టీ తాగుతూ తనకి కృష్ణస్వామిగారు చెప్పిందంత క్లుప్తంగా చెప్పి అన్నాడు. "నాతో కాపురమే చేయలేదు. నాకు బాబు ఎక్కడినుంచి వస్తాడు?" అడిగాడు సూటిగా.
"అసలు మీ ఇద్దరూ ఎప్పుడూ కలవలేదా? దాదాపు ఏడాది కలిసి బతికారుగా!"
"లేదు కానీ.... ఒకరోజు..."
"ఊ! ఒకరోజు ఏం జరిగింది?"
వేణుకి ప్రజ్ఞ అలా సూటిగా అడుగుతుంటే కొంచెం జంకు కలిగింది. నేను తప్పు చేశాను. అలా చేయకుండా ఉండాల్సింది. ప్రజ్ఞకి ఆ సంఘటన గురించి ఎలా చెప్పాలి?
అతని మౌనం భంగం చేస్తూ మళ్ళీ అడిగింది ఆవిడ. "ఏం జరిగింది చెప్పు సందేహించకు."
ప్రజ్ఞ అతడివైపు సూటిగా చూస్తూ కూర్చుంది.
అతని కళ్ళముందు ఆనాటి సంఘటన కదిలింది.
* * * * *
ఆ రోజు చక్రవర్తి కొడుకు బారసాల. చక్రవర్తి వెళ్ళి మూడో నెల బాబునీ, మాధవినీ పుట్టింటినుంచి తీసుకొచ్చాడు. వారం రోజుల తరువాత బ్యాంకులో వేణుని కలిశాడు.
"వేణూ! రేపు బాబు బారసాల. పేరు పెడుతున్నాం. అర్చనని తీసుకుని రేపు ఉదయం ఇంటికి వచ్చెయ్యి. ఆదివారమేగా! అలాగే అర్చనని పేరేదన్నా సెలక్ట్ చేయమని చెప్పు. మంచి క్రియేటివ్ నేమ్" అన్నాడు చక్రవర్తి వేణుతో మధ్యాహ్నం లంచ్ టైంలో. ఒకళ్ళకి హైదరాబాదులో, మరొకరికి వరంగల్ లో పోస్టింగ్ రావడంతో కొంచెం బాధపడ్డారు కానీ, చక్రవర్తి తండ్రి బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో చక్రవర్తిక్కూడా వరంగల్ నుంచి హైదరాబాదుకి ఆరునెలల్లో బదిలీ చేయించగలిగాడు. అలా వారిద్దరూ ఒకే బ్యాంకులో, ఒకే బ్రాంచిలో కలిసి పనిచేసే అవకాశం ఏర్పడింది. విద్యార్ధులుగానే వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. పైగా ఒకే రూములో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒకే ఆఫీసు. వాళ్ళ మధ్య ఎటువంటి అరమరికలు, రహస్యాలు లేని స్నేహం ఉంది.
"అర్చన వస్తే తప్పకుండా తీసుకొస్తాను" అన్నాడు కొంచెం ముభావంగా.
"ఏం? ఎందుకు రాదు?" అడిగాడు చక్రవర్తి. "అర్చనా, మధూ మంచి స్నేహితులు కూడా కదా!"
వేణు మౌనంగా ఉండిపోయాడు.
"ఏంటి వేణూ! మాట్లాడవేం?" మృదువుగా అడిగాడు చక్రవర్తి.
"ఏం మాట్లాడను?"
"ఏదో ఒకటి. డల్ గా ఉన్నావేంటి?" వేణు భుజమ్మీద చేయి వేసి ఆప్యాయంగా అడిగాడు చక్రవర్తి.
వేణు నిట్టూర్చాడు. "అర్చన ఉద్యోగం మానేసింది."
"ఉద్యోగం మానేసిందా?" విస్మయంగా అడిగాడు చక్రవర్తి.
"అవును పదిరోజుల్నించీ ఆఫీసుకి వెళ్ళడం లేదు. ఒంట్లో బాగోలేదేమో, లీవు పెట్టిందేమో అనుకున్నాను."
"అనుకోడం ఏంటి? నువ్వడగలేదా ఏమైంది అని" ఆశ్చర్యంగా చూశాడు.
వేణు నిట్టూర్చాడు. "ఏం మాట్లాడినా సమాధానం సరిగా చెప్పదు. ఇన్ని రోజులూ కనీసం స్నేహితుల్లా అయినా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా ఉండేవాళ్ళం. సుమారు నెల కావస్తోంది. తనలో ఏదో మార్పు వచ్చింది. పరధ్యానంగా ఉంటుంది. నవ్వడం మర్చిపోయినట్టుగా ఉంది. మాధవి కూడా సమయానికి డెలివరీకి వెళ్ళడంతో అర్చన మనసులో ఏం ఉందో తెలుసుకోవడం ఎలాగో నాకు అర్ధం కావడం లేదు."
"అదేంటి వేణూ నాకెందుకు చెప్పలేదు. మనం రోజూ కలుస్తూనే ఉన్నాం కదా!"
వేణు మాట్లాడలేదు. ఏం చెప్పాలి? ఎంత ఆత్మీయుడైనా నా భార్య నాతో సరిగా ఉండడం లేదని అస్తమానం చెప్పుకోడం తనకే అవమానం. చక్రవర్తి పెళ్ళి అయిన ఐదారు నెలలకే అర్చనని తను వివాహం చేసుకున్నాడు. చక్రవర్తి తండ్రి అయాడు. కానీ, తను....!?
అర్చన తనని ఒక స్నేహితుడిగా తప్ప భర్తగా అంగీకరించడం లేదు. ప్రతి రాత్రీ అర్చన కౌగిలి కోసం తను తపిస్తూనే ఉన్నాడు. పది కాగానే గుడ్ నైట్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకుంటుంది. అప్పటిదాకా ఎన్నో కబుర్లు చెబుతుంది. టిఫిను, వంట చేసి పెడుతుంది. భార్యగానో, స్నేహితురాలిగానో ఉదయం లేచిన దగ్గర్నించీ తనకి ఏ టైముకి ఏం కావాలో అన్నీ అమరుస్తూ, కులాసాగా బండి వెనకాల కూర్చుని కలిసి ఆఫీసుకి వెళుతూ, సినిమాలు, షికార్లు తిరుగుతూ రాత్రి కాగానే తననుండి దూరంగా పారిపోయే అర్చన గురించి ఎవరికీ చెప్పుకోవాలి? ఏమని చెప్పుకోవాలి? ఎంతో ప్రేమించి, తపించి, లాలించి, బుజ్జగించి, అనునయించి పెళ్ళిచేసుకున్నాడు. తనమీద తల్లితండ్రులు పెట్టుకున్న ఆశలు కూడా నిరాశ చేసి, అర్చన జీవితం నాశనం కాకూడదని ఆమెని అర్ధాంగిగా చేసుకున్నాడు. తనకి బ్యాంకు ఉద్యోగం రావడం ఆమె అదృష్టం కాదా? లేకపోతే ఇంత స్వల్ప వ్యవధిలో జీవితం ఇలా సెటిల్ అయేదా, అర్చన ఎందుకు అర్ధం చేసుకోడం లేదు. ఆమె మనసులో ఏం ఉంది? ఏం చేయాలనుకుంటోంది?
"వేణూ! ఏం జరిగింది? ఏం ఆలోచిస్తున్నావు?" మృదువుగా అడిగాడు చక్రవర్తి.
ఆలోచనలనుంచి తేరుకుంటూ "తెలియదు. అర్చన మనసులో ఏదో సంఘర్షణ జరుగుతోంది. నాకెందుకో అనుమనంగా కూడా ఉంది. ఏదో జరక్కపోతే తనకి సెక్స్ అంటే భయం ఎందుకు?" అన్నాడు కొంచెం ఆవేశంగా.
"ఏంటి? ఏం అంటున్నావు నువ్వు. నీకూ, అర్చనకీ ఇంకా సయోధ్య కుదరలేదా? నేనింకా ఈపాటికి మీరిద్దరూ చక్కగా కాపురం చేసుకుంటున్నా రనుకుంటున్నాను. అదేంటి వేణూ, ఎందుకు ఊరుకున్నావు?"
"ఊరుకోక ఏం చేయాలి? కొట్టనా, తన్ననా, వెళ్ళగొట్టనా?"
"ప్చ్... వేణూ, ఆవేశం కాదు. కొంచెం నిదానంగా మాట్లాడు. మంచో, చెడో, తొందరపాటో, గ్రహపాటో ఆమెని పెళ్ళిచేసుకున్నావు. ప్రేమించావు. కావాలనుకున్నావు. అందరిలా కాకుండా అనుకోని పరిస్థితుల్లో జరిగిన పెళ్ళి కాబట్టి మీరు అడ్జస్టు అవడానికి కొంచెం టైం పట్టచ్చు. కానీ, ఆర్నెల్లు దాటింది. ఇంకా మీ మధ్య ఏం జరగలేదనడం హాస్యాస్పదంగా అనిపిస్తోంది. తప్పు నీదా, ఆమెదా?"
వేణు మొహం జేవురించింది. "తప్పు నాదే! యస్... చక్రవర్తి నాదే! ఎంత ప్రేమించినా చెడ్డ పేరు తెచ్చుకున్న అమ్మాయిని ఆదర్శంగా పెళ్ళిచేసుకున్నాను చూడు. అది నేను చేసిన బ్లండర్."