Previous Page Next Page 
వివాహం పేజి 12

   
కాని మళ్ళీ వాళ్ళందరే ఒక సంవత్సరం దూరం కావడం చేత కొంచెం మంచి వాళ్ళలాగే తోచారు. రవణని తల్చుకుంటే ఏదో కడుపులో సంతోషం వూగినట్టయింది. ఇంకొకళ్ళ ఇంట్లో తన చదువులకోసం చాకిరీచేస్తోన్న తల్లిని జాలివల్ల చూడాలనిపించింది. ఏదో స్కూలు ఫైనలన్నా ప్యాసుకాని కుర్రాడని తనని ఆడించారు. గాని కాబొయ్యే వోపర్సీరుని ఏడిపిస్తారా? మొన్న ప్రిన్సిపలు తనని కుర్చీయిచ్చి మర్యాద చేశాడే? ఆ సంగతి యెట్లాగో వాళ్ళకి తెలిసివుండదా? అన్నట్లుగా భావించుకున్నాడు. ఈసారి తన హోదాను తను నిలుపుకోవాలి! రైలు దిగి జట్కా బండిమీద దర్జాగా యింటికి వొచ్చి సామాన్లు హాలులో పెట్టించి బండివాడి చేతిలో నాలుగు అణాలు పెట్టాడు. వాడు చాలదని గోల చేశాడు. గోపాలరావు కేకలేశాడు. వాడూ కేకలేశాడు. యిదేమి తన కొత్త హోదాకి తగినట్టుగా లేదని, సరే వాడడిగిన రెండణాలూ పారేద్దామని సంచిలో చెయ్యిపెడితే అణన్నరే వుంది. ఇంట్లోనుండి ఒక్కరూ రాలేదు. కనపళ్ళేదు. ఆ అణన్నర యిచ్చి గొంతు తగ్గించి "చిల్లర లేదు యెప్పుడైనా అప్పుతీర్చుకొంటా" నని, వాణ్ణి బతిమాలి, గుర్రపుబండి దర్జాకి తనని తాను తిట్టుకొని హాలులోకి వస్తూవుంటే, యింటో రామమ్మ - "ఏం, ముందే మాట్లాడుకోగూడదూ బండి బాడుగ? ..... వెధవదర్జా"- అనడం వినపడ్డది. ఇంకేదర్జా తనకి! హాలులోకి వెళ్ళి పెట్టిమీద కూలబడ్డాడు. ఒక్కళ్ళూ రాలేదు. పలకరించలేదు. రవణ వూళ్ళోలేదా? తన అమ్మకూడా లేదా? పోనీ యింటో వాళ్ళువచ్చి, ఆ సంగతి చెప్పి పొమ్మన కూడదూ? కాలు కదల్చడానికి అభిమానం. యెప్పటిదాకా యిట్లా? తను రైల్లో అనుకున్న సంగతులు జ్ఞాపకమొచ్చాయి. తన రైలు దిగగానే వెంకన్నపంతులు కుర్చీ చూపించి కూచోమని కబుర్లు చెప్పడం, రామమ్మ కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు తెమ్మని కేకెయ్యడం, రవణ యెక్కడో వెనక నుంచొని నవ్వుతోన్న ముఖంతో కనపడ్డం, తన తల్లి - "నాయనా, వొచ్చావా" అనడం, యిప్పుడిట్లా అయిందే? అని దిగాలుపడిపోయినాడు. ఇంక రెండు నెలలెట్లాగడపడం యీ యింటో?... పావుగంటకి అప్పమ్మ వచ్చి సంతోషంతో అన్నీ అడిగి కాళ్ళు కడుక్కోమంది.

    గోపాలరావు రైలు ఆలస్యమయింది. అందుకని ఆ వేళకే వెంకన్న పంతులు కచేరికి వెళ్ళాడు. పిల్లలు బడికి పోయినారు. అప్పమ్మ అన్నం తింటోంది, గోపాల్రావు రాలేదనుకొని. బండిచప్పుడు కాగానే, రవణ కిటికీ దగ్గిరికి వొచ్చి చూసింది. గోపాలరావు మారినట్టు కనిపెట్టింది. పొట్టిగా కత్తిరించిన తివాసీ క్రాప్ పెట్టాడు. మీసాలు పెరిగాయి. ఆ షర్టు కాలరు చెన్నపట్నం రకం, మాటకూడా మారింది. కొంచెం నాగరికం వొచ్చింది అనుకుంది. గోపాల్రావు ప్రతి శలవలకీ వొస్తాడనుకుంటో వుండేది. ఇరుగు పొరుగు పిల్లలు పట్నం నించి వొస్తే పైకి అప్పమ్మా లోపల రవణా గోపాల్రావు రాలేదే, తమకే డబ్బుంటే, రైలు చార్జి పంపించే వారంకదా, అనుకునేవారు. రవణ దగ్గిర, వాళ్ళ నాన్న నెలకు పావలాయిస్తే పూర్వం కూడపెట్టుకున్న సొమ్ము నాలుగురూపాయలుంది. చెన్నపట్నం రాను పోను అది సరిపోతుండేమో పంపాలని వుండేది కాని, యెట్లా తెలుసుకుంటుంది. అడిగితే గోపాలరావుకోసమని తెలుసుకుంటారని భయం. అప్పమ్మతో మాటాడటం కూడా సిగ్గే. గోపాల్రావు మీద రవణకి పెద్దప్రేమ అప్పుడే వుందని కాదు. అతను తన వాడనీ తను అతనికి సంతోషం కలిగిస్తాననే అభిప్రాయం యేదో వుంటుంది. బొమ్మలమీద చూపే ప్రేమ కొంత అతని మీదకి మళ్ళింది. అతను బండి దిగడమూ, తను యెదురుగా నుంచోడమూ అతని మొహంలో కనబడే సంతోషాన్ని తను చూడ్డమూ తలుచుకునేది. కాని ఆమె పెద్దమ్మ విషయమూ, తరువాత, యింటోవాళ్ళనే మాటలూ, గోపాల్రావు వొస్తాడనగా వాళ్ళు చేసిన వేళాకోళాలూ పెద్ద సిగ్గు తెచ్చి పెట్టాయి. ఆమె అందుకనే కిటికీలోంచి ఒకసారి చూసి పారిపోయి మళ్ళీ కంటపళ్ళేదు.

 Previous Page Next Page