రాత్రి భోజనం దగ్గిర వెంకన్న పంతులు గోపాల్రావుని పలకరించి, చదువు సంగతీ, ఖర్చు సంగతీ మాటాడాడు.
"అయినా మీరు చదివే దేమిట్లే, యీ కాలవ వొడ్డునీ, ఆ కాలవ వొడ్డునా, తాత్సారం చెయ్యడమేగా? మునుపటి వాళ్ళు వోవర్సీర్లయినారంటే, యే బిల్డింగన్నా కడితే యింక వెయ్యేళ్ళయినా చెక్కుచెదరక పడివుండవలసిందే. ఇప్పటివాళ్ళు బొమ్మరిల్లు కట్టాలంటే, యిరవై తౌమ్మిది ప్లాన్లూ ముప్ఫై యెస్టమేట్లూ వేసి, చివరికి ఆరునెలల్లో కింద కూలేట్టు తయారు చేస్తారు."
అంత సర్వజ్ఞంగా మాట్లాడుతోవుంటే గోపాల్రావు యేమంటాడు? రాత్రింబగళ్ళూ మేలుకుని తను చదివిన సంగతీ, వోవర్లీరు పరీక్షకు వెళ్ళమని తనని ప్రోత్సహిస్తా యాడిది కిందట వెంకన్న పంతులు ఆ డిపార్టుమెంటుని పొగుడుతూ చెప్పిన మాటలు జ్ఞాపకం వొచ్చి వూరుకున్నాడు.
"మీ లాడ్జీలో యెంతమంది వున్నారు?"
"యిరవై ముగ్గురం."
"అందరూ బ్రాహ్మలేనా?"
"ఆరుగురు కాదు."
"క్రిష్టియనులున్నారా?"
"ఒకడు."
"వాణ్నెందుకు రానిచ్చారు?"
"నా యిష్టమా? అయినా యెవరయితేనేం?"
"యివీ వాళ్ళు పట్నంపోయి నేర్చుకునే సంగతులు. చదువే మాత్రం వెలిగిస్తారో కాని, యీ కులాచారాన్ని వెక్కిరించడంలో మాత్రం గట్టిగా తయారౌతారు."
పట్నం పొమ్మని పట్టుపట్టింది వెంకన్న పంతులేగా! ఆయన కేమాత్రం కులాచారాలున్నాయి? యివ్ అనాలనిపించింది గోపాలరావుకి. కాని లోకువతనం బాగా అలవాటు కావడంచేత ఆ మాటలు పైకిరాలేదు. గోపాలరావు మాట్లాడక పోవడం చూసి. వెంకన్న పంతులు "నీ యిష్టం కాకపోతే, ఆ లాడ్జిలో యెందుకున్నావు?" అన్నాడు.
"మీరు పంపే యిరవై రూపాయలతో యింకెక్కడుండేదీ?" అనాలనిపించింది కాని వూరుకున్నాడు.
"పోనీ సుశర్ల వెంకటేశ్వరరావు పంతులుగార్ని చూశావా?"
"యెందుకు"
"యెందుకట! అట్లాంటి ప్రయజకుల్నీ, ధర్మాత్ముల్నీ చూస్తే ఏం లాభం? యీ క్రిష్టియనువాణ్ని, యీ తెల్లమొహాన్ని, పట్టుకుని వేళాడ్డంతో సరిపోతుంది. వెంకటేశ్వరరావు పంతుల్లాంటి వాళ్ళుండబట్టే, మన సాంప్రదాయమూ, ఆచారాలు నిలబడివున్నాయి దేశంలో"