గోపాలరావు స్కూలు పైనల్ ప్యాసైనాడని తెలిసింది. అతనూ, అతని తల్లీ, అతను యింటర్ మీడియట్ చదవాలన్నారు. వెంకన్న పంతులు ఓవర్సీర్ పరీక్ష మంచిదన్నాడు. అసలు గోపాలరావు మార్కులు తెచ్చుకోడానికి, వరం పొంది పుట్టిన అవతార పురుషుడు. కాని ఆ పనిలో "ఆసక్తిలేదనీ, ఆ సబ్జెక్టులలీ ప్రవేశం లేదనీ" చెప్పినా వెంకన్న పంతులు వినిపించుకోలేదు. నాలుగేళ్ళు బి.ఏ. తరువాత రెండేళ్ళు బి.యల్. యివన్నీ లెఖ్కవేసి చూస్తున్నాడు. ఈ గోపాలరావు పట్నం వెళ్లేటప్పుడు అతనికి రెండు పంచలూ, ఒక కోటూ, రెండు షర్టులు కొన్నారు. జీతంముందే కట్టేసి, అతనికి నెలకి యిరవై రూపాయలకంటే ఒక్క దమ్మిడీ కూడా యెక్కువ యియ్యనని కఠినంగా చెప్పారు వెంకన్న పంతులు. చిన్న ట్రంకు సద్దుకొని కూలివాడి నెత్తిమీదపెట్టి, తన తల్లితో అతను వెడుతున్నానని చెప్పడానికి వొస్తే రవణకి కళ్ళంబడి నీళ్లు తిరిగాయి. ఏదో తనకి తెలీని గొప్ప స్నేహబంధాన్ని విడిచి వొంటరిగా వెడుతున్నట్టు గోపాలరావుకి తోచింది. ఆ అనుభవాన్ని కలగజేసింది ఆ పన్నెండేళ్ళ చిన్న హృదయమని అతనికి తెలీదు.
గోపాలరావు వెళ్ళిపోగానే ఇల్లంతా శూన్యమైనట్టుంది రవణకి, తను అతనితో వొక్కమాట మాటాడక పోయినా, అతని సంగతి తెలియకపోయినా ఆ వొక్కరోజూ అతని పక్కన పీటలమీద కూచోడమూ, అతనికి చిటికెన వేలు పట్టుకోడమూ, తనని అతనిదానిగా చేసిన అభిప్రాయాన్ని తెచ్చాయి.
ఎండాకాలపు శలవులకి గోపాలరావు వచ్చేలోపున రవణ పెద్ద మనిషయ్యింది. వెంకన్న పంతులకి రవణ, కన్న కూతురుకన్న ఆప్తురాలయింది. ఆఫీసునుంచి వచ్చింది మొదలు మళ్ళీ పడుకోబోయేవరకూ రవణ వొక్క నిమిషం కూడా యెడంగా వుండటానికి వీల్లేదు. ఆయన్ని క్లబ్బులో చేర్పించి, షర్టువేసి, కండువావేసి. చేతికర్ర అందించి సాయంత్రం క్లబ్బుకి పంపించేది. భోజనం చేసేటప్పుడు రవణ యెదురు కూచోవాలి. భోజనం కాగానే, ఆంధ్రపత్రికా, సాహితీ, కథాసరిత్సాగరమూ, ఆయనకి రవణ చదివి వినిపించాలి. పొద్దున్నే రవణా అనే పిలుపుతో లేస్తాడు. రామమ్మకీ, అప్పమ్మకీ రవణ ప్రాణం.
అప్పమ్మ రోజుకోసారి రవణని కావలించుకొని,
"మా గోపాలం అదృష్టం" అంటో వుంటుంది.
రామమ్మ "యిట్లాంచి పిల్లని ఆ వెధవ చేతుల్లో పెట్టాము, సుఖపడిపోతాడు దరిద్రుడు" అనేది.
చెన్నపట్నం నించి బయలుదేరేముందు, గోపాలరావు తను వెళ్ళబోయే యింటి సంగతి తలుచుకొని భయపడ్డాడు; కాని ఆలోచించగా మళ్ళీ, తను యీ సారి గౌరవంగా వుండకూడదా అని తోచింది తనంతటే తనే లోకువ పర్చుకున్నాననీ, తను మాత్రం బెట్టుగా వుంటే, వాళ్ళుకూడా గౌరవం చూపుతారని తోచింది. యాడాది చెన్నపట్నంలో వుండి, ఇతరుల సమపద్ధతిని మెలగి, కొన్ని విషయాలు నేర్చుకున్నాడు. కాని గొప్పవాడివలె తనతో ఒక్క మాట మాట్లాడక, తన వంకన్నా చూడక, పైగా తన భార్య రవణతో నవ్వుకుంటో పనులు చేయించుకునే వెంకన్న పంతులూ, చాకలి కన్నీ తనని హీనంగా చూసి, మాటలనే రామమ్మా, తన ప్రాణాలు కొరుక్కుతినే హిరణ్యకశిప హిరణ్యాక్షుల్ని తలుచుకునేటప్పటికి మళ్ళీ భయంతో ప్రాణం తత్తరిల్లింది.