Previous Page Next Page 
రాంగ్ నంబర్ పేజి 17

                                 


    
                                                                        రాంగ్ నంబర్
                                                                         వసుంధర

                         

       

    ప్రభుత్యోద్యోగం చేస్తూనే భార్య పేరున ఇన్యురేన్స్ ఏజన్సీ తీసుకున్నాడు రఘురాం. అయితే అతని దురదృష్టమేమిటో కాని ఒక్కటే కూడా కేసు దొరకడం లేదతనికి. అందుక్కారణం అతని మొహమాటమని భార్య సుజాత అనుమానం. కానీ అది నిజం కాదు.
    కేవలం దురదృష్టం అందుకు కారణమని ఋజువు చేయడానికి చాలా సంఘటనలున్నాయి.
    రఘురాం కి ఏజన్సీ తీసుకోవాలని బుద్ది పుట్టేసరికి అతని ఆఫీసులో ఉన్న వాళ్ళందరికీ పెద్దో చిన్నో ఏదో పాలసీ ఉండనే ఉంది. రెండో పాలసీ తీసుకోగల స్తోమతు ఉన్నవాడు ఆఫీసు మొత్తానికీ అఫీసరోక్కడే . ఆయనకు రెండెం కర్మ - మూడు పాలసీలున్నాయి.
    రఘురాం కి కొన్ని నమ్మకాలున్నాయి. మొదటి కేసులో ఫెయిలవకూడదని అతడి ఆశయం. అందుకే ఎవరైనా  అతని  దృష్టికి వచ్చినప్పుడు ముందుగా సమాచారం సేకరించి తనకు అనువుగా ఉన్నాడా, లేడా - అని పరీక్షించుకునే వాడు. ఆ విధంగా అతను తనకు దూరపు బంధువైన గోవిందయ్యను ఎన్నుకున్నాడు.
    గోవిందయ్యకు బట్టల కొట్టు ఉంది కానీ, అయన దాని మీద ఆధారపడి లేడు. నల్లబజారులో సంబంధముందని చాలామంది చెప్పుకుంటారు. రఘురాం పరోక్షంగా సేకరించిన సమాచారాన్ని బట్టి ఆయనకు లక్ష రూపాయల వరకూ ఇన్సురెన్స్ చేసే ఉద్దేశ్యముంది.
    రఘురాం ఒకరోజు ఆయన్ను కలుసుకుని తను ఇన్సురెన్స్ ఏజన్సీ ప్రారంభించిన విషయం చెప్పి బోణి ఆయనతోనే చేయాలనుకుంటున్నానన్నాడు. అయన పెదవి విరిచి ---" 'అబ్బే ! లాభం లేదోయ్ ! నా వ్యాపారం కుంటి నడక నడుస్తోంది ." అన్నాడు. రఘురాం ఎంత చెప్పినా అయన కన్విన్స్ కాలేదు.
    తన అంచనా ఎక్కడ, ఎందుకు దెబ్బ తిందో అతనికి తెలియలేదు.
    మొదటి కేసు ఫెయిలై నందుకు విచారపడుతూ అతను సాయంత్రం ఇంటికెళ్ళి పేపరు చదువుతుండగా ఒక చిన్న వార్త కనబడింది. ప్రస్తుతం సీబీఐ వాళ్ళు బ్లాక్ మనీ వివరాలు తెలుసుకోవడం కోసం వ్యాపారస్తులందరినీ ఇన్సురెన్స్ పాలసీ వివరాలు తెలుసుకుంటున్నారుట. పెద్ద పెద్ద పాలసీ ఉన్న వాళ్ళని ప్రీమియం గురించి అడుగుతున్నారట. కొంతమంది సీబీఐ వాళ్ళు ఇన్సూరెన్స్ ఏజంటుల్లా కూడా వెడుతున్నారుట.
    గోవిందయ్య పాలసీ ఎందుకు తీసుకోలేదో రఘురాం కు అర్ధమై పోయింది. అతను కొంతకాలం పాటు వ్యాపారస్తుల జోలికి వెళ్ళకూడదని అనుకున్నాడు. ద్వీతీయ ప్రయత్నంగా అతను సుబ్బారావు దగ్గరకు వెళ్ళాడు.
    సుబ్బారావు కు ఇటీవలే ఉద్యోగం వచ్చింది. వచ్చింది కూడా బ్యాంకు ఉద్యోగం. అతని తండ్రి, తాత కూడా బ్రతికి ఉన్నారు. సుబ్బారావు కూ, రఘురాం కూ ఊళ్ళో వాళ్ళు కావడం వాళ్ళ ముఖ పరిచయం ఉంది.
    "ఇప్పట్లో నాకు పాలసీ తీసుకునే ఉద్దేశం లేదండీ ?" అన్నాడు సుబ్బారావు.
    పాలసీ తీసుకోవడం వల్ల ఇన్ కంటాక్సు తగ్గుతుందని చెప్పాడు రఘురాం.
    'అవుననుకోండి ! కానీ నేను ఇన్ కంటాక్సు తగ్గించడానికి ప్రావిడెంట్ ఫండ్ లో ఎక్కువ డబ్బు వేస్తున్నాను. అందులోని డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇన్స్ రెన్స్ అయితే మళ్ళీ పాతికేళ్ళ దాకా డబ్బు తిరిగి రాదు? అన్నాడు సుబ్బారావు.
    "మీరు చెప్పింది నిజమే కాని -----మీ ఇంట్లో అనారోగ్యంతో ఉన్న పెద్ద వాళ్ళుంటే - ఓ పెద్ద పాలసీ తీసుకోవచ్చు. డాక్టరు సర్టిఫికేట్ నేను మానేజ్ చేయగలను" అన్నాడు రఘురాం.
    రఘురాం మాటలకు సుబ్బారావు కోప్పడలేదు కానీ చిరాకు పడ్డాడు -' అయిదేళ్ళ క్రితం మా తాతగారికి జబ్బు చేసింది. యాభై వేలకి ఓ పాలసీ తీసుకొన్నాడు నాన్న - మీ లాంటి ఏజంటు మాట పట్టుకుని. మా తాతయ్యని ఆ తర్వాత ఇంచుమించు కింద పెట్టేశారు కానీ అయన మృత్యుంజయుడై లేచి కూర్చుని ఇప్పుడు పిడిరాయిలా గున్నాడు. ఆ పాలసీ డబ్బు కట్టలేక చస్తున్నాం. ఇప్పుడు అందువల్లే కొంతకాలం పాటు పాలసీల జోలికి వెళ్ళదలచుకోలేదు."
    మారుమాట్లాడకుండా అక్కణ్ణించి బయటపడ్డాడు రఘురాం. రెండో కేసు కూడా ఫెయిల్ కావడం అతనికి బాదనిపించింది. మూడో సరైనా తన ఎన్నికలో జాగ్రత్తగా ఉండాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో మధుసూదనరావు తగిలాడు.
    మధుసూదనరావు ప్రయివేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆయనకు నలభై ఏళ్ళు ఉంటాయి. హటాత్తుగా ఏవో టాక్స్ సమస్యలు వచ్చి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని అయన అనుకుంటున్నాడు. బహుశా లక్ష రూపాయల పాలసీ తీసుకున్నా ఆశ్చర్యం లేదు.
    రఘురాం ఆయన్ను కలుసుకున్నాడు. అయన చాలా ప్రోత్సాహకరంగా మాట్లాడాడు. ఆరోజు మంచిరోజు కాదనీ రెండు రోజు పోయేక అవసరమైన కాగితాలతో వస్తే అన్నీ ఫైనలైజ్ చేయవచ్చు ననీ అయన రఘురాం తో అన్నాడు. ఇన్నాళ్ళకు తన కేసు ఫలించి నందుకు రఘురాం చాలా సంతోషించాడు. కాగితాలన్నీ సిద్దం చేసికొని అయన చెప్పిన రోజుకు ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేసరికి మధుసూదనరావు గారు ఇంట్లోనే ఉన్నాడు కానీ వళ్ళు తెలియని జ్వరం.
    అప్పటికప్పుడు పని జరక్క పోయినందుకు కొద్దిగా నిరుత్సాహపడినప్పటికీ రఘురాం కి లోలోన కాస్త సంతోషం లేకపోలేదు. మానవ శరీరం అస్థిరమైనదనీ, దానికి ఏ క్షణంలో నైనా ప్రమాదం రావచ్చు ననీ ఈ దెబ్బతో మధుసూదనరావు గ్రహిస్తే ----పాలసీ మరికాస్త పెద్దది తీసుకోవచ్చును.
    మధుసూదనరావు కు చాలా పెద్ద జబ్బు చేసింది. అయన చచ్చిపోతాడేమోనని అనుకున్నారు. రఘురాం ప్రార్ధనలు ఫలించాయేమో కానీ అయన చచ్చి బ్రతికాడు. అతను ఆయన్ను మళ్ళీ చూడ్డానికి వెళ్ళినప్పుడు మనిషి పుల్లలా ఉన్నాడు.
    "ఎలాంటి వారు ఎలా అయిపోయాడు?" అన్నాడు రఘురాం.
    మధుసూదనరావు భార్య -- "ఏమిటో - ఇన్సురెన్స్ పాలసీ తీసుకుందామనగానే ఆయన్ను రోగం చుట్టూ ముట్టేసింది. అయినా మా చుట్టాలావిడ అన్నట్లు చస్తానేమోనని భయంతో చేసే ఆ పాలసీ తీసుకోవడం పెద్ద అపశకునం" అంది.
    రఘురాం హడలిపోయి - 'అలా గనకండి ....' అని ఏదో అనబోయాడు.
    మధుసూదనరావు మధ్యలో కలగజేసుకుని ----"ఏమీ అనుకోకండి, నేను పాలసీ తీసుకునే ఉద్దేశ్యం మానుకున్నాను. ఇన్ కంటాక్స్ నుంచి తప్పించుకుందుకు నా స్నేహితుడేవో ఇతర మార్గాలున్నాయన్నాడు. అవి చూసుకుంటాను. అంతగా అవసరమైతే టాక్స్ కట్టేస్తాను. మీకు శ్రమ ఇచ్చినందుకు మన్నించండి." అన్నాడు.
    రఘురాం ముఖం మాడిపోయింది. ఈ కేసు తప్పక సాధించగలననుకున్నాడు. అతన్ని ఓ విధమైన నిరుత్సాహం ఆవరించింది.
    రఘురాం లో కొత్త ఆశలు చిగురింపజేస్తూ అతని ఆఫీసులో కొత్త వ్యక్తీ చేరాడు. అతనికి సుమారు ముప్పై ఏళ్ళు ఉంటాయి. అందమైన పాతికేళ్ళ భార్య ఉంది. మీదుమిక్కిలి మనిషి బాగా మొహమాటస్థుడు . అతనికి డబ్బు బాగా ఉంది. పేరు సూర్యం.
    రఘురాం కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా సూర్యాన్ని గమనించాడు. సూర్యం నిజంగానే బాగా మొహమాటస్తుడని తేలిపోయింది. అతనినేవరైనా ఏమైనా అన్నా సహించి ఊరుకుంటాడు కానీ, చటుక్కున ఏమీ అనలేడు. సూర్యం కాఫీ హోటలు కు వెడితే, అందరి బిల్లూ తనే ఇచ్చేయడానికి సిద్దపడతాడు. తన గురించి గొప్పలు చెప్పుకోడు. ఎదుటి వారు ఎన్ని గొప్పలు చెప్పినా వినేస్తాడు.
    ఇన్సురెన్స్ పాలసీని దృష్టిలో ఉంచుకుని రఘురాం - సూర్యాన్ని భార్యతో సహా తన ఇంటికి ఆహ్వానించాడు. తర్వాత తనూ భార్యతో కలిసి సూర్యం ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు తను మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నాడు. అది రానే వచ్చింది.
    ఆఫీసులో సూర్యం దగ్గరకు పాలసీ గురించి మాట్లాడడానికి వెడుతుండగా మరో కొలీగ్ రఘురాం కి కాగితం మీద ఓ నంబరు వేసి ఇచ్చి - "ఈ నంబరుకు ఫోన్ చేయి గురూ ! శంకర్రావు ని ఒకాయనకి ఇన్సురెన్స్ పాలసీ ఇంట్రస్ట్ ఉందట." అన్నాడు. రఘురాం ఉత్సాహంగా ఆ కాగితం జేబులో పెట్టుకుని ముందు సూర్యం దగ్గరకు వెళ్ళాడు. ఈ కేసులో తను తప్పక జయించగలనని అతడి అభిప్రాయం.
    కాసేపు ఆ కబురూ ఈ కబురూ చెప్పి - "ఇన్సూరెన్స్ మీద మీ అభిప్రాయం ఏమిటి?" అనడిగాడు రఘురాం.
    "ప్రత్యేకమైన అభిప్రాయం ఏమీ లేదు" అన్నాడు సూర్యం.
    "మీకు పాలసీ తీసుకునే ఉద్దేశ్యముందా?" అన్నాడు రఘురాం.
    "లేదండీ!' అన్నాడు సూర్యం.
    'అలాగనకూడదు మీరు. నేను ఇన్సూరెన్స్ ఏజన్సీ తీసుకున్నాను. ఇంతవరకూ బోణి కాలేదు. మీరే బోణి చేయాలి ' అన్నాడు రఘురాం.
    సూర్యం మొహమాటపడ్డాడు. "మీరలా అనేస్తే కష్టం! నాకు ఇన్సూరెన్స్ ఎందుకండీ?"
    అతను మెత్తబడుతున్నట్లు కనిపెట్టిన రఘురాం ఇన్సూరెన్స్ వాళ్ళ గల ప్రయోజనాలన్నింటినో వివరించి- "ఏదో ముందుకు పోతున్నామనుకుంటున్నాం కాని ఆడవాళ్ళ కింకా సరైనా రక్షణ లేదండి మన దేశంలో, ఎప్పుడు , ఎక్కడ ఏ ప్రమాదమేదురౌతుందో తెలియదు. మీరు ప్రేమించే మీ భార్య సుఖజీవనం కోసం మీరు తప్పక ఇన్సూరెన్స్ చేసి తీరాలి" అన్నాడు.
    సూర్యం ముఖం మాడిపోయింది----"నా భార్య సుఖజీవనానికి ఇప్పుడే లోటూ లేదు. అందుకే అయితే ఇన్సూరెన్స్ అక్కర్లేదు నాకు" అన్నాడు. అతనా మాటల్ని రఘురాం ఊహించనంత ఖచ్చితంగా అన్నాడు.
    సూర్యం తన మొహమాటాన్ని హటాత్తుగా ఎందుకు వదిలి పెట్టాడో రఘురాం కి అర్ధం కాలేదు. అతను తన ప్రయత్నం మానకుండా మరో సారి అడిగాడు.
    "రఘురాంగారూ! మీరు అన్యదా భావించవద్దు. ఆడవాళ్ళ పరిస్థితి మీరనుకున్నంత అన్యాయంగా లేదు. నా భార్యకు నేను రెండవ భర్తను. మొదటి భర్త పెద్ద మొత్తానికి ఇన్సూరెన్స్ చేసి చనిపోవడం వల్ల ఆస్తి వచ్చిన కారణంగా నేనామెను వివాహం చేసుకున్నాను. అతడి పాలిటి దురదృష్టం నా అదృష్టంగా మారింది. ఏ పరిస్తితుల్లోనూ ఇటువంటి అదృష్టం నా భార్యకు మరోసారి కలగడం ఊహలో కూడా నేను భరించలేను. దయచేసి ఇన్సూరెన్స్ ప్రసక్తి నా వద్దకు తీసుకురావద్దు " అన్నాడు సూర్యం.
    రఘురాం మ్రాన్పడిపోయాడు. అతను తేరుకోవడానికి కొద్ది క్షణాలు పట్టింది. తేరుకున్నాక కూడా ఆవరించిన నిరుత్సాహం అతన్ని వదలిపెట్టలేదు. నెమ్మదిగా ఫోన్ దగ్గరకు వెళ్ళి కొలీగ్ ఇచ్చిన నంబరు తిప్పి - "హలో, శంకరరావు గరున్నారాండి?" అని అడిగాడు.
    "రాంగ్ నంబర్!" అని అవతల క్లిక్ మంది.

                                              ***

 Previous Page Next Page