Previous Page Next Page 
వివాహం పేజి 14

   
    తను దొరలచుట్టూ తిరగడమూ, కలెక్టరాఫీసు సిరద్దారు క్రిష్టియను వాడికి ముందు నమస్కారం పెట్టవలసి రావడమూ తన హృదయంలో కలిగించే బాధని-యిట్లా యితర్లని అంటూ వుండడంలో తీర్చుకొని కొంతవరకూ బాధ్యత చెల్లించి, పురాతన ధర్మం నిలబెట్టానని సంతుష్టి పొందుతో వుంటాడు పంతులు. ఆ వెంకటేశ్వర్రావు గొప్ప వకీలు. కాని వేషమూ భాషా అంతా వీలైనంత పూర్వాచారంగా వుంచుతాడు.

    పూర్వాచారం సంగతి తలుచుకున్నప్పుడు ఆయన్ని ప్రజలు పొగుడుతూ, ఆయనా కోర్టులో జడ్జీలూ మొదలైనవారు చేసే మానసిక దురాచారాల్ని జ్ఞాపకం చేసుకోరు, యింటి దగ్గిర కనపడే పిలకా, విభూదీ, గావంచా పంచలేగాని! పురాతన మతాన్ని తలుచుకున్నప్పుడు, వకీలు వెంకటేశ్వర్రావేగాని యీ నూతన నాగరికతకూ, ధనాశకూ లోబడక తమ శిష్టాచారమే ప్రధానంగా యెంచి పల్లెటూళ్ళు విడవక వేళ్ళాడే, సనాతన స్వభావులైన శిష్టాచారపరులు జ్ఞాపకంరారు.

    వారంరోజుల్లో గోపాలరావు స్థితి మళ్ళీ మొదటికొచ్చింది. పిల్లలు అల్లరి ప్రారంభించారు. ఒకరోజు రామమ్మ మేనమామ వొస్తే గోపాలరావు మంచం లాక్కుని ఆయనకేశారు. మళ్ళీ బజారుకి స్పష్టంగా చెప్పి పంపుతున్నారు. పైగా - "ఏమిటీ వంకాయలు తేవడం! అన్ని పుచ్చు" అంటారు. కూర చాలకపోతే - "తెచ్చేవాళ్ళంత తెలివిగా తెస్తున్నారు" అనేదీ, బెండకాయలు వొడిలిపోయినాయంటే - "మెక్కవూ? బజారుకెళ్ళటం తప్పుతుంది కదా అని ఒకేసారి కొని తెచ్చి పడేస్తే?" అనడం ప్రారంభించారు.

    ఒకసారి గోపాలరావు దారిలో వున్న పాలచెంబు తంతే

    "కళ్ళ కనపట్టం లేదూ?" అన్నారు.

    రవణ కివన్నీ చాలా కష్టంగా వున్నాయి. తనకోసం పాపం అతడి బాధలన్నీ పడుతున్నాడని విచారం. వెంకన్న పంతుల్తో అప్పమ్మతో మాట్లాడాలంటే సిగ్గు. అప్పమ్మ చాలా మేధకురాలు. నోరెత్తడం చాతకాదు. ఎక్కా కోపమూ, చిరాకూ, రోషమూ, ఏమీ లేకుండా, తండ్రీ మొగుడూ ఆమె జీవనం చావకొట్టేశారు. పతివ్రత కింద చాలా పేరు తెచ్చుకుందే కాని, వితంతువై లోకంలో మెలగవలసి వొచ్చినప్పుడు యెందుకూ పనికిరాని దయింది. మొదట చిన్నప్పుడు తన మాట వినకుండా పెంకెతనం చేస్తే తన కంఠం వినేప్పటికి వొణికేట్టుగా తండ్రి చావకొట్టి తన కుక్కని చేసుకున్నాడు. ఈ తండ్రి సరైన కట్నం ఇవ్వలేదని అతని పేరెత్తితే తన్నేవాడు ఆ భర్త. ఆ భర్త పోయిన తరువాత ఆ భర్త పేరూ, అతని పునర్వివాహపు చెల్లెలి పేరూ యెత్తితే నోరు నొక్కింది సంఘం. చివరికి ఏమీ చాతగాక, కొడుకుని కాపాడుకోలేని అప్పమ్మా, నోరెత్తడానికి భయపడేట్టు ఆమె పెంచి తయారుచేసిన గోపాలరావూ మిగిలారు. ఆమెనట్లా పిరికిదాన్నిగా తయారుచేసి, గోపాలరావు చిన్నప్పుడు పిరికితనం చూపితే "పిరికి వెధవని కన్నావు" అని వెక్కిరించేవాడు ఆ భర్త.

 Previous Page Next Page