాగానే ఆ గోపాలరావూ తనూ వొకటనీ, అతను తనవాడనీ ఆమె మనసులో ఏర్పడ్డదీ- అతనికి న్యూనత కలిగితే తనకి కలిగినట్టుంది. ఆ గోపాలరావుకి, తనకి అవమానాలు జరుగుతున్నట్లు తెలిసినట్టేలేదు. తెలిసికూడా తప్పనిసరి అని వూరుకున్నాడా?

 Previous Page Next Page