"హు. నీవెందుకు చావడం? ఇలాంటి వాడితో యింకా కాపురం సాగిస్తున్ననిన్ను చూస్తె ఆశ్చర్యంగా వుంది. చదువుండీ ఉద్యోగం వుండి , నీ బతుకు నీవు బతక గలిగే అవకాశం వుండీ, యిలా భరిస్తున్నానంటే ...గట్టిగా ఎదిరించి యింట్లోంచి పోతా, నా బతుకు నే బతుకుతా అని."
'అన్నీ అయ్యాయి. అంటే, ఫో అని బట్టలు విసిరేశాడు. నన్ను ఎదిరించి పోతా అని మరోసారి అంటే గెంటేస్తా యింట్లోంచి . ఏ బాబు ఆడుకుంటాడో చూస్తా అని బెదిరింపులు. ఉద్యోగం చూసుకు మిడిసి పడ్తున్నావు , ఫో యింట్లోంచి . పొతే మొగుడంటే ఏమిటో తెలుస్తుంది. మొగుడన్నాక ఓ మాట అంటే పోతా పోతా అని భయపెడితే , ఆడాళ్ళ కే అంత తెగింపు వుంటే, నాకేం మగాణ్ణి మరో పెళ్లి చేసుకుంటా."
"అంటే....ఎంత మగ అహంకారం! ఇంకా యీ రోజుల్లో యిలాంటి మగాడిని భరించి సహిస్తున్నావంటే..."
"ఏమిటో , నాకెవరూ లేరు. అమ్మని చూసుకోవాలి. ఒంటరిగా బతకడం లో ఏ చిక్కులు వుంటాయో నని..... అక్కడి కొచ్చి ఏ గొడవలు..........చేస్తాడో?"
"ఇంతకంటే గొప్ప చిక్కులుండవు లే అమ్మా! ఒక గది తీసుకో. చిన్న యిల్లు తీసుకుని నీ పాటికి నీవు బతకలేవా? పిచ్చి వేషాలు వేస్తె పోలీసు కంప్లైంట్ యిస్తానని బెదిరించు. నీ హద్దులో నీవుండి, మొగుడ్ని కదా అని నన్ను వేధిస్తే నీ అంతు చూస్తా' అని బెదిరించి చూడు. అన్నింటికీ నీవు భయపడ్తున్నావని నీకు ధైర్యం లేదని గుర్తించి అలా రెచ్చిపోతున్నాడు. నీకు నేనున్నా, ఏమన్నా పిచ్చి వేషాలు వేస్తె పెట్టె పట్టుకు నా యింటికి రా. నీ ఏర్పాటులు చేసుకునేవరకూ నేను అండగా వుంటా. ఎన్నాళ్ళు కావలిస్తే అన్నాళ్ళు ఉండు."
"అమ్మో! మీ యింట్లో -- నన్ను బతకనిస్తాడా?"
"ఇదిగో , పిచ్చి మాటలు మాట్లాడకు. పిరికితనం వదులు. నీ వంటి మీద చెయ్యి వేస్తె ఫోను ఎత్తి పోలీసులని పిలు. చచ్చినట్లు బయపడతాడు."
అపనమ్మకంగా చూసింది. "పోలీసులు వస్తారా?' వాళ్ళు వస్తే ఆ కోపంతో యింకా....."
ఆమెలో అభద్రతా భావం పిరికితనం పోగొట్టడానికి ఎన్ని రకాలుగా ధైర్యం చెప్పి చెప్పి, "తిరగబడి చూడు ....అప్పటికి దారికి రాకపోతే చూద్దాం" అంటూ ఆ రోజంతా ధైర్యం చెప్పింది వరలక్ష్మీ.
* * *
"అంటీ! మీరు చెప్పింది చేశా. ఫోను ఎత్తేసరికి భయపడి, కోపం పట్టలేక ఫోను విసిరేశాడు. 'ఫోను విసిరేస్తే బయటికి వెళ్లి చెయ్యలేనను కుంతున్నావా? నీ హద్దులో నీవు వుండి యీ యింట్లో నీకెంత హక్కుందో నాకూ అంతే హక్కు ఉంది. పొమ్మనే హక్కు నీకు లేదు' అని దబాయిస్తే కాస్త తెల్లబోతూనే బెదిరాడు. 'పోగరేక్కిందే నీకు . ఉండు నీ పని చెప్తా' అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. అంటీ! కాస్త భయపడ్డాడు."
రెండు మూడు రోజులకి ఒకసారి సలహాలు, సంప్రదింపు లు తో యిద్దరూ చర్చించేవారు. ఆఫీసు కి వెళ్ళే పీల్ల అంటూ వండుకున్నది, కాస్త ఎక్కువ వండి కూర, పచ్చడి, పులుసు లాంటివి స్పేర్ తాళం దగ్గర పెట్టుకుని వాళ్ళిద్దరూ యింటి కొచ్చే ముందు వంటింట్లో పెట్టేది వరలక్ష్మీ. చాకలి బట్టలు తెచ్చినా, పనిమనిషి వస్తే తాళం యిచ్చి పని చేయించడం వంటి చిన్న చిన్న పనులు చేయిస్తూ తల్లిలా ఆడుకుంటూ ధైర్యం నూరిపోస్తూ వాణి కాస్త ప్రశాంతంగా ఎలా తన బతుకు తను బతకాలో చెపుతూ అప్రుతాలైంది. వాణి తిరగబడ్డాక తిట్లు తగ్గినా, ఆ కోపం, ఆ విసురు సహజంగా వచ్చిన బుద్దులు తగ్గడానికి సమయం యివ్వాలని , "కొన్నాళ్ళు ఎదురు చూడు. మార్పు రాకపోతే ఆలోచిద్దాం" అంది వరలక్ష్మీ.
పది రోజులు కాస్త తగ్గినట్టు కనిపించినా, లోలోపల వుడికిపోతూ వాణిలో తిరుగుబాటు తనం తట్టుకోలేక బరస్ట్ అయ్యాడు. ఒకరోజు యధాప్రకారం పళ్ళేలు, గ్లాసులు విసరడం తిట్లు అన్నీ అయ్యాయి. 'అంటీ , నాకు మీరు అండగా వున్నారని మీరు నాకు అన్నీ నేర్పుతున్నారని , మనిద్దరి మధ్య సాన్నిహిత్యం తెల్సి "ఆ ముసలిది నీకు అన్నీ నూరి పోస్తుందన్నమాట! అందుకే యింత పెలుతున్నావు . ఎవరే అది . కాళ్ళిరగ కొడతా ణా ఇంటి వేపు వస్తే కాపురం చెడ గోడ్తుందా? అన్నేళ్ళు వచ్చి బుద్ది జ్ఞానం లేదా డానికి' అంటూ నోటికి రాని మాటలంటే వినలేక తిరగబడ్డా. అదీ చూశారుగా అయన బుద్ది.
"సరే చూద్దాం...." అంది వరలక్ష్మీ.
ఆ రోజే కొడుకుతో మాట్లాడితే కొడుకు అన్నది విన్నాక కాస్త ఆలోచనలో పడింది. ఆలోచన తెమలక ముందే తరువాత పది రోజులకి కొత్త కారణంతో నోటికి రాని మాటలు.
"అంటీ, ఆఫీసులో ఎవరితోనో నాకు సంబంధం అంటగట్టి వాడితో స్నేహం మరిగావే. వాడు రమ్మన్నాడా? పోతావా రంకు మొగుడి దగ్గరికి. అందుకేనా అంత ధైర్యంగా ఎదిరిస్తున్నావు?' అంటూ నానాగోల చేశాడు" అంటూ ఏడ్చి ఏడ్చి వాచిన కళ్ళతో ఏడుస్తూ అంది వాణి.
"పద, నీ మొగుడి తో మాట్లాడుతా. ఇంక వూరుకోవద్దు" వరలక్ష్మీ ఆవేశం పట్టలేక లేచి వాణి వద్దు వద్దు అంటున్నా చేయి పట్టి లాక్కెళ్ళి నట్టే ఆ యింట్లో చొరబడింది. అతను తెల్లబోయాడు. "చూడు బాబూ! నీ పేరేమిటో , ఎందుకు ఒక ఆడపిల్లని యింతలా హింసిస్తున్నావు? అగ్నిసాక్షిగా పెళ్ళాడి, నిన్ను నమ్మి తన వాళ్ళందరి ని వదులుకుని వచ్చిన భార్యని గుండెల్లో దాచుకోవాల్సిన అమ్మాయిని నీ యింటి కొచ్చి, నీకు చాకిరి చేసి, నీకు పిల్లల్ని కని, నీ యిల్లే తన యిల్లను కుని బతికే భార్యని యిలా హింసిస్తావా? మగాడి వైతే, మొగుడి వైతే నీ యిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా?"
దులిపెస్తున్న వరలక్ష్మీ ని చూసి ముందు బిత్తర పోయి తరువాత కోపంగా లేచి "ఏమిటి, ఎవరు నువ్వు? నా యింటి కొచ్చి, నన్ను యిన్ని మాటలంటూన్నావు. నీకెంత ధైర్యం? ముందు నడు బయటికి. మా యింటి వ్యవహారం లో కలుగజేసుకునే అధికారం ఎవరిచ్చారు? అసలు నీవే దానికి లేనిపోని వన్నీ ఎక్కించావు బుర్ర లో . అంతవరకు చచ్చినట్టు పడి వుంది. పో బయటికి. నీవెవరు అని యిన్ని మాట్లాడుతున్నావు?" ఎగిరెగిరి పడుతూ మీద మీదకి వచ్చాడు.
"నేనెవరినా? తోటి మనిషిని. నీ అమ్మ వయసున్న దాన్ని; బుద్ది చెపితే వింటావని వచ్చాను. ఆ అమ్మాయి మీద చెయ్యి వేశావో నీ అంతు చూస్తా! ఉద్యోగం ఊడగొట్టించి జైల్లో తోయిస్తా" అరిచింది వరలక్ష్మీ.
"ఇదే ఆఖరు సారి , మరో చాన్సు లేదు నీకు. కట్టుకున్న ఇల్లాలి పై యిలాంటి దౌర్జన్యం , హింస ఏ పోలీసులు , కోర్టులు సహించవు. అది తేల్చుకో వస్తా. వాణీ, మరోసారి ఏదన్నా నోరెత్తితే ణా దగ్గిరికి" తర్జనితో బెదిరించి విసవిసా యింట్లోంచి బయటికి వచ్చింది వరలక్ష్మీ ఆయాస పడ్తూ.
* * *
తుఫాను ముందు నిశ్శబ్దంలా పది రోజులు నిశ్శబ్దంగా గడిచాయి. పదకొండో రోజు ఏం జరిగిందో చెప్పడానికి వాణి లేదు. ఏదో పెద్ద నింద , హింస భరించలేనంత ఏదో జరిగి వుంటుంది. కాస్త ధైర్యం తెచ్చుకుని, ఏవో నిర్ణయానికి వద్దామన్న ఆలోచన వాణికి వచ్చి ఆ నిర్ణయం అమలు పరిచే వేళకి యిలా తొందర పడింది.
పావుగంట అలా స్పృహ లేనిదానిలా కూర్చున్న వరలక్ష్మీ నెమ్మదిగా శక్తి కూడగట్టుకుని, ఫొను తీసింది. తర్వాత గోడకి తగిలించిన తాళాలు పట్టుకు నెమ్మదిగా వాణి యింటి వైపు వెళ్ళింది. ఇంట్లో నలుగురయిదుగురు జనం. డైనింగ్ టేబుల్ దగ్గిర కుర్చీలో రెండు చేతుల మధ్య తలవాల్చి పాలిపోయిన మొహంతో కూర్చున్న ఆ మొగుడనే మృగం దగ్గిరకి వెళ్ళింది. టేబుల్ మీద వాళ్ళ ఇంటి తాళం పడేసి "ఆలస్యం చేశాను ఫోన్ చెయ్యడం ఇప్పుడు చేశాను. వారం ముందే చేసి ఉంటె వాణిని రక్షించు కునేదాన్ని నాదే పొరపాటు. ఇప్పుడు ఇంక ఆలస్యం అవదు. వస్తారు పోలీసులు. సిద్దంగా వుండు" తిరస్కారంగా చూస్తూ చెమటలు కారుతున్న అతని మొహంలోకి తీక్షణంగా చూసి బయటికి నడిచింది.
ఇంట్లో లైట్లన్నీ వేసుకుని కుర్చీలో కూర్చుని పోలీసుల రాక కోసం చూస్తుంది వరలక్ష్మీ.
* * *