ఏం మాట్లాడాలో తెలియలేదు రాజుకి. అత్తయ్య అలా మాట్లాడుతుంటే బాదగావుంటుంది. 'అలా మాట్లాడవద్దు. నీకేం అత్తయ్యా!తొందరలో తగ్గిపోతుందిగా? అందామనుకుంటాడు. చిన్న తనం వల్ల బిడియపడి తల వంచుకున్నాడు.
కాసేపు ఆగి రాజేశ్వరమ్మ వాడి నా బాధలోంచి విముక్తుడ్ని చేసింది.
"ఏమయినా కబుర్లు చెప్పు. రాజూ!", అంది.
అత్తయ్యంటే రాజుకి. యిష్టం. తల్లితో చెప్పని మాటలు కూడ అత్తయ్యవద్ద హుషారుగా చెపుతాడు. ఆ రోజు జరిగిన విషయాలన్నీ రాజు చెపుతుంటే "ఊ" కొడుకు మధ్య మధ్య ప్రశ్న లేస్తున్నది రాజేశ్వరమ్మ.
పసుపుకొమ్ము ఛాయతో నల్లని వంకులు తిరిగిన తలకట్టు , నుదుట పైసాంత ఎర్రని కుంకుమ పొట్టిగా సన్నగా వున్నా కళకళ లాడుతున్న మొము రాజేశ్వరమ్మది . వ్యాధి గ్రస్తురాలయి మంచంలో వున్నా మనిషిలో కళ తగ్గలేదు.
" అయితే మీ ప్రవేటు మాస్డారుకి చదువు చెప్పటం రాదంటావు రాజూ!" అంది రాజేశ్వరమ్మ. రాజు చెప్పింది విని.
"ఆయనకన్నా నాకే బాగా వచ్చు చదువు. మాటకుముందు డిష్టరీ తెరుస్తాడు."
"మామయ్యతో చెప్పి మాష్టరు ను మారుద్దాము!"
"వద్ద త్తయ్యా! చదువుకోవటం యిష్టంలేక, సాయంత్రం ఆటలు మరిగి ప్రవేటు వద్దంటున్నానని అనుకుంటాడు మామయ్య."
"అర్థమయ్యేటట్లు బాగా చెపుతాగా"
అయిష్టంగానే "ఊ" కొట్టాడు రాజు.
ఆచార్ల గారిని వెంటబెట్టుకొని రఘుపతి వచ్చాడు గదిలోకి మామయ్యను చూచి మంచంమీద నుంచి గబుక్కున లేచాడు రాజు."ఏం రాజా!ఇక్కడ వున్నావా? సాయంత్రం ఎక్కడికో షికారుకెళ్ళావట? ప్రవేటు ఎగ్గొట్టలేదుకదా? ప్రవేటు ఎగ్గొట్టిన్లు తెలిసిందా కాళ్ళారగ కొడతాను జాగ్రత్త" లోపలికి అడుగు పెడుతూనే మందలింపు అన్నాడు రఘుపతి.
రాజు పెదవి కదపకుండానే తల తాటించాడు.
"సరేపో" అన్నాడు రఘుపతి.
క్షణం ఆలశ్యం చేయకుండ విడిచి బైటకు వచ్చాడు రాజు సరాసరి తల్లివద్దకు వచ్చాడు వంటగదిలోకి . వంటపనిపూర్తయి పొయ్యి వద్ద సుభ్రంచేస్తున్నది పార్వతమ్మ.
"మామయ్య, ఆచార్లుగారూ వచ్చారమ్మా?" అని చెప్పాడు. రాజు.
చేతిలో పని ఆపి వెనుతిరిగింది పార్వతమ్మ. "ఆచార్లుగారు ఏమన్నారురా?" అంది ఆతృతగ
"ఇప్పుడే వచ్చారు. అత్తయ్యను ఇంకా చూడలేదు." పీట వాల్చుకుంటు అన్నాడు రాజు.
"నేనోసారి వెళ్ళి మాట్లాడివస్తాను కూర్చో" అని పార్వతమ్మ చేస్తున్న పని ఆపి చెయ్యి కడుక్కుని వెళ్ళింది.
స్కూల్ విడిచిపెట్టంగానే ప్రవేటుకి వెళ్ళటంవల్ల సాయంత్రం ఆడుకోవటానికి వీలు వుండదు.అనుపమను చూడటానికి యీ రోజు ప్రవేటు ఎగ్గట్టాడు. మధ్య మధ్య ఎగకొడితే మామయ్యకు తెలియదేమోగాని వరసగా రెండు మూడు రోజులు ప్రవేటుకి వెళ్ళకపోతే మామయ్యకు తెలుస్తుంది. అనుపమతో రేపు ఆడుకోటానికి వస్తానని చెప్పాడు. రేపు సాయంత్రం ఆడుకోవటానికి వెళ్ళటం ఎలా?
రేపటి సంగతి ఆలోచిస్తు కూర్చున్నాడు రాజు.
4
సుభద్రమ్మకి రోజు రోజు దిగులు ఎక్కువయిపోతున్నది. ఏ పని చేస్తున్నా కూతురి భవిష్యత్తు గుర్తుకొస్తు మనసు అల్లకల్లోలం అవుతున్నది. "అదేమిటమ్మా! ఇదేమిటమ్మా?" అంటూ తెలుసుకోవాలనే జిజ్నాసతో ప్రశ్నలేస్తూ... చెప్పినా అర్థంగాక మరోరకంగా అర్థం చేసుకుంటు పూత్తడిబొమ్మలా ఇంట్లో తిరుగుతున్న అనుపమను చూస్తుంటే కన్నతల్లి హృదయం బేలగా రోదిస్తున్నది.
సాయంత్రం అలవాటు ప్రకారం పిల్లతో ఆడుకోవటానికి బైలు దేరింది.అనుపమ. పెరట్లో పనిచేసుకుంటూ వుంటుంది తల్లి అని తెలిసి పెరట్లోకి వచ్చింది.
సుభద్రమ్మ పెరట్లో దానిమ్మ పిందెలకు గుడ్డముక్కలు చుడుతున్నది, తియ్యదానిమ్మచెట్టు విరగకాసింది. ఉడతలు,చిలుకలు పిందెలను బతకనివ్వటం లేదు చెయ్యి. తీరుబడిచేసుకుని పిందెలకు గుడ్డలు చుటుతున్నది. కూతురు రావటం చూసింది.
" అమ్మ! ఆడుకోటానికి వెళతాను" అంది అనుపమ.
"బైటకు వెళ్ళకపోతే ఇంట్లో చెల్లాయి., తమ్ముడు వాళ్ళతో ఆడుకోరాదూ!" అంది సుభద్రమ్మ చేస్తున్న పని ఆపి.
"ఛీ! వీళ్ళు చిన్నవాళ్లు ఎలా ఆడుకుంటాను? రమ-సుజాత-ఉమ వాళ్ళతో అయితే దాగుడుమూతలు ఆడొచ్చు, కధలు చెప్పుకోవచ్చు." హుషారుగా చెప్పింది అనుపమ.
ఎప్పడు దాగుడుమూతలు ఆడినా అనుపమ 'తల్లి' గా వుంటుంది. కూర్చున్న చోటునుంచి కదలకపోయినా...." దాగుడుమూత దండాకోర్, పిల్లి వచ్చి ఎలుకాబాద్! ఎక్కడి దొంగలు అక్కడనే,గప్ చిప్ సంబారుబుడ్డీ!" అని ప్రతి పిల్ల కళ్లుమూసి అనటం గొప్ప పని చేసినట్లు వుంటుంది అనుపమకి. ఆటలో దొంగకి దొరక్కుండా ఎవరైనా వచ్చి అనుపమను ముట్టుకుని " తల్లిని ముట్టుకున్నా నోచ్చి" అంటే పిచ్చి సంతోషం పొందుతుంది.ఆటలో ఎవరు దొంగయ్యారో తెలుసుకుని నవ్వుతుంది.