Previous Page Next Page 
అర్చన పేజి 17

    వేణు ఆపాదమస్తకం వణికింది.
    వెంటనే బాబు గుర్తొచ్చాడు. బాబుని తెచ్చుకోవాలి. వెంటనే తెచ్చుకోవాలి. తన ప్రాణానికి ప్రాణంగా, తన కంటిపాపలా వాడిని పెంచుకోవాలి. అర్చన కసాయిది. తాను కసాయివాడు కాదు. తన బాబుని తను పెంచుకుంటాడు.
    వేణుకి ఇంక ఒక్కక్షణం కూడా అక్కడ కూర్చోవాలనిపించలేదు.
    ఎలా ఉన్నాడో తన రక్తం పంచుకు పుట్టిన బాబు! వాడిని చూడాలి. అవును చూడాలి. వెంటనే తనతో తెచ్చుకోవాలి. చివాల్న బెంచీమీదనుంచీ లేచాడు. పార్కింగ్ ప్లేస్ లో పెట్టిన బండి మీద కూర్చుని ఉద్వేగంగా స్టార్ట్ చేసి ఇంటివైపు పోనిచ్చాడు.
    వేణు గేటు తోసుకుని లోపలికి నడిచేటప్పటికి వాకిట్లో అరుగుమీద కృష్ణస్వామి కూర్చుని ఉన్నాడు. వాకిలి శుభ్రంగా ఊడ్చి, నీళ్ళు చల్లి ముగ్గు పెట్టి ఉంది. అరుగుమీద దుమ్మూ ధూళి అంతా పోయి కూర్చోడానికి వీలుగా ఉంది. పనమ్మాయి లోపలనుచి ప్లాస్టిక్ చేటలో చెత్త తీసుకొచ్చి ఓ మూలగా పెట్టిన కవరులో చెత్త వేసింది. అదంతా చూడగానే తండ్రి పరిశుభ్రతకి ఎంత విలువ ఇస్తాడో వేణుకి గుర్తొచ్చింది. మొహమాటంగా కొన్ని క్షణాలు గేట్లోనే నిలబడిపోయాడు. తనింట్లో అతనికే కొత్తగా, మొహమాటంగా అనిపించింది.
    "రా నాన్నా! ఏం అలాగే ఆగిపోయావు?" చాలా ప్రశాంతంగా ఆహ్వానించాడు కృష్ణస్వామి.
    వేణు ముందు రెండు అడుగులు సందేహంగా వేసినా బాబు గుర్తు రావడంతో అనుకోకుండానే అతని అడుగుల్లో వేగం పెరిగింది. కళావిహీనమైన ఆ కళ్ళల్లో చిన్న వెలుగు వెలిగింది. తండ్రికి దగ్గరగా నడిచి ఆయన పక్కనే అరుగుమీద కూర్చుని నెమ్మదిగా అన్నాడు. "నాన్నా! బాబు ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు?" 
    "ఏ బాబు?" కొంచెం చిత్రంగా చూశాడాయన.
    "అదే....అది.... అర్చన బాబు."
    కొన్ని క్షణాలు మౌనంగా ఉన్న కృష్ణస్వామి నెమ్మదిగా అడిగాడు "ఇప్పుడు నమ్మకం కలిగిందా బాబు నీ కొడుకే అని." వేణు తల వంచుకున్నాడు.
    "ఏమైందిరా? అర్చన బాబుని ఎందుకు వదిలేసింది? మీ అనుబంధానికి గుర్తేనా బాబు?"
    వేణు నిట్టూర్చాడు. "బాబుకి మేమే తల్లితండ్రులం నాన్నా... కానీ..."
    "చెప్పరా! ఉదయం ఏదో చెపుతుంటే నాకు నిద్రపట్టింది."
    "చెపుతాను నాన్నా! కానీ, ఇప్పుడు కాదు. మనం ఈ రాత్రికే మన ఊరు వెళ్ళిపోదాం. నాకు బాబుని చూడాలని ఉంది."
    ఆయన మనసు ఆర్ద్రమైంది. వేణు భుజమ్మీద ఆప్యాయంగా చెయ్యి వేసి నొక్కుతూ, "అలాగే వెడదాం నాన్నా" అన్నాడు.
    వేణు కళ్ళల్లో ఆనందం విరిసింది. "అయితే, ఇప్పుడే ఫోన్ చేసి టిక్కెట్లు బుక్ చేస్తాను నాన్నా. బస్సులో వెడదామా? కాకినాడ దాకా బస్సులున్నాయి. ఏ.సి. బస్సులు. అక్కడినుంచి మన ఊరికి మంచి బస్సుంటే వెళదాం. లేకపోతే టాక్సీలో వెడదాం" అన్నాడు.
    "అలాగే నీ ఇష్టం. ఇంతకీ నువ్వు భోంచేశావా?"
    అప్పుడు గుర్తుకొచ్చింది వేణుకి ఆయనకి భోజనం ఏర్పాటు చేయలేదని. "నాన్నా! మీకు భోజనం?" అంటూ ఆగిపోయాడు.
    "పద కాళ్ళూ చేతులు కడుక్కురా. అన్నం తిందాం" అన్నాడాయన అరుగుమీంచి లేస్తూ.
    "అన్నమా?" అయోమయంగా చూశాడు వేణు.
    "నాకు వంటొచ్చు కదరా!"
    ఓ... వేణు చూపులు గుమ్మంలోంచి లోపలికి ప్రసరించడానికి ప్రయత్నిస్తూ తానూ లేచి లోపలికి నడిచాడు. గుమ్మం దగ్గరే మంచి పరిమళం అగరొత్తుల పరిమళం. ఇల్లంతా చాలా పరిశుభ్రంగా ఉంది. పనమ్మాయితో శుభ్రం చేయించి నాన్న వంట చేసినట్టున్నారు. ఛ తానొక ఫూల్ అని మరోసారి ఋజువు చేసుకున్నాడు. వేణు మనసులోనే నొచ్చుకుంటూ బాత్ రూం వైపు వెళ్ళిపోయాడు.
    అతను తిరిగి వచ్చేసరికి విస్తరాకుల్లో అన్నం, కూర వడ్డించి అతని కోసం ఎదురుచూస్తూ కూర్చుని ఉన్నాడు కృష్ణస్వామి. వేణు మౌనంగా వచ్చి తండ్రి పక్కనే పీట మీద కూర్చున్నాడు. ఎంత కాలమైంది నాన్నతో కలిసి భోంచేసి? వేణు కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి. అవి బైటకు రాకుండా మంచినీళ్ళు తాగి, భోజనానికి ఉపక్రమించాడు.
    వేణు హైస్కూలుకి వచ్చిందాకా ప్రతి పూటా ఖచ్చితంగా తండ్రితో కలిసే భోంచేసేవాడు. వేణుకి ఏడేళ్ళ వయసులోనే ఉపనయనం జరిగింది. గాయత్రీ మంత్రం చెవిలో పడిన మరుక్షణం వేణులో దివ్యమైన తేజస్సు, అంతులేని విజ్ఞానం కలుగుతాయని కృష్ణస్వామి నమ్మకం. నిజం చెప్పాలంటే వేణు చాలా తెలివైనవాడు. అతని జీవితం అనుకోకుండా తిరిగిన మలుపు వలన అతనొక బ్యాంక్ మేనేజర్ గా ఉండిపోవాల్సి వచ్చింది. కానీ, ప్రయత్నించి ఉంటే కలెక్టర్ కావాలన్న తండ్రి కోరిక తప్పకుండా తీర్చగలిగేవాడు. నీళ్ళు నిండిన అతని కళ్ళకి పళ్ళెంలో పదార్ధాలు మసకగా కనిపించాయి.
    ఉపనయనం అయాక కొంతకాలం పాటు ప్రతి పూటా భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన ఆచారాలను దగ్గరుండి అమలు చేయించాడు. గాయత్రీ మంత్రం చదివావా లేదా అంటూ పదే పదే అడిగి తెలుసుకునేవాడు. సంధ్యావందనం చేయించడం దగ్గర్నుంచీ ప్రతి ఒక్కటీ. వేణుకి హఠాత్తుగా ఒకటి అనిపించింది. సుమారు హైస్కూలు చదువు అయిందాకా పాటించిన ఆచారాలను తను ఎప్పుడు, ఎలా వదిలేసినట్టు అతనికి అంత ఆలోచించినా అ విషయం గుర్తు రాలేదు.
    "సరిగా భోంచెయ్యి వేణూ! ఇప్పుడు బాధపడినంత మాత్రాన కోల్పోయిన జీవితాన్ని, ఆనందాన్ని తిరిగి పొంధలేము. అందుకే పెద్దలంటారు. గతం అనేది ఒక క్యాన్సిల్డ్ చెక్కులాంటిదిట. మర్చిపో. ఏం చేయాలో అమ్మతో ఆలోచించి చేద్దాం సరేనా?"
    ఆయన మాటల్లోని ఆర్ద్రత, ఆప్యాయత వేణు కన్నీళ్ళను మరింత ఎక్కువ చేస్తుంటే బలవంతంగా కన్నీళ్ళు అదిమిపెట్టి అన్నం ముద్ద నోట్లో పెట్టుకున్నాడు.
    రాత్రి తొమ్మిదిన్నరకి కాకినాడ వెళ్ళే బస్సుకి టిక్కెట్టు బుక్ చేశాడు. సూట్ కేస్ లో రెండు జతలు బట్టలు సర్దుకుని, ఇంట్లో సర్దుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయేమో చూశాడు. అంట్లగిన్నెలన్నీ పెరట్లో పంపు దగ్గర వేసి గిన్నెల గంప అక్కడ పెట్టాడు. జాగ్రత్తగా పెరటి తలుపు వేసి గొళ్ళెం పెట్టాడు. వంటగదిలో అన్నీ ఒకసారి చెక్ చేసుకుని సిలిండర్ ఆఫ్ చేశాడు. వాకిట్లోకి వెళ్ళి తండ్రి పక్కన కూర్చుని నెమ్మదిగా అడిగాడు.
    "నాన్నగారూ... బాబుని అమ్మే చూసుకుంటోందా?"

 Previous Page Next Page