ఊరికి ఉపకారం
కొడుకుని చూసి తప్పు చేసిన దానిలా, తలదించుకుని కళ్ళు, వాల్చింది అన్నపూర్ణమ్మ. మూసిన కళ్ళు నిండుకున్నాయి. అరవింద్ తల్లి చెయ్యి పట్టుకుని "ఏమిటమ్మా, ఎలా ఉన్నావు? బాగా నొప్పిగా వుందా"అనునయంగా అన్నాడు "ణా ఖర్మం నాయనా, యీ వయసులో యిదంతా నా కెందుకురా నాయనా ఈ బాధలు, అవస్థలు, నా బాధ సరే, మిమ్మల్నందరి ని బాధ పెడ్తున్నాను. అంత దూరం నుంచి అన్ని వేలు తగలేసుకుని శ్రమపడి రావడం, మొన్నే వచ్చి వెళ్ళావు మళ్ళీ యిలా... ఖర్మ , ఇంకా ఆ దేముడికి నా మీద దయలేదు. విలవిల లాడుతూ కన్నీళ్ళు పెట్టుకున్న తల్లిని చూసి బాధపడి అప్పటి వరకు రాత్రికి రాత్రి హటాత్తుగా ప్రయాణం అయి వచ్చిన చిరాకు, అసహనం, పోయి జాలిగా చూశాడు. ఎనభై ఎనిమిదేళ్ళ వయసులో తుంటి ఎముక విరిగింది. ఆపరేషన్ తప్పదు. రెండు నెలలన్నా పక్క మీద తప్పదు. డబ్బుంది మనుషుల్ని పెట్టి చేయిస్తారు. కానీ యిక్కడీవిడ యీ పల్లెటూరి లో వంటరిగా, దేశాలవతల మేము....ఎన్నాళ్ళు ఉండగలరు. రెండు నెలల క్రితం వచ్చి వెళ్ళాడు. మళ్ళీ రావాల్సి వచ్చింది. రేపు ఆపరేషన్ అన్నారు. అరవింద్ తలంతా బరువుగా, ప్రయాణ బడలిక, నిద్రలేమి అన్నీ కలిసిఅలోచించే స్థితిలో లేకుండా దిగులు, అశాంతి కమ్ముకుంది.
"ఇంటికి వెళ్లి స్నానం, భోజనం చేసి నిద్రపో రేపు పొద్దుటే రా రాత్రికి మన వెంకట్ వున్నాడులే వెళ్లు" అంది అన్నపూర్ణమ్మ ఆప్యాయంగా చూస్తూ. "సరే అమ్మా పొద్దుటే బయలుదేరి వస్తాను. డాక్టరు తో మాట్లాడాను. నీవు కాస్త తిని నిద్రపో అంటూ పక్కనున్న నర్సు తో "జాగ్రత్తగా చూసుకో అమ్మా నీ పేరేమిటో అన్నాడు.' 'సుగుణ' అంది ఆమె. "మీరేమీ వర్రీ కాకండి నేను చూసుకుంటా" భరోసా యిచ్చింది. తల్లికి ఇరవై నాలుగు గంటలు తోడుగా ఉండేందుకు కుదిర్చిన అమ్మాయి.
"పద నరేష్ వెడదాం. పక్కనున్న చిన్నాన్న కొడుకుని తీసుకుని బయటికి వెళ్ళాడు అరవింద్. "సారీరా, మీ కందరికీ ట్రబుల్ , యివ్వడం తప్పలేదు. సిటీ లో వున్న మీకు యీ ఆస్పత్రి బంధువులు తప్పరు" కారులో వెడుతూ అన్నాడు.
"అలా మాట్లాడకు అన్నయ్యా. బంధువులన్నది వున్నది యీలాంటప్పుడు కాకపోతే యింకేప్పుడు పెద్ద దోడ్డమ్మ మమ్మల్నందరినీ స్వంత పిల్లల్లాగా చూసేది. ఆవిడకి అవసరం వచ్చినప్పుడు ఈ మాత్రం అన్నా చేయ్యద్దా" అన్నాడు నరేష్.
* * *
అంబులెన్స్ పట్నం పొలిమేరలు దాటి పల్లెబాట పట్టింది. ఆపరేషన్ అయి తొమ్మిదో రోజున డిశ్చార్జ్ చేసి, డాక్టరు తీసుకోవలసిన మందులు, ఫిజియోతెరఫీ లు అన్నీ వివరంగా రాసి, యిచ్చాక, ఆస్పత్రి వారే ఏర్పాటు చేసిన అంబులెన్స్ లో నర్సు సుగుణ నెల రోజులు ఇంట్లో ఉండే ఏర్పాట్లు చేయించుకుని తల్లిని తీసుకుని ఊరు బయలుదేరారు అరవింద్. వెంకట్ అంతకుముందే పందిరి మంచం తీయించి, ఆస్పత్రి మంచం అద్దెకి తీసుకుని, బెడ్ సోర్స్ రాకుండా వాటర్ బెడ్ వేయించి, కమోడ్ కొని అన్నీ ఏర్పాటులు అ పల్లెటూరి లో దొరకని సమస్త మందులు, ఇంజక్షన్లు అన్నీ ఏర్పాటు చేసి పెట్టాడు. ఇంకో వారం తర్వాత మళ్ళీ వచ్చి చూపించుకోవాలన్నారు. అప్పటి వరకు తనుండక తప్పదు. ఈలోగా అరుణ వచ్చే ఏర్పాటు చెయ్యాలి. అది మాత్రం ఎన్నాళ్ళు ఉంటుందిరా , యీ సుగుణ చూసుకుంటుంది లే" అంది అన్నపూర్ణమ్మ.
ఊర్లో అంబులెన్స్ ప్రవేశించగానే ఊరంతా జనం, ఏమిటో ఆభరాగా తిరుగుతూ , పిల్లలు పరిగేడ్తూ - అంబులెన్స్ కి అడ్డం పడ్డారు. "ఏమిటి ....! ఏమైంది ...? యీ జనం ఏమిటి వెంకట్" అరవింద్ ఆశ్చర్యంగా అన్నాడు.
నేనూ పొద్దుటే వచ్చేశాగా తెలియదు వుండు. అడుగుతా , కిటికీ లోంచి తలబయట పెట్టి, నర్సయ్యా ఏమిటి ఏమయింది అన్నాడు వెంకట్.
"తమకి తెల్దాండీ. మన సత్తెయ్య మొత్తం ఫేమిలీ అంతా పరుగులు మందు తిని సచ్చిపోనారండి..."
"అయ్యొయ్యో , అదేమిటి, ఎప్పుడూ...." వెంకట్ గాభరాగా అన్నాడు.
"తెల్లారి పొలం ఎల్లడానికి కూలికి వచ్చినవాడు ఎంత పిలిచినా తలుపు తీయకపోతే, తలుపు బద్దలు కొట్టారండి పోలీసులోచ్చారండీ...గోల గోలండి"
"అయ్యో, యింటి కెళ్ళి అటు వస్తాలే... అరవింద్ వంక తిరిగి ' పాపం సత్తెయ్య మూడేళ్ళ బట్టి పంట చేతి కందక, అందిన డానికి గిట్టుబాటు ధర పలక్క ఒక ఏడాది పంటెండి, ఇంకో ఏడాది ధాన్యం మొత్తం తడిసి , తెచ్చిన అప్పులకి వడ్డీ కూడా కట్టలేక అప్పులపాలయ్యాడు. అప్పు మూడు లక్షలు దాటి పోయిందని డీలా పడిపోయి మరో దారిలేక యింతకీ వడిగట్టి వుంటాడు.
"ఏమిటి సత్తేయ్యా...అయ్యో...అయ్యో....ఇంత పని చేశాడు" కలవరపడ్తూ నీర్సంగా అంది అన్నపూర్ణమ్మ.
"మాట్లాడకమ్మా , నీర్సంగా వున్నావు. ఆయాస పడకు యింటి కెళ్ళాక మాట్లాడుదాం" అరవింద్ తల్లిని ఆపాడు.
యిల్లు చేరి స్ట్రీచ్చర్ యింట్లో పక్క మీదకి చేర్చారు. నర్సు ఆవిడ తాలూకు వస్తువులు తీసుకుని దిగింది. రూములో నర్సు కి అన్నీ చూపించి, వేయాల్సిన మందుల లిస్ట్, ఆవిడ కాఫీ, ఫలహారాలు, భోజనం టైములు అన్నీ వివరంగా చెప్పి, వంటావిడ కమలమ్మ గారికి అప్ప చెప్పాడు. తమ ఫోన్లు నెంబర్లు, డాక్టరు ఫోను, వెంకట్ ఫోను అన్నీ రాసిచ్చి చెప్పాల్సినవన్నీ చెప్పాడు. నేను చెపుతాలే చేయించు కుంటాలే అంది అన్నపూర్ణమ్మ. బాబూ మేమంతా వున్నాం ఆవిడకేం కావాలో మాకు తెలీదా. మీరేం బెంగ పెట్టుకోవద్దు" నాలుగైదేళ్ళుగా వున్న వంట ఆవిడ కమలమ్మ గారు, పనిమనిషి సీతాలు భరోసా యిచ్చారు. "మీరంతా వున్నారన్న ధీమాతోటే మేం అక్కడ నిశ్చింతగా వున్నాం" అన్నాడు అరవింద్ అందరిని అభిమానంగా చూస్తూ బతికినన్నాళ్ళు ఆవిడకి ఏ లోటు లేకుండా చూసుకోండి. మీ సంగతి నేను మర్చిపోను" తనూ భరోసా యిచ్చాడు. "ఏమిటోరా నాయనా దేముడు మాలాంటి వాళ్ళ కిలా అయిష్హు పెంచేస్తూ పిల్లల్ని దూరం చేసుకున్న మా బతుకులతో ఆడుకుంటున్నాడు. ఒంటరి బతుకులు అయిపోయాయి. అన్నపూర్ణమ్మ కళ్ళు వత్తుకుంది.
"సరే, అమ్మా, ఏం చేస్తాం , కాస్త హార్లిక్స్ తాగి విశ్రాంతిగా పడుకో"
"వెంకట్ ఒక్కసారి వెళ్లి సత్తెయ్య సంగతి కనుక్కురా బాబూ అన్ని విధాల రైతు బతుకులు చితికి పోయాయి. ఏదీ సబ్సిడీ అంటారు. ఏ మూలకది. ప్రతి ఏడు ఏదో ఒకటి. వాళ్ళ పొట్ట కొట్టడానికి ఆవేదనగా అంది.
"నీవు పడుకో అత్తయ్యా, నేను కనుక్కుంటాలే" వెంకట్ అన్నాడు.
* * *
"అరవింద్ , వెంకట్ కాసేపు మీరిద్దరూ కూర్చోండి . మీతో మాట్లాడాలి" అంది మర్నాడు పొద్దుట పదకొండు గంటల వేళ అన్నపూర్ణమ్మ , నిన్న రాత్రంతా ఆవిడకి నిద్ర పట్టలేదు. సత్తెయ్య సంగతి విన్న దగ్గిర నించి ఆవిడ మనసు పాడయింది. కళ్ళ ముందు పుట్టి పెరిగిన వాడు. వూరంతా ప్రతి గడప, ప్రతి మనిషి ఆవిడకీ తెలీని వాళ్ళు లేరు. 75 ఏళ్ళ అనుబంధం ఊరంతటికి పెద్దమ్మ గారే ఆవిడ. ఏ యింట ఆడపిల్ల పెళ్లి జరిగినా పుస్తె, పట్టు చీర పంపాల్సిందే. ఎవరి పొలం ఎక్కడో, ఎంతమంది రైతులో , కుమ్మరులు, వడ్రంగులు, చాకళ్ళు ప్రతి వర్గం ఆవిడకి తెలుసు. మామగారి హయాం లో కట్టించిన పెంకుటిల్లు మార్చి కట్టించడం, చిన్న స్కూలు పెట్టించడం, ఊర్లో రామాలయ స్థాపన, ఊరికి తారు రోడ్డ్డు , బస్సు ఆగే సౌకర్యం అన్నీ భర్త కాలంలో జరిగి ఆ వూరికి పెద్ద దిక్కుగా నిలిచారు. మరుదులు, ఆడపడుచులు పెళ్ళిళ్ళు శుభకార్యాలు పెద్దక్కగా అన్నీ ఆవిడ చేతి మీద జరిగాయి. ఊరంతా తనదేనన్నట్టు మూడు వేల జనాభాకి ఆవిడ తల్లి అనిపించుకుంది.
'అరవింద్ నేను పోయేలోగా యీ వూరి రైతులకి ఏదన్నా మంచిపని చేసి పోవాలనుందిరా. నా కళ్ళేదుట ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయో , కళ్ళ ముందు పుట్టిన వారు, చిన్న వాళ్ళు, ఎంతో బతుకు వున్నవాళ్ళు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు రా, ఏదన్నా చేసి వాళ్ళను ఆదుకోవాలని వుందిరా."
"అవునమ్మా నిజమే, కాని మనం ఏం చెయ్యగలం. ప్రభుత్వాలు చెయ్యాల్సిన పనులు, ఒకరా యిద్దరా ఆడుకోడానికి" అరవింద్ తల్లి వంక చూస్తూ అన్నాడు.
"సబ్సిడీలిచ్చామంటారు, రుణా లిచ్చామంటారు. యిచ్చిన డబ్బులు చాలవు అప్పులు చేస్తున్నారు. విత్తనాల కొరకు, ఎరువుల కొరకు, సకాలంలో వానలు పడవు. పంట చేతికి వచ్చే వేళకి వానలు ముంచెత్తి ధాన్యం తడిసి పోతుంది. వడ్డీలు పెరిగి అప్పుల భారం పెరుగుతుంది. పంట చేతికొస్తే దళారులు దోపిడీ, గిట్టుబాటు ధర పలకదు. కల్లాంలో వేసిన గింజలు నీళ్ళలో తెలిపోతుంటే రైతుల కన్నీళ్ళేమో అనిపిస్తుంది. అన్నపూర్ణమ్మ ఆవేదనగా చెప్పుకు పోతుంది.
'అరవింద్, ఒక రైతు గా నాకు ఈ బాధలన్నీ తెలుసు. కానీ నీవన్నట్టు మనలాంటి వారం, ఏం చెయ్యగలం" వెంకట్ అన్నాడు.
"అందుకేరా, నే పోయేలోగా వాళ్ళకి పండిన పంట దాచుకోడానికి ఒక గోడౌన్ కట్టించి ఇవ్వాలని వుంది. ఏదో దేముడు దయ వల్ల మీ యిద్దరూ చక్కగా పైకి వచ్చి అమెరికా లో ఆర్జించు కుంటున్నారు . నా డబ్బు.......
"ఏమిటత్తయ్యా వందో రెండొందలా బస్తాలా దాచుకోడానికి, చిన్న గోడౌన్ కట్టించడానికి వూరందరి పంట, పదివేల బస్తాలన్నా వుంటాయి. కనీసం తెలుసా అడ్డుకుని అన్నాడు వెంకట్.
"అవును నాకు తెలుసు. అందుకే వూర్లో రైతుల పంట లెక్క తీయి సరిపోయేట్టు కట్టిద్దాం" ఆశగా చూసింది.
"గోడౌన్ అంటే స్థలం కావాలి. కట్టడానికి ఖర్చు నీ దగ్గిర వున్న డబ్బు సరిపోతుందనుకుంటున్నావా --" అరవింద్ ప్రశ్నార్ధకంగా చూశాడు.
"అదీ ఆలోచించా రాత్రంతా . డబ్బు సరిపోదు. పొలం కొంత అమ్మాలి. అంతకంటే నీవు వప్పుకుంటే.......ఆరాటంగా చెప్పబోతూ అగిందావిడ.
"ఏమిటి చెప్పు, నీ మనసులో మాట చెప్పు" అరవింద్ అన్నాడు.
'అదే పొలం అమ్మడం కంటే వున్న ఐదేకరాలలో మీరిద్దరూ చేరి రెండేకరాలు తీసుకుని ఆ ఎకరం పొలం మనల్ని నమ్ముకొని బతికే మన రైతు కిద్దాం. ఈ యిల్లు పాతబడింది. ఈ వూర్లో అమ్మినా పెద్ద ధర రాదు. మీరా యిక్కడ వుండరు. ణా తరువాత ఎలాగో అమ్మి పారేస్తారు. అంచేత యీ యిల్లు రైతులకి పంట దాచుకోడానికిద్దాం. పెద్ద కొంప, వరండాలు, అన్నీ కలిపి ఎనిమిది గదులు ధాన్యం కొట్టు అన్నీ కలిపితే పంటంతా దాచుకోవచ్చు. వాళ్ళు మనకు స్థలం కొనడం, కట్టించడం, శ్రమ నీవుండవు ఇదంతా ఎవరు చూస్తారు అందుకని యిల్లు యిద్దాం ఏమంటావు." ఆశగా చూసింది.
'అది సరే, యిల్లు యివ్వాలంటే నీ తదనంతరం కదా అదెప్పుడో మనకేం తెలుసు ఏమో యింకా ఏ ఐదారేళ్ళ సంగతే అయితే యిప్పటి నించి ఆ ఆలోచన ఎందుకు' తేలిగ్గా కొట్టి పారేసాడు.
"అవునురా నాయనా, ఇంకా నాకు ఎంత అయుష్హు పోషాడో ఆ దేముడు అందుకే, నాకోసం ముందు భాగం వంట గది అట్టి పెట్టుకుని మిగతా దంతా వాళ్ళని వాడుకోమందామానుకుంటున్నాను. ఇల్లంతా ఖాళీగా పడుంది గదా"
"అబ్బ నీవుండగానే యిదంతా ఎందుకమ్మా తరువాత చూద్దాం" విసుగ్గా అన్నాడు అరవింద్. యింట్లో ఆ గోలంతా నీవు భరించలేవమ్మా" . "నా చేతులతో వాళ్ళ కిచ్చిపోతే మంచి పని చేశానన్న తృప్తి దక్కనీరా , నా కళ్ళతో వాళ్ళ కళ్ళలో ఆనందం చూడనీ" ఇబ్బందిగా వెంకట్ వంక చూశాడు అరవింద్.
"సరేలే అత్తయ్యా అరవింద్ వెళ్ళేలోగా చేద్దాం ముందు రైతుల వివరాలు ఎకరాలు, బస్తాలు యివన్నీ తెలుసుకొని వచ్చి చెప్పుతాలే"
"వెంకట్ అరవింద్ ఉన్నప్పుడే , యిదంతా నీ చేతుల మీద నీవే చేసి పెట్టాలి" "సరే అత్తయ్యా అలాగే అన్నా కదా.'
* * *